యదార్థ గాథలు

గమ్యం చేరిన జీవితం   

-దామరాజు నాగలక్ష్మి 

 

విమల ఓ మధ్యతరగతి కుటుంబంలో మూడవ పిల్లగా అపురూపంగా పెరిగింది. తండ్రి గోవిందయ్య ఓ చిన్న మిల్లులో గుమాస్తా. విమలని అన్న కృష్ణ, అక్క సీత చాలా ప్రేమగా చూసుకునేవారు. ఉండేది పల్లెటూరు కాబట్టి చాలీ చాలని జీతంతో ఎలాగో నెట్టుకొస్తూనే పిల్లలని డిగ్రీలు చేయించాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఉద్యోగాలకోసం హైదరాబాదు వస్తూ తల్లితండ్రులిద్దరినీ తీసుకుని వచ్చేశారు. 

 

విమల కంపెనీలో ఉద్యోగానికి చేరింది. కృష్ణకి, సీతకి పెళ్ళిళ్ళయిపోయాయి. వాళ్ళు ఎవరిదారిన వాళ్ళు సెటిల్ అయిపోయారు. విమల అమ్మా నాన్నలతో కలిసి వుంటోంది. కొన్నాళ్ళకి తండ్రి అనారోగ్యంతో మరణించాడు. చెల్లెలు, అమ్మ కలిసి వుంటున్నా… ఎన్నాళ్ళు అలా వుంటుందని,   చెల్లెలికి పెళ్ళి చెయ్యాలని ఎన్నో సంబంధాలు చూశారు. ఒకటి కుదిరితే ఒకటి కుదరట్లేదు. మొత్తానికి కృష్ణ ఆఫీసులో స్నేహితుడు రామనాథన్ మా బంధువులబ్బాయి వున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీ చెల్లెలికి మాట్లాడుకోండి అన్నాడు. 

 

కృష్ణకి బాగానే అనిపించింది కానీ వాళ్లు అరవవాళ్ళు. పద్ధతులు తేడా వస్తాయి అని ఆలోచించాడు. కానీ అన్నీ ఆలోచిస్తుంటే చెల్లెలికి పెళ్ళి అవదు. సరే ముందయితే అబ్బాయిని చూద్దాం అనుకున్నాడు. ఒకరోజు రామనాథన్ వాళ్ళింట్లో పెళ్ళిచూపులు ఏర్పాటు చేశాడు. విమల అతన్ని చూడగానే ఏదో డల్ గా వున్నాడు అనుకుంది.

 

అదే మాట అన్నతో అంది. కృష్ణ ఒక్కసారి ఆలోచనలోపడి, మళ్ళీ వెంటనే ఏం చేస్తామమ్మా… నీకు ఏ సంబంధాలు కుదరట్లేదు. వీళ్ళు కట్నం వద్దన్నారు. పెళ్ళి కూడా సింపుల్ గా చెయ్యమన్నారు. ఇంతకన్నా నేను వేరే సంబంధం తేలేను అన్నాడు. 

 

విమల ఏమీ మాట్లాడలేకపోయింది. వెంకట్ తో పెళ్ళయిపోయింది. పెళ్ళయిన దగ్గరనుంచీ ఏమాత్రం సంతోషంగా లేదు. వెంకట్ ఎప్పుడూ డల్ గా ఏదో ఆలోచిస్తూ వుంటాడు. అదే ఆశ్చర్యం. ఆఫీసుకి టైం ప్రకారం వెడతాడు, వస్తాడు. వెంకట్ బంధువు రామనాథన్ రికమండేేషన్ తో వచ్చింది కాబట్టి అతన్ని ఎవరూ ఏమీ అనరు. ఏది ఏమయినా… విమలకి అతను ఆఫీసులో పని ఎలా చేస్తాడా అని సందేహం వచ్చింది. ఒకరోజు వెంకట్ ఆఫీసులో పనిచేసే లత కలిసింది. లత దగ్గిర విమల తన సందేహం వెలిబుచ్చింది. 

 

లత విమలని జాలిగా చూసి ఆయన ఎక్కువ పనేమీ చెయ్యడు. లెటర్లు ఫైలింగ్ లాంటివి చేస్తాడు. ఉన్నట్టుండి తన డ్రాలో వున్న దేముడి పుస్తకాలు తీసి గట్టిగా మంత్రాలు చదివేస్తాడు. ఇదంతా చూసి మా మేనేజర్ అతన్ని ఎవరికీ సంబంధం లేకుండా చివరగా కూచోపెట్టారు అని చెప్పింది. అతనికి కొంచెం ఏదో ప్రాబ్లం వున్నట్టుంది అంది. 

 

విమల ఆమాటలు విని ఎందుకు అడిగానా… తెలియకుండా వుంటేనే బావుండేదేమో అనుకుంది.  లతకి ఓ థాంక్స్ చెప్పి అక్కడ నుంచి బయటపడింది. 

 

లత చెప్పినవన్నీ ఎంత వద్దనుకున్నా మనసుని తడుతూనే వున్నాయి. ఇంకా ఏవో ఆలోచనలు చుట్టు ముట్టేస్తున్నాయి విమలని – వెంకట్ అన్నయ్య కొంత డబ్బు సాయం చేస్తున్నారు. అలా చేసినా ఈ మనిషి సరిగ్గా వుండకపోతే ఎలా… ఇంట్లో  ఏమీ పట్టించుకోడు. జీతం తన చేతికే ఇస్తాడు. సరేలే ఏం చేస్తాం అనుకుంది. కానీ ఒక్కోసారి షాపుకి ఏమైనా తెమ్మని పంపిస్తే ఇక్కడ బాగాలేదు, అక్కడ బాగాలేదు అనుకుంటూ ఓ కిలోమీటరు దూరం వెళ్ళిపోయి అక్కడ తెచ్చేవాడు. అది కూడా విమల చెప్పినది కాకుండా వేరేది తెచ్చేవాడు. రాసిస్తే ఆ పేపరు పడేసేవాడు. డబ్బులు షాపు వాడికి అసలు కన్నా ఎక్కువ ఇచ్చేసి వచ్చేవాడు. తెలిసిన షాపువాళ్ళయితే సరిగ్గా డబ్బులు తీసుకుని పంపేవారు. విమలకి దుఃఖం ఆగేది కాదు. ఏమీ చెయ్యలేని పరిస్థితి. కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. కొన్ని పనులు బాగా చేస్తాడు. కొన్ని పనులు సరిగ్గా చెయ్యడు. ఈ ఒరవడిలో కొట్టుకుపోతుండగానే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.

 

ఆ పిల్లలిద్దరినీ తల్లి సాయంతో ఎలాగో పెంచుతోంది విమల. ఓరోజు వెంకట్ ఆఫీసులో ఎవరో తిట్టారని ఇంటికి వచ్చి విమలని గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. విమలకి కొంచెం చిరాకనిపించినా… ఎలాగో ఓదార్చింది. ఆ డిప్రెషన్ లో వెంకట్ కి పెద్ద పెట్టున జ్వరం వచ్చింది. రోజూ మందులు వేసి ఆఫీసుకి వెళ్ళేది విమల. ఒకరోజు ఇంటికి వచ్చేసరికి తలుపులు దగ్గిరగా వేసి వున్నాయి. ఇదేమిటి అనుకుంటూ లోపలికి వెళ్ళింది. మంచం మీద స్పృహ లేకుండా పడి వున్నాడు. ఎంత పిలిచినా లేవలేదు. ఎవరో డాక్టర్ని పిలుచుకు వచ్చారు.  డాక్టరు వెంకట్ చెయ్యి పట్టుకుని చూసి, అమ్మా… స్పృహ లేకపోవడం కాదు. ఇతను చనిపోయాడు అని చెప్పాడు. 

 

ఒక్కసారి షాక్ తిన్న విమల అన్నకి, అక్కకి ఫోన్ చేసి చెప్పింది. ఉరుకులు పరుగుల మీద అందరూ వచ్చి చేరారు. జాలి చూపించడం తప్ప ఏమీ చెయ్యలేకపోయారు. విమల అన్న కృష్ణ మాత్రం ఏదో తప్పు చేసిన వాడిలాగా విమల మొహం చూడలేకపోయాడు. నీకు తోడుగా నేను నిలబడతాను అన్నాడు. విమల మూగదయింది. దుఃఖాన్ని దిగమింగుకుంది. 

 

మెల్లగా పరిస్థితులు సద్దుకుంటున్నాయి. విమల ఎంతో ధైర్యంగా నిలబడింది. నా కళ్ళల్లో ఏడుపు అనేది రాదు, రాకూడదు అనుకుంది.  పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చెయ్యాలి అని అనుకుంటూండేది. వీళ్ళ పరిస్థితి చూసి వాళ్ళ బంధువుల్లోనే ఒకాయన మీ పెద్ద పాపని నేను చదివిస్తాను అన్నాడు. ఆయన సాయంతో పెద్దపాప మాధురిని ఇంజనీరింగ్ చదివించింది. మంచి మార్కులతో పాసయ్యింది. వెంటనే క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఉద్యోగం వచ్చింది. విమలకి కొండంత ధైర్యం వచ్చింది.

 

విమల కూడా ఉద్యోగం మారింది. మంచి జీతం వస్తోంది. చిన్నపాప పావనిని బాగా చదివిస్తున్నారు. అమ్మయ్య నా జీవితం ఓ దారిన పడింది అనుకుంది విమల. పిల్లలిద్దరూ తల్లిని బాగా చూసుకుంటున్నారు. పరిస్థితులకి ఏ మాత్రం కుంగిపోని అమ్మని ఎంతో ఇష్టపడతారు పిల్లలు. అమ్మకి ఏ కష్టం రాకూడదు అనుకున్నారు. ఇలా పరిస్థితులని ఎదురీదింది విమల.

      

 *****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.