
ఆమె (కవిత)
-కె.రూప
ఆమెను నేను……
పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను
లోగిలిలో ముగ్గుని
గడపకు అంటుకున్న పసుపుని
వంటింటి మహారాణిని
అతిథులకు అమృతవల్లిని
పెద్దలు మెచ్చిన అణుకువను
మగని చాటు ఇల్లాలుని
ఆర్ధిక సలహాదారుని
ఆశల సౌధాల సమిధను
చిగురించే బాల్యానికి
వెలుగురేఖను
స్వేచ్ఛనెరుగని స్వాతంత్ర్యాన్ని
కనుసైగలోని మర్మాన్ని
భావం లేని భాద్యతను
విలువ లేని శ్రమను
ఆమెను నేను…
కల్లోల సంద్రంలో
కన్నీటి కడలిగా
ఎన్ని కాలాలు మారిన
నిలదొక్కుకోవాలనే
అలుపెరుగని పోరాటం
సమానత్వం లేకపోయినా
తనదైన స్తానం కోసం
గడప దాటాలనే తెగింపు
మనుషుల మధ్య మనిషిగా
గుర్తింపు పొందాలనే ఆశతో
ఎన్నో ఉద్యమాలకు ఊపిరి
జెండాను కట్టి గళమెత్తిన స్ఫూర్తిని
కూడికలలో తీసివేతను
వేన్నీళ్లకు చన్నీటిని
కాలమెరుగని చక్రాన్ని
అలుపెరుగని ఆవిశ్రాంతని
అన్నీ తెలిసిన మౌనాన్ని!!
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

‘అన్నీ తెలిసిన మౌనాన్ని!!’ భలే చెప్పారు. ఆ మౌనపు ముద్ద పేరే స్త్రీ! congratsamDi..
Thank you very much
Wow it’s sooo heart warming
Thank you soniya ji
స్వేచ నెరుగని స్వాతంత్ర్యాన్ని…. Excellent