ఒక భార్గవి – కొన్ని రాగాలు -4

మలయమారుతం

-భార్గవి

మనసు గుర్రము రోరి మనిసీ

మనసు కళ్లెము పట్టి లాగు అన్నాడో మహా రచయిత

కోర్కెల సెల నీవు

కూరిమి వల నీవు

ఊహల ఉయ్యాలవే మనసా

మాయల దయ్యానివే 

అన్నాడింకో రచయిత

అయితే త్యాగరాజ స్వామేమన్నాడు

మనసా ఎటులోర్తునే 

నా మనవిని చేకొనవే —అంటూ

దినకర కులభూషణుడైన రాముని సేవ చేసుకుంటూ దినము గడుకోమంటే వినవెందుకూ గుణవహీన అని విసుక్కున్నాడు

ఇంకా యేమన్నాడు ఈ లోకంలో రాజస,తామస గుణములు కలిగియున్న వారి చెలిమి చేసి కాలము గడిపేకంటే,మనిషి జన్మకు కావలసిందీ,ఎవరైనా కోరుకునేదీ యేవిటీ? సులభంగా కడతేరటం,అలా సులభముగా కడతేరే సూచనలను తెలియజేసే త్యాగరాజు మాట వినవేమీ గుణవిహీనా? అని తన మనసుని తానే కోప్పడ్డాడు ఇంతకంటే తత్త్వం బోధ పరిచే విధానం వుందా!

 ఇంతకీ ఈ అపురూపమైన కీర్తనని త్యాగరాజస్వామి అంతే అపురూపమైన “మలయ మారుత” రాగంలో వరసకట్టాడు,అందుకేనేమో అది సూటిగా మనసును తాకుతుంది.

మలయ మారుతం అంటే మలయ పర్వతం మీదినుండీ వీచే చల్లని సుగంధ భరితమైన గాలి అని చదివాను ఎక్కడో,అది మనసుని రంజింప జేస్తుందనీ,ఆ అనుభూతినీ మాటల్లో చెప్పలేమనీ కూడా విన్నాను

ఆ మలయ పర్వత మెక్కడుందో ,ఆ గాలి సంగతేమిటో నాకు తెలీదు గానీ ,ఈ రాగంలో చేసిన కీర్తనలైనా,పాటలైనా విన్నప్పుడు మాత్రం నిజంగా మాటలకందని అనుభూతి కలుగుతుందనడంలో సందేహంలేదు.

మలయమారుత రాగం ,పదహారవ మేళకర్త అయిన చక్రవాకం నుండీ జన్యము,ఆరోహణ అవరోహణల్లో ఆరే స్వరాలుంయి,అందుకే షాడవ షాడవ రాగం అంటారు.ఇందులో మధ్యమం వర్జిత స్వరం అంటే మధ్యమం వుండదు.

దీనిని  భూపాల  రాగం లాగా ఉదయ కాలాల్లో పాడే రాగం గా భావిస్తారు..

సంగీతం నేర్చుకునే విద్యార్థులకు ఈ రాగంలో “శ్రీ లోలా శ్రిత పాలా,సేవిత సుర గణలీలా “అనే చక్కని గీతం ఒకటి నేర్పుతారు కొంతమంది గురువులు.

ఇక వర్ణాలూ,కృతులూ కూడా చెప్పుకోదగినన్ని వున్నప్పటికీ,

ఈ రాగంలో ఇంతకు ముందు చెప్పుకున్నట్టు త్యాగరాజ స్వామి చేసిన “మనసా ఎటులోర్తునే ” చాలా పేరెన్నిక గన్నది .దీనిని “త్యాగయ్య “సినిమాలో నాగయ్యగారు  క్లుప్తంగా అంటే రాగాలాపన,నెరవు ,స్వరకల్పన లేకుండా సూక్ష్మంగా పాడినప్పటికీ రాగ స్వరూపాన్ని చక్కగా తీసుకు వచ్చారు ,ఇక మహా విద్వాంసులు బాలమురళీ, మల్లాది బ్రదర్స్ మొదలయిన వారు పాడినవి వింటుంటే రాగమూ,భావమూ చక్కగా మనసుకి పడతాయి.

పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ “దీనుడెవడో “చక్కతి కృతి మల్లాది బ్రదర్స్ నోట ఇంకా చక్కగా వుంటుంది

అన్నమయ్య పదాలెన్నిటికో స్వరరచన చేసి మట్లు కట్టి పాడుతున్న గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు  “ఇహ పర సాధన మిదియొకటే ,సహజపు మురారి సంకీర్తనొకటే” పాట మలయమారుతంలో  స్వరపరిచారు,చాలా బాగుంటుంది

సినిమా పాటల విషయానికొస్తే ఈ రాగం అరుదుగానే ఉపయోగించారు మన సంగీత దర్శకులు.

అరుదైన రాగాలిని,తన బాణీలలో అలవోకగా పలికించే బాలాంత్రపు రజనీ కాంతరావు గారు “మానవతి” అనే సినిమాలో ఎం.ఎస్ .రామారావు,రావు బాలసరస్వతిల గళ యుగళాన్ని,ఈ రాగంలో స్వర పరిచిన “ఓ మలయ పవనమా “అనే యుగళ గీతానికి ఉపయోగించారు.

ఆ యుగళ గీతంలో ఎం, ఎస్ .రామారావు గారి గొంతు మంద్ర గంభీరంగా నిజంగా తుమ్మెద ఝంకారంలో వుంటే ,బాలసరస్వతి గారి గొంతు దిరిసెన పూవులాగే కుసుమ కోమలంగా వుంటుంది.”రజనీ”స్వర రచనా సామర్థ్యమూ,వచన విలాసమూ వేరే చెప్పాలా!

పాట వింటుంటే రాగస్వరూపమంతా బోధపడుతుంది,”తొలి జన్మల వలపులలో తొరిపిన తేనియలూ,విరిసిన పుప్పొడి మెరుపుల మురిసిన మాధురులూ “అంటుంటే ఆ పదాల పోహళింపుకీ,వాటిలోని అచ్చతెలుగు అలరింపుకి సలాం అనటం తప్ప ఇంకేం చేయగలం.

ఇదే రాగంలో పెండ్యాల నాగేశ్వరరావు “ఉయ్యాల-జంపాల ” అనేసినిమాలో ఆరుద్ర రచనకి ట్యూను కట్టి ,”కొండ గాలి తిరిగింది” అనే పాటకి పట్టం కట్టాడు.

సినిమా పాటల ప్రియులలో ఈ పాటని ఇష్ట పడని వారుండరేమో! ఏం పాట “కొండ గాలి తిరిగింది గుండె ఊసు లాడింది “అనంగానే గుండె దడ దడ కొట్టుకుంటుంది.పాటలో అన్నీ ప్రతీకలే , ఘంటసాల గొంతు వింటుంటే అదేదో సుదూర తీరాలనుండీ తేలి వస్తున్న ఒక వేదాంతి గొంతులా అనిపిస్తుంది,అతని గొంతులో వున్న ఒక రకమైన డిటాచ్ మెంట్ వలన ఈ అనుభూతి కలుగుతోందా ?యేమో?.వెనక నేపథ్యంలో వినపడే సుశీల గొంతూ,బాక్ గ్రవుండ్ స్కోరూ ,పాట చివరిలో “ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయిందీ” అనే వాక్యమూ అన్నీ చేరడం వలన, ఈ పాట తత్త్వ సారాన్ని బోధిస్తూ ఆధ్యాత్మిక తీరాన్ని చేర్చే ఒక నావ లాగా అనిపిస్తుంది.

అసలు “మలయ మారుతం “రాగంలోనే ఈ మహత్తు వుందను కుంటా,ఈ పాటలన్నీ విని చూడండి,మీరు కూడా నా మాట నిజమేనంటారు


*****

Please follow and like us:

One thought on “ఒక భార్గవి – కొన్ని రాగాలు -4 (మలయమారుతం)”

  1. భార్గవి గారు, మలయమారుత రాగాన్ని గుర్తుకు తెచ్చారు. వినిపించారు . ఆర్ద్రత భావం అలా వీచి, మనసుని కదలించి వెళ్ళింది . బాగా వ్రాశారు .

Leave a Reply

Your email address will not be published.