విషాద నిషాదము

ద్వితీయ భాగము – స్వర సంగమము

-జోగారావు

అది 1938 వ సంవత్సరము.

మైహర్ పట్టణములో ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి ఇంటి ముందు వరండాలో కూర్చున్న పద్దెనిమిదేళ్ళ నవ యువకుడు లోపల వినిపిస్తున్న శిష్యుల సంగీత సాధనను ఆస్వాదిస్తూ, గురుదేవుల దర్శనానికి నిరీక్షిస్తున్నారు.

ఆయన పేరు రొబీంద్ర శొంకర చౌధరి.

కాల క్రమేణా ఆయన రవి శంకర్ ( 07/04/1920 – 11/12/2012 ) అయ్యేరు.

ఆయనకు మైహర్ రావలసి వచ్చిన సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి

పదేళ్ళ వరకు బాల్యాన్ని బెనారస్ లో తల్లి వద్ద గడిపి, పిమ్మట పెద్ద అన్న అయిన ఉదయ శంకర్ బృందముతో, బృంద సభ్యునిగా దేశ విదేశములలో నృత్య ప్రదర్శనలిస్తూ, ఫ్రెంచ్ భాషను, విదేశీ వాద్యములను నేర్చుకొంటున్నారు.

1934 వ సంవత్సరములో , కలకత్తాలో ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి సంగీత కచేరీ కి వెళ్ళడము వలన ఆయన పట్ల అన్నదమ్ములిద్దరికీ గురుభావము ఏర్పడింది.

1935 వ సంవత్సరములో ఉదయ శంకర్ మైహర్ వచ్చి మైహర్ సంస్థానాధి పతి అయిన మహారాజా బ్రజ్ నాథ్ సింగ్ జూదేవ్ ని కలసి, ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారిని తన సంగీతము ద్వారా యూరోప్ ఖండములోని వివిధ దేశ వాసులను ఉఱ్ఱూతలూగించడానికి తమ బృందముతో యూరోప్ దేశముల పర్యటనకు అనుమతిని పొందేరు.

ఆ పర్యటనలో రవిశంకర్ కి ఉస్తాద్ అప్పుడప్పుడు సంగీత విషయములను బోధిస్తూ, సంగీత సాధనకు, సంగీతములోని సూక్ష్మాంశములను, మెళకువలను నేర్చుకొనడానికి విదేశీ యాత్రలను, నృత్య కార్య క్రమాలను వదలి, సంగీత సాధన పైనే దృష్టి పెట్టి మైహర్ రావాలని చెప్పేరు.

1938 వ సంవత్సరములో, ద్వితీయ ప్రపంచ యుధ్ధ మేఘములు యూరోప్ ను కమ్ముకోవడంతో ఉదయ్ శంకర్ తన బృందముతో భారత దేశము చేరుకున్నారు.

వెంటనే రవి శంకర్ ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి వద్ద శిష్యరికము చేయడానికి సంకల్పించుకున్నారు. భారతదేశము చేరిన వెంటనే, రవిశంకర్ మైహర్ చేరుకున్నారు.

ఆయన ఆలోచనలకు భంగము కలిగిస్తూ శిష్యులు ఒక్కక్కరూ బయటకు వస్తున్నారు. లోపల నుండి సరోద్ , సుర్ బహార్ వాద్య నినాదములు ఇంకా వినిపిస్తున్నవి . ఎదురుగా ఉస్తాద్ అల్లాఉద్దీన్ గారు రావడము గమనించిన రవి శంకర్ గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించేరు.

ఉస్తాద్ తనతో రమ్మని రవి శంకర్ కు సైగ చేసి ఇంటి లోపలకి కదిలేరు.

ఆ గదిలో సరోద్ సాధన చేస్తున్న పదహారేళ్ళ ఆలీ ఆక్బర్ ఖాన్ ను, సుర్ బహార్ సాధన చేస్తున్న పదకొండేళ్ళ రోషనారాను చూసి చిరునవ్వుతో అభివాదన చూసేరు.

“ ఇతను రవి శంకర్. మన ఇంటిలో ఉంటూ సంగీతం నేర్చుకుంటారు. “ అని వారిద్దరినీ పరిచయం చేసేరు.

ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి వద్ద సంగీతము అభ్యసించడమంటే ఆషామాషీ వ్యవహారము కాదు. సంగీతము కఠోర సాధన వలననే అబ్బుతుందని ఉస్తాద్ గారి నమ్మకము. గురుకుల పధ్ధతిలో గురువు గారి ఇంటిలో ఉంటూ రవిశంకర్ సితార్, సుర్ బహార్ వాద్యములను నేర్చుకొంటూ సంగీత ప్రక్రియలైన ద్రుపద్, ఖయాల్ , ఢమర్ కూడా నేర్చుకున్నారు.

సితార్, సుర్ బహార్ నేర్చుకొంటూనే, రవి శంకర్ రుద్రవీణ , రుబాబ్, సుర్ సింగార్ కూడా నేర్చుకున్నారు.

ఆయన ఆలీ అక్బర్ ఖాన్ , రోషనారలతో కలసి సంగీత సాధన చేసేవారు.

రవిశంకర్ గారి సితార్, ఆలీ అక్బర్ ఖాన్ గారి సరోద్, రోషనారా గారి సుర్ బహార్ సంగీత సాధన కర్ణ పేయముగా ఉండేది.

1939 డిసంబర్ నెలలో రవి శంకర్ తన మొదటి సితార్ కచేరీని ఆలీ ఆక్బర్ ఖాన్ గారితో కలసి సితార్ – సరోద్ ల జుగళ బందీ గా చేసేరు.

1944 వ సంవత్సరము వరకూ మైహర్ లోనే ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారి శుశ్రూషలో రవి శంకర్ సంగీత సాధన జరిగింది.

అప్పటికి రవిశంకర్ వయసు 24. రోషనారా వయసు 14.

ఉదయ్ శంకర్ మైహర్ వచ్చి రోషనారా రవి శంకర్ ల పెళ్ళి చేయమని

ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారిని అడిగేరు. కుల మత ధర్మ జాతి వివక్షతలు చూపకుండా ఉస్తాద్ అల్లాఉద్దీన్ ఖాన్ గారు ఈ వివాహానికి అంగీకరిస్తూ, రోషనారా హిందూమతమును స్వీకరించి హిందూ నామము అన్నపూర్ణ పేరుతో ఉండాలని ఒకే ఒక్క షరతును విధించేరు.

ఆ షరతును అందరూ అంగీకరించిన పిమ్మట రవి శంకర్ రోషనార ల వివాహము ఆల్మోరా లో 15 మే 1941 న జరుపుటకు అందరూ అంగీకరించేరు.

15 మే 1941 ఉదయము రోషనారా హిందూ మతమును స్వీకరించి, మైహర్ సంస్థాధీశులు పెట్టిన “ అన్నపూర్ణ “ పేరుతో ఆ నాటి సాయంత్రము రవిశంకర్ గారిని పరిణయమాడేరు

క్రమేపీ, రోషనారా పేరు మరుగున పడింది.

అన్నపూర్ణ రవిశంకర్ ల వైవాహిక జీవిత సంగీత ప్రయాణములు ప్రారంభము అయ్యేయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.