దుర్గ

                                                      –డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం

అర్థరాత్రి దాటింది.

అలసిన దేహాలను మత్తు నిద్ర ఆవహించే వేళ.

నడిచి, నడిచి పుళ్ళు పడిన పాదాలు కదలలేమని మొరాయిస్తుంటే , ఆకలి పేగులను ఎండిపోయిన సద్ద రొట్టెతో బుజ్జగించి, రైలు పట్టాల వెంట నాలుగు రోజులుగా నడుస్తున్న ఆ ఇరవై మంది వలస కూలీలు అక్కడే పట్టాల పక్కన కొందరు, పట్టాల మధ్యన కొందరు నిద్రలోకి ఒరిగారు.

ప్రాణమున్న శవాలలా గాఢ నిద్రలో సోలిపోయిన ఆ అభాగ్యుల మీదకి దయలేని యమదూత లాగా పట్టాల మీద దూసుకు వచ్చింది గూడ్స్ బండి.

కాళ్ళు, చేతులు, తలలు తెగి చెల్లాచెదురైన దేహాల చావు కేకలతో ఆ కాళరాత్రి వులికి పడింది.

ప్రక్రుతి పిలుపుతో పొదల పక్కకు పోయిన ,వీరేసు ,అతని కూతురు అమ్మణ్ణి , చెరొక పక్కనుండి పరిగెట్టుకు వచ్చారు.

ఆమ్మా! అని అరచుకుంటూ వచ్చిన అమ్మణ్ణి రైలు పట్టాల నడుమ తల ఒక వైపు, మొండెం మరొక వైపు పడిన అంజనమ్మ కాళ్ళను కావులించుకుంది.

తెల్లవారింది. పోలీసులు వచ్చారు. పది మంది ప్రాణాలు పోగొట్టుకోగా, మిగిలిన వారికి తాము కర్నాటక దాటి ఆంధ్ర రాష్త్రం లో హిందూపురంకి దగ్గరగా వచ్చినట్టు అర్థమయ్యింది.

విచారణ, పంచనామా పూర్తయినాక ఖండ ఖండాలుగా వున్న శరీర భాగాలకు పోలీసులే దహనక్రియ ముగించారు.

ఒక రాజకీయ నాయకుడు వచ్చి బతికి వున్న వారిని పరామర్శించి, వాళ్ళకు నష్టపరిహారం ఇప్పిస్తానని ఓదార్చి వెళ్ళాడు. వాళ్ళందరికీ కరోనా పరీక్ష చేసి, ఎవరికీ వ్యాధి వున్నట్టు నిర్ధారణ కాకపోయినా, పక్క రాష్త్రం నుండి వచ్చారు గనుక ఎవరినీ కలవకుండా క్వారెంటైన్ లో పద్నాలుగు దినాలు ఇక్కడే వుండాలంటు ,ఒక స్కూలు గదిలో దింపారు.

అర్థాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్న ఆత్మీయులను తడవ తడవకు తలచుకుంటూ వేదన దిగమింగుతూ, కన్నీళ్ళు తాగుతూ ,తిన్నారో, పస్తులున్నారో -జైలులో వున్నట్టు అక్కడ రెండు వారాలు గడిపి ,చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు బయటపడ్డారు వాళ్ళు.

నెత్తిమీద పిడుగు పడినట్టు లాక్ డౌన్ ఇంకా పెంచినారని తెలిసింది వాళ్ళకు.

వాళ్ళ వూరు పంపే విషయం చూస్తాము అన్న వాళ్ళు మళ్ళా కనబడలేదు.

చచ్చినా ఫరవాలేదు గానీ తమ వూరు చేరాలని మళ్ళి నడక సాగించారు.

వూరు దాటే వేళకే వీరేసు నడవలేక కండ్లుతిరిగి కూలబడ్డాడు. “ మీరు పాండి మేము మెల్లిగ వస్తాము “ అని తండ్రి, బిడ్డ చెట్టుకు చారగిలబడి కూచున్నారు.

“ వున్న వూళ్ళో పని దొరక లేదని పొట్ట కూటికై పక్క రాష్త్రానికి కూలికోసం వలస వస్తే ఈ కరోనా వచ్చి మన పొట్టకొట్టింది. అమ్మణ్ణీ! నేనుకూడా మీ యమ్మ దగ్గరికే పోతానేమో. నీ తమ్ముళ్ళను జాగ్రత్తగా చూసుకో. వయసొచ్చిన బిడ్డకు పెండ్లి చేసి అత్తింటికి పంపించేది విడిచి నీ మీదనే భారం మోపుతున్నా”. అంటు ముఖం మీద తుండు కప్పుకుని వెక్కిళ్ళు పెట్టినాడు వీరేసు .

***

వీరేసు, అంజనమ్మ లది అనంతపురం దగ్గర వున్న పాపిలి అనే వూరు. కూరగాయలు పండించి అమ్ముకునీ, కూలిపని చేసుకునీ పొట్టపోసుకునే పేద సంసారం. వీరేసు ఇండ్లలో పాలిష్ బండలు పరిచే పని మీద పక్క వూళ్ళకు పోతే పది దినాలకు ఒక తూరి ఇంటికి వచ్చి ,పెండ్లాం, పిల్లలను చూసి పోయేవాడు.

పెండ్లి అయిన ఏడాదికే అంజనమ్మ నీళ్ళాడింది. కొడుకు పుడతాడని ఆశగా ఎదురు చూసిన వీరేసు ఆడబిడ్డ పుట్టిందని తెలిసి మూతి ముడుచు కున్నాడు. ” ఈ తూరి మగబిడ్డను కంటానులే ” అని మేలమాడింది అంజనమ్మ. ఆ పిల్లకు పేరు పెట్టారు గానీ అమ్మా,నాన్న “అమ్మణ్ణి “అని పిలుస్తుంటే అదే అందరికి అలవాటు అయ్యింది. ఆ పిల్ల అసలు పేరేందో అందరూ మరచిపోయినారు.

మాటైతే ఇచ్చిందిగానీ అయిదేండ్లు గడిచిపోయినా మళ్ళీ ఆ, వూ అనలేదు అంజనమ్మ.

మగబిడ్డ కోసం నెట్టికంటి ఆంజనేయస్వామికి మొక్కున్నాడు వీరేసు . ఏడాది తిరిగేసరికి వీరేసు ఆశ తీరింది. ఆంజనేయుడి పేరు, తనకు ఇష్టమైన సినిమా హీరో పేరు కలిసి వచ్చేట్టు పవన్ కుమార్ అని పేరు పెట్టుకున్నాడు వీరేసు . ఇంకో రెండేండ్లకు ఇంకో మగబిడ్డ అంజనమ్మ ఒడి నించినాడు. అంజనమ్మ తన నాయన పేరు పెడతానని వెంకట రమణ అని పిలుచుకుంది వాడిని.

ఆడపిల్లకు చదువెందుకని కూతురుని తనతో కూడా చేనిపనికి తీసుకుపోయేది అంజనమ్మ. మగబిడ్డలని స్కూల్ లో చేర్చి, రెండు ఇండ్లలో పనికి చేరి ఆ డబ్బు వాండ్లకు జీతం కడుతోంది అంజనమ్మ.

వానలు పడక,నేల పగుళ్ళిచ్చింది. మొక్కలు, పాదులు ఎండిపోబట్టె. బండలు పరిచే పనికి మేస్త్రీలు పిలిచేది తగ్గిపాయె. సంసారం ఈదుకొచ్చేది ఎట్లరా దేవుడా అని అంగలార్చే వేళకు ఈ బెంగుళూరు

అపార్ట్ మెంటు పనికి కూలీలు కోసం నంజుండప్ప ఆ ఆంజనేయసామి ఆగట్లా వచ్చి , పాలిష్ బండలు పరిచే పనికి దినానికి వీరేసు కు అయిదువందలు కూలి, అంజనమ్మకు,ఆడపిల్లకు కలిపి

మట్టి పనికి ఇంకో అయిదు వందలు ఇచ్చేట్టు మాట్లాడుకుని పిల్చుకొచ్చినాడు. వీరేసు కాకుండా ఇంకో పది జంటలు వూరు విడిచి నంజుండప్ప వెంట బయలుదేరారు.

చేతికందిన కూలి డబ్బులో కొంచెం దగ్గర పెట్టుకుని, మిగిలింది ఇంటికి పంపించాడు వీరేసు .ఇంతలో వురుము లేని పిడుగులా స్కూళ్ళు, అంగళ్ళు, బస్సులు, అన్నీ బందుచేసి, ఇల్లు విడిచి బయట తిరగ కూడదని ఆజ్ఞ వేసింది ప్రభుత్వం. ఎక్కడ విన్నా చైనా నుండి వచ్చిన కరోనా వ్యాధి గురించిన వార్తలే. అమెరికాలో లక్షమంది పోయారంట అంటు బెదిరి పోతున్నారు. కరోనా వ్యాధి వొస్తే పైకి పోవాల్సిందే అన్న భయంతో వణికి పోతున్నారు జనం. మనుషులు బయట కనబడితే

లాఠీలతో కొట్టి తరుముతున్నారు. ఎక్కడి పనులు అక్కడ నిలిచి పోయినాయి.

వీరేసు పని చేస్తున్న అపార్ట్ మెంటుల కట్టడం జరుగుతున్నది బెంగుళూరుకు ఒక చివరన వున్న బన్నెర గట్ట అనే ప్రాంతంలో. పనివాళ్ళు చిన్న టెంట్లు వేసుకుని వండుకుని తిని, బిల్డింగ్ బేస్మెంట్లో పడుకుని రోజులు గడుపుతున్నారు.

” మనల్ని తోలుకొచ్చిన నంజుడప్ప సామి పదైదు దినాలుగా కంటికి కనబడక పాయె. ఇంటిలో చూస్తే తెచ్చుకున్న రేషన్ బియ్యం సంచీ ఎప్పుడో దులిపి మడిచి పెట్టిందయ్యె. జొన్న పిండి ,సద్ద పిండి కూడా అయిపాయె. ఏమి తిని బతికేది దేవుడా? ” తలమీద చెయ్యి పెట్టుకుని ఏడ్వ బట్టింది నలభై ఏండ్ల అంజనమ్మ.

‘ చూస్తున్నవు కదే! పిట్ట,పురుగు వీధి లోకి కదిలేందుకు లేదు. ఎక్కడి పని అక్కడ నిలిచి పాయె. జనాలంతా ఏం పాపం చేసినారో గానీ, మనిషిని చూస్తె మనిషి భయపడే మాయ కాలం వచ్చింది. పెండ్లాన్ని మొగుడు తాకినా, బిడ్డలను తల్లి రెండు చేతులా కట్టుకున్నా ఆ కరోనా మీద పడుతుందని గుబులు రేపి పెట్టిరి.ఏమి చేస్తాము? అని, వీరేసు భుజం మీది తుండు గుడ్డతో ముఖం తుడుచుకున్నాడు.

అపార్ట్ మెంటుల్లో పాలిష్ బండలు పరిచే పని నిలిచిపోయి నెలదినాలు దాటిపోయె. ఇల్లూ, వాకిలి ఇడిచి పెట్టి కడుపు చేత పట్టుకుని బెంగుళూరుకు వలస వచ్చినాక ఒక నెల కూలి చేతికి వచ్చింది.

“చిన్న బిడ్డలను వాండ్ల అవ్వ దగ్గర విడిచి వస్తిమి. స్కూలు వుంటే వాళ్ళే మధ్యాన్నం కడుపు నింపుతూండ్రి. ఇదేమి మాయ రోగమో అందరిని ఇంట్లో బెట్టి బీగం వేసినట్టే బయటకు కదలనిస్త లేరు. పిలగాండ్లు , అత్త ఎట్లున్నరో, పస్తులున్నరో. యాదికొస్తే మనసు బేజారైతాంది. “ అంటా కండ్లు తుడుచుకున్నది అంజనమ్మ.

” అమ్మా! బౌఆకలైతాంది. ఏమన్న చేసినావా? లేదా? అంటా లోపలికి వచ్చింది అమ్మణ్ణి.

ముక్కుకు నోటికి అడ్డంగా కట్టుకున్న పాత తువాలు గుడ్డ ముక్కను లాగి పక్కన పారేసి ” ఇది కట్టుకుంటే వూపిరి ఆడదు, మాట సరిగా రాదు. మాస్క్ వేసుకోక పోతే మక్కెలు విరగకొడతారు. ఇదేమి కరోనానో మనుషులను నమిలేస్తావుంది.” అంటు నేలమీద కూలబడింది అమ్మణ్ణి.

“ అదో అక్కడ కూరల బండి వాడు కుళ్ళిపోయినాయని పక్కన పారేస్తే ఏరుకొచ్చినాను.అని సంచి బోర్లించింది.

” కాయగూరలు పండించి అమ్మే మనకు, పారేసిన, కుళ్ళిపోయినవి ఏరుకుని తినే కర్మ పట్టింది.” జీరబోయిన గొంతుతో అంది అంజనమ్మ .

” ఈ లాక్ డౌన్ ఎన్నాళ్ళకు ఎత్తేస్తారో తెలియదు. నెల్లాళ్ళుగా పని ఆగిపోయింది. తిండి గింజలు లేవు. మన వూరికి పోదాము పా నాయనా .పవను, రమణ ఎట్లున్నారో! నాయనమ్మ ఏమి అవస్థ పడుతోందో. సొంతవూరు కన్నతల్లి అంటారుకదా..తిన్నా, పస్తులున్నా అక్కడే మేలు. పోదాము నాయనా.” అమ్మణ్ణి గుడ్లనీళ్ళు కుక్కుకుంటా బతిమలాడింది నాయనను.

“బస్సులు లేవు, రైళ్ళు నడవవు. ఎట్లా పోతాం? వీరేసు దిగులుపడ్డాడు.

” ఎట్లో ఒక అట్ల. పోయి మన వూళ్ళో పడితే చాలు.మనతో బాటు వచ్చిన మిగిలిన వాళ్ళు మాత్రం ఇక్కడ వుండి ఏం చేస్తారు? అందరినీ అడిగి చూస్తాను.” అంది అంజనమ్మ.

“ మెల్లిగా నడుచుచుకుంటూ పోతే ఎప్పటికో ఒకప్పటికి వూరు చేరక పోము.పరాయి వూళ్ళో పస్తులు బడి చచ్చే కన్నా సొంత గడ్డమీద కండ్లు మూస్తే చాలు పోదాం పాండి “ అంటూ వచ్చిన మిగిలిన వాళ్ళను బయల్దేరదీసింది అంజనమ్మ.

ఇంకో మూడు నెలల దాకా పని మొదలు కాదని చెప్పేదానికి వచ్చిన నంజుడప్పకు నమస్కారం పెట్టి తమ సామాను మూట గట్టుకుని, చీకటి పడినాక ఒకరు, ఇద్దరుగా ముందుకు సాగారు. గుంపు కనబడితే కొట్టి తరుముతారని భయం.

రైలు పట్టాల వెంబడి నడుచుక పోతే దారి తెలుస్తుందని స్టేషన్ కు చేరుకున్నారు.ఆగి ఆగి ఆ నడక నాలుగు దినాలు సాగేసరికి అందరికీ ప్రాణాలు కడబట్టినట్టు అయ్యింది. అట్లనే పడి నిద్ర పోయినారు. దూసుకు వచ్చిన గూడ్స్ కిందబడి నిద్ర లోనే సగం మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

***

గుండెల్లో దాచుకునే అమ్మ చావుతో కుంగిపోయిన అమ్మణ్ణి నాయన బేలతనం చూసి కరిగి కన్నీరయ్యింది. అంతలో ధైర్యం తెచ్చుకుంది. ” నీకేమీ కాదు నాయనా. నేను మన నిన్ను పిల్చుకు పోతాను. తమ్ముళ్ళకు నువ్వే చదివిస్తావు.” అని చెప్పి లేచింది. వెనక్కి తిరిగి, తాము నడిచే దోవలో దాటి వచ్చిన ఇండ్ల దగ్గరకు వచ్చింది. ఒక ఇంటి ముందు నిలబెట్టిన సైకిల్ కనబడింది.

మూసివున్న తలుపులు చూసింది. గేటు పక్కన ఇంటి ఆసామి పేరు రాసి వున్న పలకను చప్పుడు కాకుండా వూడదీసి సైకిల్ స్టాండుకు పెట్టి, సైకిల్ ఎక్కి నాయన కూచుని వున్న చెట్టు వైపుకి వురికింది.

“లెయ్ నాయనా. బేగి సైకిల్ ఎక్కి కూచో” అంటా తొందరబెట్టింది . ఏమి జరుగుతోందో అర్థం కాక దిక్కులు చూస్తున్న వీరేసు చెయ్యి పట్టి లాగి కూచోబెట్టి ముందుకు దూసుకు పోయింది.

అట్లనే ఆగకుండా అదే వేగంతో రెండు గంటల సేపు సైకిల్ తొక్కింది.తమ వెంట ఎవరూ పడలేదని నమ్మకం కుదిరాక దారి పక్కన ఆపింది సైకిలు.

” ఏందమ్మా ఇది? దొంగతనం చేసుకొచ్చినావా సైకిలు? ఇప్పటికి అయినది చాలదా? జైలుకు కూడా పోవలనా మనం?” కిందకి దిగిన వీరేసు కూతురును గద్దించినాడు.

” బతికి వుంటే బలుసాకు తినవచ్చునంటారు కదా నాయినా. సైకిలు ఎత్తుకు వచ్చింది దీన్ని అమ్ముకునే దానికి కాదు నాలుగు దినాలు వాడుకునే దానికి” అని నాయనను ఎక్కించుకుని ముందుకు సాగింది.

తెల్లవారేసరికి పెనుగొండ చేరారు. డస్సి పోయిన శరీరాలు, ఆకలికి పేగులు మొండికేసాయి. సైకిలు తోసుకుంటు నెమ్మదిగా వూళ్ళొ సందుగొందుల్లో నడిచారు. ఒక చోట స్వచ్చంద సంస్థ వాళ్ళు అన్నం పొట్లాలు పంచుతుంటే ఆవురావురుమని తిని , కుళాయి నీళ్ళు తాగారు తండ్రి బిడ్డలు.

ఒంట్లోకి కొంచెం సత్తువ రాగానే సైకిలు ఎక్కింది అమ్మణ్ణి.

మూడు దినాల తరువాత ఎట్లనో అనంతపురం చేరినాక తమ వూరు చేరుతామని ఇద్దరికీ నమ్మకం కుదిరింది.

అనంతపురం పాత వూరులో శివాలయం దగ్గర ఎవరో ధర్మాత్ములు వలస కూలీలకు రొట్టెలు పంచుతుంటే చేయిజాపి కడుపు నింపుకున్నారు.

తమ వూరు దరిదాపుల్లోకి వచ్చామన్న ఆనందం వాళ్ళను నిలువనీయలేదు. ఆయాసం తీరకుండానే మళ్ళీ సైకిలు ఎక్కింది అమ్మణ్ణి. ” నేను తొక్కుతాలేమ్మా ” అన్న నాయన మాటలు వినిపించుకోలేదు.

” అమ్మ మీద ఒట్టు వేసి నీకు నేను మాట ఇచ్చినాను నాయనా హిందూపురం నుండి పాపిలి కి నిన్ను తీసుకు పోతానని. మాట నిలబెట్టుకోవాల కదా.ఇంత దూరం తొక్కినదాన్ని మాట తప్పనా? ఎక్కు ఎక్కు.” అంటు వీరేసు మరి మాట్లాడనీయలా అమ్మణ్ణి.

రొట్టెలు పంచిన ఆమె , వీళ్ళ మాటలు విని ” ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? అని అడిగింది.

” బెంగుళూరుకు కూలి పనికి పోయినమమ్మా. కరోనా అంటూ అన్ని పనులు ఆపేసినారు.అందుకే వెనక్కి పోతుండాము”. అన్నది అమ్మణ్ణి.

“రైళ్ళు ,బస్సులు లేవుగదా ఎట్లా వొచ్చినారు?” ఇంకొక ఆమె అడిగింది.

” బయలుదేరి ఇరవై దినాల పైనే అయ్యింది. నడుచుకుంటు హిందుపురం దాకా వొచ్చినాము.ఇంక నడ్చలేక రైలు పట్టాల దగ్గర పండుకున్నాము.అంతలో గూడ్స్ బండి వొచ్చి మా యమ్మను, ఇంకో పదిమందిని పొట్టన బెట్టుకునె. పోలీసులు వొచ్చి మేమంతా వెరే రాష్త్రం నుండి వొచ్చినాము గనుక రెండువారాలు బయటకు పోనీకి లేదని మమ్మల్ని అందరినీ ఒక చోట పెట్టి ఇప్పుడు విడిచి పెట్టినారు. మా నాయనకు కాళ్ళు పుండ్లు పడిందానికి నడ్చ లేకుంటే సైకిల్ మీద ఎక్కించుకుని వచ్చినా. పిల్లోండ్లు ఎట్లున్నారో అని దిగులు పడిన మా యమ్మ మధ్యలోనే పోయింది. మా సొంత వూరికి పోయి మా అవ్వని,తమ్ముళ్ళను చూస్తే చాలునని పోతున్నాము.”

ఆకలిగొన్న పేదవారికి రొట్టెలు పంచుతున్న స్వచ్చంద సంస్థ వారిని పేపరు కోసం విడియో ,ఫోటొలు తీసుకుంటున్న ఒక విలేఖరి చెవిన బడింది ఈ సంభాషణ.

“ఇన్ని మైళ్ళు ఎట్లా తొక్కినావమ్మా సైకిల్?” అనడిగాడు విలేఖరి.

అతను విలేఖరి అని, తమ మాటలు విడియోలో రికార్డ్ చేసుకున్నాడనీ తెలియని దుర్గ

” మా నాయనను ఎట్లనో ఇంటికి చేర్చాలకున్నా. అదే నాకు శక్తి నిచ్చింది అన్నా.” అంది అమ్మణ్ణి “. “ కనక దుర్గ అని పేరుపెట్టిన దానికి ఆ దుర్గమ్మ తల్లి మాదిరి నన్ను ఇల్లు చేరుస్తావుంది నా బిడ్డ” అంటూ సైకిలు ఎక్కినాడు వీరేసు.

పాపిలి పొలిమేరలు చేరుతుండగానే, ఆ గాలి పీల్చగానే కొత్త ప్రాణం వచ్చినట్టు ఒంట్లోని నిస్సత్తువ మాయమైంది ఇద్దరికీ.

వీరేసు వెనుక కూర్చోబెట్టుకుని సైకిలు తొక్కురూ వస్తున్న అమ్మణ్ణి ని , గేదెలను ఇంటికి తోలుకు పోతున్న వాళ్ళు నోరు తెరుచుకుని చూసారు.

వలస కూలీలుగా బెంగుళూరు పోయిన వాండ్ల ఇళ్ళ లోని ముసలీ ముతకా, పిల్లా,జెల్లా ఇంటి ముందు చేరారు. ఏడుపులు, ఓదార్పులతో బాటు మిగిలిన వాళ్ళు వెనక వస్తున్నారన్న కబురుతో కళ్ళు తుడుచుకుని వెనక్కి మళ్ళారు.

పొద్దున్నే ఆ వూరిలో లో పని చేసే సీనయ్య గసపోసుకుంటా పరిగెత్తుకు వచ్చాడు వీరేసు ఇంటికి.

” దుర్గా! నీది, మీ నాయనది ఫోటొ పేపరులో వొచ్చింది. టివి. వాళ్ళు కూడా వస్తున్నారంట “ఆయాస పడుతూ చెప్పి , వీరేసును దుర్గను తోలుకుపోయాడు.

అంతవరకు వీరేసు బిడ్డ అమ్మణ్ణి అనే వాళ్ళంతా దుర్గ ,దుర్గా అంటూ గౌరవంగా పలుకరిస్తున్నారు.

” ముక్కుకు బట్ట కట్టుకోకండ ఇట్ల బయటకు రాకూడదు “అంటూ దుర్గ అక్కడ చేరిన వాళ్ళకు చెప్తూ వుండగానే అక్కడకు వచ్చిన టివి చానెల్ వాళ్ళు దుర్గనుఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టారు.

“ఆడ పిల్లవైనా మీ నాయనను వెనక ఎక్కించుకుని ఇంత దూరం సైకిల్ తొక్కి వచ్చినందుకు అందరూ నీ సాహసాన్ని మెచ్చుకుంటున్నారు. నువ్వేమంటావు దుర్గా?”

“ఆడబిడ్డ, మగబిడ్డ అని ఎందుకు వేరు చేస్తారు సారూ.ఎవరైనా కడుపున పుట్టిన బిడ్డనే కదా ! మా నాయనకు నేను పిల్చుకొచేది గొప్ప కాదు.” తడుముకోకండా చెప్పింది దుర్గ.

“ఎన్నో కష్టాలు పడి మీ వూరు చేరుకున్నారు. మీకు ఏమనిపిస్తోంది వీరేసు గారు?”

“నా మాదిరిగా ఎవురూ అయినవాండ్లను పోగొట్టుకోకూడదు స్వామీ. కడుపు చేత పట్టుకుని, దేశంలో ఎక్కడ పని దొరికితే అక్కడికి పోయే వలస కూలీలను ఆదుకోమని నాయకులకు చెప్పండయ్యా. సొంత వూరికి పోవాలని బయలుదేరిన చానా మంది నా పెండ్లాం మాదిరి దారిలోనే ప్రమాదం లోనో, ఆకలితోనో ప్రాణాలు విడుస్తున్నారు.తల్లిని పోగొట్టుకున్న ఈ పసి బిడ్డలను చూసైనా మావంటి వలస కూలీలు ప్రాణాలతో సొంత వూరు చేరే దారి చూపమని అధికారులకు చెప్పండి .” అంటూ పవన్, రమణలను చూపుతూ కండ్లనీళ్ళు పెట్టుకున్నాడు వీరేసం.

“ఈ గూడ్స్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇస్తామని అంటున్నారు నాయకులు ” ఓదారుస్తున్నట్టు అన్నాడు టివి చానెల్ ప్రతినిధి .

” డబ్బుతో అమ్మ ప్రేమను కొనగలరా అయ్యా? ప్రాణానికి ఖరీదు కట్టగలరా? ఏం చేసినా మా అమ్మ తిరిగి రాదు కదా? ” ఆవేశంగా అంది దుర్గ.

” కరోనా కాలంలో నాయనను సొంత వూరికి చేర్చే దానికి ఇంచుమించుగా రెండువందల కిలో మీటర్లు సైకిలు తొక్కిన కనక దుర్గ అని అందరూ పొగుడుతున్నారు.మీ నాయనే మా దుర్గ ఆ దుర్గమ్మ తల్లి మాదిరి నన్ను కాపాడింది అంటున్నాడు. నీకు ఏమనిపిస్తోంది దుర్గా? మరో ప్రశ్న వేసాడు అతను.

” అయ్యా నేను వూరికి వుపకారం చేయలేదు.ఆ విషయం విడచండి. మీకు పుణ్యముంటుంది

నాకొక సహాయం చేయండి. ఈ సైకిలు హిందూపురంలోఒక ఇంటిముందు వుంటే చెప్పకుండా తీసుకొచ్చినాను. అందుకు నన్ను క్షమించండి మా నాయన అడుగు ముందుకు వేయలేక కూలబడి పోతే ,దిక్కు తోచక ఈ పని చేసినాను గానీ దొంగిలించాలని కాదు. మళ్ళా వాళ్ళ వస్తువు వాళ్ళకు చేర్చాలనే ఆ ఇంటి అసామీ పేరు వున్న ఈ చెక్క పలక కూడా తెచ్చుకున్నాను. మీకు దండం పెడతాను. ఈ సైకిలు వాండ్లకు చేర్చండి ” అంటు సైకిలు, ఆ యజమాని నామ ఫలకం టివి వాళ్ళకు ఒప్పగించింది.

“ఈ దుర్గను చూసి ఆడపిల్లలందరూ తాము ఏవిషయంలోనూ ఎవరికన్నా తక్కువ కాదని, అసాధ్యమయిన పని అయినా సాధించగలమని ఆత్మ విశ్వాసం పెంచుకోవాలి.” అనిచెప్పి ఇంటర్వ్యూ ముగించాడు విలేఖరి.

కరోనా సమయంలో కనకదుర్గ సాహసం ఆమెకు ఏ అవకాశాలు తెచ్చిపెడుతుందో కాలమే చెప్పాలి.

******

( వార్తల ఆధారంగా కల్పిత కథ )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.