మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

దొమితిలా జీవితం- సైగ్లో – 20

గృహిణుల సంఘం

బర్డోలాలతో ఘర్షణ అయిపోయాక స్త్రీలందరూ తామెక్కడి నుంచి తరిమేయబడ్డారో అక్కడికి చేరుకొని నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆ రాత్రి సాన్ రోమాన్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సాన్ రోమాన్ క్రూరమైన ముఖాన్ని చూడడం వాళ్ళెవరికీ ఇష్టం లేకపోయింది. మహిళల్లో నుంచి ఒకావిడ లేచి సాన్ రోమాస్ ముందుకొచ్చి “సాన్ రోమాన్, మీ తలారుల్నించి రక్షించుకోడానికి మా దగ్గర ఆయుధాలేవీ లేవని నీకు బాగా తెలుసు కానీ జాగ్రత్త, ఏమన్నా జరిగిందో ఈ క్షణంలోనే మనం అందరికందరమూ పేలిపోయేటట్టు చేస్తాం. మా దగ్గర డైనమైటుంది తెలుసా. అందరికందరమూ ఊడ్చుకపోతాం” అని ఆమె జేబులో నుంచి ఏదో బయటకు తీసి అగ్గి పెట్టిమ్మని ఎవరినో అడిగింది. స్త్రీలు అగ్గి పెట్టె కోసం అటూ ఇటూ చూసేలోగానే సాన్ రోమాన్, వాడి ముఠా కాలికి బుద్ధి చెప్పారు.

అదృష్టవశాత్తూ స్త్రీలను ఫ్యాక్టరీ కార్మికులు వెంటనే ఆదుకున్నారు. ఆ రాత్రికే వాళ్ళు స్త్రీలందరికీ ఫ్యాక్టరీ కార్మికుల సంఘ భవనంలో ఒక గదిలో బస చూపెట్టారు. ఆ తర్వాత నిరాహారదీక్ష ఆ గదిలోనే సాగింది. అక్కడ్నుంచే ఆ స్త్రీలు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో వాళ్ళు తమ భర్తల్ని విడుదల చేయాలనీ, కార్మికులకు ఎగ్గొట్టిన జీతాలను చెల్లించాలనీ, కంపెనీ దుకాణంలో ఎప్పుడూ సరుకుల నిల్వలుంచాలనీ, ఆస్పత్రులకు మందులు సరిగ్గా ఇవ్వాలనీ కోరారు.

నిరాహారదీక్ష సమయంలో స్త్రీలు అసలేమీ తినలేదు. ఏమైనా తాగే పదార్థాలు మాత్రమే తీసుకున్నారు. అయితే ఇది పదిరోజులే సాగింది. వాళ్ళలో పిల్లలతో సహా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నాళ్ళకి ఈ మహిళలకి సంఘీభావంగా యూనివర్సిటీ విద్యార్థులు, ఫ్యాక్టరీ కార్మికులు ఇతర గనుల స్త్రీలు కూడా వాళ్ళతో కలవడం మొదలు పెట్టారు.

సమ్మె ఇంకా పెరగకుండా ఉండడానికి ప్రభుత్వం దిగిరావాల్సి వచ్చింది. వాళ్ల డిమాండ్లను ఒప్పుకుంది. మొత్తానికి గృహిణులు విజయం సాధించారు. వాళ్లు విడుదలైన తమ భర్తలతో సహా ఇంటికి తిరిగొచ్చారు. కంపెనీ కార్మికులకు బకాయీలన్నీ చెల్లించింది. దుకాణంలో సరుకులు కనబడసాగాయి. అయితే లోకం మీద ఏ సంగతినీ పట్టించుకోవద్దని నేర్చుకొని ఉన్నాం గనుక ఈ స్త్రీలు చేసిన గొప్ప త్యాగాన్ని మేం వెంటనే మరిచిపోయాం.

నిరాహారదీక్ష చేయడానికి ముందుకొచ్చిన స్త్రీలు గని పనివాళ్లతో భుజం భుజం కలిపి పోరాడడానికి, నిర్మాణంలో సంఘటితం కావాలని ఆలోచించారు. వాళ్ళంతా కలిసి వీథుల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. “మేమో సభ పెట్టబోతున్నాం. మేం ఓ సంఘం స్థాపించబోతున్నాం అని వాళ్లు చెప్పారు. చెప్పింది చేశారు. సంఘటితమై నాయత్వాన్ని నిర్ణయించుకొని సంఘానికి “సైగ్లో-20 గృహిణుల సంఘం’ అని పేరు పెట్టుకున్నారు. దాంట్లో అప్పుడు 70 మంది స్త్రీలుండేవారు.

కాని ఆ రోజుల్లో మగవాళ్లు అన్న తిరస్కారపు మాటలు మీరు వినే ఉంటారు. “ఆడాళ్లు సంఘం పెట్టుకున్నారట! పెట్టుకోనీ – అది నలభై ఎనిమిది గంటలకంటే ఎక్కువుంటే చూడు! వాళ్లను వాళ్ళే సంఘటితం చేసుకోబోతున్నారు! అది అక్కడే ముగిసి పోతుంది కూడా” అనే వారు.

నిజానికట్లా జరగలేదు. దానికి ప్రతిగా సంఘం ఇంతింతై అన్నట్టు పెరిగి ప్రస్తుతం స్త్రీలకు మాత్రమే కాదు మొత్తం కార్మిక వర్గానికే చాలా ముఖ్యమైన సంఘం అయ్యింది.

అయితే మొదట్లో కష్టం కాలేదని కాదు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే లాపాజ్ నుంచి తిరిగొచ్చాక సైగ్లో – 20లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడ్డానికి స్త్రీలు యూనియన్ హాల్ బాల్కనీ పైకి ఎక్కారు. తాము మాట్లాడిన వేదిక మీది నుంచే ఒక స్త్రీ మాట్లాడితే మగవాళ్లు వినలేకపోయారు. వాళ్లు “ఇంటికి వెళ్లండి, వంటింట్లో కెళ్లండి. బట్టలుతకడానికీ, ఇంటి పనికీ వెళ్లండి” అని అరిచారు. పిల్లి కూతలు కూశారు. అల్లరి చేశారు.

కాని స్త్రీలు దృఢంగా నిలబడి నిజంగా పనిచేయదలచుకున్నారు. అందుకే వాళ్ళు ఎన్ని అడ్డంకులెదురైనా లక్ష్య పెట్టలేదు. కోపంతోనూ, అసహాయతతోనూ వాళ్ళు ఏడ్చారనే మాట నిజమే, కాని వాళ్లు మున్ముందుకే సాగిపోయారు. అప్పుడు ఉన్న పరిస్థితి పట్ల తమ దృక్పథాన్ని వివరిస్తూ, కార్మికులకి మద్దతు ప్రకటిస్తూ, ప్రకటనలు విడుదలచేసి గని కార్మికుల రేడియో స్టేషన్ల ద్వారా ప్రసారం చేయించారు. గని కార్మికుల భార్యలుగా తాము ప్రభుత్వ ఆర్థిక కార్యక్రమాల్ని ఒప్పుకునే సమస్యేలేదని వాళ్లు ప్రకటించారు. ప్రతి ఒక్కళ్ళనీ ఈ విషయం తీవ్రంగా ఆలోచించమని కోరారు. వాళ్లు తమ దృక్పథం వివరిస్తూ అధ్యక్షునికీ, మంత్రులకూ ఉత్తరాలు రాశారు. వాళ్లు కొమిబొల్కు గని కార్మికుల ఫెడరేషన్ (కోబ్)కు ఉత్తరాలు రాశారు. కిరాణా దుకాణానికి వెళ్ళి మాకు కావల్సినవి ఇచ్చేటట్టు చూశారు. బళ్లకు వెళ్లి పిల్లలను సరిగ్గా చూస్తున్నారో లేదో చూశారు. బడిలో ఇచ్చే భోజనం సరిపోతుందో లేదో చూశారు. ఆస్పత్రులకు వెళ్లి రోగులను జాగ్రత్తగా చూస్తున్నారో లేదో చూశారు. వాళ్లు నిజంగా ఎంతో పనిచేశారు. చాలా కష్టపడి పనిచేసిన స్త్రీ నార్బెల్టా డి ఆగిలార్. ఆమె ఒక పూర్వపు కంపెనీ కార్మికుని భార్య. సంఘం మొదటి రోజుల్లో ఒక డాక్టరు భార్య విల్మాడీ గారెట్ సంఘాన్ని నడుపుతుండేదని నాకు వాళ్ళు చెప్పారు. కాని నిజానికి సంఘం నడిచేట్టు చేసింది నార్ బెర్టానే. ఆమె గొప్ప స్త్రీ అని నేనెందుకనుకుంటానంటే ఆమెకు సంఘాన్ని దాని సూత్రాలమీద నడిపించడమెలాగో తెలుసు. ఇది చాలా కష్టమైన పని. ఇవ్వాళ ఆమె మారిపోయిందంటున్నారు కాని నాకు గుర్తున్న ఆమె రూపం అదే.  నార్బెల్టాతో పాటు కష్టపడి పనిచేసినవాళ్ళు మరికొందరున్నారు అందర్నీ పేరు పేరునా చెప్పలేను. వాళ్ళు ప్రతి ఒక్కరూ సంఘానికి తాము చేయగలిగినంత చేశారు. ఉదాహరణకు 1963లో జరిగిన మా రెండో నిరాహారదీక్షలో మా కంపెనీలో ఒకామె చనిపోయింది. కంపెనీ కూలీ మాన్యులా డి సెజాన్ పేగులు పూర్తిగా ఎండుకు పోయాయి. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఎనిమిదిమంది పిల్లల్ని అనాథలనుచేసి ఆమె వెళ్ళిపోయింది. ఎంతోమంది కంపెనీ కూలీలకు నిరాహారదీక్షలవల్ల గర్భస్రావం అయింది. మరికొన్ని సందర్భాల్లో తమ తల్లులనుభవించిన కష్టాలవల్ల పిల్లలు రక్తహీనంగా తయారయ్యారు. తామనుభవించిన బాధలవల్ల ఎంతోమంది కంపెనీ కూలీలు రోగాలపాలయ్యారు. వాళ్ళు చేసిన పనులు ప్రత్యేకమైనవి. కంపెనీ కూలీలతో పాటు రాత్రిపూట కాపలా నిలబడం, సమ్మెలు చేయడం యూనియన్ కు చెందిన కేంద్ర కార్యాలయం, రేడియో స్టేషన్, లైబ్రరీ తదితర ఆస్తుల్ని రక్షించడం. కొన్నిసార్లు స్త్రీలు యూనియన్ రేడియో స్టేషన్లోని మైక్రోఫోన్ ద్వారా కర్తవ్యం తెల్సుకోవడంలో మాకు తోడ్పడేవారు.

ఇవన్నీ మా దృష్టినాకర్షించాయి. 1964లో అధికారినికి రాగానే జనరల్ బారియెంటోస్ మహిళా సంఘాల ప్రమాదాన్ని గమనించాడు. వాళ్ళు మా నాయకుడు లెచిన్ బక్వండోను అరెస్టుచేసి పెరుగ్వేకు ప్రవాసం పంపారు. వెంటనే వాళ్లు రేడియో నుంచి, పత్రికల నుంచి కొందరినీ, ఇతర నాయకులు కొందరినీ అరెస్టు చేశారు. వాళ్ళు గృహిణుల సంఘంమీద కూడా దాడిచేశారు “ఎవరు నాయకత్వం వహిస్తారో చూస్తాం! ఎవరు నడుపుతారో చూస్తాం. వాళ్ళ భర్తలెవరు?” అని వాళ్ళన్నారు. వాళ్ళు ఆ భర్తలను అర్జెంటీనాకు ప్రవాసం పంపుతూ వాళ్ళతో “మిమ్మల్ని రాజకీయ కారణాలవల్లనో, పని సమస్యవల్లనో బహిష్కరించడంలేదు. మీరు చాలా గౌరవనీయమైన, కష్టపడి పని చేసే మనుషులని మాకు తెలుసు. మీ పనితో మేం సంతృప్తిచెందాం కూడా. కాని మీ భార్యలు విదేశీయులకు ఊడిగం చేయడాన్ని మీరొప్పుకోవడం మాకు నచ్చలేదు” అని చెప్పేవారు. ఇంకా ఎన్నో చెప్పేవారు. “బయటికెళ్ళిపో” అని ఇంట్లోంచి తరిమేసేవారు. ఇక “ఆమె తన కుటుంబాన్ని ఎట్లా పోషిస్తుందో చూద్దాం” అనేవారు. అది వాళ్ళు సంఘానికి వ్యతిరేకంగా తీసుకున్న మొదటి చర్య.

సంఘానికి ఆ రోజుల్లో ఇప్పుడున్నంత పెద్ద ఎత్తున మద్దతులేదు. ఉదాహరణకు వాళ్ళు నన్ను అరెస్టు చేసినప్పుడు నన్ను విడుదల చేయమని కోరుతూ కార్మికులు కొన్ని రోజులు సమ్మె చేశారు. ఇది నాకు ఎంతో సౌకర్యం కలగజేసింది. కాని మొదటి రోజుల్లో స్త్రీలు చాలా తక్కువ సంఘీభావాన్ని పొందారు. ఎందుకంటే మగవాళ్ళు స్త్రీలు సంఘటితం కావాల్సిన అవసరాన్ని పట్టించుకోలేదు. వాళ్ళు దాన్ని అర్థం చేసుకోదలచలేదు. అది వాళ్ళకు సరైనదని అనిపించలేదు. అది పక్కదారేనని వాళ్ళనుకున్నారు.

మొదట్లో మా సంఘానికి ఇతర మహిళా సంఘాలతోకూడా సమస్యలువచ్చాయి. ఉదాహరణకు క్రిష్టియన్ స్త్రీలతో ఎప్పుడూ ఘర్షణలు వస్తుండేవి. వీళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ మూవ్ మెంట్ కు సంబంధించిన ఒక మహిళా బృందం. వీళ్ళు మమ్మల్ని తప్పు పట్టారు. మమ్మల్ని వేలెత్తి చూపారు. మమ్మల్ని నాస్తికులన్నారు. సంఘం పేరు చెడగొట్టడానికి ఏమి చేయగలిగితే అది చేశారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మేము కలిసే పనిచేస్తున్నాం. ఎందుకంటే జెయిలుకు పోయివచ్చాక మాలో మేమే పోట్లాడుకోవడం నిష్ప్రయోజనమని మేం గుర్తించాం. నేను బైబిల్ నుంచి నేర్చుకున్న వాటిని బైబిల్ గురించి తెలిసిన వాటిని ఈ క్రిస్టియన్ స్త్రీలతో చర్చించడం మొదలు పెట్టాను. ఒక ప్రభుత్వం ప్రజలమీద హత్యాకాండ కొనసాగిస్తున్నప్పుడు నిరసించడం తప్పా ఒప్పా అని నేను వాళ్ళనడిగాను. ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక చర్యలను వాళ్ళు ఒప్పుకుంటున్నారా అని వాళ్ళనడిగాను. చివరికి వీళ్ళు క్రిస్టియన్ స్త్రీలు కనుక వీళ్ళకు జీతాలు ఎక్కువ ఇద్దామని ప్రభుత్వం ఏమైనా అన్నదా లేక ఆర్థిక పరిణామాలు అన్నీ అందరికీ ఒక్కలాగానే ఉన్నాయా అని నేను వాళ్లనడిగాను. అంతేగాక పొరుగువాళ్ళను ప్రేమించడం అంటే కార్మికుల హక్కులను డిమాండ్ చేయడానికి ఐక్యం కావడం కాదా అని అడిగాను. అప్పుడు వాళ్ళు నేనన్నవన్నీ నిజాలేనని ఒప్పుకున్నారు. ఆ తర్వాత మేం సమిష్టిగా ఓ సమావేశం ఏర్పాటు చేశాం. వాళ్ళకు సహకరించేందుకుగాను సంఘాన్ని పునర్ నిర్మించాము. అప్పట్నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. అయితే స్త్రీలు ఏ స్థాయిలో పాల్గొనవలసిన అవసరం ఉందని మేమనుకుంటున్నామో అది చేరటానికింకా చాలా దూరం పోవాల్సి ఉంది. ఇంకా అసలు తాము ఎందుకు పాల్గొనాలో అర్థం చేసుకోని స్త్రీలు కూడా ఉన్నారు. ఇది ఒక నేరమనే నాకనిపిస్తుంది. “ఎందుకంత పట్టుపడతారు? ఎందుకు ప్రదర్శనల్లో, సమ్మెల్లో చేరతారు? మొత్తానికి మనమిప్పుడు బాగున్నాము కదా? ఇదివరకెంతో కష్టంగా బతికేవాళ్ళం కాదూ” అని కొందరు స్త్రీలు అడిగినప్పుడు నాకు చాలా కోపం వస్తుంది.

“మనం బాగున్నామంటే మీ ఉద్దేశ్యమేమిటి? మనను దోపిడీ చేస్తున్నవాళ్ళు కచ్చితంగా చాలా బాగున్నారు. వాళ్ళు మనవల్లా మన భర్తల శ్రమవల్లా బాగున్నారు. మనకు చనిపోవడానికి కూడా ఓ ఇల్లంటూ లేదు. ఎందుకంటే గని శిబిరంలోని ఇల్లు కేవలం అద్దెకొంపలాంటిదే కార్మికుడు చనిపోగానే మనను వీథిలోకి తో సేస్తారు. ఏమనుకుంటున్నారు బాగుండటం అంటే? ఊచకోతలు జరిగినప్పుడు మనం ఆరేడుగురు పిల్లల బరువు మీద వేసుకొని బతకాల్సి వస్తుంది”. మా పని అన్ని వేళలా సులభంగా ఏమీ జరగలేదు. నాయకులతో కూడా సులభంగా ఏమీ జరగలేదు. యూనియన్ నాయకులందరూ మమ్మల్ని అర్థం చేసుకున్నారనీ సాయపడ్డారనీ చెప్పడానికి వీల్లేదు. మా అనుభవ శూన్యతవల్ల మేం వాళ్ళ పనుల్లో కూడా వేలు పెట్టాం. కొన్నిసార్లు మగవాళ్ళు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మేము స్త్రీలం ఒక పథకం వేసుకొని కొంత ముందుకుపోవడం, కొందరు మగవాళ్లకు అసలే నచ్చలేదు. మరోవైపు మరికొంతమంది నాయకులతో అతికష్ట సమయాల్లో కూడా మేం కలిసి పనిచేశాం. ముఖ్యంగా ఎస్కోబార్ మాకెంతో సహాయపడ్డాడు. ఆయన ఏదైనా సభకొచ్చినప్పుడు మాకెంతో సాయం చేసేవాడు. “పరిస్థితి ఇదీ. మనం చెయ్యవలసిన పని ఇదీ. మనం ఇందుకోసం ఈ పద్దతుల్లో పోరాడాలి.” అని వివరంగా చెప్పేవాడు. అప్పుడు మాకు మొత్తం పరిస్థితి అర్థమయ్యేది. అది మాకెంతో మేలు చేసేది. మరికొందరు నాయకులతో కూడా కలిసి సమస్యలు చర్చించడానికి, బాగా పనిచెయ్యడానికి మాకు అవకాశం ఉండింది. అది చాలా అవసరం కదూ?

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.