తెలుగు ఫాంట్లు

– డా||కె.గీత

తెలుగు ఫాంట్లు రకాలు తెలుసుకునే ముందు అసలు “ఫాంట్” అంటే ఏవిటో చూద్దాం. 

“ఫాంట్” అంటే రాత పద్ధతిలో స్టైల్  అని చెప్పవచ్చు. ఉదాహరణకి 80’లలో ప్రభంజనమైన బాపూగారి  చేతిరాత ఒక స్టైల్ . 

అందంగా, గుండ్రంగా, పొందిగ్గా రాయడం మరో  స్టైల్ . కుడివైపుకో, ఎడమ వైపుకో అక్షరాలు వాల్చి రాయడం మరో స్టైల్. ఇలా రకరకాల పద్ధతుల్లో  స్టైల్స్ తో రూపొందించిన కంప్యూటర్ రాతపద్ధతే “ఫాంట్” అన్నమాట. ఎవరి చేతిరాతనయినా “ఫాంట్” గా మార్చుకోగలిగినప్పటికీ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటే దానిని విజయవంతమైన “ఫాంట్” గా పరిగణించవచ్చు. 

అయితే ఇలా చేతిరాత ని “ఫాంట్” గా విడుదల చెయ్యడం వెనుక కృషి సామాన్యమైనదేమీ కాదు. సాధారణ టైపుసెట్టింగుతో సాధ్యమయ్యే పనీ కాదు. 

చేతిరాతని కంప్యూటరుకి అర్ధమయ్యే పరిభాషలో పరిచయం చెయ్యాలంటే ముందు యూనికోడ్ విభాగంలో  చెప్పుకున్నట్టు యూనికోడ్ లో ప్రతీ గుర్తుకి ఉన్న సంకేత సంఖ్యను ఆయా భాషా అక్షరాలకు జోడించాలి.  అంటే సరైన పద్ధతిలో “మేపింగు” చెయ్యాలి. యూనికోడ్ స్క్రిప్ట్ ప్రాసెసర్ సహాయంతో ఇలా మేపింగు చెయ్యబడ్డ అక్షరాల్ని సరైన మాత్రల రూపంలో గుర్తింపజేయాలి.  మాత్రల్ని ఓటియల్ సర్వీసు సహాయంతో లిప్యంతరాకృతులతో జోడించి, స్థానీకరించాలి. చివరగా అందుకు కుదురైన కీబోర్డు మేపింగునీ తయారుచెయ్యాలి. 

ఫాంట్ల చరిత్రలో మొట్టమొదటిది “పోతన ఫాంటు” . 

“1985 లో తన కావ్యం ‘హనుమప్ప నాయకుడు’ ప్రచురించినపుడు ఆ కావ్యంలో దొర్లిన ముద్రారాక్షసాలు చూడలేక, తన కావ్యాలని తనే టైప్‌సెట్టింగ్ చేసుకోవాలన్న సంకల్పంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మాకింటాష్ (Macintosh) కంప్యూటరుపై అందమైన తెలుగు ఫాంట్లను కూర్చిన ఘనత దేశికాచారి గారిది. ఆంధ్ర భాగవత కర్త అయిన పోతనపై తనకున్న అభిమానంతో మొదటి ఫాంటుకు ‘పోతన’ అని పేరు పెట్టారీయన. మొట్టమొదటగా 1990 లో బిట్-మాపింగ్ ఫాంట్లుగా కూర్చి, ఆ తరువాత 1993 లో వీటిని పోస్ట్ స్క్రిప్ట్ ఫాంట్లుగా వెలువరించారు. ఈ ఫాంట్లను ఉపయోగిస్తూ తెలుగు టైప్ చెయ్యడానికి వీలుగా పోతన కీబోర్డ్ ను డిజైన్ చేసి, అందుకు తగిన సాఫ్ట్‌వేర్ కూడా తనే స్వయంగా రాసారు. అమెరికాలో నివసించే చాలామంది తొలితరం తెలుగువారు తెలుగులో రాయడానికి ఉపయోగించింది దేశికాచారి గారి పోతనా సాఫ్ట్‌వేరే.

1995లో జంపాల చౌదరిగారి చొరవతో పొందిన తానా ఆర్థిక సాయంతో దేశికాచారి గారు తన పోతన ఫాంటుని పబ్లిక్ డొమైన్‌లో ఉంచడానికి ఒప్పుకున్నారు. పబ్లిక్ డొమైన్ సాఫ్ట్‌వేర్ అయిన RIT 1994 దాకా ముక్కవల్లి ఫాంట్లమీదే ఆధారపడింది. 1995లో, పోతన ఫాంట్లకు ISO ప్రమాణాల స్థాయికై తగువిధంగా మార్పులు చేసిన రమణ జువ్వాడి , వీటిని ‘తిక్కన ఫాంట్స్’ అన్న పేరుతో RIT 3.0 తో పాటు పబ్లిక్ డొమైన్ లోకి 1995లో విడుదల చేసారు. ఆ తరువాతి కాలంలో చోడవరపు ప్రసాద్, రమణ జువ్వాడితో కలిసి వెబ్ లో వాడకానికి అణుగుణంగా ఈ ఫాంట్లకు మరికొన్ని మార్పులు చేసారు. 

ఇవే కాక, ఆ రోజుల్లో భారతదేశంలో కమర్షియల్ ప్రచురణా సంస్థల నుండి రచన, అను, విజన్, ప్రభుత్వ సంస్థ అయిన C-DAC తయారు చేసిన LEAP ఆఫీస్ సాఫ్ట్‌వేర్లు కూడా లభ్యమౌతూ ఉండేవి. ఇవన్నీ వెబ్ అంతగా ప్రాచుర్యం పొందక ముందు జరిగిన తెలుగు సాఫ్ట్‌వేర్ ప్రయత్నాలు”. (సురేశ్ కొలిచాల, ఈ-మాట)

కొన్ని ప్రసిద్ధమైన ఫాంట్లని, లభ్యతా వివరాల్ని ఇక్కడ చూద్దాం:-

ఇలా అందమైన అక్షరాల వెనుక దాగున్న శ్రమైక గాథని వెలికితీసి కంప్యూటరు పరిభాషలో “Creating Unicode Compatible OpenType Telugu Fonts” అనే తిరుమలకృష్ణ దేశికాచార్యులు గారి వ్యాసం ఆధారంగాను, “Developing OpenType Fonts for Telugu Script” అనే మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటు ఆధారంగానూ ఇక్కడ మీకు అందజేసే చిరుప్రయత్నం ఇక్కడ చేస్తాను. 

ముందు చెప్పుకున్నట్టు చేతిరాతని కంప్యూటరుకి అర్ధమయ్యే పరిభాషలో పరిచయం చెయ్యాలంటే ముందు యూనికోడ్ విభాగంలో  చెప్పుకున్నట్టు యూనికోడ్ లో ప్రతీ గుర్తుకి ఉన్న సంకేత సంఖ్యను ఆయా భాషా అక్షరాలకు జోడించాలి. 

ఉదాహరణకి ఇంగ్లీషులో “A” అనే అక్షరం టైపు చెయ్యాలనుకుంటే కంప్యూటరుకు తత్సంబంధిత డెసిమల్ కోడ్ 65  అని కంప్యూటరుకు సందేశం జారీ చెయ్యబడుతుంది. అదే యూనికోడ్ తెలుగు లో “అ” అనే అక్షరాన్ని “A” అనే అక్షరం ద్వారా టైపు చెయ్యాలనుకుంటే డెసిమల్ కోడ్ 3078  అని కంప్యూటరుకు సందేశం జారీ చెయ్యబడుతుంది.

ఇక సరైన పద్ధతిలో “మేపింగు” చెయ్యడంలో “ వర్డ్” వంటి  అప్లికేషన్లు కీబోర్డ్ ద్వారా ఇచ్చిన సందేశాన్ని తీసుకుని తిరిగి సరైన అక్షరాన్ని సరైన ఫార్మాట్ లో ఆపరేటింగు సిస్టమ్ తో బాటూ వచ్చిన “Unicode Script Processor” లేదా “Uniscribe” సహాయంతో కనిపింపజేస్తుంది.

ఈ యూనికోడ్ స్క్రిప్ట్ ప్రాసెసర్ రకరకాల షేపింగ్ ఇంజన్ల సహాయంతో మేపింగు చెయ్యబడ్డ అక్షరాల్ని సరైన మాత్రల రూపంలో గుర్తింపజేస్తుంది.  

ఇక యూనికోడ్ ఓపెన్ టైప్ ఫాంట్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు TrueType font కంటే మెరుగ్గా ఇప్పటి OpenType font ఖచ్చితమైన స్వరూప సామ్యాలు, భేదాలతో నిండిన లిప్యంతరాకృతులు (glyphs ), పొజిషనింగ్, కెర్నింగ్ (kerning) వంటి అదనపు సౌకర్యాలు కలిగి ఉంటుంది. కెర్నింగ్ అక్షరానికి అక్షరానికి  మధ్య ఎంత దూరం ఉండాలో, అసలు దూరం ఉండకూడదో  వంటివి నిర్దేశిస్తుంది.

తెలుగు షేపింగ్ ఇంజన్ మాత్రల్ని గుర్తింపజేయడం, మాత్రల ఆర్డర్ సరిచేయడం కాక, ఓటియల్  సర్వీసు సహాయంతో లిప్యంతరాకృతులతో మాత్రల్ని జోడించడం, స్థానీకరించడం వంటివి కూడా చేస్తుంది.  

అంటే ముందుగా యూనికోడ్ లో గుణింతాలు, వత్తులు రాయాలంటే విడిగా ఉన్న తలకట్లు, దీర్ఘాల్ని, వత్తుల్ని ఎలా వాడాలో వివరంగా కంప్యూటరుకి తెలియజేయాలన్నమాట.

ఉదాహరణకి “క్ష” అనే అక్షరం రాయాలనుకుంటే ఏవేవి కలిపితే “క్ష” అక్షరం తయారవుతుందో, ఎలా కలిపితే అవుతుందో ఇక్కడ చూడండి.

మాత్రల్ని గుర్తింపజేయడం, మాత్రల ఆర్డర్ సరిచేయడం:

అంతే కాకుండా తెలుగు భాషకు సహజమైన తలకట్లు, దీర్ఘాలు హల్లుకి పైన ఇవ్వడమూ, కొమ్ములు పక్కన ఇవ్వడమూ, వత్తులు కిందన ఇవ్వడమూ వంటివి కూడా వివరంగా తెలియజేయాలన్నమాట.

ఇలా ఇప్పటికే తయారుచేసి ఉన్న చట్రంలో ఏ పోత పోస్తే ఆ విధంగా అక్షరాలు తయారైపోవు. ఒక కొత్త ఫాంట్ రూపొందించేటప్పుడు అక్షరాల పొడవు, వెడల్పు, మందం, ఆకృతి వంటివి సరిగా ఉండేలా చూసుకుందుకు కూడా ఓటియల్ సర్వీసులు (OpenType Shaping Engine) ఉపకరిస్తాయి.

ఇలా ఫాంట్ తయారుచెయ్యడం కష్టసాధ్యమైన పనే అయినా ఇప్పుడు మనకు 300 వందలకు పైగా తెలుగు ఫాంట్లు ఉచితంగా ఆన్లైన్ లో లభ్యమవుతూ ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.