మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం

పులకాయోలో నా బాల్యం-3

 

మర్నాడు నేను మళ్ళీ బడిదగ్గరికి వెళ్లి కిటికీలోంచి లోపలికి చూశాను. టీచర్ నన్ను పిలిచాడు.

“నువ్వింకా పుస్తకాలు తెచ్చుకోలేదు గదూ” అన్నాడు.

నేను జవాబివ్వలేకపోయాను. ఏడుపు మొదలు పెట్టాను.

“లోపలికి రా! పోయి నువు రోజూ కూచునేచోట కూచో. బడి అయిపోయినాక కాసేపాగు” అన్నాడు.

ఆ సమయానికే మా తరగతిలో ఒకమ్మాయి మా అమ్మ చనిపోయిందనీ, పిల్లలను నేనే సవరించాల్సి ఉందనీ చెప్పింది.

బడి అయిపోయాక ఆయనవచ్చి “చూడూ – ఇప్పట్నించి మనిద్దరమూ దోస్తులమవుదామేం. కాని నువు నాకన్ని విషయాలు చెప్పాలి. మీ అమ్మ చనిపోయిందట నిజమేనా?”

“అవును”

“ఎప్పుడు?”

“నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు”

“మీ నాన్నేం చేస్తాడు?”

“గని పోలీస్ శాఖలో దర్జీ”

“నేన్నీకు సాయపడతాను. నువు మాత్రం నా దగ్గరేమీ దాచొద్దు” అన్నాడాయన.

ఆయన మా నాన్నను పిలవబోతున్నాడని నాకనిపించింది. కోపం వచ్చిన టీచర్లంతా చేసే పనదే. నాకదే ఇష్టంలేదు. నేనూ ఆయనా కుదుర్చుకున్న ఒప్పందం ఏమంటే నేనాయన్ను దేనికోసమూ బాధపెట్టగూడదు. ఏమీ అడగకూడదు. ఆ తర్వాత ఆ టీచర్ నన్ను చాల వివరంగా ఎన్నో విషయాలడిగాడు. నేను కూడా హోమ్వర్క్ చేయగలననీ, నోటు పుస్తకాలు లేకపోవడంవల్లనే చేయడంలేదనీ, డబ్బు లేక పోవడం వల్లనే పుస్తకాలు కొనుక్కోక పోవడమే కాదు బడి కూడా మానేయవలసి వచ్చిందనీ, అతికష్టంమీద బడికి రాగలుగుతున్నాననీ చెప్పాను. ఐతే నాన్నకు చదువంటే అయిష్టమేమీ లేదు. కాని డబ్బు ఇబ్బందివల్లనే ఇలా చేయవలసి వచ్చింది. ఎందుకంటే పులకాయోలో ఎంతోమంది ఆడపిల్లలకు చదువెందుకంటున్న రోజుల్లోనే ఆయన మా చదువులను ప్రోత్సహించాడు.

ఆయన మా చదువుపట్ల ఎంతో శ్రద్ద చూపేవాడు. అమ్మ చనిపోయినప్పుడు జనం మమ్మల్ని చూసి “అయ్యో పాపం! చిన్న పిల్లలు – ఐదుగురూ ఆడముండలే – మగపిల్లడు ఒక్కడైనా లేడు. ఎందుకు పనికొస్తారు వీళ్ళు, చావడం మంచిది” అన్నారు. కాని నాన్న గర్వంగా “వీల్లేదు, ఆడపిల్లలన్న మాట నిజమేగాని వాళ్ళను బతికిస్తాను” అని చెప్పేవాడు. మేం అమ్మాయిలమైనందుకు సిగ్గుపడాలని జనం అన్నప్పుడూ, మేం ఎందుకూ పనికిరామని అను కునేట్టు చేసినప్పుడు ఆయన ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళతో సమాన హక్కులున్నాయని చెప్పేవాడు. మగవాళ్ళు చేసే పనులు మేం కూడా చేయగలమని చెప్పేవాడు. మమ్మల్ని ఆయన చిన్నతనం నుంచీ ఆ భావాలతోనే పెంచాడు. అది ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణ. మా భవిష్యత్తు దృష్టితో చూస్తే అది చాల ఉపయోగకరమైనది. అందువల్లనే మేం ఎప్పుడూ అప్రయోజకులమని అనుకోలేదు.

నా గురించి అంతా చెప్పుకున్నాక ఆ టీచర్ అర్థం చేసుకొని నాకవసరమయినవన్నీ తననడుగమని చెప్పాడు. అప్పట్నుంచి మేమిద్దరం మంచి దోస్తులమై పోయాం. టీచర్ నాకు, నా చెల్లెళ్ళకు అవసరమైన పుస్తకాలన్నీ ఇచ్చేవాడు. అలా అలా 1952లో నేను బడి చదువు ముగించుకోగలిగాను.

బడిలో నేను చదవడమూ రాయడమూ సరిగ్గా ప్రవర్తించడమూ నేర్చుకున్నాను గాని జీవితాన్ని అర్థం చేసుకోవడంలో బడి నిజంగా తోడ్పడిందని చెప్పలేను. ఎన్ని సంస్కరణలు జరిగినా బొలీవియాలో అమల్లో ఉన్న విద్యావిధానం పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగమే. వాళ్ళు చెప్పే చదువంతా పరాయీకరించే చదువే. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే వాళ్ళు మాతృభూమి అంటే జాతీయగీతంలోని అందమైన వస్తువుగా చెప్తారు. జెండాలాగ రంగులకలగా వర్ణిస్తారు. కాని నిజంగా మాతృభూమి కష్టాల్లో ఉన్నప్పుడు ఈ వర్ణనలన్నీ అర్థంలేనివి అయిపోవూ!? నాకైతే మాతృభూమి అంతటా ఉంది. ప్రతీ చోటా -గని పనివాళ్ళలో, రైతుల్లో, జనాల పేదరికంలో, జనాల నగ్నత్వంలో, వాళ్ళ కల్తీ తిండిలో, వాళ్ళ కడగండ్లలో, వాళ్ళ సంతోషంలో, ఎటుచూస్తే అటు మాతృభూమి నిండి ఉంది. మాతృభూమి అంటే అది కాదూ!? కాని బడిలో వాళ్ళు మాకు జాతీయగీతం పాడడం నేర్పుతారు. కవాతు చేయడం నేర్పుతారు. అంతేకాదు మేం ఈ పనులు చేయక పోతే దేశభక్తులు కామని అంటారు. వాళ్ళు మా పేదరికం గురించీ, మా కడగండ్ల గురించీ, మా తల్లిదండ్రుల స్థితిగతుల గురించీ, వాళ్ళ మహత్తర త్యాగాల గురించీ వాళ్ళ చాలీచాలని జీతాల గురించీ ఏమీ వివరించారు. కొందరు పిల్లలకు కావలసినవన్నీ ఎట్లా ఉన్నాయో మరికొందరు పిల్లలకు ఏమీ ఎందుకులేవో ఎక్కడా చెప్పరు. నేను బడిలో ఎన్నడూ ఇలాంటివి విననేలేదు.

అందుకనే నేనేమనుకుంటానంటే ఇంట్లోనే మన పిల్లలు వాస్తవాలు తెలుసుకునేటట్టు చేయవలసిన బాధ్యత మనమీద ఉంది. ఒకవేళ మనమీపని చేయకపోతే మనం చేతులారా భవిష్యత్ అపజయాలకు దారితీస్తున్నామన్నమాట. కొంచెం వయసురాగానే వాళ్ళు ఎదురుతిరగటం మొదలు పెడతారు. చివరికి ఎందుకూ పనికిరాని వాళ్ళుగా తయారయి తల్లిదండ్రుల్ని కూడా గౌరవించని స్థితికి చేరతారు. అప్పుడిక మన పిల్లలను అద్భుతాల అవాస్తవాల ప్రపంచంలో బతికేట్లు చేసినందుకు మనను మనమే తిట్టుకోవాలి. తల్లిదండ్రులు కొన్నిసార్లు తమకు తినడానికి లేకున్నా పిల్లలకోసం తినుబండారాలు తెస్తారు. తాము ఎంత కష్టాల జీవితం గడుపుతున్నారో పిల్లలకు తెలియకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు అందువల్లనే వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారు. ఈ రకంగా చివరికి వాళ్ళు విశ్వవిద్యాలయానికి వెళ్ళినప్పుడు గని కార్మికుల పిల్లలమనీ, రైతుల పిల్లలమనీ చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళకు మన భాష మాట్లాడడం చేతకాదు. వాళ్ళు ప్రతీ విషయాన్ని ఎంత క్లిష్టమైన భాషలో వివరిస్తారంటే, విశ్లేషిస్తారంటే మనమిక ఎంతమాత్రం ఒకరినొకరం అర్థం చేసుకోలేం. ఇది చాలా తప్పు. విశ్వవిద్యాలయానికి వెళ్ళి వాళ్ళు ఎన్నెన్నో సంగతులు నేర్చుకొంటారు. అవన్నీ మనం ఉపయోగించుకోవద్దా? వాళ్ళ మాటా చదువూ శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని నాకు తెలుసు. కానైతే అది వాళ్ళకు మాత్రమే అర్థమయ్యే – భాషలో బొమ్మలూ అంకెలూ కాకుండా మనందరం కూడా అర్థంచేసుకునేట్లుండాలి.

మాతో ఏదైనా సమస్య గురించి మాట్లాడడానికి విద్యార్థులు సైగ్లో -20కి వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళు చేసే పనేమంటే ఓ బోర్డు తెస్తారు. మమ్మల్ని అందరినీ ఒకచోట చేరుస్తారు. ఒకతను వచ్చి డబ్బు మొదలైన విషయాలెన్నో వివరిస్తాడు. కార్మికులు వాళ్ళు చెప్పేదేమీ వినరు. గోలచేసి నువు చెప్పే అంకెలన్నీ నీ ఇంటికే పట్టుకుపో అని గేలిచేస్తారు. అందుకే విశ్వవిద్యాలయానికి వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు మన భాష మాట్లాడాలి. మనమేమో ఎప్పుడు యూనివర్సిటీకి వెళ్ళలేదు. మనకా అంకెలూ తెలియవు. అయితే మనం మన జాతీయ వాస్తవికతను అర్థం చేసుకోగలం. అందుకే నేనేమంటానంటే జనం సంతోషంగా ఉండాలనుకునే వాళ్ళు తాము నేర్చుకున్నదాన్ని జనం భాషలో మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడే వాళ్ళు నేర్చుకున్నదంతా మనం నేర్చుకోగలం. ఇది చాలా అవసరం. ఒకరకంగా మన దేశంలో మంచి జీవనపరిస్థితులు సాధించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.

బొలీవియన్ కార్మికవర్గపు చైతన్యం వల్ల విద్యార్థులు గత కొద్ది సంవత్సరాల్లో, నిజంగా ఎంతగానో మారారు. బొలీవియా విద్యార్థి ఉద్యమం విశ్వవిద్యాలయాల్లో మాత్రమే కాదు కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా ఎంతో బలంగా ఉంది. అందుకు రుజువేమిటంటే ప్రభుత్వం పాఠశాలలు కూడా మూసేయడానికి తలపడుతున్నది. యూనివర్సిటీలమీద టాంకులతో, విమానాలతో దాడిచేసి కూడా విద్యార్థుల నోరు మూయించలేకపోతే ప్రభుత్వానికి మిగిలే దారి అదొక్కటే. అందుకనే విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడల్లా ప్రభుత్వం ఉద్యమ నాయకుల్ని అణచివేయడం మొదలు పెడుతుంది. అయినా విద్యార్థులు అన్నివేళలా మన డిమాండ్లకు మద్దతునిస్తున్నారు. మేం సమ్మెలు చేసినప్పుడు, మేం ప్రదర్శనలు నిర్వహించినప్పుడు మా భర్తలు జెయిల్లో పెట్టబడినప్పుడు వాళ్ళు సంఘీభావం ప్రకటిస్తూనే వచ్చారు.

అయితే మాకు మద్దతునిస్తూ ఉండి మంచి విప్లవకారులుగానే కనిపించిన ఎంతో మంది. యువకులు చదువయిపోయి పట్టాపుచ్చుకోగానే మానుంచి దూరమైపోయిన విషయం మాకు తెలుసు. “మా తండ్రులు వదిలేసిన ఆయుధాలు మేం చేపడతాం. మేం వాళ్ళ పిల్లలం, రాజకీయాలూ, అర్థశాస్త్రమూ, చట్టమూ చదువుకున్నాం. ప్రజలెట్లా మోసపోతున్నారో తెల్సుకున్నాం. మా తండ్రుల గుండెలు ఎందుకు స్పందించాయో మాకు తెలుసు -” అని చదువుకుంటున్నప్పుడు విద్యార్థులు పలికిన మాటలేవీ ఇప్పుడు వినబడవు. యూనివర్సిటీ నుంచి ఓ డాక్టర్, లాయరో బయటికి వస్తాడు. ఓ చిన్న ఉద్యోగం సంపాదించుకుంటాడు. ఇక ఆ విప్లవకారుడో, విప్లవకారిణో అదృశ్యమై పోతుంది. ఇది జరగకుండా మనం జాగ్రత్తపడాలి. మనం మన వర్గానికి బాధ్యత వహించాలి. మనం నిలకడగా ఉండొద్దూ!?

నా బడి చదువయిపోగానే వాళ్ళు నాకు పులకాయో కంపెనీ (పచారీ) దుకాణంలో ఉద్యోగం ఇచ్చారు. అది 1953. మరుసటి సంవత్సరం నా రెండో చెల్లెలు కూడా బడి చదువు పూర్తిచేసింది. దానికి కేకుల దుకాణంలో పని దొరికింది.

ఆ సమయానికే మా నాన్నకు రెండో పెళ్ళి చేసుకోవాలనిపించింది. ఆయన రెండవ భార్య రాకతో మా బతుకు మరింత దుర్భరమైపోయింది. ఆమె ప్రేమ పొందడానికి నేనెంతో ప్రయత్నించాను. ఎందుకంటే నాకు తల్లి ప్రేమ పొందాలని ఎంతో కోరికగా ఉండేది. నేను అమ్మను ఎప్పుడో చిన్నప్పుడే పోగొట్టుకున్నానుగదూ! ఎవరో ఒకరు నన్నర్థం చేసుకునే వాళ్ళు, నన్ను ప్రోత్సహించే వాళ్ళ, నన్ను కౌగిలించుకునే వాళ్ళు, నాకు చేయూత నిచ్చే వాళ్ళు కావాలనిపించేది. మా నాన్న నన్నెంతో ప్రేమించే వాడే కాని కొంచెం కోపంగా ఉండేవాడు. చివరికి తన ఇద్దరు పిల్లలతో సహా ఆమె మా ఇంటికొచ్చింది. మాకు తిండి పెట్టడానికి, నాన్న మమ్మల్ని కొడుతున్నప్పుడు ఆపడానికి ఎవరో ఒకరుంటారుగదాని ఎంత సంతోషించానో! మేం నిజంగానే ఆమెను ఆహ్వానించాం. ఆ రోజుల్లో నేను తెల్లారగట్లే లేచేదాన్ని. ఆ రకంగా ఉదయం పనికి పోయేముందే నేనావిడకు సాయపడేదాన్ని. వంట మొదలు పెట్టేదాన్ని. బంగాళాదుంపలు పొట్టు వలిచి పెట్టేదాన్ని. శని, ఆదివారాల్లో ఆమె బట్టలుతికే సేదాన్ని.

అయితే నాకెందుకో అర్థంకాలేదు కాని మా సవతి తల్లి మమ్మల్నెప్పుడూ ఇష్టపడలేదు. ముఖ్యంగా చెల్లెళ్ళనయితే అస్సలే బాగా చూసేది కాదు. ఓ రోజు మా చిన్న చెల్లెల్ని ఆవిడ కొడుతూ ఉండగా చూసి పోట్లాడ్డం మొదలు పెట్టాను. ఆ తర్వాత నుంచి ఆవిడ తిండి మాకు కనబడకుండా దాచి పెట్టడం మొదలు పెట్టింది. ఓ చిన్న పాత్రలో వండి నాన్నకూ తన పిల్లలకు పెట్టుకొని తాను తినేది. ఇక మిగిలిన అడుగూ బొడుగూ మాకు తినడానికి పెట్టేది. అంతే! అది తప్ప మరేమీ ఉండేదికాదు. ఈ సంగతి నాన్నకు తెలిసేది కాదనుకుంటాను. ఎందుకంటే ఆయన పనికి బయటికి పోయేవాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు పుట్టించడం ఎందుకని మేమూ ఆయనకు ఏమీ చెప్పకపోయే వాళ్ళం.

ఒక రోజు ఆవిడ మళ్లీ చిన్నదాన్ని కొడుతూ ఉండగా పట్టుకున్నాను. అది చేసిన నేరమల్లా పాత్రలోని అడుగు మాడు చెక్కలు తినడమే. ఇక నేనూ మా పినతల్లిని ఓ దెబ్బేసి “నా చెల్లెల్ని ఎందుక్కొడుతున్నావ్?” అని అడిగాను. ఆమె కూడా నా వైపు తిరిగింది. మా ఇద్దరి మధ్య ఇక పోట్లాట మొదలైంది.

నాన్న కూడా పని నుంచి రాగానే నన్నే కొట్టాడు. అయినా సరే నేనామెను మాత్రం వదలదలచుకోలేదు.

“నాన్నా ఇదేమీ బాగాలేదు. నువ్వు నన్ను కొట్టినా కొద్దీ నేన్నీ భార్యను కొడతాను. నువ్వు నన్నెంత ఎక్కువ కొడితే నీ భార్య అంత ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అందుకే ఒక్క క్షణమాగి నన్ను నిజం చెప్పనియ్యి. ఆవిడ చెల్లెళ్ళనూ, నన్నూ కొడుతోంది…” అన్నాను.

చివరికి నేనిక దీన్ని భరించలేక పోలీసుల దగ్గరికెళ్ళాను. అక్కడ పోలీసుల ముందే నాన్నతో “నీకు మేం కావాలో నీ భార్యకావాలో తేల్చుకో. నేను నా చెల్లెళ్ళతో కల్సి వెళ్ళిపోతాను. నా సంపాదనతో చెల్లెళ్ళని పోషించుకోగలను. నేనింకెక్కడైనా ఇల్లు తీసుకొంటాను. మా గురించి ఏమీ బాధపడకు. నీ భార్యతో సుఖంగా ఉండు మేమింకా ఇట్లా ఉండలేం. వెళ్ళిపోతాం” అన్నాను.

మేమంటే ఉన్న ప్రేమ వల్ల నాన్న ఆవిడ్నొదిలేసి మాతో ఉండడానికొచ్చాడు. అయితే అప్పట్నుంచీ ఇంకోరకం హింస మొదలైంది. నాతో ఎవరూ మాట్లాడకపోయేవారు. నేను ఊళ్ళో చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నానని, తండ్రికి తలవంపులు తెచ్చే కూతుర్ననీ మా సవతి తల్లి నాన్నకు చాడీలు చెపుతూ ఉండేది. ఆయన అవన్నీ నమ్మేసే వాడు. ఆయన మాతో ఇంకా నిక్కచ్చిగా, దురుసుగా ఉండడం మొదలెట్టాడు. పొద్దంతా తాగుతూ ఉండేవాడు. మమ్మల్ని బాగా కొడుతూ ఉండేవాడు. చివరికి నేనే ఆయన్ని వెళ్ళి పొమ్మనీ భార్యతోనే బతకమనీ చెప్పాను. ఇక ఆవిడే మాతో కల్సి ఉండటానికి వచ్చింది. మా పని పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది.

ఓ రోజు రాత్రి ఆవిడ, నాన్న కలిసి నన్ను చితకబాదారు. వాళ్ళిద్దరూ తాగి ఇంటికొచ్చారు. చెల్లెళ్ళు నాకడ్డం నిలబడి నాన్నను దూరం తీసుకెళ్ళి “దొమీ పరుగెత్తికెళ్ళిపో” అని కేకేసారు.

నేను ఒక్క అంగలో బజార్లో పడ్డాను. నా కాబోయే భర్త అప్పుడు సివిలియన్ పోలీసుగా ఉండేవాడు. రాత్రి పూట వీథుల్లో తిరుగుతూ జంటలను పట్టుకోవడం, కనిపించిన జనాన్ని జైళ్ళకు పంపడమో తల్లిదండ్రులకు అప్పజెప్పడమో ఆయన పని. నా కప్పటి కాయన తెలియదు. నన్నాయన బజార్లో చూడగానే నా మీద లైటేసి “ఇక్కడేం చేస్తున్నావ్” అని అడిగాడు.

ఆయన నన్నరెస్టు చేయదలుచుకున్నాడు.

“నువ్వు డాన్ ఎజికిల్ కూతురివి కదూ”

“అవును”

 “ఏం జరిగింది?”

“మా నాన్న తాగేసి వచ్చి నన్నుకొడుతున్నాడు. వాళ్ళు నిద్రపోయే వరకు చూసి తర్వాత లోపలికెళతాను.”

“కాని ఈ రాత్రిపూట బయటెట్లా ఉంటావ్ ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళాల్సిందే. నాతో రా.”

ఇక నేను ఆయనతో కలిసి ఇంట్లోకెళ్ళాను, మేం ఇంట్లోకెళ్ళగానే రెనె నాన్నతో “డాన్ ఎజికిల్ – ఇదుగో నీ కూతురు. ఆ అమ్మాయిని కొట్టడానికి నీకు చేతులెలా వచ్చాయ్? ఆ అమ్మాయిని ఈ చీకట్లో బయటికి గెంటేయడానికి నువ్వు మనిషివి కావూ? అసలట్టా ఎట్లా ప్రవర్తిస్తావ్?”

“అదుగో వాడే, వాడే, వాడే దాని మిండడు” అని నా సవతి తల్లి అరిచింది.

అసలే తాగివున్న మా నాన్న ఇంట్లో ఉన్న తన తుపాకీ బయటికి తీసాడు. ఆయన పోలీసే గద. నా వైపు ఎక్కు పెట్టాడు.

అప్పుడు మేం అనుకోని పని ఒకటి చేయాల్సి వచ్చింది. నాన్న నుంచి తప్పించుకునేందుగ్గాను బయటికి పరుగందుకున్నాం. ఎంత వేగంగా పరిగెత్తగలిగితే అంత వేగంగా పరిగెత్తాం. అక్కడో పొలం కనబడింది. నాన్న కూడా మా వెనుక పరిగెత్తుకొస్తున్నాడు. మేం వెనక్కి తిరిగి చూడకుండా ఆగకుండా పరుగెత్తుతున్నాం. పరుగెత్తి పరుగెత్తి మేం ఓ గోతిలో పడిపోయాం. వెలుగొచ్చేవరకు మేం అక్కడే నేలను కరచుకొని ఉండిపోయాం .

నిజానికి అదంత మంచి పనేమీ కాదు. ఆ మరుసటి రోజు రెనె నన్ను వాళ్లింటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ అమ్మ నేను కొత్త పరిస్థితుల్లో బతకడానికి సాయపడింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.