
బంగారమంటి-
-డా||కె.గీత
ష్ …. పాపా
నాన్నని డిస్టర్బ్ చెయ్యకు
పని చేసుకొనీ
అర్థరాత్రి వరకూ మీటింగులనీ
చాటింగులనీ
పాపం ఇంటి నించే
మొత్తం పనంతా
భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు
పొద్దుటే కప్పుడు కాఫీ
ఏదో ఇంత టిఫిను
లంచ్ టైముకి
కాస్త అన్నం
మధ్య ఎప్పుడైనా టీనో, బిస్కట్టో
రాత్రికి ఓ చిన్న చపాతీ
ఏదో ఓ కూరో, పప్పో
పాపం సింపుల్ జీవితం
అట్టే ఆదరాబాదరా లేని జీవితం
లాక్ డవున్ లోనూ
ఇవన్నీ ఎలా వస్తున్నాయో
ఎట్నుంచి ఏది మారినా
ఇల్లు ఎలా గడుస్తుందో
తెలియక్కరలేని అదృష్టవంతుడు
పాపా!
నాన్నని డిస్టర్బ్ చెయ్యకు
పాపం ఉన్నవి రెండే చేతులు
ఎటూ తిప్పలేని తల ఒకటి
ఉదయమధ్యాహ్నసాయంత్రాలు
ఒక్కలాగే చెమటోడ్చే
కంప్యూటరు కార్మికుడు-
పాపా!
అమ్మని డిస్టర్బ్ చేసినా పర్లేదు
హెడ్ ఫోన్స్ లో
మీటింగు నడుస్తున్నా
చంటిదాని
ముడ్డి తుడవగలిగిన నేర్పరి
పోపుల డబ్బా పక్కనే
లాప్ టాప్ పెట్టుకుని
ఫ్రిజ్ తలుపు మీద
టైం టేబుల్ రాసుకుని
ఇంటిల్లిపాదీ
తిన్నారో ఉన్నారో
పది చేతులతో
పట్టి చూసుకునే
మల్టీ టాలెంటెడ్ మనిషి
పని మనిషీ
పరుగెత్తే మనిషీ
తనే అయ్యి
సమయానికి అన్నీ అమర్చి పెట్టే
సకల కళామ తల్లి-
అగ్రరాజ్యమైనా
డిపెండెంటు వీసాలో
సగ జీవితం మగ్గిన అమ్మకి
గృహ నిర్బంధం
కొత్తేవీ కాదు కదా
నాలుగ్గోడల మధ్య
తనదైన ప్రపంచాన్ని
నిర్మించుకోగల ధీశాలైనా
కాదన్న ప్రపంచాన్ని
ఔననిపించగలిగే ధీమతైనా
“బంగారమంటి పెళ్ళాం” అన్న
నాన్న ధీమా మాట
ఒక్కసారి వినబడితే చాలు
అతని భుజాన బరువునీ
తన భుజానేసుకుని
ఇంటినేం ఖర్మ
భువనాన్నే మోస్తుంది
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

గీతా మీ “బంగారమంటి “కవిత ఇప్పుడే చదివాను. తన పేరును సార్థకం చేసుకుంది ఈ కవిత. అమ్మవారికి నాలుగు చేతులు చాలు. కానీ ఇల్లాలికి పది చేతులు చాలవు. ప్రాణ సఖుడు పలికే ఒక ప్రియమైన మాటే ఆమె శక్తి, బలం. అలతి మాటలతో అల్లిన అందమైన కవిత.
మీరాబాయి గారూ! కవిత మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ.
గీతా చాలా బాగుంది . ముగింపు మరీ బావుంది
కవిత మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది షర్మిల గారూ!