ఒక భార్గవి – కొన్ని రాగాలు -3

కీరవాణి

-భార్గవి

కీరవాణి అంటే చిలక పలుకు అని అర్థం ,ఇది ఒక రాగం పేరుగా కూడా వుంది.

కర్ణాటక సంగీత జగత్తులో కీరవాణి రాగానికొక ప్రత్యేక స్థానం వుంది.ప్రపంచం మొత్తం వినపడే రాగం అంటే పాశ్చాత్య సంగీతంలోనూ,మిడిల్ ఈస్ట్ లోనూ కూడా వినపడే రాగం,అరేబియన్ సంగీతంలో ఈ రాగ ఛాయలు బాగా వున్నాయనిపిస్తుంది,పాశ్చాత్యసంగీతంలో దీనిని హార్మోనికా మైనర్ స్కేల్ కి చెందింది అంటారు.అతి ప్రాచీనమైనది అని కూడా భావిస్తారు,అంటేమేళకర్తల విభజన జరగక ముందు నుండీ ఉందని ఒక భావన. ఒక సంపూర్ణ రాగం ,72 మేళకర్తలలో 21వది.వేంకట మఖి వర్గీకరణలో దీనికి “కిరణావళి”అని నామకరణం చేశారు.

 ఇది ఒక సంపూర్ణ రాగం అని చెప్పుకున్నాం కదా,అంటే అన్ని స్వరాలూ వుంటాయి,

షడ్జమం,చతుశ్రుతి రిషభం,సాధారణ గాంధారం,శుధ్ధ మధ్యమం,పంచమం ,శుధ్ధ దైవతం,కాకలి నిషాదం—-ఇందులో వున్న స్వర స్థానాలు

వినంగానే ఒకరకమైన శాంతినీ,భక్తి భావాన్నీ కలిగించే రాగంగానూ,రాత్రి రెండో జాములో పాడవలసిన రాగం గానూ భావిస్తారు,నాకైతే ఒక ఆర్తి,ఆవేదన,విరహం,ఒక సన్నని విషాదం ధ్వనించే రాగం అనిపిస్తుంది అయితే ఇళయరాజా లాంటి మేథావులు ఈ రాగం తో చేసిన ప్రయోగాలకు లెఖ్ఖే లేదు,ఒక జోల పాట కానివ్వండీ,ఒక ప్రణయ గీతం కానివ్వండీ,సరదా పాట కానివ్వండీ ఏదీ ఈయన ప్రయోగానికి అతీతం కాదు,అందుకే కాబోలు ఆయన్ని “కింగ్ ఆఫ్ కీరవాణి “అని పిలుస్తారట తమిళ సినిమా ప్రపంచంలో.హిందూ స్థానీ సంగీతంలో ఈ రాగాన్ని పరిచయం చేసి బాగా ప్రాచుర్యం కలిగించింది పండిట్ రవిశంకర్ అని చెప్పుకుంటారు.ఆయన తన గురువూ,మామగారూ అయిన బాబా అల్లావుద్దీన్ ఖాన్ ఆధ్వర్యం లో నడిచిన “మైహార్ బేండ్ “లో ఈ రాగాన్ని ప్రయోగించగా విని ,తాను కూడా దానిని హిందూస్థానీ సంగీత ప్రపంచం లో స్థానం కల్పించాడంటారు.

మన వాగ్గేయకారుల విషయానికొస్తే ,త్యాగరాజస్వామి—-“కలిగియుంటే “అనేకీర్తన బాగా పాప్యులర్ 

హరికేశనల్లూరి ముత్తయ్య భాగవతార్ కృతి—-“అంబ వాణి నన్నాదరించవే “అనేది దాదాపు సంగీతం నేర్చుకునే విద్యార్థులందరూ నేర్చుకుంటారు.నేనుకూడా  మా గురువుగారి దగ్గర నేర్చుకుని ఆయన సమక్షంలో మొట్ట మొదటి సారి స్టేజ్ మీద ఈ కీర్తనే పాడాను

పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ —-“వరములొసగి” అనే కృతి ఈ రాగంలోనే వుంది.

పాపనాశం శివన్ —-“దేవీ నీయే “అనే తమిళ కృతి మల్లాది బ్రదర్స్ నోట వింటుంటే ఈ రాగ స్వరూపం పూర్తిగా కళ్లముందు దేవీ అవతారంలో సాక్షాత్కరిస్తుంది,ఇంకా జి.యన్ .బి మొదలైన ఎంతో మంది కృతులున్నాయి.

సినిమా పాటల విషయం లో అయితే మన తెలుగులో కంటే తమిళం లోనే ఈ రాగాన్ని ఎక్కువ వాడినట్టు కనిపిస్తుంది

ముందస్తుగా మన తెలుగు సినిమా పాటల గురించి చెప్పుకుందాం

సినీ సంగీత దర్శకుడు యస్ .రాజేశ్వరరావుని జీనియస్ అంటారందరూ,ఆయన తాను దర్శకత్వం వహించిన రెండు సినిమాలలో చేసిన రెండు పాటలు చాలా బాగుంటాయి

.ఎందుకోయీ తోటమాలీ అంతులేనీ యాతనా—-విప్రనారాయణ—-భానుమతి

ఈ పాట భానుమతి బాగా పాడారని చెప్పడం హాస్యాస్పదం గా వుంటుంది.ఈ పాట గురించి చిన్న ముచ్చట పంచుకోవాలి మీతో,ఈ పాట ని పదే పదే ఇష్టంగా విన్న ఒకాయన ,ఈ పాట “కీరవాణి “రాగంలో వుందని తెలుసుకుని తన కొడుక్కి ఆ రాగం పేరు పెట్టుకున్నారు.ఆ అబ్బాయి పెరిగి పెద్దవాడయి ప్రఖ్యాత సంగీత దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు.ఈ పాటికి గ్రహించే వుంటారుగా ఆయనెవరో? ఆయనే మన సంగీత దర్శకుడు మరకత మణి కీరవాణి.

.ఝుమ్ ఝుమ్ ఝుమ్ తుమ్మెదా ఓ తుమ్మెదా—-మల్లీశ్వరి—టి.జి.కమలా దేవి,ఇది కూడా చాలా మంచి పాట,ఆమే అభినయిస్తూ పాడారు.

A.M.రాజా సంగీత దర్శకత్వం లో తమిళంలో “తేన్ నిలవు “అనే సినిమాలో ఈ రాగం లో  రెండు పాటలున్నాయి నిజంగా తేనె పానకాలే ఆ రెండు పాటలూ,”పాట్టు పాడవా,ఓహో ఎందన్ బేబీ”-సారీ నాకు తమిళం ముక్క రాదు అందుకని నాకు వీటి అర్థం తెలియదు.

యస్ .యమ్ ,సుబ్బయ్య నాయుడు “మరకతం” అనే సినిమాలో కమెడియన్ జంట మీద చిత్రీకరించిన పాట ,చంద్రబాబు,జమునారాణి పాడారు–“కుంగుమ పూవే”అనే పాట ,ఇదే పాట తెలుగులో మళ్లీ జమునా రాణీ,పిఠాపురం పాడారు”టక్కరి దానా,టెక్కులదానా-తుంటరి రాజా “అంటూ –చిత్రం పేరు “విమల” ,ఎంతో సరదాగా భలే వుంటుంది పాట.

ఆ తర్వాత వచ్చిన ఇళయ రాజా “కీరవాణి “లో చేసినన్ని పాటలు ఎవ్వరూ చేయలేదనుకుంటా.చాలా తమిళ ట్యూన్లు యథాతథంగా మన తెలుగులో కూడా వచ్చాయి.

ముఖ్యంగా “పాడుమ్ పారవైగళ్ “అనే సినిమాలో చేసిన “కీరవాణి ఇరవిలె కనవిలె” అనే పాట ఆయన ఆ రాగానికి చెప్పిన భాష్యం ,ఆ పాట చరణంలో ఆ రాగం ఆరోహణని వాడిన తీరు అనన్య సామాన్యం,సింపుల్గా దాటు స్వరాలతో డాన్స్ చేయిస్తాడాయన,ఇలా దాటు స్వరాలతో ఆడుకున్నది సలీల్ చౌదరి తర్వాత ఈయనే అనిపిస్తుంది నాకు.అన్నట్టు ఇదే పాట తెలుగులో “అన్వేషణ “లో వుంది,రెండు సినిమాలు ఒకేసారి తయారయ్యాయనుకుంటా.

.ఇంకో పాటతెలుగు లో “చెట్టుకింద ప్లీడర్ “సినిమాలో “చల్తీకా నామ్ గాడీ”అని వస్తుంది ,తమిళ్ లో “అమ్మన్ కోయిల్ “అనే సినిమాలో “చిన్న మణి కుయిలె” అనివస్తుంది,అబ్బ ఎంత బాగుంటాయో  రెండు పాటలు! మజా వస్తుంది వింటుంటే కాకపోతే తమిళ్ లో సోలో ,తెలుగులో డ్యూయట్ 

“చంటి “అనే సినిమాలో “ఎన్నెన్నో అందాలు” అనే పాట ,”గీతాంజలి “లో “ఓ పాపా లాలి ” పాటలు కూడా”కీరవాణి” ఆధారంగా ఇళయరాజా చేసినవే.అవి వింటుంటే నిజంగానే ఆయన “కింగ్ ఆఫ్ కీరవాణి “అనిపిస్తుంది (ఆయన ఇంకా చాలా పాటలు తమిళ్ లో ఈ రాగంలో చేశారు) 

ఎ.ఆర్ రహ్మాన్ “బాంబే “సినిమాలో చేసిన “కన్నానులే కలయికలు యే నాడు ఆగవులే ” పాటకి కూడా “కీరవాణి “రాగమే ఆధారం.

ఇవన్నీ వింటుంటే వివిధ సంగీత దర్శకులు వివిధ సందర్భాలలో ఆ రాగాన్ని ఎంత ప్రతిభావంతంగా వాడారో తెలుసుకోవచ్చు ,ఆ రా స్వరూపం కూడా బాగా బోధ పడుతుంది.మిత్రులారా మీదే ఆలస్యం పైన చెప్పిన పాటలన్నింటికీ సాధ్యమైనంత వరకూ లింకు లందిస్తున్నాను విని ఆనందించే పని మీదే

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.