వెనుతిరగని వెన్నెల(భాగం-5)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-5)

-డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

——-

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. ఇంటర్మీడియేట్ చదువుతున్న తన్మయిని  చుట్టాల పెళ్ళిలో చూసి ఇష్టపడి ఉత్తరం రాస్తాడు శేఖర్. సహజంగా భావుకురాలైన తన్మయికి శేఖర్ పట్ల ఆసక్తి మొదలవుతుంది.  ఇద్దరికీ పరిచయమవుతుంది.

***

వనజ ఇంటి నుంచి తన్మయి వస్తూనే జ్యోతి ‘త్వరగా రా చీర కడతాను. కాస్సేపట్లో  పెళ్ళి చూపులకి వస్తున్నారు” అంది.

ఆశ్చర్యపోయింది తన్మయి. 

“తనకి పెళ్లి చూపులా?” 

కానీ పైకి ఎవరూ, ఏవిటని అని అడిగే ధైర్యం కూడా లేదు తన్మయికి. 

జడగంటలు వేస్తూ “అబ్బాయి కాకినాడ లో ఆర్. ఎం. పీ  డాక్టరు. ప్రాక్టీసు బావుంటుందంట, బాగా సంపాదించి ఈ మధ్యే సొంతిల్లు కట్టుకున్నాడట. బాబాయి వాళ్లు చెప్పేరు”  అని 

“కాస్త నవ్వుతూ మాట్లాడు ఏవైనా అడిగితే” అంది జ్యోతి కూతురితో. 

తన్మయికి మతి పోతూంది. “ఇలా చెప్పా పెట్టకుండా హఠాత్తుగా పెళ్లి చూపులంటున్నారేవిటి? ఒక పక్క శేఖర్ వైపు తన మనస్సు ముడిపడిపోతూంది. ఇప్పుడిక్కడ ఈ పెళ్లి చూపుల్లో అవతలి వాళ్లకి తను నచ్చితే? తను ఒకరిని ఇష్టపడుతూ మరొకరికి భార్య కాగలదా?”

భాను మూర్తి లోపలికి  వచ్చి వాళ్లొస్తున్నారని  చెప్పేక గుండె దడ ఎక్కువైంది తన్మయికి. 

అన్యమనస్కంగా ఇంత సేపూ ఎలా తయారు చేస్తే అలా ముస్తాబు చేయించుకుంది. అద్దంలో తనను చూసుకుంది. పీలగా ఉన్న శరీరానికి చీర కడితే కొయ్య బొమ్మకు కట్టినట్టు అనిపించింది.  పెట్టుకున్న నగలు తన కంటే బాగా మెరుస్తున్నాయి. చుట్టుపక్కల తెల్సిన ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి జ్యోతికి వంటింట్లో సాయం చేస్తున్నారు. 

పక్కింటి అత్తయ్య వచ్చి కనకాంబరం మాల తలలో తురిమి చెంపలు నిమిరి మెటికలు విరిచింది.

 

తన్మయికి శేఖర్ తన చుట్టూ పరిభ్రమిస్తూ మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఏవిటిదంతా? అని తనని నిలదీసి అడుగుతున్నట్లనిపించింది.

“తనొక్కదానికీ ఆలోచించి బుర్ర పగిలిపోతూంది. వనజతో ఈ విషయం చెప్పే వాళ్లుంటే బావుణ్ణు.” అంటూ పెదవి కొరుక్కుంటూ అలానే కూచుండి పోయింది. 

అతను తల్లితో కలిసి వచ్చినట్లున్నాడు. కానీ అతనే అన్ని విషయాలూ మాట్లాడుకుంటున్నాడు.  

తనని ఆ గదిలోకి తీసుకెళ్లి నిలబెట్టింది జ్యోతి. పక్క వాళ్లతో మాట్లాడుతూ తనవైపో సారి చూసి  చూపు తిప్పుకున్నాడు. 

తలెత్తి చూసిన తన్మయికి ఎందుకో నిర్వేదం వచ్చింది. 

ఒక మోస్తరు కళగా కూడా లేని ముఖం.  అతని వయస్సు 25 పైన ఉండొచ్చు. తన్మయికి  తెలీని బాధగా అనిపించింది.

ఎప్పుడు తనని అక్కడి నించి పంపేస్తారా అన్నట్లు తల్లి వైపు చూసింది. 

మిగతా వాళ్లెవ్వరూ తనని పట్టించుకోనట్లు అతని వైపే చూస్తున్నారు. పెళ్లి చూపులంటూ పెద్ద తతంగం జరలేదు.  సరిగ్గా 5 నిమిషాలు అతనెదురుగా నిలబడి పేరేమిటో చెప్పి, వచ్చేసిందంతే.

నరసమ్మ మనవరాలిని లోపలికి తీసుకెళ్లింది.

మనవరాలి కళ్లలో దిగులు అర్థం చేసుకున్నా ఏవీ చేయలేని అసహాయతతో తల నిమిరి వెళ్లిపోయింది.

***

 ఆ సాయంత్రం దిగులుగా కూచున్న మనవరాలి దగ్గరకి వచ్చి ” రొండు లచ్చలు కట్నవడిగేరు. మీ అమ్మా, నాన్నా వొద్దని చెప్పేరు” అంది.

తన్మయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అప్రయత్నంగా అమ్మమ్మని కౌగలించుకుంది. 

ఒక్క ఉదుటున డాబా మీదికి పరుగెత్తింది. చీకట్లో మెరుస్తున్న నక్షత్రాల్ని చూస్తూ రెండు చేతులూ జోడించి గుండెలకి అదుముకుని “థాంక్యూ..థాంక్యూ” అంది.

ఏదో ఒక గొప్ప రిలీఫ్ గా, గుండెల మీద బరువు తీరినట్లు హాయిగా అనిపించి గిరగిరా తిరిగింది.

కిందికి వచ్చి, మెట్ల పక్కనే  పొద మీద మెరుస్తూ విరిసిన చిట్టి  చంద్రకాంత పూవునొకదాన్ని చేతులోకి తీసుకుని లేత పరిమళాన్ని దీర్ఘంగా పీల్చి, మెత్తని రేకుల్ని అపురూపంగా తడిమి, మురిపెంగా తలలో తురుముకుంది.

తర్వాతి వారంలో శేఖర్ నించి మరొక ఉత్తరం వచ్చింది.

ఊర్లో ఏదో పెళ్లికి తల్లితో బాటూ వస్తున్నాడట, ఆదివారం ఇంటికి వస్తామని రాసేడు.

తన్మయి అతను వచ్చే సమయానికి ఇంట్లో లేకుండా వనజ దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.

అదే పెళ్ళికి తనూ వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదు.

అలా అనుకుందే కానీ పెళ్లిలోశేఖర్ కనిపిస్తూనే తన్మయికి తెలీని సంతోషం ముంచుకు వచ్చింది. అతని తల్లి దేవి తనని పరికించి చూడడం గమనించింది.

“ఇలా దగ్గరికి వచ్చి మాట్లాడు దేవి అత్తయ్యతో” నరసమ్మ మనవరాలి చెయ్యి పట్టుకుని ముందుకు లాగింది.

బిడియంగా “నమస్తే” అని చెప్పింది. 

పరిచయంగా దగ్గిరికి తీసుకుని “ఇలా రామ్మా, నువ్వేనా తన్మయివి” అని, “మా శేఖర్ చెప్పేడులే” అంది నవ్వుతూ దేవి.

“ఏం చెప్పేడన్నట్లు” కుతూహలంగా దేవి వైపు తిరిగి,  దూరంగా తన వైపే చూస్తున్న శేఖర్ వైపు కొంటె చూపు విసిరింది తన్మయి.

దూరం నించి నవ్వుతూ కన్ను గీటేడు శేఖర్.

అతన్ని, తనని ఎవరైనా చూసేరేమో అని భయంగా తల దించుకుంది.

“ఏవిటిదంతా సిగ్గే” అంది మళ్లీ దేవి.

మధ్యాహ్నం భోజనాలు కాగానే బయలుదేరుతూ “మాతో రండి మా ఇల్లు చూద్దురు గాని”  అంది జ్యోతి తల్లి పోరు పడలేక. 

ఇంట్లో మధ్య గదిలో పైన గోడ బల్లల  మీద బోర్లించి ఉన్నఇత్తడి సామాన్ల వైపు దృష్టి వాల్చకుండా  చూసింది దేవి.

“ఇవన్నీ మా అమ్మ నాకు ఇచ్చినవే. ఇవన్నీ మా తన్మయికి ఇచ్చేస్తాం” అంది నవ్వుతూ జ్యోతి.

దేవి ప్రశంసా పూర్వకంగా చూస్తూ “అయినా ఒక్కతే అమ్మాయి కదా, మీకంటే ఎక్కువగానే ముట్టచెప్పాలి మీ అమ్మాయికి మీరు.” అని 

అవే కదా “ఒదిన గారూ, పిల్లలకి పుట్టింటి ధైర్యాలు” అని సర్దింది. 

పెద్దవాళ్ళు ఈ సామాన్ల గోలలో ఉండగా తన్మయికి శేఖర్ తో మాట్లాడే అవకాశం వచ్చింది.

పెరటి సందులో ఎదురెదుగా గోడలకి జేరబడి నిల్చున్నారు. 

“ఏవిటీ, ఉత్తరాలు రాయడం లేదు” అన్నాడు.

 “ఇంట్లో గొడవవుతుందేమోనని” అని నసిగింది కిందికి చూస్తూ తన్మయి.

“అమ్మకి చెప్పేను. నాకు నచ్చినట్లే తనకీ నువ్వు నచ్చితే మంచిది కదా” అని పెదవి బిగబట్టి చూసాడు తన్మయి వైపు. 

అతనలా పెదవి బిగబట్టి కొంటెగా చూస్తే మరింత అందంగా ఉంటాడు. 

“ఊ…ఇంకేవిటి  విశేషాలు?” అన్నాడు.

“బోల్డు ఉన్నాయి. నాకు నీతో కలిసి వెన్నెట్లో గోదారి మీద విహారానికి వెళ్లాలని ఉంది. తీసుకెళ్తావా” అంది.

“గోదారి మీద రాత్రి పూట పడవలు తిరగవనుకుంటా, పగలెళ్లొచ్చుకదా, చీకట్లో పడి గోదారెంట తిరగడమెందుకు?” అన్నాడు. 

“చీకట్లో కాదు, వెన్నెట్లో…అని సరి చేసింది ఉక్రోషంగా తన్మయి.

“అదేలే..ఏదో ఒకటి” అని,  “సరిగా తినవా ఇలా బక్క చిక్కి ఉంటావు?” అన్నాడు తేరిపార చూస్తూ.

తన్మయికి ఇంకాస్త ఉక్రోషం పెరిగింది.

అయినా తమాయించుకుని “నేనెంత తిన్నా ఇంతే” అనేదో చెప్పబోతూండగా

అకస్మాత్తుగా పరిచయంగా ముందుకి ఒకడుగు వేసి చప్పున బుగ్గని తట్టి”ఇక బయలుదేరుతాం మళ్లీ వొస్తానులే” అన్నాడు.

బుగ్గ మీది అతని అరచేతిని అలానే పట్టుకుని ఉండిపోవాలన్న తమకం కలిగింది తన్మయికి. ఒక్క సారిగా ఒళ్ళంతా పులకరింతతో వొణికింది.

 శేఖర్ వైపు దిగులుగా చూస్తూ “అప్పుడేనా” అంది గొంతు పెగల్చుకుని.

“చాలా పనుందమ్మాయ్, నాన్న గారితో సాయంత్రం మరో పని మీద  వెళ్లాలి నేను” అన్నాడు చాలా కాజువల్ గా.

 బైటి  నుంచి అప్పుడే వస్తూన్న తండ్రి గొంతు వినిపించేసరికి ఒక్క ఉదుటున లోపలికి పరుగెత్తింది తన్మయి.

***

తన్మయికి ఇంటర్మీడియేట్ లో చేరినప్పట్నించీ కాలేజీ లెక్చరరు కావడమంటే ఇష్టం పట్టుకుంది. అంతకు ముందు వరకూ తను పెద్దయ్యి ఏం కావాలో తనకి ఎటువంటి ఆలోచనా ఉండేది కాదు. 

ఇంగ్లీషులో ధారాళంగా పాఠాలు చెప్తూ పిల్లలందరినీ ఆకట్టుకునే కృష్ణారావు  మాస్టారంటే విపరీతమైన గౌరవం తన్మయికి.

ఆ మాస్టారు ఇంగ్లీషులో పీ.హెచ్.డీ  చేసేరని విని తనెప్పుడు పీ.హెచ్.డీ చేస్తుందో అనుకుంది. బిడియంగా మాస్టారి దగ్గరకెళ్లి ధైర్యం చేసి అడిగింది ఒక రోజు.

లెక్చరరు కావాలన్న తన్మయి ఆలోచనకి ఎంకరేజింగ్ గా చూస్తూ “జూనియర్ కాలేజీ లెక్చరరు కావాలంటే పీ.హెచ్.డీ చెయ్యనవసరం లేదు. తత్సంబంధిత సబ్జెక్టులో ఎమ్మే చేస్తే చాలు. అయితే ఎంట్రన్సు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందుకు ఎమ్మేలో  మినిమం సెకండ్ క్లాసు మార్కులు వచ్చినా సరిపోతుంది. నీకు తెలీనిదేవుంది. ఇది కాంపిటీషను కాలం. మంచి మార్కులు ఎప్పుడూ అవసరమే. ఇక పీ.హెచ్.డీ చేస్తే డాక్టరు అనిపించుకోవడమే కాదు. డిగ్రీ కాలేజీ లెక్చరరు పరీక్ష రాయడానికీ, యూనివర్శిటీలలో లెక్చరరు ఉద్యోగాల అర్హత పరీక్షలకూ పనికి వస్తుంది.” అని సాలోచనగా 

ఇంటర్మీడియేట్ లోనే ఇవన్నీ తెలుసుకోవడం అనవసరమే అనుకో. కానీ ముందు ముందు ఏం చెయ్యాలనుకుంటున్నామో

అదే విధంగా జీవితంలో స్థిర పడడానికి డిగ్రీలో నువ్వు తీసుకునే సబ్జెక్టుల మీద ఆధారపడి ఉండడం వల్ల తెలుసుకోవడం మంచిది.” అని 

“నువ్వు తప్పక లెక్చరరువవుతావు ఒక రోజు,  ఇలా బిడియంగా మాట్లాడడం మానేస్తే” నవ్వారు మాస్టారు.

అవేళ్టి నుంచి ఇంగ్లీషు బాగా చదవడం మొదలు పెట్టింది తన్మయి. దానితో సమానంగా తెలుగు సాహిత్యం పట్లా ఇష్టం మొదలైంది. ఎందుకో రెండు భాషల పట్లా తీరని మక్కువ మొదలైంది. నిజానికి కాలేజీలో లెక్కల సబ్జెక్టులో తనకి ఎప్పుడూ ఎక్కువ మార్కులొస్తాయి. కానీ సాహిత్యంలో ఉన్నదేదో లెక్కల్లో లేనట్లు అనిపించసాగింది క్రమంగా తన్మయికి.

వేసవి సెలవులు కాగానే తన ఇష్టానికి సరిపడగానే డిగ్రీ కాలేజీ లో చేరి ఇంగ్లీషు లిటరేచరు తో చదవాలనుకుంది తన్మయి. 

“అసలే రోజులు బాగా లేవు, అమ్మాయి కోసం అసలే ఆ కుర్రాడు తిరుగుతున్నాడు. హాస్టలులో పెట్టడం నాకిష్టం లేదు. మీరే ఏదో రకంగా సర్దిచెప్పండి అమ్మాయికి.” అంది జ్యోతి.

“ఊర్లో డిగ్రీ కాలేజీ లేదు, నిన్ను హాస్టల్ లో  పెట్టి చదివించడం మాకు ఇష్టం లేదు. ప్రైవేటుగా బియ్యే చేసుకోమ్మా. కావాలంటే ట్యూషను పెట్టించుకో” అన్నాడు భానుమూర్తి తన్మయితో.    

“ప్రైవేటుగా ఇంట్లో కూచుని ఇంగ్లీషు లిటరేచరు  చదవాలంటే కష్టమే, ఇదో నాలా డిగ్రీ మధ్యలో డిస్కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తెలుగు లిటరేచర్ చదువు పోనీ, నీకెలాగూ తెలుగు సాహిత్యమంటే ఇష్టమేగా” అంది వనజ ఆ సాయంత్రం.

“నిజమే వనా, కానీ తెలుగు లిటరేచరుతో పాలిటిక్సు, ఎకనామిక్సు గ్రూపు తప్పని సరిగా చదవాలనుకుంటా. నాకేమో హిస్టరీ లాంటి సబ్జెక్టులైతే బావుణ్ణని ఉంది.” అంది తన్మయి.

“హేయ్, ఇది చూసేవా తెలుగు లిటరేచరు, ఇంగ్లీషు లిటరేచరు, హిస్టరీ” నీ పంట పండింది పో. నువ్వనుకున్న సబ్జెక్టులతో ఆంధ్రా యూనువర్శిటీ నీ కోసమే ప్రెవేటు డిగ్రీ ఆఫర్ చేస్తూంది.” అంది వనజ కోర్సుల బ్రోచరుని చూపిస్తూ.

తన్మయి సంతోషంగా కిందికి పరుగెత్తింది. 

***

తన్మయి బియ్యే మొదటి సంవత్సరంలో వుండగా అడపా దడపా సంబంధాలని ఎవరో అనడం, వాళ్లు ఇంటి వరకూ రావకపోవడం జరుగుతూనే ఉంది.

జ్యోతికి, భానుమూర్తికి అమ్మాయి పెళ్లి తొందర లేకపోయినా బంధువుల ఒత్తిడి, తన ఈడు వాళ్లందరికీ పెళ్లిళ్లు మొదలవడంతో వీళ్లకూ తొందర పట్టుకుంది. 

ఇంతలో ముచ్చటగా మూడోసారి  ఓ సాయంత్రం శేఖర్ ఇంటికి వచ్చేడు. 

భానుమూర్తి ఇంట్లో లేడు. 

ఏదో మామూలుగా, చుట్టపు చూపుగా వచ్చానని అతనంటున్నా ఇంట్లో వాళ్లకి అనుమానం మరింత బలపడేలా అతని చూపులు చెప్తున్నాయి.

“తన్మయిని చూడడానికే  వచ్చానండీ” అన్నాడు ఉన్నట్టుండి ధైర్యంగా జ్యోతితో.  

 జ్యోతి కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి, “పెళ్లి కావలిసిన పిల్ల,  నువ్విలా అమ్మాయి కోసం వస్తూ ఉంటే ఏం బావుంటుంది?” అంది ఇక రానవసరం లేదన్నట్లు కొంచెం గట్టిగా. 

“అదే చెప్పడానికి వచ్చానత్తమ్మా, మీకు ఇష్టమైతే తన్మయిని నేను పెళ్లి చేసుకుంటాను.” అన్నాడు శేఖర్.

లోపలి నుంచి చెవులొగ్గి వింటున్న తన్మయికి ఒక్క సారిగా గాలిలో గంతులేయాలనిపించింది.

నరసమ్మ ఈ మాట వింటూనే “ఇది పద్ధతి కాదు బాబూ, పెద్ద వాళ్లు వచ్చి అడగాలీ…” అంది లోపల్లోపల సంతోషపడుతూ.

“అలాగేనండి, మా పెద్ద వాళ్లని తీసుకుని వస్తాను” అన్నాడు.

“అబ్బాయీ వాళ్లు మన బంధువులే గానీ, మనకు వీళ్ళ విషయాలు సరిగా తెలీదు. ఏం చేద్దామంటారు? అంది జ్యోతి భానుమూర్తితో రాత్రికి ఈ విషయం మాట్లాడుతూ.

“అబ్బాయి మన అమ్మాయిని ఇష్టపడుతున్నట్లున్నాడు. మనమ్మాయికీ ఇష్టమైతే పెళ్లి చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు” అన్నాడు భానుమూర్తి.

***

“పెళ్లి మాటలు మాట్లాడడానికి వాళ్ల పెద్దల్ని తీసుకు వస్తానన్నాడు. ఎంత ధైర్యంగా అడిగేసాడో తెలుసా?!” అంది సంతోషంగా తన్మయి వనజతో.

“ఇవన్నీ కాదు, నీకేమో పీ.హెచ్.డీ చేయాలనుందన్నావు, మరి ఇప్పుడీ పెళ్లి మాటలేవిటో” అంది వనజ నవ్వుతూ.

“అవన్నీ అతన్ని అడుగుతాను. ‘’పెళ్ళాయ్యాక చదువుకోనిస్తానంటేనే పెళ్లి అని ఖరాఖండీగా చెప్పేస్తాను.” అంది తన్మయి. అందే గానీ అతను కాదంటే చేసేదేమీ లేదని కూడా తెలుసు తనకు. అయినా అతను తన మాట తీసెయ్యడని నమ్మకం.

“అయినా అతనంత ధైర్యంగా అడగడం ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఎదురుగా వెళ్లి అతనితో నేనొప్పుకుంటున్నానని గంతులేస్తూ చెప్పాలనిపించింది.” అంది మళ్లీ ఇంకా మురిసి పోతూ.

“ఊ..అంతా బానే ఉంది. కానీ అతనేం చేస్తున్నట్లు? ప్రేమించడానికి ఈ వివరాలు అవసరం లేకపోయినా, పెళ్లంటే ఇవన్నీ ఆలోచించాలేమో” అంది వనజ.

అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు తన్మయి.

కాస్త చికాకుగా ముఖం పెట్టి “నువ్వెప్పుడూ ఇంతే వనా, హాయిగా నాలుగు నిమిషాలు ఉండనివ్వకుండా, సీరియస్ టాపిక్స్ మొదలెడతావు” అంది.

“పెళ్లంటే గాలిలో తేలడం మాత్రమే కాదమ్మడూ, అసలు విషయం పెళ్లయ్యాక గానీ అర్థం కాదులే” అంది వనజ.

“ఇలా లక్ష ఆలోచిస్తావు కాబట్టే, నీకింకా పెళ్ళి కాలేదు” అని చప్పున నాలుక కరుచుకుని “సోరీ, సోరీ ” అంది నిశ్శబ్దమై పోయి, కిందికి చూస్తున్న వనజ ముఖాన్ని పైకి ఎత్తుతూ.

“లేదులే, ఏమో ఎందుకు కాలేదో ఎవరికి తెలుసు? నీకు తెలుసనుకున్నాను.” అంది వనజ అంతలోనే తేలికగా నవ్వుతూ.

“నువ్వేమీ అనుకోలేదు కదా, ప్రామిస్” అంది తన్మయి మళ్లీ.

“అందుకే నువ్వంటే నాకిష్టం వనా, నీ స్నేహం లేకపోతే నాకివన్నీ ఎవరు చెప్తారు చెప్పు?”  అంటూ

ఆకాశం లోకి చూస్తూ “అదిగో, ఈ సంధ్య వేళ చందమామతో పాటూ ఉదయిస్తున్న గ్రహమ్మీద ఒట్టు, ఇంకోసారి నిన్ను బాధ పెట్టను” అంది.

“ఇక నీ ఒట్ల దండకం ఆపుతావా?” అని 

“శేఖర్ వాళ్ల  నాన్నగారితో బాటూ కోళ్ల ఫారం చూసుకుంటున్నాడని చెప్పేడన్నావు కదా, అంటే నువ్వు పెళ్ళయ్యాక ఉమ్మడి కుటుంబంలో ఉండాలన్న మాట.” అంది వనజ సాలోచనగా.

తల నిలువుగా, అడ్డంగా ఆడించి “అవుననుకుంటా…కానీ ఈ మధ్య వ్యాపారంలో నష్టం వస్తూందని అతన్ని వైజాగులో ఏదైనా ఉద్యోగం వెతుక్కోమని వాళ్ల తాతగారింటికి పంపించేరట. బహుశా: అదేమైనా సక్సెస్ అయితే నేను కన్న కలలన్నీ ఫలించినట్లే. ఇంచక్కా ఆకాశాన్ని తాకే సముద్ర తీరంలో ఎగిసి పడే కెరటాల అందాలని ఆస్వాదిస్తూ  జీవితాన్ని గడిపెయ్యొచ్చు. ఏవంటావ్?” అంది తన్మయి గాలిలోకి ఆశావహంగా చూస్తూ.

“నీ కళ్లలోని ఆత్మవిశ్వాసం చూస్తే ఇవన్నీ నిజం అయితే బావుణ్నని అనిపిస్తూంది. అయినా నువ్వు కాస్త కలల్లో బతకడం తగ్గించాలి.” అంది వనజ నవ్వుతూ ముక్కు పట్టుకుని ఊపి.

“ఇంకో విషయం. నేను ఇంచక్కా అడ్డూ అదుపూ లేకుండా డైరక్టుగా యూనివర్శిటీలో చేరి ఎమ్మే, పీహెచ్ డీ చెయ్యొచ్చు” అంది రెట్టించిన ఉత్సాహంతో తన్మయి.

ఇంతలో కింది నించి జ్యోతి గట్టిగా అరిచింది “తన్మయీ, ఒకసారి కిందికి వస్తావా” అంటూ.

*****

(ఇంకా ఉంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.