కొత్త అడుగులు – 11

– శిలాలోలిత

జ్యోతి నండూరి మరణించిందన్న వార్తను నమ్మలేకపోతున్నాను. నవ్వూతూ, తుళ్ళుతూ, సౌమ్యంగా, స్నేహంగా కనిపించే  ఈ కవయిత్రి ఇలా తన జీవనగీతను కోల్పోతుందని తెలీదు. ‘కాలంగీసిన చిత్రం’ అనే కవితా సంపుటి 2017 లో తీసుకొచ్చింది. చాలా అద్భుతమైన కవిత్వముంది. నర్సింగ్లో యం.ఫిల్ కూడా చేసింది. ఈ కోర్సు క్లిష్టమని అతి తక్కువమంది చేస్తారు. దాన్ని తాను సాధించింది. ఇద్దరు పిల్లలూ, భర్త, కవిత్వమూ ఆమె వెంటే నడిచాయి. హఠాత్తుగా బ్రెయిన్కి ఏదో ప్రాబ్లమ్ వచ్చి, ట్రీట్మెంట్ నడుస్తున్నా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయిందట. ఈ లాక్ డౌన్ కాలంలో ఆమె వెళ్ళిపోవడం కూడా కాలం ముందే గీసిన చిత్రంలా అన్పిస్తోంది.

ఆమె చిరునవ్వులో గొప్ప కాంతి వుంది. మాటల్లో స్నేహం, కవిత్వమంటే అపారమైన ఇష్టం కన్పించాయి. తక్కువ పరిచయంలోనే దగ్గరగా రావడమే కాక, పుస్తకం నన్ను చేరాక మరింత దగ్గరైంది.

ఆవిష్కరణ సభకు నన్ను అధ్యక్షురాలిగా వుండమని, ఎంత గారాబంగా అడిగిందో, ఆ చిన్నపిల్ల మనస్తత్వమే నన్ను ఒప్పుకొనేలాచేసింది.

కవిత్వాన్ని అంకితం చేసింది వినూత్నంగా –

’తొలివేకువ కిరణాల వాత్సల్యంలో

కన్నీటికి ఊరటనిచ్చే బాసటలో…

ప్రతి మనిషిలో వెలుగు రేఖలు నింపే

ప్రతి ఆత్మీయ హృదయ స్పందనకు…

నా  ఈ తొలి కవితా సంపుటి అంకితం…

ఒకచోట తన పొయెటిక్ డెఫినిషన్స్ అంటూ-

నది : భూమి పసిపాపగా

నవ్వినప్పుడు పుట్టిన

ఆనంద భాష్పాలు

సూరీడు : ఆకాశం పురివిప్పి ఆడితే

విరబూసిన వెలుగుపూవు

చందమామ : ఆకాశం చెట్టుకు –

పూసిన మల్లెపూవు

‘సుద్దాల అశోక్ తేజ’ గారు రాసిన ముందుమాటలో ఊహకు రెక్కలొచ్చి, కాగితం రెపరెపలాడడం, జీవితం పుస్తకంగా మారడం, చిగురించని మోడునుండి చిగురుంచే మోడుకోసం ఎదురుచూపులు, సగంపైగా కవితలు స్వీయానుభూతుల వెల్లువల్లా అలరిస్తాయి. ప్రతికవిత వెనుకా ఒక కవితావేశం ప్రస్ఫుటం. గుండెలోని గాయాలు చెమ్మగిల్లిన కళ్ళలో చెందిన రక్తం ఆయుధాలు కావాలన్న తపన, అంతలోనే పాదం ముద్దాడే భావాలు కనిపిస్తాయి. అని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు.

ప్రసాదమూర్తిగారు కూడా మంచి ముందుమాటతో పరిచయం చేసారు. జ్యోతికి పసిపిల్లలంటే ప్రాణమనీ, అనాధలపట్ల మరింత ప్రేమ అనీ భావించి ఆమె రాసిన వాటిల్లో 

‘వాడు తెగిన గాలిపటంతో ఆకాశం ఎక్కాలనుకుంటాడు

శూన్యంలో నీళ్ళు తోడుకుంటాడు

మాట్లాడాలనిపిస్తే శిఖరపు అంచునుండి

జారుతున్న జలపాతాన్ని చూస్తాడు

నాలుగు దిక్కులు తనవేనంటాడు’’ –

‘‘నీటి పలకపై రాసిన అక్షరంలా

చిగురించిన మోడుతో అలసిన జీవితం’’-

‘చిగురించిన మోడు’  అనే కవితలో జ్యోతిలో స్త్రీవాదిని చూస్తామన్నారు. భావవితా పోకడలు, గేయ కవితా లక్షణాలు ఎక్కువని అభిప్రాయపడ్డారు. చాలా చోట్ల ప్రేమకోసం ప్రేమగా ప్రేమకై ప్రేమతో పలకరించడం కనబడుతుంది.

చైతన్య ప్రసాద్ గారు ‘స్నేహం, ప్రేమ, అమృతం లాంటి సార్వత్రిక అంశాలపై కవి దృక్కోణం రసాత్మకంగా వినిపిస్తుంది. శైలి లలితమధురంగా సాగుతుంది. శబ్దం సున్నితంగా మోగుతుంది అని తన అభిప్రాయాన్ని చెప్పారు.

పొట్లూరి హరికృష్ణగారు జ్యోతి కవిత్వాన్ని గురించి-

‘‘కాల్పనిక జగత్తుకు సంబంధించిన వర్ణనలు కాకుండా మానవజీవితంలో ఎదురయ్యే సంఘటనలే ఛాయాచిత్రాలతో సహా కవితా వస్తువులుగా ఎంచుకున్న కవితలవి. ప్రతి కవితలో తనదైన ముద్రవేసుకునే ప్రయత్నం చేశారు’ అని భావించారు.

గుండెను తడిపి ముద్దచేసిన సంకలనం అని ‘కపిల్ రామ్ కుమార్’ గారు అభిప్రాయపడ్డారు. ఆర్ద్రత నింపిన పదచిత్రాలు, శబ్దచిత్రాల విన్యాసం మనముందు పరచడంలో కృతకృత్యారలైందని, కవితా నిర్మాణాన్ని చాలా సునాయసంగా చేసిందని, కవితల నిడివి తగ్గించుకుంటే మరింత బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ఇంతమందితో జ్యోతి ముందుమాటలు రాయించుకోవడంలోనే ఆమె కవిత్వ తపన అర్థమౌతోంది. అక్షరాలతో కవిత్వం రాయడమే కాదు గీతలతో కూడ చెలిమి చేసిన చిత్రకారిణి. అందుకే తనపుస్తకానికి ముఖచిత్రం తనే వేసుకుంది. ఆమె మనసేంటో మనకు అక్కడే తెలిసిపోతుంది.

సీతాకోకల్లా స్వేచ్ఛగా, అందంగా, హాయిగా స్త్రీలు బతకాలంటే వారికెదురయ్యే అనేక దాడులన్నీ  ఆ బొమ్మలో ఉన్నాయి. ఒక  కంట కన్నీరు, కనుపాపపై బ్రహ్మజెముళ్ళు, చెవుల్లో బుసకొట్టే కాలసర్పాల హోరు, గులాబీలతో ఎంత సున్నితంగా  తాకుదామని ప్రయత్నించినా, సీతాకోకల్ని సైతం మింగేసే సర్ప పరిష్వంగాలు, ఎన్నెన్నో భావాలు  ఆ విషాదపు కళ్ళు కురిపిస్తూనే వుంటాయి.

నిజానికి కవిత్వం కంటే  ఆమె వేసిన చిత్రాలే స్త్రీల మానసిక సంఘటనలనెన్నింటినో బహిర్గత పరిచాయి. కన్నీటి కడలి, మట్టిపూలు, మది గెలిచిన మనో పుస్తకం, చిగురించని మోడు, సిరిగల మారాజు, చెమ్మగిల్లిన కళ్లు, చిందిన నా రక్తం, వేదన వంటి చిత్రాలు అద్భుతమైన గీతల ప్రపంచాన్ని మన ముందుంచాయి.

ఇంకెన్నో రాయగల ఈ కవయిత్రి హఠాత్తుగా చివరి చుక్కగా మిగిలిపోవడం బాధను కలిగించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.