యదార్థ గాథలు

-దామరాజు నాగలక్ష్మి

అలసట తీరిందిలా

కొంతమంది జీవితాలు ధైర్యంగా ముందుకి వెడితేనే బాగుపడతాయనుకుంటున్నాను. 

ఇలాగే జీవితాన్ని ఓ కొలిక్కి తెచ్చుకున్న విమల కథ.

రవితో విమల జీవితం ఎటువంటి లోటూ లేకుండా హాయిగా సాగిపోతోంది. వాళ్ళు అమ్మాయి సుమ, అబ్బాయి రాజాలతో చీకూచింతా లేకుండా వున్నారు. రవి ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కష్టపడి పనిచేేసేవాడు కాబట్టి ఆఫీసులో మంచి పేరు వుండేది. టైమ్ ప్రకారం పనులన్నీ చేసుకుంటూ వుండేవాడు.

పిల్లలిద్దరూ స్కూలుకెళ్ళి వచ్చేసరికి వాళ్ళకి బట్టలు మార్చి, తినడానికి ఏదైనా పెట్టి, వాళ్ళ హోంవర్కులు చేయిస్తుండేది  విమల. 

ఒకరోజు రవి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదని ఎదురు చూసి ఎదురు చూసి ఆఫీస్ కి ఫోన్ చేస్తే వెళ్ళిపోయాడని చెప్పారు. సరే దగ్గరే వున్న అక్కావాళ్ళింటికి వెళ్ళాడేమోనని అక్కడికి ఫోన్ చేసింది విమల. రాలేదన్నారు – వాళ్ళూ కంగారు పడ్డారు. అక్క కొడుకు శీను గబగబా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. వాళ్ళు సాయంత్రం ఒక యాక్సిడెంట్ అయ్యింది. గాంధీ హాస్పిటల్ కి పంపించాం వెళ్ళి చూడమన్నారు.

శీను విమలకి ఏం చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ వివరాలన్నీ చెప్పి అక్కడ కనుక్కునేసరికి పొద్దున్న యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూపించారు. ఒక్కసారి శీనుకి కళ్ళుతిరిగినంత పనయింది. అది బావ రవి…… ఈ విషయం అక్కకి ఎలా చెప్పాలి. చెప్పకుండా కుదరదు. హాస్పిటల్ వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక పొద్దున్న బాడీని ఇస్తామన్నారు.     

శీను విమల దగ్గిరకి వెళ్ళాడు. అప్పటికి రాత్రి 11 గంటలయ్యింది. విమల ఆత్రంగా శీను దగ్గిరకి వచ్చి రవి విషయం ఏమైనా తెలిసిందా అంది. శీను ఒక్కసారి భోరున ఏడ్చేశాడు. విమలకి ప్రపంచం అంతా స్తంభించిపోయినట్టనిపించింది. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. శీనుని అడిగి అన్నీతెలుసుకుని చాలాసేపు ఏడ్చింది.

పొద్దుటికి ఒక నిర్ణయానికి వచ్చింది. నేను ఏడుస్తూ కూచుంటే కష్టం. జరిగిందేదో జరిగిపోయింది. వెనక నా పిల్లలు వున్నారు. వాళ్ళని ఎలాగైనా పైకి తీసుకురావాలి అనుకుంది.

మర్నాడు పొద్దున్న 11 గంటలకి నిర్జీవంగా వున్న రవి శరీరాన్ని హాస్పిటల్ వాళ్ళు ఇంటికి పంపించారు. పిల్లలిద్దరికి నాన్నకి ఏం జరిగిందో తెలియదు కానీ, వాళ్ళూ బాగా ఏడ్చారు. జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. 

రవికి రావలసిన ఇన్స్యూరెన్సులు అవీ కలిపి 3 లక్షల దాకా వచ్చాయి. కూచుని తింటే అన్నీ అయిపోతాయి. తనకా ఎక్కువ చదువు లేదు. ఏం చెయ్యాలా అన్న ఆలోచనలో పడింది. 

నెల తిరిగి వచ్చింది. ఇల్లుగలాయన వచ్చి అమ్మా అద్దెడబ్బులు ఇస్తావా అన్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగేసి ఇచ్చింది.

ఆయన మొహమాటం లేకుండా అమ్మా ఏమీ అనుకోకపోతే ఇంత రెంటు నువ్వు ఇచ్చుకోలేవు వీలైనంత తొందరలో ఏదైనా చిన్న ఇల్లు చూసుకో అమ్మా అన్నాడు. విమల తను అనుకున్నదే కాబట్టి ఎక్కువ బాధపడలేదు. 

అప్పటివరకూ మహారాజభోగాలు కాకపోయినా దేనికీ లోటు లేకుండా ఉన్నారు. సరే పరిస్థితులు మెల్లగా సద్దుకుంటాయిలే అని ధైర్యంగా వుంది. 

వాళ్ళున్న చోటు వదిలేసి ఇంకొంచెం దూరంలో పిల్లలకి స్కూలుకి దగ్గరలో ఒక మూడు గదుల ఇల్లు చూసుకుంది. అక్కడికి మారుతుంటే మనసంతా పిండేసినట్లయింది. ఎందుకంటే ఇప్పుడు వదిలిపెడుతున్న ఇంట్లో చాలా జ్ఞాపకాలు చాలా వున్నాయి. కానీ తప్పదు.  

అంతేకాదు ఇప్పుడు మారే ఇల్లు ఒక 20 కుటుంబాలు నివసిస్తున్న పెద్ద లోగిలి. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడే అలవాటు లేదు. ఎలా జీవితాన్ని గడపాలో అర్థం కాలేదు. మొత్తానికి ఇల్లు మారారు. పిల్లలు బాగా పేచీ పెట్టారు. ఏమయినా ఏం చెయ్యలేం. వాళ్ళని ఎలాగో ఓదార్చి మీరు బాగా చదువుకుంటే మనం పెద్ద ఇంట్లోకి వెడదాం అంది. 

అక్కడ చాలామంది పిల్లలు వుండడంతో వాళ్ళతో కలిసి ఆడుకుంటూ వుండేవారు. విమల కూడా తను అనుకున్నంత ఇబ్బంది లేకపోవడంతో అందరితో కలిసిమెలిసి వుండేది. పిల్లలు, తను మెల్లగా మామూలు స్థితికి వచ్చారు. 

అయితే ఇప్పుడున్న ఇల్లు రెంటు తక్కువే కానీ ఉన్న డబ్బులోంచి వాడేస్తే కష్టం. ఈ ఆలోచనలతో ఉన్న విమలకి ఒక అవకాశం వచ్చింది. దగ్గరలోనే ఒక ఫ్యాన్సీ షాపు ఎవరో అమ్మేసి వెళ్ళిపోతారుట అని శీను చెప్పాడు. ఇద్దరూ వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి వచ్చారు. డబ్బు మొత్తం ఒక్కసారి ఇవ్వక్కరలేదు. ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చి, మిగిలినది నెలకి కొంత ఇవ్వమన్నారు.  

విమల చదువుకోక పోయినా టైలరింగ్ వచ్చు. ఇంట్లో పిల్లల బట్టలు, తనకి సంబంధించినవి, తెలిసిన వాళ్ళవి అప్పుడప్పుడు కుడుతూ వుండేది. అయితే ఇదొక మంచి అవకాశంగా అనుకుంది. షాపుకి సంబంధించిన రాతకోతలన్నీ పూర్తి చేసుకుని ఒక రోజు పొద్దున్నే పిల్లలని స్కూలుకి పంపించి షాపుకి ప్రారంభోత్సవం చేసింది. 

పిల్లలని చూసుకుంటూ, షాపుకి వచ్చి బట్టలు కుట్టడంతో బాగా అలసిపోతూ వుండేది.  విమల ధైర్యానికి కొందరు సంతోషించినా, మరికొందరు వెనక్కి లాగినవాళ్ళూ వున్నారు. 

అయినా అవేమీ పట్టించుకోలేదు. తను రెంటుకి ఉన్నచోట అందరికీ చెప్పి వచ్చింది. అందరూ మెల్లమెల్లగా వాళ్ళ బట్టలు కుట్టడానికి ఇచ్చేవారు. అందులోనూ తమ్ముడు శీను సహకారంతో ఫ్యాన్సీ షాపులో కూడా ఎప్పటికప్పుడు అన్నీ వుండేలా చూసుకునేది. 

ఒక్కోసారి పాతజ్ఞాపకాలతో మనసులో గుబులు పుట్టేది. అయినా సరే మొండిగా రోజులు నెట్టుకురావడం నేర్చుకుంది. అందరితో ఎలా మాట్లాడాలో నేర్చుకుంది. అప్పు తీరింది. పిల్లలూ పెరిగి పెద్దవుతున్నారు. ఇద్దరూ కాలేజీ చదువులకి వచ్చారు. ఇద్దరూ చదువులో మంచి మార్కులతో పాసవుతున్నారు. 

రాజా ఇంజనీరింగు చదువుతున్నాడు. సుమ ఇంటర్ తర్వాత సి.ఎ. చేస్తానంది. చదువులకి బ్యాంక్ లోను తీసుకుంది.

రాజాకి చదువుతుండగానే క్యాంపస్ లో ఉద్యోగం వచ్చింది. ఇక వాళ్ళ ఆనందానికి అంతులేదు. బ్యాంక్ లోను తీర్చేశాడు. సుమ కూడా సి.ఎ. పూర్తి చేసింది. ఉద్యోగం నిమిత్తం రాజా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. తల్లికి, సుమకి ధైర్యం చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు. 

ఉద్యోగంలో బాగా స్థిరపడిన రాజా ఇండియాలో తల్లికి మంచి ఇల్లు కొన్నాడు. సుమకి మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాడు. 

ఒకరోజు అనుకోకుండా కలిసిన విమల ఎలా వున్నారు అని పలకరించింది. మీరెక్కడ వున్నారు.  పిల్లలు ఎలా వున్నారు అని అడిగితే – మా అప్పులన్నీ తీరిపోయాయి. మేమే పదిమందికి అప్పిచ్చేలా వున్నాం అని నేను పడ్డ అలసటంతా తీరిపోయింది అంది. 

ఇలా కథ సుఖాంతం అయింది.   

*****

Please follow and like us:

2 thoughts on “యదార్థ గాథలు-అలసట తీరిందిలా”

  1. బాగుంది. మోటివేటింగ్ స్టోరీ 👏👏👏

Leave a Reply

Your email address will not be published.