మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం

పులకాయోలో నా బాల్యం-2

నా ఇన్నాళ్ళ అనుభవంతోనూ, జ్ఞానంతోనూ మా నాన్న నిజంగా కోరుకున్నది ఎం.ఎన్.ఆర్. కాదని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఉదాహరణకు గనులు జాతీయం అయినాయనే వార్త విన్నప్పుడు ఆయనెంత సంతోషపడ్డాడో నాకింకా గుర్తుంది. కాని ఆయన అప్పుడే “తగరపు దొరల’’కు నష్టపరిహారం చెల్లించొద్దని అన్నాడు. ఆ మాట మీద ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడు. నష్టపరిహారం చెల్లించడాన్ని తీవ్రంగా నిరసించాడు. “మనం వాళ్ళకు నష్టపరిహారం ఎందుకివ్వాలి” అని కలిసిన ప్రతి ఒక్కళ్ళనూ అడిగాడు. అది మనం చెయ్యగూడనిపని అని ఆయన ఉద్దేశ్యం. ఆయన మిత్రులతో మాట్లాడేటప్పుడు మేం పడుకొని ఉన్నామనుకునేవాడు. కాని చాలాసార్లు నేను మెలకువతోనే వుండి వాళ్ళ మాటలు వింటుండేదాన్ని. అయితే ఆ మాటలన్నీ ఎందుగురించో నాకర్థం కాకపోయేది. అందుకనే ఓ రోజు నేనాయన్ను నిలదీశాను. “నాన్నా – నష్టపరిహారం అంటే ఏమిటి? దాన్ని నువ్వెందుకు ఒప్పుకోవటల్లేదు?” అని అడిగాను. అప్పటికి నేనింకా చిన్నపిల్లనే ఐనా, రాజకీయాలు అర్థం చేసుకునే వయసు లేకపోయినా ఆయన నన్ను కూచోబెట్టుకొని ఓపిగ్గా కథలు చెప్పాడు.

“నేను నీకో అందమైన బొమ్మనో, నడిచే, మాట్లాడే తోలు బొమ్మనో కొనిచ్చాననుకో, నువు దాన్ని చూపి డబ్బులు సంపాయించుకోవచ్చు. బతుకుదెరువు వెళ్ళదీసుకోవచ్చు కాని నువ్వా బొమ్మను ఇంకొకరికి అద్దెకిచ్చావనుకో, వాళ్ళు దాన్ని ఎక్కడెక్కడికో తిప్పుతారు. దానిమీద చాలా సంపాదిస్తారు. కొన్నాళ్ళకు బొమ్మ నీది గనుక తిరిగి ఇచ్చెయ్యమని నువ్వు వాళ్ళనడుగుతావు. వాళ్ళతో పోట్లాడుతావు. అయినా వాళ్ళివ్వరు. దానికి బదులు వాళ్ళు పెద్దవాళ్ళూ, బలవంతులూ గనుక నిన్ను కొట్టి గెంటేస్తారనుకో. కాని ఒక రోజున నువు ఎంతోకాలం పోరాటంచేసి, వాళ్ళని పట్టుకొని, కొట్టి బొమ్మ లాక్కుంటావు. నీ బొమ్మ నీకొచ్చేస్తుంది. కాని ఇన్నాళ్ళ వాడకంతో అది పాతదై పోతుంది. ముక్కలు ముక్కలైపోతుంది. అది కొత్తగా ఉన్నప్పుడు నీకెంత పని కొచ్చేదో ఇప్పుడంత పనికిరాదు. ఐతే ఇప్పుడు ఆ బొమ్మను వాళ్ళ దగ్గరినుంచి తీసేసుకున్నందుకు నువు వాళ్ళకేమన్నా డబ్బు ఇవ్వాల్సి ఉంటుందా? డబ్బివ్వడం నీకేమన్నా సబబుగా కనబడుతోందా? ఆ ‘తగరపు దొరలు’ ఇలాగే మన గనులతోనే బొర్ర బాగ పెంచారు. ఇప్పుడు ప్రజల గని ప్రజల చేతుల్లోకి వస్తోంది. సరేగాని ఏం జరుగుతోంది? వాళ్ళకు డబ్బు చెల్లించబోతున్నారు. వాళ్ళు మనకు నష్టాలు కలిగిస్తే వాళ్ళకు మనం నష్టపరిహారం చెల్లించబోతున్నాం. సరిగ్గా ఇదే జరగొద్దని నేను కోరుకుంటున్నాను”.

ఈ సారి మాత్రం కొంచెం అటూ ఇటుగా మా నాన్న చెప్పిన సంగతి నాకర్థమైంది. ఇవాళ నాకు తెలిసిన విషయాల వెలుగులో ఆలోచిస్తే ఆ నష్టపరిహార చట్టం నంబర్ 53 వచ్చినప్పుడు ఆయనెందుకంత విచారపడ్డాడో అర్థమవుతోంది.

అంతిమంగా గనుల జాతీయకరణ అనేది గనుల యజమానులు మారడంగానూ, కొత్తవాళ్ళు ధనికులు కావడంగానూ పరిణమించింది. అంటే ఏమీ మారలేదన్నమాట. గని యజమానులుగా ఉండిన తగరపు దొరల్ని కాపాడ్డానికి ప్రభుత్వం 1942 లోనూ, 49లో సైగ్లో 20 జనం మీదపడి ఊచకోత కోసింది. ప్రజలు తమ జీవితాల్ని పణం పెట్టి సాధించుకున్న1952 విప్లవం తర్వాత అదే పద్దతిలో, లేదా అంతకన్న క్రూరంగా 1965లోనూ, 1967లోను సైగ్లో 20లో ప్రభుత్వం హత్యాకాండలు నడిపింది. అంతేకాదు, గనుల్ని జాతీయం చేసే సమయానికి యంత్రాలన్నీ పాతవి. ప్రభుత్వం దగ్గర కూడా కొత్త విడిభాగాలు లేవు. కనుక జరిగిందేమిటయ్యా అంటే ఘోరంగా ఉన్న పరిస్థితి, ఘోరాతి ఘోరంగా మారిపోయింది. ఈ నష్టాల ఫలితాలన్నీ కార్మిక వర్గమే భరించాల్సి వస్తుంది గదా!

అసలు గనుల్ని ఎందుకు జాతీయం చేశారు? ప్రభుత్వంలోనూ, కంపెనీ యాజమాన్యంలోనూ ఉన్నవాళ్ళు అంత పిచ్చాళ్ళేమీ కాదు. వాళ్ళు బాగా చదివిన వాళ్ళు, వాళ్ళలో ఆర్థిక శాస్త్రవేత్తలున్నారు, సాంఘిక శాస్త్రవేత్తలున్నారు, చట్టం గురించీ, ప్రతిదాని గురించి తెలిసిన వాళ్ళున్నారు. ప్రజల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి పనులు చేయాలో వాళ్ళకు తెలియదంటారా? జనాన్ని అణచకుండా, ఊచకోతలు కోయకుండా సమస్యలెట్లా పరిష్కరించాలో వాళ్ళకు తెలియదూ?! తెలుసు. కాని వాళ్ళకు బయటి నుంచి డబ్బొస్తుంది. అట్లా వాళ్ళు లంచగొండులైపోయారు, అమ్ముడుబోయారు.

సరే, 1954లో సెలవుల తర్వాత ఇంక నాకు బడికి వెళ్ళడం వీలుకాలేదు. అప్పుడు మేం ఉంటున్న ఇల్లు ఓ చిన్న గది. దాని ముందూ, వెనకా కూడా స్థలం లేకుండింది. కనుక పిల్లల్ని వదిలేసి పోవడానికి గానీ, వాళ్ళతో ఎవరినైనా ఉంచడానికి గానీ వీలుగాక పోయింది. అందుకని మేం ప్రిన్సిపల్ తో మాట్లాడి చెల్లెళ్ళను నాతోపాటు బడికి తీసుకెళ్ళడానికి ఒప్పించాం. బడి ఉదయమూ, మధ్యాహ్నమూ కూడా ఉండేది. నేను బడికి వెళ్తూనే ఇంటి పనికూడా చూసుకోవాల్సి వచ్చేది. నేనేమో చిన్నదాన్ని ఎత్తుకొని నడుస్తుంటే, నా చెయ్యి పట్టుకొని ఒకతీ, సీసాలు పట్టుకొని ఒకతీ, పుస్తకాలు పట్టుకొని ఇంకొకతీ బయల్దేరేవాళ్ళు. అందరమూ చదువుకోవడానికి పోయినప్పుడు చిన్నదాన్ని ఓ మూల వదిలేసి ఏడ్చినప్పుడల్లా నోటికో సీసా అందిస్తుండే వాళ్ళం. మిగిలిన చెల్లెళ్ళందరూ ఓ బెంచి నుంచి ఇంకో బెంచికి తిరుగుతుండే వాళ్ళు. మళ్ళీ బడి నుంచి బయటపడితే ఇంటికొచ్చి వంటచెయ్యడం, బట్టలుతకడం, ఇస్త్రీ చేయడం, పిల్లల్ని సవరించడం నేనే చేయాల్సి వచ్చేది. ఈ పనంతా నాకు చాలా కష్టంగా ఉండేది. మిగిలిన నా ఈడు పిల్లల్లాగానే నేనూ ఉండాలని ఉండదూ?

రెండేళ్ళయ్యాక పిల్లలు బాగా గోల చేస్తున్నారనీ, వాళ్ళను బడికి తీసుకు రావద్దనీ టీచర్ చెప్పింది. మేమేమో ఆయాను పెట్టుకోలేం. నాన్న జీతం మా తిండీ బట్టకే సరిగ్గా సరిపోదు. నాకు ఇంట్లో వేసుకునేందుకు చెప్పులే ఉండేవి కావు. పులకాయోలో చలికి నా అరచేతులు పగిలి రక్తం కారుతూ ఉండేవి. అరికాళ్ళలోంచి కూడా రక్తం వస్తూ ఉండేది. పెదవులు పగిలి నోట్లోంచి రక్తం కారుతుండేది. నా ముఖమంతా నెత్తుటి మయమయ్యేది కనీసం మాకు వెచ్చటి బట్టలైనా లేకుండేవి. సరే, ఇంక టీచర్ అంత గట్టిగా చెప్పాక నేను ఒంటరిగానే బడికి పోవడం మొదలయింది. పిల్లల్ని బజార్లో వదిలేసి, ఇంటికి తాళం వేసి బడికి పోయేదాన్ని. పోనీ పిల్లల్ని గదిలోనే ఉంచి తాళం వేద్దామా అంటే ఆ గదికి కిటికీకూడా లేదు. గది చిమ్మచీకటై పిల్లలు దడుచుకునే వాళ్ళు. ఆ గది ఒకే ఒక్క తలుపున్న జైలులా ఉండేది. పోనీ పిల్లల్నెవరి దగ్గరయినా ఉంచిపోదామన్నా చుట్టుపట్లెక్కడా కుటుంబాలే ఉండేవి కావు. అక్కడందరూ ఒంటరిగా మగవాళ్లే ఉండేవారు.

ఇక అప్పుడు నాన్న నన్ను బడి మానేయమన్నాడు. అప్పటికే నాకు చదవడం వచ్చేసింది. ఇంక నేర్చుకోవలసిందేమైనా ఉంటే నా అంతట నేను చదువుకోవచ్చును గదా అన్నాడాయన. ఐనా నేనాయన మాటను లక్ష్య పెట్టలేదు. బడికి వెళ్ళడం మానలేదు.

ఓ రోజు మా చిన్న చెల్లి చెత్తకుండిలోని కార్బైడ్ నుసి తినేసింది. దీపాలు వెలిగించుకునే ఆ నుసి మీద ఎవరో తినుబండారాలు పారేశారట. బాగా ఆకలిగా ఉన్న మా చెల్లి కుండీలోనుంచి అవి ఏరుకుని తిందామని వెళ్ళిందట. దాంతో పేగుల్లో చిల్లులు పడి అది చచ్చిపోయింది. దానికప్పుడు మూడేళ్ళు.

అది చనిపోయాక నేను నేరం చేసినట్లు భావించాను. నేనెంతగానో కుంగిపోయాను. చివరికి నాన్న కూడా నేను ఇంట్లో పిల్లల్లో ఉండకపోవడం మూలంగానే ఇది జరిగిందన్నాడు. అది పుట్టినప్పట్నించీ దాన్ని నేను నా చేతులమీదే పెంచాను. దాని చావు నన్ను బాగా కలత పెట్టింది..

అప్పటినుంచి నేను పిల్లల్ని మరింత శ్రద్ధగా చూడడం మొదలెట్టాను. బాగా చలిగా ఉన్నప్పుడు నాన్న బట్టలు ఎత్తుకొచ్చి వాళ్ళకు కప్పేదాన్ని, నిండా ముసుగు పెట్టేదాన్ని. వాళ్ళను బజారుకు తీసుకెళ్ళి సంతోషపెట్టడానికి ప్రయత్నించేదాన్ని. అలా నన్ను పూర్తిగా వాళ్ళకే అంకితం చేసుకున్నాను. మేం అప్పుడుండిన ఇల్లు మాకు ఇరుగ్గా ఉండింది గనుక నాన్న పులకాయోగని కంపెనీ వాళ్ళతో మాట్లాడి మాకు మరో ఇల్లు వచ్చేట్టు చేశాడు. మా ఇంటికి చుట్టూ స్థలం ఉండేది. మేనేజర్కు మా నాన్నే బట్టలు కుట్టి పెట్టాడట. ఆ పరిచయంతో వెళ్ళి అడిగితే ఆయన మాకు పెద్ద ఇల్లు ఇమ్మని ఉత్తర్వు ఇచ్చాడు. పెద్ద ఇల్లంటే ఓ పెద్దగదీ, ఓ వంటగదీ, చిన్న సందూ అన్నమాట. మేం ఆ ఇంట్లోకి వెళ్లిపోయాం. ఆ ప్రాంతంలో చాల మంది గనికార్మికుల కుటుంబాలుండేవి.

ఒక్కోసారి మాకు తిండి సరిపోయేది కాదు. ఆకలితో చచ్చిపోయేవాళ్ళం. అయితే మరి నాన్న అంతకంటే ఎక్కువ సంపాదించలేడు గదా – చిన్నప్పుడే అంత పేదరికంలో, అన్ని సమస్యల్లో బతకడం చాల కష్టం. ఐతే ఈ బతుకే మాలో కొన్ని లక్షణాలు లోతుగా నిలిచిపోవడానికి తోడ్పడింది. ఈ బతుకువల్లనే మాకు కారుణ్యదృష్టి అలవడింది. ప్రజలకు సాయపడాలనే ప్రగాఢమైన ఆకాంక్ష కలిగింది. చిన్నప్పుడు మేం ఆడుకునే ఆటలన్నీ మా బతుకు చుట్టూరా తిరిగేవి. మేమెట్లా బతకాలనుకుంటామో కూడా ఆ ఆటల్లో ఉండేది. అంతేగాక, పులకాయోలో ఉన్న రోజుల్లో పేదరికంలో గూడా మా అమ్మా నాన్నా ఎన్ని కుటుంబాలకు తోడ్పడేవారో మేమప్పటికే చూసి ఉన్నాం. బజార్లో బిచ్చగాళ్ళను చూసినప్పుడు నేనూ, చెల్లెళ్ళూ ఎన్నో ఆలోచనలు చేసే వాళ్లం. పెద్దయ్యాక బాగా భూమి సంపాదిస్తామనీ, ఎన్నో పంటలు పండిస్తామనీ, పేదలందరికీ తిండి పెడతామనీ మేమెన్నో కలలు కనేవాళ్ళం. బయట ఎవరైన బిచ్చమెత్తుకుంటున్న చప్పుడు వినబడితే మాకు మిగిలిన పంచదారో, కాఫీయో కాగితంలో కట్టి వీథిలోకి విసిరేసే వాళ్ళం.

ఓ సారి సరిగ్గా మేం కాఫీ బయటికి విసిరేసే సమయానికి నాన్న పని నుంచి తిరిగొచ్చాడు. ఆయన ఇంట్లోకొచ్చి మమ్మల్ని బాగా తిట్టాడు. “మనకే కొంచెం ఉందంటే పారబోయడానికి మీకు చేతులెట్లా వచ్చాయే! మీకోసం అది తెచ్చి పెట్టడానికి నేనెట్లా రెక్కలు ముక్కలు చేసుకున్నానో తెలుసా? ఇంకోసారట్లా పారేస్తారా?” అని తిడుతూ కొట్టాడు. ఇంత జరిగినా, ఇలాగైతేనే ఎవరికైనా సాయపడగలమని మేం నిశ్చయించుకున్నాం. అంతేకదూ!

మా బతుకట్లా గడిచింది. నాకప్పుడు పదమూడేళ్ళు. నాన్న ఎప్పటికప్పుడు నన్ను బడిమానెయ్యమంటూనే ఉన్నాడు. నేనాయనను రోజురోజూ బతిమిలాడి బడికి వెళుతుండేదాన్ని. ఐతే నాకప్పుడు బడికి కావలసిన వస్తువులన్నీ ఉండకపోయేవనుకోండి. కొందరు టీచర్లాసంగతి అర్థంచేసుకునేవారు, కొందరు అర్థంచేసుకోలేక పోయేవారు. నేను మంచి విద్యార్థిని కానని వాళ్ళు నన్ను బాగా కొట్టేవాళ్ళు.

సమస్యేమిటంటే నేనూ, నాన్నా ఎప్పుడో ఒప్పందం చేసుకున్నాం. తన దగ్గర డబ్బులేదనీ, నాక్కావలసిన వస్తువులు కొనివ్వలేననీ, బడికోసం ఏమీ ఇవ్వలేననీ నాన్నముందే చెప్పేశాడు. అంటే నా అంతట నేను సమకూర్చుకోగలిగినన్ని సమకూర్చుకోవాలన్నమాట. అందువల్లనే నాకెన్నో సమస్యలొచ్చేవి. ఆరో తరగతిలో నాకో మంచి టీచర్ ఉండేవాడు. ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన కొంచెం నిక్కచ్చి అయిన మనిషి. మొదటిరోజు నా దగ్గర పుస్తకాలు లేనందుకు ఆయన, నన్ను తీవ్రంగా దండించాడు. ఓ రోజాయన నా వెంట్రుకలు పట్టిపీకాడు. చెంపదెబ్బ వేశాడు. చివరికి బడిలోంచి నన్ను బయటికి గెంటేశాడు. నేను ఏడుస్తూ ఇంటికెళ్ళిపోయాను.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.