యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

పరిచయం

ఎన్నో సమస్యలతో సతమతమవుతూ చివరికి జీవితాన్ని అంతం చేసుకుందామనుకుని కూడా తిరిగి ఆత్మస్థైర్యంతో వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలబడి విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది తారసపడ్డారు. అదే మహిళా సాధికారత. వీరి జీవితాలు స్ఫూర్తిగా వుంటాయని అందరికీ అందించాలని సంకల్పించాను. 

సాహసమే జీవితం – 1

జీవితంలో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ఎంతోమంది స్త్రీల జరిగిన కథలు.

తల్లితండ్రులు ఆడపిల్లలకి పెళ్ళి చేసి అమ్మయ్య అమ్మాయి పెళ్ళయిపోయిందని నిశ్చింతగా వుంటారు. కానీ కొంతమంది జీవితాల్లో ఆ నిశ్చింత అనేది కరువైపోతుంది. అది వాళ్ళజీవితాల్ని ముగించుకునేలా చేస్తుంది. కానీ ఇటువంటి పరిస్థితులని మాలతి ఎలా ఎదిరించి నిలబడిందో చూద్దాం. 

మాలతి ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగింది. తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. తెలిసిన వాళ్ళ సంబంధం చూసి కూతురికి పెళ్ళి చేశాడు. 

తండ్రి దగ్గర అతిగారాబంగా పెరిగిన మాలతి అత్తవారింటికి వచ్చింది.  అత్తగారు, భర్త చాలా బాగా చూసుకునేవారు. తన జీవితం చాలా హాయిగా గడిచిపోతోందని సంతోషించింది. తను చదివిన ఎం.ఏ. డిగ్రీతో ఏదో ఒక ఉద్యోగం చేస్తానని భర్త ప్రసాద్ తో చెప్పింది. ప్రసాద్ చేద్దువుగానిలే ఇప్పుడేం అవసరం వుంది. నీకు కావాలంటే ఈ నిమిషంలో ప్రభుత్వోద్యోగం ఇప్పించగలను. చూద్దాంలే అనేశాడు. 

అలా రోజులు గడిచిపోతున్నాయి. ఉద్యోగం చెయ్యాలనే ఆకాంక్ష ఎక్కువయిపోయింది. కానీ ఎందుకో భర్త అడ్డుపడుతున్నాడు. ఇంతలోనే తను గర్భవతినని తెలిసింది. ఉత్సాహమంతా నీరుకారిపోయింది. సరేలే డెలివరీ అయ్యాక చూద్దాం అనుకుంది. 

భర్తని చూస్తే ఎక్కడికో వెళ్తున్నాడు వస్తున్నాడు. ఇంటికి ఎవరెవరో వచ్చిపోతున్నారు. ఏం పని చేస్తాడో తెలియదు. ఇంట్లోమాత్రం తనని ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాడు కదా, పైగా జర్నలిస్టు కదా ఏదో హడావుడి వుంటుందిలే అనుకుంది.  చూస్తుండగా తొమ్మిది నెలలు గడిచిపోయాయి. సుఖప్రసవం అయ్యి పాప పుట్టింది. ప్రసాద్ పాపకి కావలసినవన్నీ కొనుక్కుని వచ్చి, పాప పేరుమీద బాంక్ లో డబ్బులు కూడా వేశాడు. 

ఇంకేముంది జీవితం సాఫీగా గడిచిపోతోంది. ఇంతలోనే ఉప్పెన వచ్చినట్లుగా ప్రసాద్ లేని సమయంలో ఇంటికి కొంతమంది వ్యక్తులు వచ్చి ప్రసాద్ గురించి అడిగారు. లేరు ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్పింది. వరసగా రెండు రోజులు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రసాద్ ఇంట్లో లేడు. 

వాళ్ళు ఎందుకు వస్తున్నారో అర్థం కాలేదు మాలతికి. ప్రసాద్ ఇంటికి వచ్చాక చెప్పింది. నేను అన్నీ చూసుకుంటాలే అనేసి వెళ్లిపోయాడు. మర్నాడు వాళ్ళు మళ్ళీ వచ్చారు. ప్రసాద్ ఇంట్లో లేడు. మాలతి వాళ్ళని సమస్యేమిటో అడిగింది.

అమ్మా నీకేం తెలుసో తెలియదు. మాకు ఒక్కోళ్ళకి అమెరికా నుంచి వస్తున్నాయని 50 పుస్తకాలు ఇచ్చి అవన్నీ కంప్యూటర్  లో టైప్ చెయ్యమని చెప్పాడు. మా చేత 50 వేలు, 75 వేలు కట్టించుకున్నాడు. పని పూర్తయ్యాక దానికి రెట్టింపు ఇస్తానని చెప్పాడు.  ఇప్పటికి 6 నెలలు అయిపోయింది. మనిషి ఫోన్ తియ్యడు, అజపజా లేదు.  

 ఒక్కసారి నేలకింద భూమి గిర్రున తిరిగినట్లయింది. ఇదా ఇతను చేసే పని అనుకుంది. వాళ్ళని మర్నాడు రమ్మని సద్దిచెప్పి పంపించేసింది. 

మాలతి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి సమస్య చెప్పింది. కూతురు జీవితం అతలాకుతలం కాకూడదని ఆయన ఇంకేమీ ఆలోచించకుండా తన రిటైర్ మెంట్ లో వచ్చిన డబ్బు కొంత తీసుకుని మాలతికి ఇచ్చాడు.  మాలతి వెంటనే ఆ డబ్బుని అందరికీ తలాకొంత ఇచ్చి వాళ్ళని తృప్తిపరచి పంపించింది. వాళ్ళు మాలతి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయారు.

అమ్మయ్య ఓ సమస్య తీరింది నేను ఏదైనా ఉద్యోగం చూసుకోవడం మంచిది అనుకుంది. కానీ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. 

రెండు రోజుల తర్వాత కొంతమంది విద్యార్థులలాంటి వాళ్ళు, కొంతమంది నిరుద్యోగులు వచ్చారు. వాళ్ళదీ అదే సమస్య. బాగా మోసపోయారు. వాళ్ళు వచ్చి ప్రసాద్ ని పిలవండి అన్నారు. ఇంట్లో వుంటే కదా పిలవడానికి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదని చెప్పాను. 

పిలవకపోతే మర్యాదగా వుండదని వాళ్ళే ఇల్లంతా తిరిగి లేడని తెలుసుకుని వచ్చారు. మేము మీమీద కేసు పెట్టాము.  మా డబ్బులు మాకు ఇవ్వకపోతే జైల్లో వుంటారు అని అరుచుకుంటూ వెళ్ళిపోయారు.

మాలతికి దిక్కు తోచలేదు. వాళ్ళని బతిమాలింది. ఇల్లు అమ్మి అయినా మీ డబ్బులు ఇస్తాం అంది. అవన్నీమీరు పోలీస్ స్టేషన్ లో చెప్పుకోండి అంటూ వెళ్ళిపోయారు. 

సాయంత్రం అయ్యింది ప్రసాద్ రాలేదు. రాత్రి 9 గంటలకి వచ్చాడు. రాగానే గట్టిగా అరిచింది. ఇల్లు అమ్మి డబ్బులు ఇచ్చెయ్యండి. నేను వాళ్ళకి చెప్పాను అంది మాలతి. 

ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. జరిగిన విషయం చెప్పింది. నేను వాళ్ళందరితోటి మాట్లాడాను. ఇల్లు అమ్మమనడానికి నువ్వెవరు. ఒక రెండు రోజుల్లో నేనే సెటిల్ చేస్తాను అన్నాడు. సరే నిద్రకి ఉపక్రమించాం. 

రాత్రి 11 గంటలకి దడదడ తలుపు చప్పుడయింది. ఉలిక్కిపడి లేచి తలుపు తీశాను. ప్రసాద్ ని పిలమ్మా అన్నారు. పిలిచాను. ప్రసాద్ రాగానే  జనాల్ని మోసం చేస్తున్నందుకు మీమీద కేసు పెట్టారు. ఇద్దరూ నడవండి అన్నారు. 

మాలతి నేనెందుకండీ నేనేం చేశాను. చిన్నపాప ఉంది మీరిలా చెయ్యడం ఏమీ బాగాలేదు అంది. అవన్నీ మాకు చెప్పకమ్మా… పాపని ఎవరికైనా ఇచ్చిరా అన్నారు. బాధ ఉప్పెనలా తరుముకు వస్తుంటే మాలతి అత్తమ్మకి పాపనిచ్చి పోలీసు వాన్ ఎక్కింది. 

మర్నాడు ఈవిషయం తెలుసు మాలతీ వాళ్ళ నాన్న హుటా హుటిన హైదరాబాదు వచ్చి పెద్దవాళ్ళ సిఫార్సు మీద బెయిలు ఇప్పించి ఇద్దరినీ విడుదల చేయించారు.  అల్లుడు మొహం చూడ్డానికి చాలా అసహ్యంగా అనిపించినా నోరు మెదపకుండా ఇంటికి వచ్చారు. 

ఇంటికి వస్తుండగానే తల్లిని పట్టుకుని భోరున ఏడ్చేసింది మాలతి. అమ్మా పాపని పట్టుకో జాగర్త అని ఇచ్చి, ఇప్పుడే వస్తానని బాత్రూంలోకి వెళ్ళి ఏమీ ఆలోచించకుండా బాత్రూం క్లీన్ చేసే లిక్విడ్ తాగేసింది. 

కూతురు ఎంతకీ రాకపోవడం ఉన్నట్టుండి డోకుతున్న శబ్దం వినపించడంతో మాలతి తల్లి పాపని పక్కన పెట్టి బాత్రూం దగ్గిరకి ఒక్క పరుగు పెట్టింది. అక్కడ కూతురు పరిస్థితి చూసి, కూతురు చేసిన పనికి అవాక్కయ్యింది. అయ్యో… ఎంతపని చేశావమ్మా… నీకు నీ బిడ్డ కూడా గుర్తు రాలేదా… అని గబగబా భర్తని పిలిచి ఆఘమేఘాల మీద హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు.  మొత్తానికి మాలతి ప్రాణాలతో బయటపడింది. 

వాళ్ళ నాన్న చాలా బాధపడి అమ్మా… నీ భర్త చేసిన పిచ్చి పనులకోసం నా దగ్గిర డబ్బంతా అయిపోయింది. ఇల్లు, నెలనెలా వచ్చే పెన్షన్ మాత్రం మిగిలి వుంది. నీకు రెండు నెలలు టైము ఇస్తున్నాను. నువ్వు నా దగ్గిరకి వస్తే నిన్ను పాపని నేను పోషిస్తాను, నీకు రక్షణగా వుంటాను. రానంటావా… నీ భర్తతో నువ్వు ఏం పడినా నాకు చెప్పకు అనేసి వెళ్ళిపోయాడు.

మాలతీ వాళ్ళ నాన్నావాళ్ళు వెళ్ళగానే చాలా మంచివాడిలా ప్రవర్తించాడు ప్రసాద్. నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ఎటువంటి పిచ్చిపనులు చెయ్యనని చెప్పాడు. కానీ మాలతి మనసులో ఎక్కడో అలజడి. అతని మాటల మీద నమ్మకం కుదరలేదు. తనుకూడా కొన్నాళ్ళు ఏమీ జరగనట్టే వుంది. అత్తగారు వాళ్ళు ఎప్పుడూ అతని విషయాల్లో కల్పించుకునేవాళ్ళు కాదు.

మాలతి బాగా ఆలోచించింది. తను చదివిన ఎం.కాం. ఎంతవరకు పనికి వస్తుందో తెలియదు.  ఒకరోజు తన ఇంటికి దగ్గరలో ఉన్న సుమతి ఆంటీ దగ్గరకి వెళ్ళి ఆంటీ మీరు చేసే కంప్యూటర్ పని నాకు నేర్పించండి అంది. సుమతి నీకెందుకమ్మా… హాయిగా మంచి భర్త, సొంత ఇల్లు, మంచి అత్తగారు అంది. 

మాలతి భోరున ఏడ్చి, ఆంటీ మీకు అసలేం తెలియదనుకుంటాను. అని తన కథంతా చెప్పింది. నాన్న చెప్పిన దాన్ని బట్టి నాన్న సపోర్టుతో నేను నా కాళ్ళమీద నిలబడాలనుకుంటున్నాను అంది.  సుమతి సరే అని చాలావరకు వర్కంతా నేర్పించింది. అప్పుడప్పుడు మాలతి చేసిన పనికి డబ్బులు కూడా ఇచ్చేది. మాలతికి మానసిక ధైర్యం బాగా చెప్పేది సుమతి. మాలతికి కూడా సుమతి మాటలు బాగా నచ్చేవి.

ఒకరోజు మాలతి వచ్చి మీకు చాలా థాంక్స్ ఆంటీ. నేను మా అమ్మావాళ్ళ వూరు వెళ్ళిపోతున్నాను. మీకు నేను ఫోను చేస్తుంటాను. ఆంటీ నా అదృష్టమో, దురదృష్టమో నేను మళ్ళీ గర్భవతిని అయ్యాను. నేను ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదు. ఎవరు పుట్టినా సరే నా మొదటి బిడ్డకి ఇంకో బిడ్డ తోడుగా వుంటుంది.  పిల్లలిద్దరినీ నేనే పెంచుకుంటాను. వెళ్ళొస్తానాంటీ ఆనేసి వెళ్ళిపోయింది.

రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సుమతి మాలతికి ఫోన్ చేసింది. సుమతీ ఎలా వున్నావు చాలా రోజులైందికదా అని నేనే చేశాను అంది. ఆంటీ నేను బాగానే వున్నాను. నేనే మీకు చేద్దామనుకుంటున్నాను. నాకు మళ్ళీ పాప పుట్టింది. మీరు వర్కు నేర్పబట్టి నాకు ఇక్కడ కలక్టర్ ఆఫీసులో టెంపరరీగా 10 వేల రూపాయలకి ఉద్యోగం దొరికింది. మీకు మరోసారి థాంక్స్ ఆంటీ అంది. సుమతి చాలా సంతోషించింది.  పోనీలే ధైర్యంగా వెళ్ళిపోయినందుకు బాగానే సెటిల్ అయ్యింది అనుకుంది. 

అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజు మాలతి సుమతికి ఫోన్ చేసింది. ఆంటీ మీరు ఎలా వున్నారు. మీకో శుభవార్త చెబ్దామని ఫోన్ చేశాను. మా పెద్దపాప పదవతరగతి 90 శాతం మార్కులతో పాస్ అయ్యిందాంటీ. కాలేజీలో ఫ్రీ సీటు కూడా వచ్చింది. చిన్నపాప 8వ తరగతి చదువుతోంది. అమ్మావాళ్ళు బాగా కోలుకున్నారు.  నాకు ఇప్పుడు 18వేలు జీతం ఇస్తున్నారు. అందరం మీ దయవల్ల చాలా సంతోషంగా వున్నాం అంటీ. ఒకసారి మా వూరు రండి. అందరం సరదాగా గడుపుదాం అంది. సుమతి సరే మాలతీ అంతా శుభమే జరుగుతుందిలే. నేను మీ వూరు వస్తాను అని ఫోను పెట్టేసింది. 

సుమతికి మనసంతా తేలిగ్గా అనిపించింది. అబ్బా ధైర్యంగా నిలబడితే అంతా విజయమే కదా… ఇంక కొద్ది సంవత్సరాలలో మాలతి పిల్లలు బాగా సెటిల్ అయిపోతారు. మాలతి జీవితం ఒక గాడిన పడుతుందనుకుంది. 

అన్నీ చొచ్చుకుని ముందుకి వెళ్ళిపోవడమే జీవితం. ఈ అమ్మాయి జీవితం మరికొందరికి స్ఫూర్తి కావాలి అనుకుంది.  

 *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.