మా కథ 

-మూలం: దొమితిలా చుంగారా

-అనువాదం:ఎన్. వేణుగోపాల్ 

కార్మిక సంఘం

బొలీవియన్ పోరాట సంప్రదాయమంతా మౌలికంగా కార్మిక వర్గానిదేనని చెప్పొచ్చు. కార్మికులు తమ సంఘాలను ప్రభుత్వం చేతుల్లో ఎన్నడూ పడనివ్వలేదు. సంఘం ఎప్పుడూ స్వతంత్ర సంస్థగా ఉండాలి. అది కార్మిక వర్గ పంథాను పాటించాలి రాజకీయాలు లేకుండా ఉండాలని చెప్పడం లేదుగాని ఏ సాకు మీదనైనా కార్మిక సంఘం ఏలినవారికి సేవ చేయగూడదు. ప్రభుత్వాలు యజమానులకి ప్రాతినిధ్యం వహిస్తాయి. యజమానులను కాపాడతాయి కనుకనే కార్మిక సంఘం ప్రభుత్వానికెప్పుడూ సేవ చేయొద్దు.

గనుల్లోని కార్మికవర్గం బాగా సంఘటితమైంది. నేనుండేచోట ఐదు కార్మిక సంఘాలున్నాయి. అవి కటావి గని పనివాళ్ళ సంఘం, అక్టోబర్ 20’ సంఘం, లొకటేరియోల సంఘం, వెనెరిస్టాల సంఘం, లామెరోల సంఘం.

ఈ సంఘాలు జాతీయస్థాయిలో బొలీవియా గని కార్మికుల సంఘాల సమాఖ్య (ఎఫ్.ఎస్.టి.ఎం.బి.)లో భాగంగా ఉంటాయి. అలాగే నిర్మాణ రంగంలోని కార్మికులకు, ఫ్యాక్టరీ కార్మికులకు, మేస్త్రీలకు, రైతులకు, రైల్వే కార్మికులకు విడివిడిగా సంఘాలున్నాయి. ఈ అన్ని సంఘాలకూ జాతీయ సమాఖ్యలున్నాయి. ఈ అన్ని జాతీయ సమాఖ్యలూ బొలీవియా కార్మిక సంస్థ (సిఓబి) అనే దానిలో కలుస్తాయి. ఈ అన్ని సంఘాలూ ఒప్పందాల ద్వారా, మహాసభల ద్వారా బాగా సంఘటిత పడివున్నాయి. ఏ రంగంలోని కార్మికులకు ఏ సమస్య వచ్చినా సిఓబి మహాసభలో చర్చించి, పరిష్కరించడానికి అందరమూ భుజం భుజం కలిసి పోరాడుతాం. ఏ ఒక్క రంగంలోని కార్మికులకు నష్టం జరగబోతున్నా సిఓబి అన్ని రంగాల కార్మికుల సంఘీభావ ప్రదర్శనకు పిలుపిస్తుంది. వెంటనే అందరూ రంగంలోకి దిగుతారు.

మా కిందిస్థాయి సంఘం, ఎఫ్.ఎస్.టి.ఎం.బి., సి.ఓ.బి. మా ప్రతినిధులనీ మా వ్యక్తీకరణ అనీ, అందుకనే వాటిని విలువైన ఆస్తులుగా కాపాడుకోవాలని నేను భావిస్తాను.

ఇలా మనను మనం సంఘటిత పరచుకునే క్రమంలోనే మనం నాయకుల ఎదుగుదల గురించి కూడా శ్రద్ధ వహించాలి. గతంలో మా సంసిద్ధతకు పరిమితులుండడం వల్ల మా విప్లవ నైశిత్యం లోపించడం వల్ల, మా సంఘీభావ శక్తిలో లోపం ఉండడం వల్ల చాలామంది మా నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుబోయారు. కొన్ని సార్లు ఎంపికలో మేం పొరపాటుపడడం కూడా జరిగింది. ఉదాహరణకు ఎవరైనా చాల బాగా మాట్లాడగానే మేం అక్కడికక్కడే “వారెవా… ఈయన అద్భుతంగా మాట్లాడతాడు. తప్పకుండా మంచినాయకుడవుతాడు…” అనే సేవాళ్ళం. కాని చాలాసార్లు ఇది నిజం కాకపోయేది. బాగా మాట్లాడ గలిగిన ప్రతివాడూ బాగా పనిచేయలేడుగదా! కొన్ని సార్లేమో చాలా మంచివాడూ, నిజాయితీపరుడూ, కార్మిక వర్గానికి సేవ చేయదలచుకున్న వాడూ దొరికేవాడే గాని మేమిక ఆయన్ని ఎన్నుకొని ఆయనగురించి మరచిపోయే వాళ్ళం. ప్రభుత్వాన్ని, కంపెనీని ఎదుర్కొనడంలో ఆయనను ఒంటరిగా వదిలేసే వాళ్ళం. వాళ్ళాయనకు బోలెడన్ని సమస్యలు కలిపించేవాళ్ళు. చివరికి ఏం జరిగేది? కొందరు ప్రభుత్వానికి అమ్ముడుపోయే వాళ్ళు, మరికొందరు చంపివేయబడే వాళ్ళు, లేదా అదృశ్యమైపోయేవాళ్ళు. ఇలా మాకు మంచి నాయకుడు ఎప్పుడూ లేకుండా అయిపోయాడు. ఇందుకు ఎక్కువ భాగం మా పొరపాట్లదే బాధ్యత.

ఐతే ఏళ్ళ తరబడి పోరాటంలో మేం సంఘీభావపు విలువను అర్థం చేసుకున్నాం. కార్మికవర్గంలోంచే క్రియాశీలురైన కొందరు విప్లవనాయకులు ఆవిర్భవించారు. వాళ్ళు జనాన్ని సరైన దారిలో నడపడం మొదలెట్టారు. మమ్మల్ని లొంగదీయడానికి ప్రభుత్వం సాయుధశక్తిని కూడా ఉపయోగించింది. అందుకే 1942లో, 1949లో, 1965లో, 1967లో మూకుమ్మడి హత్యాకాండలు జరిగాయి. ఇవి చాలా క్రూరమైన హత్యాకాండలు. ఈ మారణకాండల్లో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీటితో ప్రజలు భయపడి వెనక్కి పోలేదు సరిగదా, మరింత మరింత గట్టిపడ్డారు. గతంలో చేసిన తప్పుల్ని సరిచేసుకునే క్రమంలో ఈ ఇరవై ఏళ్ళలో చాలమంది మంచి నాయకులు ఎదిగారు. వాళ్ళతో విస్తృతంగా సంఘీభావం చూపవలసిన అవసరాన్నీ, వాళ్ళను నిశితంగా పరిశీలిస్తుండవలసిన అవసరాన్నీ, వాళ్ళకు ఎప్పుడూ మద్దతివ్వవలసిన అవసరాన్నీ, వాళ్ళు తప్పులు చేసినప్పుడు విమర్శించాల్సిన అవసరాన్నీ మేం గుర్తించాం.

ఔను, నిజమే మాగనుల్లో నాయకులమీద కార్మికుల అధికారమే చెల్లుతుంది. మేం చేసిందానితో అంగీకరించకపోతే చాలా మెతక కార్మికుడు కూడా ఆ విషయం మా దృష్టికి తెచ్చి మమ్మల్ని విమర్శిస్తాడు. అలా వాళ్ళు నన్ను ఎన్నోసార్లు ఏడిపించారు కూడా. పిల్లల్నొదిలేసి, ఇంటినొదిలేసి, ఎంతో ఉద్వేగంతో, ఉత్సాహంతో నేను ఓ సమస్యను రేడియోలోనో సభలోనో వివరించి తిరిగివస్తుంటే ఓ కార్మికుడు ఎదురై “నువు మాట్లాడిన పెంట కర్థమేమిటి? ఎంత చెత్త!’ అనేవాడు. అది నన్ను గాయపరచదూ?! కానీ కొంచెం ఆలోచించి ధైర్యం చెప్పుకునేదాన్ని.. నిజమే – ఇందులో అడుగు పెట్టాక ఇంకా న్యాయం చేయాల్సిందే – నేనింకా ఆలోచించి ఉండవలసింది. నేనింకా నాగొంతులో జనాన్ని ఎక్కువగా పలికించవలసింది’ అని చెప్పుకుంటూ నేర్చుకుంటుండేదాన్ని.

ఒక నాయకుడో, నాయకురాలో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల ఆదరణ చూపడం ఎంత ముఖ్యమో తెలుసునా? వ్యక్తిగతంగా మాత్రమే కాదు. బయట ఉన్న వాళ్ల కుటుంబాల్ని కూడా ఆదుకోవాలి. ఒక కాట్రేడ్ జైలుకు వెళ్ళి ఉన్నప్పుడు ఆ కుటుంబం పట్ల మనం చూపే ఆదరణ ఆ కాట్రేడ్కు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. దానితో జైల్లో పడ్డ బాధలన్నీ మరచిపోగలుగుతాం. నీ ముఖం పగుల గొట్టినా, నువు ఇంటికొచ్చేసరికి పిల్లలు “నాన్నా, అమ్మా సంఘం వాళ్ళూ, కార్మికులూ – మరేమో మమ్మల్ని ఎంతబాగా చూసుకున్నారో” అంటే నీకెంత సంతోషం వేస్తుంది! నువు గనుక నిజాయితీపరుడివీ, గౌరవనీయుడివీ అయితే ఇక నిన్ను నువ్వు మొత్తంగా జనానికి ఆర్పించుకుంటావు. నీపట్ల, నీకుటుంబంపట్ల అంత ఆత్మీయత కనబరిచిన, విశ్వాసం ప్రదర్శించిన నీ ప్రజల నుంచి ఇంక భూమ్మీద ఏ శక్తీ నిన్ను విడదీయలేదు.

మాకు ఇలాంటి అనుభవాలు చాల ఉన్నాయి. చావుకైనాసరే తెగించి, ద్రోహం చేయకుండా ఉన్న కార్మికులెంతో మంది మాకు తెలుసు. ప్రభుత్వం ఎంతో మంది నాయకుల్ని ప్రవాసం పంపింది, చిత్రహింసలకు గురిచేసింది, చంపేసింది. అయినా వాళ్లెన్నడూ చెక్కు చెదరలేదు – ఎంత మంది మా నాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు! ఫెడరికో ఎస్కోబార్ జపాటా, రో సెండో గార్షియా మైస్ మాన్, సెజార్లోరా, ఐజాక్ కూచో…

ఇవి కొన్ని పేర్లు. ఎంతెంత విచిత్ర పరిస్థితుల్లో వీళ్ళు అదృశ్యమై పోయారు! సంఘాన్ని కాపాడుతూ 1967 సాజువాన్ హత్యాకాండలో మైస్ మాన్ చనిపోయాడు. సెజార్ లోరా వెంటబడి తరుముతూ పల్లెసీమల్లో ఆయన్ని చంపేశారు. ఐజాక్ కమాచోని అరెస్టుచేసి జైల్లో పెట్టారు. డిఐసి ఏజెంట్లు ఆయన్ని కనబడకుండా చేశారు. ఎస్కోబార్ ను ఒక పథకం ప్రకారం హత్యచేశారు. ఒక ట్రక్కు డ్రైవర్ కు లంచం ఇచ్చి ట్రక్కును బోల్తా కొట్టించారు. ఫెడరికో గాయపడ్డాడు. అప్పుడు వాళ్ళు ఆయనను లాపా లోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ శస్త్ర చికిత్స మొదలు పెట్టగానే ఆయన చనిపోయాడట. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులను వాళ్లివాల్టి వరకూ వివరించలేదు. ఆయన చచ్చిపోలేదనీ, చంపబడ్డాడనీ మేం భావిస్తాం.

ఆ నాయకులు తాము నాయకత్వం వహించిన కాలమంతా కార్మిక వర్గానికి సంఘటితపడడం ఎలాగో, మోసానికి గురికాకుండా ఉండడం ఎలాగో నేర్పారు. ఇక అలాంటి వాళ్లను యాభై మందిని చంపేస్తే వందమంది పుట్టుకొస్తారు. ఐదువందల మందిని చంపేసినా ప్రభుత్వం కార్మికవర్గాన్ని లొంగదీసుకోలేదు.

సంఘాల శక్తిని, ప్రజల ఐక్యతను నాశనం చేయడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందని! మొదట వాళ్ళు అమానుష నిర్బంధాన్ని అమలు చేశారు, కొన్ని సార్లు హత్యాకాండలకు తలపడ్డారు. ఆ తర్వాత వాళ్లు గనుల్లో శిక్షణ ఇవ్వడానికి ‘ఒరిట్’ నుంచి మనుషులను తీసుకొచ్చారు. ఒరిట్ అనేది అమెరికా నుంచి నడపబడే ఒక అంతర్జాతీయ సంస్థ. ఇది కార్మికుల్లో కొన్ని “స్వతంత్ర” సంఘాలను స్థాపించడం గానీ, అనుబంధించుకోవడంగానీ చేస్తుంది. ఈ సంఘాలు కార్మికులకు మద్దతిచ్చే బదులు యజమానులతో మిలాఖతవుతాయి. బొలీవియాలో మేం వీటిని “పసుప్పచ్చ సంఘాలు” అని పిలుస్తాం. ఐతే అసలు సంగతి తెలుసా? ఒరిట్ గనుల్లో సంఘాల్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇక కక్షగట్టి ప్రభుత్వం మా సంఘపు సంస్థలు వేటినీ గుర్తించలేదు. అంతేగాక మా శ్రేణులమీద, మా మీద తాను ఎంపిక చేసిన, నిర్దేశించిన సమన్వయకర్తలను రుద్దే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు కార్మికవర్గం తల ఒగ్గలేదు. బహిరంగం గానో, అజ్ఞాతంగానో తాము సాధించవలసిందేమిటో కార్మికులకు తెలుసు. వాళ్లు వాళ్ల ప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ఆ రకంగా దోపిడీదార్లకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడగలుగుతారు.

నాయకులు కొన్ని తప్పులు చేస్తారన్న మాట కూడ నిజమే. నాయకులు ప్రతీసారీ కార్మికుల్ని ఎట్లావాడుకున్నారో నాకు వివరించడానికి కొందరు ప్రయత్నించారు. అది వాస్తవమే, కాదనను. కొన్నిసార్లు అలా జరిగి ఉండవచ్చును. కొందరు రాజకీయ నాయకులుంటారు. వాళ్లు తమ భ్రమల్లో, ఊహల్లో మునిగి ఉంటారు. వాళ్ల కెంత మాత్రమూ ముందు చూపుండదు. కార్మికవర్గం వాళ్ల ప్రయోజనాల్నీ, వాళ్ల పార్టీ ప్రయోజనాల్నీ కాపాడడానికి మాత్రమే ఉన్నదని వాళ్లనుకుంటారు. కానీ నా ఉద్దేశ్యం ప్రకారం నాయకుడైన వాడికి ప్రజలంటే అపారమైన గౌరవం ఉండాలి. వాళ్లు మనను ఎన్నుకున్నారు గనుక మనం వాళ్ల సేవజేయాలిగాని అందుకు తారుమారుగా కాదు.

కొన్ని తప్పులు జరిగే అవకాశమే లేదని కాదు. సరైన కారణం లేకుండానే కార్మికులు బాధలకు గురయ్యారు. ఐతే ఇది ముఖ్యంగా మా అనుభవ శూన్యతవల్లనే జరిగింది. ఇదివరకు గడపని, తెలియని కొత్త బాటన నడపదలచుకున్నప్పుడు ఎవరైనా కొన్నిసార్లు తప్పటడుగు వేయకుండా ఉండలేరు. పడి, వాళ్లంతటవాళ్లే లేవక తప్పదు. అందుకే మనం మన అనుభవం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదా చరిత్రనుంచో బొలీవియాలోని గత పోరాట సంప్రదాయంనుంచో, ఇతర ప్రజల అనుభవాల నుంచో నేర్చుకోవాల్సి ఉంటుంది.

అందుకే పాఠాలు నేర్చుకోవడానికి ఒక గాథ ఉండాలి. జరిగిన ప్రతి విషయం రాసి పెట్టుకోక పోవడమే మా లోపం. చాలా తక్కువ విషయాలు రాసి పెట్టుకున్నాం. మా యూనియన్ కార్యాలయంలోనో, గని కార్మికుల రేడియో కేంద్రాల్లోనో రికార్డులుగా ఉన్న వాటిని సైన్యం ఎత్తుకు పోయింది. లేదా ధ్వంసం చేసేసింది. అవే ఉంటే వాటి గురించి ఆలోచించి, విమర్శించుకోవడానికైనా మాకెంత పనికొచ్చేవో తెలుసా?

ఒక కార్మికవర్గ సంస్థను నడిపేటప్పుడు మనం చాలా జాగ్రత్త వహించాలి. మంచి నాయకులను ఎంపిక చేసుకోవాలి. ఈ నాయకులను కాపాడుకోవడం మన ప్రజల బాధ్యతే. రాజ్యాధికారాన్ని సాధించే క్రమంలో కార్మికవర్గ నాయకుల్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన అంశం.

మనం అధికారానికొస్తే మన అధ్యక్షుడెవరవుతారు? ఏమో తెలియదు. కాని కార్మిక వర్గంలో మాకెంత విశ్వాసం ఉందంటే కార్మికవర్గం తప్పకుండా తన నాయకుణ్ణి, అధ్యక్షుణ్ని ఎన్నుకోగలదు. మా యుద్దం ఎంతో పెద్దది, సుదీర్ఘకాలం సాగేది. ఎంతో ముఖ్యమైనది. మాకెంతో మంది నాయకులున్నారు. ఒక్క పురుషుల్లోనే కాదు, స్త్రీలలోనూ, యువకుల్లోనూ సాహసులైన వేలాది మంది నాయకులున్నారు. మాకు అక్కడక్కడా తమ పరిజ్ఞానంతో మమ్మల్ని ఉర్రూతలూగించే నాయకులు పుట్టుకొస్తూనే ఉన్నారు. ప్రజల జ్ఞానానికి అంతమనేదిలేదు. జనశక్తి ఒక తరగని గని. అందుకే మనం జనాన్నెప్పుడూ తక్కువ అంచనా వేయగూడదు.

మా ఆడవాళ్ళం మగవాళ్ళతో సమానంగా పనిచేస్తాం. ఆడవాళ్ళను ఉయ్యాల్లో వేసినప్పటి నుంచే, ఉగ్గు పాలతోనే వాళ్ళు వంట చేయడానికో, పిల్లల్ని సాకడానికో మాత్రమే పుట్టారని, అంతకంటే ఘనమైన పనులేమీ వాళ్ళు చేయలేరని, రాజకీయాల్లో వాళ్ళను జోక్యం కలగజేసుకోనివ్వగూడదనే అభిప్రాయాలతో పెంచుతారు. కాని మా అవసరాలు మా ఈ వంటింటి కుందేటి జీవితాన్ని మార్చుకొనేట్టు చేశాయి. పదిహేనేళ్ళ క్రితం కార్మికవర్గం ఎన్నో సమస్యలెదుర్కొంది. అలా ఒకవైపు చిక్కు ముడుల్లో తలమునకలవుతున్నప్పుడే జీతాల పెంపుదల అడిగినందుకుగాను మా కార్మిక నాయకులు కొందరు జైలు పాలయ్యారు. అప్పుడు ఒక డెబ్బై మంది స్త్రీలు తమ భర్తల విడుదల సాధించేందుకు సంఘటితమయ్యారు. పదిరోజుల నిరాహారదీక్ష తర్వాత ఆ స్త్రీలు తామడిగినవన్నీ సాధించుకున్నారు. అప్పటి నుంచి ఒక నిర్మాణయుత సంఘంగా ఏర్పడాలని వాళ్ళలో ఆలోచన తలెత్తింది. అలా ఏర్పడిందే “సైగ్లో-20 గృహిణుల సంఘం’’.

అప్పటి నుంచీ ఈ సంఘం మిగిలిన కార్మికవర్గ సంఘాలతో కలిసి ఉమ్మడి ప్రయోజనాలకోసం ముందడుగు వేస్తోంది. అందుకే ప్రభుత్వం మా పై కూడా దాడి చేసింది. వాళ్ళు మాలో చాలా మందిని నిర్బంధించారు, ప్రశ్నలు గుప్పించారు. జైళ్ళలోకి తోశారు. అంతేకాదు, ఈ పోరాటంలో పాలు పంచుకున్నందుకుగాను మాలో కొందరం పిల్లల్ని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఐనా మా సంఘం చనిపోలేదు. ఈ మధ్య సంవత్సరాల్లో కూడా నాయకులిచ్చిన పిలుపుకు ప్రతిస్పందించి నాలుగైదువేల మంది స్త్రీలు ప్రదర్శనలు నిర్వహించడానికి సిద్ధపడ్డారు.

గృహిణుల సంఘం కూడా యూనియన్ లాగానే రూపొందించబడింది. దాని లాగానే పనిచేస్తుంది. మాకు గని కార్మిక సంఘాల సమాఖ్యలోనూ, సిఓబి లోనూ కూడా స్థానం ఉంది. కార్మికవర్గం తీసుకునే లక్ష్యాలు నెరవేరేటట్టు చూడడంలో మేం మా పాత్ర వహిస్తాం.

మా అవగాహన ఫెమినిస్టుల (కేవలం మహిళా సమస్యలకే పరిమితమయ్యే పాశ్చాత్య మహిళా ఉద్యమకారులు – అను) అవగాహన లాంటిదికాదు. మేం మాదేశం సామ్రాజ్యవాద విషకౌగిలి నుంచి బయటపడాలని కోరుకుంటాం. మావంటి కార్మికులే, కష్టజీవులే అధికారానికొచ్చి చట్టాన్నీ, విద్యనూ, ప్రతి విషయాన్నీ శాసించాలని కోరుకుంటాం. అప్పుడు స్త్రీ విముక్తితో పాటు సంపూర్ణ విముక్తి సాధించడానికి తగిన పరిస్థితి ఏర్పడుతుందని మేమనుకుంటాం.

మా పోరాటంలో స్త్రీ, పురుషులిద్దరూ కలిసి పాల్గొనేటట్టు చూడడమే మా ప్రధాన లక్ష్యం. అది సాధించినప్పుడే మనం మంచి రోజుల్ని చూడగలం. మంచి జనాన్ని కనుక్కోగలం. ప్రతి మనిషికీ ఆనందాన్ని పంచి ఇవ్వగలం. ఆడవాళ్ళం, ఇంట్లోనే ఉండి, ఇంటి గురించే ఆలోచిస్తూ సమాజ జీవిత యదార్థ దృశ్యంలోని మిగిలిన భాగాల పట్ల అజ్ఞానంతోనే ఉంటే మనదేశాన్ని కొత్తబాటల్లో నడిపించే నాయకత్వాన్ని తయారు చేయలేం. ఎందుకంటే చైతన్యం ఊయలలోంచే మొదలవుతుంది. భవిష్యత్ పౌరుల్ని తీర్చిదిద్దడంలో తల్లులుగా స్త్రీలు నిర్వహించే పాత్ర ఎంతటిదో ఆలోచిస్తే వాళ్ళనందుకు సిద్దం చేయకపోవడం ఎంత తప్పో తెలుస్తుంది. తల్లుల్నే మనం అందుకు సిద్దం చేయలేక పోతే ఇక పౌరులు ఎలాంటి వాళ్ళు తయారవుతారు? పెట్టుబడిదారుగానీ, యజమాని గానీ సులభంగా కొనెయ్యగల మెతక పౌరులు తయారవుతారు. అలాకాక వాళ్ళకు ముందే రాజకీయాలు నేర్పివుంటే, ముందే శిక్షణ ఇచ్చివుంటే వాళ్ళు పిల్లలకు ఉగ్గుపాలతోనే పోరు పాఠాలు, కొత్త భావాలు నేర్పగలుగుతారు. అప్పుడు మరోరకమైన పిల్లలు తయారవుతారు.

కొంచెం అటూ ఇటూగా మేం చేసే పని అదే. కార్మికులతో పాటు తామెంత ముఖ్యమైన పాత్ర నిర్వహించగలరో తమ పనుల ద్వారా నా చెల్లెళ్ళెంతో మంది నిరూపించారు. మా గృహిణుల సంఘం కార్మికవర్గ ప్రయోజనాల రక్షణలో ఎంత బలీయమైన శక్తిగా ఉండగలదో రుజువు చేసింది.

“భావాలనూ, ప్రజల ఆకాంక్షలనూ బులెట్ చంపివెయ్యలేదు” అని ఎవరో అన్నమాట వాస్తవమని నేను నమ్ముతాను. ఎంతోమంది చనిపోయినా, మరెంతో మంది చనిపోతారని తెలిసినా ఒకానొక రోజున మాకు విముక్తి దొరుకుతుందనీ, ప్రజలే అధికారంలోకి వస్తారని మాకు తెలుసు.

అయితే ఈ విజయం కానుకలాగా అప్పనంగా చేతికందదు. ఇతర దేశాల్లో జరిగినట్టుగానే దానికోసం ఎంతో రక్తం వెచ్చించవలసి వస్తుంది. ఎంతో పోరాటం సాగించాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పటికే సోషలిజం అనుభవిస్తున్న జనంతో సంబంధం పెట్టుకోవడం, సామ్రాజ్యవాద కోరలనుంచి బయటపడిన ప్రజల విజయాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. ఇది కేవలం వాళ్ళ అనుభవాలననుకరించడానికి కాదు. దీని ద్వారా మనం మన అనుభవాలతో వాటిని పోల్చి చూసి, వాళ్ళను రాజ్యాధికారానికి తీసుకుపోయిన మార్గాలు మనకెంతవరకు ఉపయోగపడతాయో చూడవచ్చు. బొలీవియాలో మేం చేసే ప్రయత్నం ఇదే. మా కార్మిక వర్గంలో సోషలిస్టు భావాలు ఎంత వ్యాప్తిలోకొచ్చాయో తెలుసునా? 1970లో జరిగిన సి.ఓ.బి. సమావేశంలో “బొలీవియా సోషలిస్టు దేశం అయినప్పుడు మాత్రమే స్వాతంత్ర్యం సాధించినట్టవుతుంది” అనే తీర్మానాన్ని ఆమోదించారు.

మేం ఒక దీర్ఘకాలిక పోరాటం కొనసాగించవలసి ఉన్నదని మాకు తెలుసు. అందుకు మేం సిద్దపడి ఉన్నాం కూడా. అయితే మేం ఒంటరిగా లేం. ఎంత మంది జనం మాతో పోరు బాటలో కలిసివస్తున్నారు! అంతెందుకు మామూలుగానే ప్రతి మనిషీ మరో మనిషి ఆసరాను కోరుతాడు గదా – మా పోరాటం మహత్తరమైనది గనుక మేమూ అంతే. కనుకనే మేం ఎందరో గానం చేసిన, ఎందరో అనుసరిస్తున్న శ్రామిక వర్గ అంతర్జాతీయతను అవలంబించాం. బొలీవియా లాగానే ఎన్నో దేశాలు వెలినీ, కోపాన్నీ, హత్యలనూ, మూకుమ్మడి మారణకాండలనూ భరిస్తూనే ఉన్నాయి. ఇతర ప్రజల్లో మాకు మద్దతు ఇచ్చే అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు ఉన్నారని గ్రహించడం, వాళ్ళ సంఘీభావాన్ని పొందడం, మా పోరాటాలు విడివిడి పోరాటాలు కావని గుర్తించడం ఎంతో ఆనందంగా ఉంటుంది! సంఘీభావాన్ని మించిందేమీలేదు. బొలీవియాలో మేం సంఘీభావాన్ని, సౌహార్దతను నిజమైన రూపాల్లో ప్రదర్శించడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం.

ఉదాహరణకు గత సంవత్సరాలలో చిలీ, వియత్నాం, లావోస్, కంబోడియా ప్రజలకు మా సంఘీభావాన్ని తెలిపాం. వియత్నాం విజయం మమ్మెల్నెంతగా ఉర్రూతలూగించిందని! అది నిజంగా సామ్రాజ్యవాదులకు పెద్ద దెబ్బ. మేం స్వయంగా వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడి యుద్దం చేయలేక పోయినప్పటికీ వాళ్ళతోనే వున్నామని వియత్నాం ప్రజలకు ఎన్నో మార్గాల తెలియజేశాం.

అలెండీ ప్రభుత్వాన్ని కూల్చేసినప్పుడు, చిలీ ప్రజలు దుస్సహమైన కష్టాలను భవిస్తున్నప్పుడు మేం వాళ్ళకు సానుభూతి ప్రకటించాం. ఒకప్పుడు చిలీ దేశం మా సముద్ర మార్గాన్ని మానుంచి లాగేసుకున్నప్పటికీ మేం అదేమీ పట్టించుకోలేదు. ఐనా చిలీ ప్రజలంటే మాకేమీ కోపం లేదు. ప్రభుత్వాలు ఈ ఘర్షణ సంగతి పదేపదే ఊదర గొడుతూనే వుంటాయి. ఈర్ష్యాద్వేషాలు కూడా ఈ వ్యవస్థ ఉత్పత్తులేగదా… మానుంచి సముద్రాన్ని దొంగిలించింది మామూలు ప్రజలేమీకాదు. పాలకులే అదంతా చేశారు. వాళ్లే అందుకు పథకాలు వేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే తమ ప్రయోజనాలకోసం అందుకు వ్యతిరేక నినాదం ఎత్తి పట్టుకున్నారు. సాల్వడార్ అలెండీ చిలీలో అధికారంలో వున్నప్పుడు లోపాజ్ వీథుల్లో ఆధునిక ఆయుధాలతో ఊరేగింపులు జరిగాయి. “ఈ ఆయుధాలతో చిలియన్ల నుంచి మా సముద్ర మార్గాన్ని మేం స్వాధీనం చేసుకుంటాం’ అని కూడా ప్రకటనలు వినవచ్చాయి. కాని అక్కడ పినోషే ప్రభుత్వం వచ్చాక అది మా ప్రభుత్వానికి సన్నిహితమైంది గనుక మా ప్రభుత్వ విధానం మారిపోయింది. చరానాలో మా ప్రభుత్వం పినోషెతో కలిసి ఒప్పందాలు కూడా చేసుకుంది.

మనలో మనం ఎడతెగకుండా పోట్లాడుకుంటూ ఉండడానికి శత్రువు ప్రయోగించే శక్తిమంతమైన ఆయుధాల్లో ఇవి కొన్ని. ఈ రకంగా మనం సంఘటితం కావడం గానీ, ఒక ఉమ్మడి రంగాన్ని సిద్ధం చేసుకోవడంగానీ అసాధ్యమైపోతుంది. చూశారూ వాళ్ళెప్పుడూ మనను పాలించడానికి మనను విభజించడమో తగువులు సృష్టించడమో చేస్తూ ఉంటారు. ఈ పని ప్రభుత్వం మాత్రమే చెయ్యదు. కొన్ని ఇతర సంస్థలు కూడా ఈ పని చేస్తూనే వుంటాయి. కొంచెం దృఢంగా, కొంచెం ఐక్యంగా రూపొందబోయే సంస్థల్లో చాపకింది నీళ్ళ లాగా శత్రువు ప్రవేశిస్తాడు. ఎవరిమీద తన కుయుక్తులు ఫలిస్తాయో గుర్తించి, శత్రువు ఆ వ్యక్తి ద్వారా వ్యతిరేకతలు, సందేహాలు ప్రచారంలో పెడతాడు. ఇలా సంస్థ చెదిరిపోతుంది. దీనివల్ల లాభపడేవాడు శత్రువే. ఇందుకు మాత్రం మనం బాగా సిద్దపడి ఉండాలి. అలా అయితేనే మనం శత్రువు జిత్తుల్లో పడకుండా ఉండగలం. మన సంస్థలను సజీవంగా కాపాడుకోగలం.

చివరిగా ఇంకొక్క విషయం చెప్పాలి. విప్లవోద్యమంలో మనలో ప్రతి ఒక్కరమూ ఎంతో ముఖ్యమని మనమందరమూ తెలుసుకోవడం చాలా అవసరం. కాదూ?! మనందరం కలిసి ఒక పెద్ద యంత్రం. అందులో మనం ప్రతి ఒక్కరమూ ఓ చిన్న మర. యంత్రంలో ఒక్క మర పని చెయ్యకపోయినా యంత్రం మొత్తం ఆగిపోతుంది. కనుకనే మనం ప్రతి వ్యక్తికీ బాధ్యతలు అప్పచెప్పడం, వాళ్ల విలువను గుర్తించడం నేర్చుకోవాలి. కొందరు చాలా బాగా ఉపన్యాసాలివ్వగలరు. మరి కొందరు చాలా బాగా రాస్తారు. మనం సమూహంగా పనికొస్తాం. కనీసం గుంపుకో సంఖ్య పెంచడానికైనా పనికిరామూ? మనలో కొందరు బాధలు భరించాల్సి వస్తుంది. కొందరం అమరులం కావాల్సి వస్తుంది. మరికొందరు మన చరిత్ర రాయాల్సి వస్తుంది. అట్లా మనందరమూ పడుగు పేకలా అల్లుకుపోయి పనిచేయాల్సి వుంటుంది. ఒకసారి మన నాయకుడు చెప్పినట్టు “ఏ ఒక్కరూ, ఏ ఒక్కరూ కూడా నియోజకులు కారు. చరిత్రలో మనందరమూ నిర్వహించవలసిన పాత్రలున్నాయి. మనకు చెప్పులకు సరిగ్గా మేకులు కొట్టడం తెలిసిన మనిషి కూడా కావాలి. ఎందుకంటే ఆ కారణం మీదనే మనం ఒక యుద్దంలోనో, ఒక విప్లవంలోనో ఓడిపోవచ్చు”. కనుక ఏ ఒక్కరూ తాను అప్రయోజకుణ్ననో, అప్రయోజకురాలిననో భావించగూడదు. ఏదో ఓ రీతిలో మనందరమూ పనికొస్తాం. మనందరమూ విప్లవం నుంచి విడదీయరాని వాళ్ళమే. మనందరమూ మనకు తోచిన మార్గంలో సాయపడబోతున్నాం. ముఖ్యమైన విషయమేమంటే కార్మిక వర్గ పోరాటంలో మనందరమూ సరైన మార్గ దర్శకత్వంలో నడవాలి. మనకు అప్పగించిన పనుల్ని వీలైనంత సంపూర్ణంగా నెరవేర్చగలగాలి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.