పామరపాండిత్యం

-వసంతలక్ష్మి అయ్యగారి

పదిరోజులుగా లోసుగరనీ,హైసాల్టనీ..డాక్టర్ వద్దకి చక్కర్లుకొట్టానే తప్ప,యింటిగడపేకాదు..పక్కదిగి ఐపాడూ పట్టుకోలేదు.కాలుకదపనిదే కబుర్లెలా వస్తాయిచెప్పండి..పదిరోజులుగా పనమ్మాయే నాలోకం!

నెల్లాళ్లుగా దానిది ఒకటే గోడు..యిల్లుఖాళీచేయాలనీ..మరోయిల్లు వెతుక్కోవాలనీ!నెలలో మూడుసార్లుశలవు చీటీ యివ్వడమూ..చివరినిముషంలోతేడాలొచ్చి డ్యూటీ కి వచ్చేయడం 

జరిగింది…నాకు pleasant surprise లనమాట!

ఓరోజు మాయిల్లూడుస్తూ…అమ్మా..మంచిరోజెప్పుడోచెప్పరా…అంది!ఎందుకనంటే…యిల్లు యెదుకుడు మొదలుపెట్టనికీ..అంది.

ఇల్లుమారేరోజు కి…పాలుపొంగించుకోవడానికి మంచిరోజుచూడాలితప్పితే…వెతుక్కోడానికి కాదుపద్మా..అని చెప్పాను.

చివరాఖరుకి ..ఓగది..వంటిల్లు,బాత్రూమ్ఉన్నబుజ్జిపోర్షన్, బేచిలర్స్ ఖాళీ చేయగా అయిదువేలకి తీసుకుని ముహూర్తం పెట్టించుకుందినాతో!రెండురోజులశలవడిగి..వాళ్లపాపను పంపినన్ను తప్పక తనకొత్తింటికి తోలుకరమ్మంటాననిపదేపదే చెప్పింది.అలాగేవస్తాలేఅన్నాను.

పద్మమంచి ప్లానర్..చాలా క్రమశిక్షణ కలిగినమహిళ.భర్త బేంకులో ప్యూన్.పాప బిసీయే చదువుతోంది.బాబు 

డ్రైవరు.అంతాబుద్ధిమంతులే!

మాటతప్పని పద్మ..తనే స్వయంగారెండోరోజుకల్లా యిల్లుసర్దుకుని మాయింటికొచ్చి..ఓపట్టాన కాలుకదపని నన్ను తెమిల్చి తోలుకెళ్లింది వారింటికి.గట్టిగా..ఓరోడ్డునడక…మూడొందలఅడుగులే!!

చాక్లెట్లప్యాకెట్టు..పసుపుకుంకాలు,రవికెల గుడ్డ,రొక్కం.ఓచిన్ని దీపపుకుందె సంచలో సర్దుకుని వెళ్లగానే వారింట్లో పెట్టాను.కూలరుగాలి నావైపుతిప్పి,రన్రమ్మా..కూసోండంటూ కుర్చీ వేసింది.ఎంతో తీరువుగా సర్దేసిందియిల్లు.వాళ్లాయన కూడా…ఏదో మీఅసొంటి అమ్మగార్లదయతోని మేమీఊర్ల సెటిలైనమమ్మా…అంటూ ఒదిగి మాట్లాడుతునేవున్నాడు.పాపకూడా మేడమ్..మేడమ్..అంటూ వినయంగా వుంది.

ఏం మాట్లాడాలో తెలియక..ఎంతసేపుండాలో తోచక .యథాలాపంగాయీ బీరువాయిటుపెట్టావా…అంటూ దిక్కులుచూస్తూవాక్కులు విసిరాను..!

జరచెప్పున్రమ్మా..ఎటుదిక్కుకుజరపాల్నో అన్నాడు యజమాని.

ఉష్..నువ్వూకో జర..అమ్మగారు వాస్తు చెప్తరనే తోలుకొచ్చిన..నువ్వు సప్పుడు చెయ్యకూకో..అంది పద్మ.

ఓరినీ..అనిగతుక్కుమన్నానుఓక్షణం.వెంటనే వాస్తు సిద్ధాంతులని ఆవాహన చేసుకుని..పరువుదక్కించుకుందుకు…కళ్లు గట్టిగామూసి..వీరలెవెల్లో గాలిలో వేళ్లుకదుపుతూ…దిక్కులూ,మూలలూలెక్కలుకడుతూ…అయ్యో..నాకుముందేచెబితే…సెల్లు తెచ్చుకుందునే..కంపాస్ చూస్తే చెప్పగలను..అన్నాను.

నాసెల్ అయితే వుందిమేమ్..కానీ..యింకా వైఫై కనెక్షన్ రాలే..అంది.

సరే ఓ పెన్నూ పేపరూ పట్రమ్మనిచెప్పి..మాయింటిగేటున్న దిక్కును పోలుస్తూ..గీతలు గీసుకుని…ఉత్తరయీశాన్యద్వారమనితేల్చి…మిగతా లెక్కలు పూర్తిచేశా!అంతసేపూ వారూ దీక్షగా చేతులుకట్టుకునిమరీ నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు.ఇంటి ప్రవేశమే కిచెన్…ఈశాన్యంలో సింకు..కిందేచక్కటి ట్రాష్డబ్బా..రెండుసిలిండర్లు..థళుక్కుమంటున్న

స్టీలుసామాన్లు!ఆపక్కకి ఆగ్నేయంలో..పొడవాటి టాయిలెట్టూ…

పైకప్పువరకూ టైల్సూ,

నైరుతిగదిలో మంచం..కనిపించాయి.అన్నీ చక్కగాఅమిరాయిపద్మా..అన్నాను.బీరువాలు..ఒకటికాదు..రెండు.

పైగా పేద్దవి. ..అవిమాత్రం వాయవ్యంలో ఉన్నాయి..నైరుతికి జరిపించమన్నాను.

అంతటితో ఆగిపోతే..యీ వాస్తురత్నం ఆపూట చేసిన పనికి న్యాయం కాదన్నట్టుగా..గీసుకున్నగీతలను చూపిస్తూ వివరించబోతుండగా..వాళ్ల లెవెల్ కి దిగాలని తోచింది…దిగాలుపడినవారిముఖాలుచూసి!

వెంటనే ఏదిక్పాలకులు పూనారో నన్ను…చూడండీ…ఈశాన్యం దిక్కులో ఈశ్వరుడు..గంగమ్మఉండాలి..అంటే నీళ్లసింకు..అంటే “గుంట“ అనమాట!అదికరెక్టుగావచ్చింది.

అవునామ్మా..దేవుడిపటాలు ఎక్కడపెట్టాల్నో తెలవకనే మిమ్మల్ని రమ్మన్న..మేకులు కొట్టిపీయాలేకదమ్మా..![ఆర్నీ..మనసులో మళ్లా..]

అట్లానే…ఆగ్నేయం..అంటే..అదుగో చక్కగా పొయ్యిగట్టూ ..పొయ్యి..అంటే..“మంట“!పర్ఫెక్ట్!

ఇక యీగది…బెడ్రూమ్…

నైరుతి,వాయవ్యం కలుపుతూవచ్చింది.అబ్బ..వాయవ్యంలో గాలుండాలి..కిటికీ వచ్చిందికదా!బీరువాలిక్కడుండొద్దు..అటుదిక్కుకు జరపండి.

“హయ్యో…మాకు ఊర్లనించొచ్చిన బియ్యంబస్తాలక్కడపెట్టినమమ్మా…సర్లే..జరిపిస్త..“అంటుండంగా..

మళ్లా దిక్పాలకుడెవరో పూనాడు..ఆహా…మంచిదే..నైరుతిలో “పంట“..అంటారు..కరెక్టేపెట్టావు.

నా పైత్యానికి..కపిత్వానికీ..నాకే ఆశ్చర్యం..ఆనందమూనూ!

కవిత క్లోజ్చేయాల్సివుంది..సమస్యాపూరణంఅంటారే…!

అంతాబాగుందిపాపా…యివన్నీ..మళ్లీ ఓసారి మీ అమ్మానాన్నలకి చెప్పు…ఇదో..యీ వాయవ్యంలో బీరువాలు అటుజరిపి కిటికీ దగ్గర మంచం వేసుకోండి..ఫస్ట్ క్లాసనుకో..అనిలేచానే కానీ..వెలితి ఫీలయ్యాను..!

అంతలోనే ఠక్కు!హా…గుంట,మంట,పంట ..అయ్యాయా..ఇక యీ మూలని …“పెంట“ …అనుకోవచ్చు.ఇదొక్కటే కలవలేదు..అయినాఫర్లేదు..ఫస్ట్క్లాస్!అంటూ నిష్క్రమించాను!

వాస్తు అంటే..ఏదోకాదు..యీజీ యే..అని నాలో నేను పునశ్చరణ చేసుకుని..నామిడిమిడి కి ఓరేంజ్ లో మిడిసిపడి ఉబ్బాను నిన్నంతా!

ఏమైనా…Ignorance is bliss అని ఊరికే అనలేదు పెద్దలు!

ఇంతకీ మీకోప్రశ్న!

ఏదో పెద్దదాన్నైనందుకు..మంచిరోజు క్యాలెండరులో తిథి చూసి చెప్పినమాత్రాన…నన్ను వాస్తురత్నంగా ఎందుకు ఎంచుకుందంటారు..మా పద్మ?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.