యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

ఓ అమల కథ

మరీ పల్లెటూరు పట్నమూ కాని వూళ్ళో ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు అమల. మనవరాలంటే తాత సోమయ్య, నాయనమ్మ పార్వతిలకి చాలా గారాబం. అందరి మధ్యన చాలా అపురూపంగా పెరుగుతోంది. 

పల్లెటూరులో పెద్ద పెంకుటిల్లు. ముందు వెనక చాలా ఖాళీస్థలం. ఎప్పుడూ వచ్చేపోయేవాళ్ళతో ఇల్లంతా సందడిగా వుండేది. ఇంటినిండా పనిమనుషులు, పాలేళ్ళతో చిన్నపాటి జమీందారుగారిల్లులా వుండేది. ఊళ్ళో అందరికీ  సోమయ్య, పార్వతి అంటే గౌరవం, అభిమానం.

అమల తాతగారు వ్యవసాయం చేస్తుండేవారు. సైకిలు మీద పొలానికి వెళ్ళేవారు. ఆయన పొలానికి వెళ్ళేటప్పుడు మనవరాలిని  ఒక రౌండు సైకిలు మీద తప్పనిసరిగా తిప్పేసి అప్పుడు ఆయన పనికి వెళ్ళాల్సి వచ్చేది. అంత ప్రాణం మనవరాలంటే.

అమలకి 12 సంవత్సరాల వయసులో  అమల బామ్మగారు గుండెపోటుతో మరణించారు. ఇంట్లో పెద్దావిడ మరణం వాళ్ళకి తీరని లోటయ్యింది. మెల్లిగా అందరూ మామూలు పరిస్థితులకి వచ్చారు. 

సోమయ్యగారు మెల్లిగా ఆయన పనుల్లో ఆయన పడ్డారు. తాతా మనవలకి చాలా అనుబంధం వుండేది. తాతగారిపట్ల పిల్లలకి భయభక్తులు వుండేవి. ఒకరోజు పొలంలో సోమయ్యగారిని పాము కాటేసింది. ఆయనని ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి మరణించారు. 

ఇలా ఇద్దరు ఇంటిపెద్దలు ఒక్కసారి దూరమయ్యేసరికి  అందరూ చాలా బాధపడ్డారు. అమలా వాళ్ళనాన్న కృష్ణ పక్కవూరి ఆఫీసులో పనిచెయ్యడం వలన పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రికి వచ్చేవారు. అమల తల్లి శాంతకి రోజంతా ఇంటిపనే సరిపోయేది. 

పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. అమలకి ఇంటరు పూర్తయ్యింది. అన్నలు డిగ్రీలకి వచ్చారు. సెలవుల్లో అన్నల స్నేహితులు వస్తూ వుండేవారు. వీళ్ళందరూ చిన్నప్పటి నుంచీ వస్తూండడంతో కృష్ణ, శాంత వాళ్ళ పిల్లలలాగే చూసుకునేవారు. 

అదే వాళ్ళ కుటుంబంలో కలతలు రేపింది. ఒకరోజు అమల వాళ్ళ అన్న స్నేహితుడు వెంకట్, అమల ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు. ఈ విషయం ఎప్పటి నుంచో అనుకుంటున్నారుట. ఎవరికీ చెప్పలేదు. 

స్నేహితురాలింటికి వెళ్ళి వస్తానన్న కూతురు ఎంతకీ రాకపోయేసరికి శాంత కొడుకులని పిలిచి అడిగితే మాకు తెలియదు చూసి వస్తామని వెళ్ళారు. కానీ ఎక్కడ వెతికినా చెల్లెలి ఆచూకీ తెలియలేదు. ఇంతలో వీరి స్నేహితుడు కామేష్ కనిపించి అమల, వెంకట్ పక్కవూరి గుడిలో పెళ్ళి చేసుకున్నారని చెప్పాడు.

వీళ్ళందరికీ భూమి గిర్రున తిరిగినట్లనిపించింది. అమల ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. చిన్న వయసు, కులాంతర వివాహం. పోలీసు కంప్లైంట్ ఇద్దామంటే ఊరిలో తాతగారి పరువుపోతుంది. 

ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలకి చెప్పారు. వాళ్లు ఒక్కగానొక్క కూతురు వైభవంగా పెళ్ళి చేద్దామనుకుంటే ఇలా చేసిందని కన్నీరుమున్నీరయ్యారు. మామూలుగానే అందరిలాగే కూతురు లేదనుకుంటాం అని బాధపడ్డారు. అమల అన్నలు వెళ్ళి వెంకట్ ని బాగా తిట్టి వచ్చారు. ఏం చేస్తే ఏం లాభం జరిగిందంతా జరిగిపోయింది.

వెంకట్ వాళ్ళ అమ్మానాన్నా కొడుకుని, కోడలుని ఇంటికి రానివ్వమన్నారు. అమల, వెంకట్ నాలుగు ఊళ్ళవతల ఉన్న ఏలేశ్వరంలో కాపురం పెట్టారు. ఒక రెండు నెలలు బాగానే వున్నారు. అమల నగలన్నీ అమ్మి సంసారం నడిపారు.  శాంత కూతురిని వదిలి వుండలేక మెల్లిగా వాళ్ళుండే చోటికి వెళ్ళి కొంత డబ్బు ఇచ్చివచ్చింది. కూతురు బాగానే వుంది కదా అనుకుంది. 

ఇంక అప్పుడు మొదలైంది అమలకి నరకం. రోజూ వెంకట్ తాగి వచ్చేవాడు. అమలని నానా హింసలు పెట్టేవాడు. అమల తను చేసిన తప్పుకి కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. తల్లికి, అన్నదమ్ములకి చెప్పుకోలేదు. వెంకట్ ని సరిగా వుండమని బతిమాలుకునేది. ఉదయం సరే సరే అనేవాడు. సాయంత్రం అయ్యేసరికి మామూలే. ఏ ఉద్యోగమూ చేసేవాడు కాదు. 

అమల ఒక పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది. బాగా ఏడుస్తోంది. పక్కింట్లో రీటా వచ్చి ఏమైంది అనడిగింది. అమల కథంతా చెప్పింది. రీటా బాగా ధైర్యం చెప్పి రేపు మా ఫ్రెండ్ సుహాసిని వుంది. ఆవిడ ఏదో ఒక దారి చూపిస్తుంది అంది.

కానీ ఒకరోజు బాగా ఆలోచించింది. అవును నేను ఆత్మహత్య చేసుకుంటే అమ్మావాళ్ళని ఇంకా బాధపెట్టినదాన్నవుతాను. నా జీవితాన్ని నేనే సరిదిద్దుకోవాలి. నా కాళ్ళమీద నేను నిలబడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది.

అమల, రీటా కలిసి సుహాసినీ వాళ్ళింటికి వెళ్ళారు. సుహాసిని కూచోపెట్టి అమలా నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. 

ఏం చేద్దామనుకుంటున్నావు? అని అడిగింది. దానికి అమల అందరికీ ఎప్పటికీ కావలసింది క్లీనింగ్ పౌడర్ కదా… అది చేద్దామనుకుంటున్నాను మీ సలహా చెప్పండి అంది. 

సుహాసిని మంచి ఆలోచన నువ్వు వెంటనే మొదలుపెట్టు. నాకు తెలిసిన వాళ్ళు ఇది ఎలా చెయ్యాలో నేర్పిస్తారు. వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. నువ్వు వెంటనే మొదలుపెట్టు. ఏమైనా అవసరం అయితే నాకు చెప్పు అంది. 

సుహాసిని చెప్పిన మాటలకి అమలకి వెంటనే ధైర్యం వచ్చింది. వెంటనే సుహాసిని చెప్పిన వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి కలిసింది. వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునేవాళ్ళకి సలహాలు ఇచ్చి, ఎంతోకొంత ఆర్థిక సాయం చేస్తుంటారు. వాళ్ళు అమల కథంతా విని బాగా ధైర్యం చెప్పి క్లీనింగ్ పౌడర్ ఎలా చెయ్యాలో, దానికి కావలసిన వస్తువులు ఏమేం కావాలో చెప్పారు. దాన్ని మార్కెటింగ్ మొదట్లో కొంచెం కష్టమయినా మానకుండా చెయ్యమ్మా నీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని చెప్పారు. 

అమల వాళ్ళు చేసిన కొద్దిపాటి ఆర్థికసాయానికి బాగా సంతోషించింది. క్లీనింగ్ పౌడర్ కి కావలసిన సరుకులన్నీ తెచ్చుకుంది. తయారు చేసింది. ముందు చిన్న చిన్న కవర్లలో పాక్ చేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ మచ్చుకి ఇచ్చివచ్చింది. కిరాణా షాపుల్లో కూడా ఇచ్చింది. తక్కువ రేటుకి బాగా పనిచేస్తుండడంతో షాపుల వాళ్ళు మరికొన్ని పాకెట్లు కావాలని చెప్పారు. ఈ వచ్చిన డబ్బులు కుటుంబం గడవడానికి ఏమాత్రం సరిపోవని తెలుసు.  

ఫినాయిల్ తయారు చెయ్యడం కూడా నేర్చుకుంది. తనే ఇంటింటికి వెళ్ళి చెప్పి వచ్చింది. తెలిసిన వాళ్ళు, బంధువులు అందరూ ఎలా బతికింది ఇలా ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటోందని విమర్శించారు. అమల ఎవరి మాటలూ పట్టించుకోలేదు. తన పిల్లలు శరత్, శాలినిలని ఏమైనా సరే పైకి తీసుకురావాలి అనుకుంది. 

భర్త పనీ పాటు లేకుండా తిరుగుతున్నాడు. ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు రాడో తెలియదు. అమల అసలు పట్టించుకోవడం మానేసింది.  

అమల పరిస్థితి చూసిన పక్కింటాయన అమ్మా! నువ్వు కొన్ని ఆఫీసులకి వెళ్ళి చెప్పావంటే నీకు ఎప్పటికీ ఆర్డర్లు వస్తాయి. అని ఆయన చేసే ఆఫీసుకి తీసుకెళ్ళారు. ఆయనద్వారా అమలకి చాలా పెద్ద ఆర్డరు వచ్చింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అమల మంచితనానికి చాలా మంది ద్వారా చాలా ఆర్డర్లు వచ్చాయి. చాలామంది అడ్వాన్స్ ఇవ్వడంతో అమలకి కొంత చేతిలో డబ్బులు కనిపించాయి. కడుపునిండా తిండి తినగలుగుతున్నారు. 

కొంతమంది చేసిన ఆర్థిక సహాయంతో అమ్మాయి డిగ్రీ, అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమ్మాయికి ఇష్టమైన వ్యక్తితో పెళ్ళి చేసింది. అబ్బాయి మంచి ఉద్యోగం సంపాదించి అమ్మకి చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఇన్నాళ్ళు అమల పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చింది. శరత్ తల్లిని ఏ పనీ చెయ్యనివ్వకుండా చూసుకుంటున్నాడు.   

 *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.