నా జీవన యానంలో- రెండవభాగం- 13

‘పిండిబొమ్మలు’ కథ గురించి

-కె.వరలక్ష్మి 

నేను స్కూల్ ఫైనల్ చదివేటప్పుడు మా ఊరు జగ్గంపేటలో పబ్లిక్ పరీక్షలకి సెంటర్ లేదు. చుట్టుపక్కల చాలా ఊళ్ళవాళ్ళు అప్పటి తాలూకా కేంద్రమైన పెద్దాపురం వెళ్ళి పరీక్షలు రాయాల్సి వచ్చేది. పెద్దాపురం మా ఊరికి పదిమైళ్ళు. ప్రైవేటు బస్సులు జనం నిండితేనే కదిలేవి, టైంతో పనిలేదు. ఇంట్లో పెద్దవాళ్ళకీ, మాకూ కూడా రోజూ అలా ప్రయాణం చెయ్యడం అప్పట్లో చాలా పెద్ద విషయం, క్లాసులో అమ్మాయిలం అయిదుగురం. పరీక్షలయ్యే వరకూ మీనాక్షి అక్కయ్యగారింట్లో ఉండేలా ఏర్పాట్లు చేసారు, అది పెద్దాపురం కాబట్టి రాత్రులు బైటికి రావద్దనీ, ఎప్పుడూ అందరూ కలిసే ఉండమని రకరకాల జాగ్రత్తలు చెప్పి పంపించారు. నిజానికి ఇప్పుడు హైవేల పక్క ఊళ్ళన్నీ ఒకప్పటి పెద్దాపురాన్ని మించిపోయాయి. మేం భయం భయంగానే లూధరన్ హైస్కూల్లో పరీక్షలు రాసాం. పెద్దవాళ్ళు భయపెట్టేసారు కానీ, అక్కడంత దుర్మార్గులెవరూ లేరు. అదీ అన్ని ఊళ్ళలాంటి ఊరే.

ఇంచుమించు పదిహేను రోజులు ఉండిపోవడం వల్ల మీనాక్షి అక్కా బావలు మాకు ఇంట్లో మనుషుల్లాగే అనిపించారు. అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. పరీక్షలు ముగిసి ఇంక ఊరికి బయలుదేరతామనగా మీనాక్షి బావగారు బజారుకి తీసుకెళ్ళి గాజులు రిబ్బన్లు లాంటివి కొని ఇచ్చారు మాకు. అక్కణ్నుంచి కొంత ముందుకు నడిపించి దర్గా సెంటర్లో రోడ్డు పక్కనున్న ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్ళారు. ఇంచుమించు ముప్పయ్యేళ్ళ వయసున్న ఒకావిడ మమ్మల్ని ‘రండి రండి ‘ అని ఆహ్వానించి, చాపవేసి కూర్చోబెట్టి తినడానికేవో పెట్టింది. ఒంటిమీద ఎలాంటి నగలు లేవు. వెలిసిన వాయిలు చీర కట్టుకుంది. అతి సామాన్యంగా, నీట్ గా ఉంది. మాట్లాడే విధానం ఎంతో బావుంది. మీనాక్షితో వాళ్ళ బావగారి గురించి మాట్లాడుతోంది. అమాయకంగా అందర్నీ నమ్మేసి వ్యాపారంలో డబ్బు ఎలా పోగొట్టుకున్నారో, తన ఒంటిమీది నగలను కూడా ఎలా పట్టుకుపోయారో చెప్తోంది. ఆయన మీద జాలిపడుతోంది. నా సహజలక్షణంతో నేనావిడ మాటలు వింటూ, రెండు గదుల ఆ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచిందో పరిశీలిస్తూ కూర్చున్నాను. బైటికొచ్చాక చెప్పింది మీనాక్షి వాళ్ళ బావగారికి ఆ ఇల్లు చిన్నిల్లు అని, ఆమె కళావంతుల కుటుంబానికి చెందిందని, దర్గా సెంటర్లో అందరూ వాళ్ళే ఉంటారని. అది 1965 నాటిమాట. అప్పట్లో ఈ ప్రాంతంలో చాలామంది మగవాళ్ళకి చిన్నిల్లు ఉండడం గొప్ప. ఆవిడే ‘పిండిబొమ్మలు ‘లో రమణి పాత్రకు మూలం. మరో ఇరవై ఏళ్ళ తర్వాత మా తమ్ముళ్ళు హైదరాబాద్ లో సెటిలయ్యాక నేను వాళ్ళింట్లో ఉన్నప్పుడు పొట్టిగా, కొంచెం బొద్దుగా, పాలమీగడ రంగులో ఉన్న ఒకమ్మాయి చేతిలో యాపిల్ సైజులో ఉన్న బంగారు కుంకుమ భరిణ పట్టుకుని కృష్ణాష్టమి పిలుపులకి వచ్చింది. ఆ అమ్మాయిలో అందంకన్నా ఆకర్షణ ఎక్కువగా ఉంది. కథలోని కృష్ణాష్టమి పూజ దృశ్యం ఆ ఇంట్లో జరిగిందే ఆ అమ్మాయి హీరోయిన్ గా సి.ఏ గారు సినిమా తియ్యబోతున్నాడని మావాళ్ళింట్లో అనుకున్నారు. కానీ, అది జరిగినట్టులేదు. ఆ అమ్మాయే సౌగంధి. వాళ్ళమ్మ మందారం పేలస్ లాంటి భవనమంతా తిప్పి చూపిస్తూ పాలరాతి గచ్చుతో నీట్ గా ఉన్న బాత్ రూం చూపించి “చల్లగా ఉంటుందని నేను రాత్రీ పగలూ తలకింద తలగడా మాత్రం వేసుకుని ఇక్కడే పడుకుంటున్నానండి బాబూ” అంది. సి.ఏ కేరెక్టర్ కూడా నేను ఆ ఇంట్లో చూసిందే చెక్రం మాత్రం మా ఊళ్ళో అబ్బులు అని ఇళ్ళకి సున్నాలు వేసే ఒకతను అచ్చం అలాగే ప్రవర్తించేవాడు. ఈ కథకి ఏ.జి ఆఫీస్ వాళ్ళు 1994లో ‘రంజని’ పురస్కారం ఇచ్చి 10.6.94 ఆంధ్రజ్యోతి వీక్లీలో ప్రచురింపజేసారు.

పిండిబొమ్మలు

సౌగంధిని చూస్తూంటే ఒళ్ళుమండిపోతోంది రమణికి. ఎంత మేడమీదిపై అంతస్తులో ఉంటే మాత్రం పక్కనున్న పాడుపడిన పెంకుటింటిని అంత నిరసనగా చూడాలా? ఆ చూపు ఇంటినో, తననో అర్ధంకాదు. బాగా డబ్బుంది కదాని ఎక్కళ్ళేని గీరాను దానికి. ఇప్పుడెంత నడమంత్రపు సిరొస్తే మాత్రం చిన్నప్పుడంతా కలిసిమెలిసి తిరగ లేదూ, ఆడుకోలేదూ? ఎప్పుడూ తన ముఖం ఎరగనంత నిర్లిప్తంగా చూస్తోంది.

పొద్దున్నే మంచిగంధం దట్టంగా పట్టించిన ఒంటిమీద పల్చటి నైటీ వేసుకుని, కారిడార్లో ఉదయపు నీరెండకి పచార్లు చేస్తూ తనని గమనిస్తూ ఉంటుంది. తను పళ్ళుతోముకోవడం, స్నానానికి బట్టలు దడిమీద వేసుకోవడం, బకెట్టుతో నీళ్ళు మోసుకెళ్ళడం అన్నీ చిత్రమే కాబోలు. దాని చూపుల్లో ఎక్కడో జాలి కదలాడుతున్నట్టు అనుమానం. ఇవాళంటే ఆ షావుకారు వాళ్ళమ్మ కింత పెద్దమేడ కట్టిచ్చాడు గానీ, నాలుగేళ్ళ క్రితం వరకు వాళ్ళదీ ఇలాంటి పెంకుటిల్లే కదా!

బొగ్గుతో బరబరా పళ్ళుతోమేసి అక్కర్లేనంత గట్టిగా పుక్కిలించి ఉమ్మడం మొదలుపెట్టింది రమణి. బట్టలిప్పి పైనవేస్తూ తడక కంతలోంచి సౌగంధిని చూసింది రమణి. ఖరీదైన పల్చని గులాబీ రంగు నైటీలో నీరెండకి పాలల్లో బంగారాన్ని కరిగించి పోసినట్టు మెరుస్తోంది సౌగంధి ఒళ్ళు. కొన్ని క్షణాలపాటు చూపు తిప్పుకోలేకపోయింది రమణి. ఆ చూపుల్ని బలవంతంగా మళ్ళించుకుని తన ఒంటివైపు చూసుకుంది. ఎముకలమీద అతికించినట్టున్న తన చామనఛాయ చర్మం తనకే అసహ్యం పుట్టిస్తోంది. చెంపలు లోపలికి పోయిన తన ముఖానికి, యాపిల్ పళ్ళలాంటి బుగ్గలున్న సౌగంధి ముఖానికి పోలికెక్కడ? ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్టున్న దాని ఆకృతి ఆడదయి తననే అంతకళ్ళు తిప్పుకోనివ్వడం లేదు. ఇంక మొగాళ్ళుపడి చస్తున్నారంటే చావరూ.

రాత్రికి రాత్రి ఆ ఎంకట్రావు గాడేవన్నాడూ. తల్చుకుంటే కడుపులో నిప్పెట్టినట్టుంది.

ప్లాస్టిక్ మగ్గుతో ముంచి చల్లటి నీళ్ళని నెత్తిమీద ధారగా ఒంపుకుంది. చల్లారలేదు సరికదా కళ్ళల్లో కాగడా వెలిగించినట్లైంది.

“పక్క మేడ మీది సౌగంధి మెడ్రాసు నుంచొచ్చిందంట కదా, బలేగున్నాదే బాబూ పంచదార సిలకలాగా. ఆడదంటే అదీ..” పాతిక కేండిలు బల్బు వెలుతురు గోడల మాపుని మింగి మగాడి చేతిలో ఘోరంగా మోసపోయి వెలవెలపోతున్న ఆడదాని ముఖంలా ఉంది. రమణి చివ్వున తలెత్తి చూసింది.

“నువ్వెప్పుడు చూసేవూ?” ,

“ఉడుక్కోకెహె, అది నిజంగానే నోరూరించే ఆడది. సెర్మం ఒలిచి కంచంలో పెట్టిన బోయిలరు సికెను” అన్నాడు వెంకట్రావు నిర్లక్ష్యంగా సిగరెట్టు వెలిగించుకుంటూ.

రమణి జాకెట్టుకి ఆఖరి హుక్కు పెట్టుకుంటూ భుజం మీంచి వెనక్కి తలతిప్పి “ఆ ఆడది నోరూరించేదేకాదు, ఖరీదైంది కూడా. వారానికి వందా, నూటే భైకన్నా గతిలేనోడికి దాని కాలిగోరిని ముట్టుకునే ఛాన్సు కూడా దొరకదు” అంది కసిగా.

ఇదేం గమనించని వెంకట్రావు గూట్లోంచి పక్కింటి మేడమీది కిటికీ వైపు తదేకంగా చూస్తూ ”మన్లో మనమాట. అసలు దాని రేటెంతుంటాదే?” అన్నాడు.

“ఆఁ.. అడిగి చెప్తాను” అని రాగం తీసింది రమణి” అయినా కొంచెం ఇంచుమించుగా నీ మెట్టపొలం పదెకరాలూ పది రోజులకి సరిపోవచ్చేమోలే. ఆ తర్వాత అడుక్కుతింటానికి బొచ్చె ఒకటి అదే కొనిస్తాది”

రమణి మాటల్లోని వ్యంగ్యం అప్పటికెక్కింది వెంకట్రావుకి.

“ఏటే, ఏలాకోలంగా ఉందేటి నోటికొచ్చినట్టు పేల్తన్నావ్?” అన్నాడు.

అతని నిస్సహాయతకి కిసుక్కున నవ్వింది రమణి. దగ్గరకెళ్ళి జాలిగా అతని రింగుల జుట్టుని చెరిపేస్తూ –

”చూడెంకట్రావూ, మీ బాబిచ్చిన పాతికెకరాలు పేకాట్లో ఇప్పటికే తగలేసావు. ముందూ వెనకా చూసుకోకుండా పెళ్ళాన్ని నలుగురు బిడ్డలకి తల్లిని చేసావు. ఆవిడ పుట్టింటోరు పసుపు కుంకం కింద ఇచ్చిన నాలుగెకరాల కొబ్బరితోటా లేకపోతే నువ్వా పెళ్ళాం బిడ్డలకి అన్నం పెట్టేటోడివా? నీ తుమ్మలు మొలిచే పదెకరాల మాటా ఈసారికి మర్చిపో, పెళ్ళిళ్ళకైనా అక్కరకొస్తాయి. పిచ్చి పిచ్చి పరుగులెట్టబోకు, పడ్డావంటే మూతిపళ్ళిరగ్గలవ్” అంది.

పదేళ్ళై వెంకట్రావుతో పరిచయం ఆమెకి. యవ్వనంలో అడుగుపెడుతున్న మొదటి రోజుల్లోనే ఎవరో మధ్యవర్తి ద్వారా మాట్లాడి తనింట్లో అడుగుపెట్టాడు. కొత్తల్లో సవారీ బండిలో వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా పళ్ళూ ఫలహారాలు బండి నింపుకొచ్చేవాడు. నెలకో కొత్తనగ కొనేవాడు. రమణి తల్లి బతికే ఉందప్పటికి, కూతురు బతుక్కో స్థిరమైన ఆదరువు దొరికిందని సంబరపడేది. “మా అల్లుడుగారు తెచ్చారు” అంటూ ఫలహారాలు వీధంతా పంచి వచ్చేది. ఆ వాడకట్టులో అది తప్పుకాదు – కొత్తకాదు.

వ్యసనాల బారినపడిన వెంకట్రావు క్రమంగా ఆస్థంతా పోగొట్టుకున్నాడు. ఎంత వరకు నిజమో తెలీదుగానీ అతని పెళ్ళాం మాత్రం తన బంగారాన్నీ, పుట్టింటివారిచ్చిన ఆస్థిపాస్తుల్నీ అతనికి అందకుండా జాగ్రత్తపడిందంటారు.

రమణి ఒంటిమీద ఒక్కొక్క నగా ఒల్చుకుపోయాడతను. “ఇదేం తెలివిమాలిన తనవే” అంటూ నెత్తీ నోరూ బాదుకుంది ముసలమ్మ. ఆ బెంగతోనే ఆవిడ కన్నుమూసింది.

పెళ్ళికి నోచుకోకపోయినా బతికినంతకాలం ఒక్కణే నమ్ముకుని బతుకు వెళ్ళమార్చెయ్యాలని రమణి అభిమతం. పదిమంది కాలికింద నలిగిన పువ్వుకావడం ఆమెకిష్టం లేదు.

ఇన్నాళ్ళూ కుక్కిన పేనులా ఉన్న వెంకట్రావులో నీచప్రవృత్తి మళ్ళీ ఇలా చిగురులేస్తోంది. దాన్ని మొదట్లోనే తుంచకపోతే లాభంలేదు.

“అవునే రవణా! ఈ మందారత్తకి ఇంతందమైన కూతురెప్పుడు పుట్టుకొచ్చిందే, నువ్వెప్పుడూ మాటైనా అనలేదు” అన్నాడు వెంకట్రావు మళ్ళీ.

“ఈడి బుర్రలో పుట్టిందే పురుగు, ఎలాగో చావనీ” అని మనసులోనే దిగాలుపడింది రమణి.

“మందార పిన్నికి ఒక్కతే కూతురు, తురకాయనకి పుట్టింది. తురకాయన చచ్చిపోయాక షావుకారుతో ఒప్పందం జరిగినప్పుడు పిల్లని తనతో ఉంచుకోడానికి ఆయనొప్పుకోలేదంట, అందుకని సౌగంధాన్ని మెడ్రాసు ఇంగ్లీషు బళ్ళో చేర్పించి వచ్చింది పిన్ని. అయినా నువ్వు చూడకగానీ ఏటేటా సెలవలకి వస్తానే ఉందికదా!”

“ఆహా, మరిప్పుడు సదువైపోయి పూర్తిగా వచ్చేసిందా?”

“చదువెప్పుడో అయిపోయింది. అదే చిన్న కూచిలాగా కనపడతందేంటి నీ కళ్ళకి? దాన్దీ నాదీ ఒకటే వొయిసు తెల్సా, కాకపోతే నీ పాలబడి నేనిలాగైపోయాను” అంది నిష్ఠూరంగా రమణి.

“నువ్వేటైపోయావే, నీకేం సక్కని సుక్క లాగున్నావ్” అన్నాడు వెంకట్రావు కిటికీ వైపే చూస్తూ, ఏదో వాగాల్సి వాగుతున్నాడు కానీ అతని మనసిక్కడలేదని గ్రహించింది రమణి. ఆమెనొకలాంటి నిస్పృహ ఆవరించుకుంది హఠాత్తుగా, లోపలెక్కడో లుంగలు తిరుగుతున్న దుఃఖం బైటికి రావటం లేదు.

ఆమెకి కంటిమీదికి కునుకురావడంలేదు.

ఒక రాత్రివేళ ఉలిక్కిపడి లేచి కూచుని “కారొచ్చిందే” అన్నాడు వెంకట్రావు.

ఈడికి పట్టింది. మాములు దెయ్యంకాదు, కామినీ పిశాచం అనుకుని పళ్ళుకొరుక్కుంటూ “అది మనింటిక్కాదు, పక్కింటికి” అంది రమణి.

“అదే, ఎవరిదీ అని” అన్నాడు వెంకట్రావు కలలోలాగ.

“ఎవడిదైనా కావచ్చు, నీతి నిజాయితీ లేకుండా డబ్బుని అడ్డంగా సంపాదించేసిన మొగోడెవడిదైనా కావచ్చు. ఆ డబ్బునేం జేసుకోవాలో తెలీక ఊరిమీదపడిన పిచ్చికుక్క గాడిదెవడిదైనా కావచ్చు. అది స్టారుహోటలు నాయనా, కార్లో వస్తేగానీ ప్రవేశం దొరకదు.” సందకాడినుంచీ రగులుతున్న నిప్పంతా ఆమె మాటల్లో ఉంది.

వెంకట్రావు ఏమనుకున్నాడో ఏమో అటు తిరిగి పడుకున్నాడు. తెల్లవారుఝామున లేచి వెళ్ళేటప్పుడు వెంకట్రావు ముఖంలో ఒకలాంటి తెగింపును చూసింది రమణి. “అంతా అయిపోయింది, ఇంక ఈణ్ణి నమ్ముకుంటే లాభంలేదు” అనుకుంది.

“అక్కా.. రవణక్కా.. అక్కోయ్..” వీధిలోంచే అరుచుకుంటూ వస్తున్నాడు చెక్రంగాడు. “వీడొకడు, వీడికి ఆడోళ్ళదగ్గిరా సిగ్గులేదు, మొగోళ్ళ దగ్గిరా సిగ్గులేదు. అందరినీ అలాగే అనుకుంటాడు సచ్చినోడు” దడిమీది చీర తీసి ఆదరాబాదరా ఒంటికి చుట్టుకుంది రమణి.

“ఎక్కడున్నావ్, తానవాడతన్నావా?” అంటున్నాడు వాడు దడిమీంచి కాళ్ళెత్తి చూస్తూ, చెక్రం వయసెంతో ఎవరికీ తెలీదు. యాభైకి అటైనా కావచ్చు. ఇటైనా కావచ్చు, చిన్నోళ్ళ నైనా, పెద్దోళ్ళనైనా ఆడోళ్ళనందర్నీ అక్కా అనీ, మగోళ్ళందర్నీ బావా అని పిలుస్తాడు. లుంగీని లంగాలాకడతాడు. విటులిచ్చిన పొడుగుచేతుల పాతచొక్కాలు తొడుగుతాడు. కుడిభుజం మీదుగా తిప్పిన ఓణీని ఎడమ నడ్డి మీద ముడి పెడతాడు. ఎప్పుడూ బొంగరంలా ఆ పేటంతా తిరుగుతూనే ఉంటాడు. మందారం ఇంట్లో ఎప్పట్నుంచో నమ్మిన బంటువాడు. ఇంట్లో పన్లూ , పైపన్లూ అన్నీ చక్కబెడుతుంటాడు.

రమణి చివుక్కున తలతిప్పి మేడమీదికి చూసింది. సౌగంధి అక్కడలేదు. ‘బతికేన్రా  నాయనా’ అనుకుని “ఏంటి చెక్రం, వస్తాపద చీరకట్టుకుని” అంది.

“అయ్యోరాత, నువ్వు చీరే కట్టుకుంటావో రైకే తొడుక్కుంటావో నీ ఇష్టవమ్మా. నాకు మాత్రం టైములేదు తల్లీ. మందారక్క జన్మాష్టమి పూజ చేస్తుంది. అందరికీ బొట్టెట్టి రమ్మని ఇదిగో నన్నిలా అంపింది. బైటికిరా బొట్టెడతాను.”

“బొట్టు గడపకి పెట్టెయ్ రా, నేనొస్తాలే”

“మర్చిపోయేవు గనకమ్మోయ్, రెండు కళ్ళూ చాలవు చూడ్డానికి. క్రిష్ణుడికి సావుకారు బావగారు చేయించిన, ఎండితొడుగెలాగా ఉన్నాదా, సౌగంధమ్మకేమో సి.ఏగారు వడ్డాణం, వరస గొలుసులు చదివిస్తున్నారు. అయ్యన్నీ ఇవేళ క్రిష్ణుడి అలంకారంలో ఉంటాయి. చూసి తీరాలనుకో” అన్నాడు వెళ్ళడానికి సిద్ధమై వెనక్కి తిరుగుతూ.

“చీ, వడ్డాణమేంట్రా పాత ఫేషనూ”

“ఛీఛా అనకమ్మోయ్ కళ్ళుపోతాయి, బంగారం కాడ పాతేంటి కొత్తేంటి, ఏది బరువుగా ఆన్తే అదే కొనిపించుకోవాల. ఆడదాని తెలివంతా అక్కడే సూపించుకోవాల, అయినా ఒడ్డాణం పాత పేషనేంటీ, సినిమాల్లో శ్రీదేవి ఎట్టుకోటంలా”

“ఒరే చెక్రం”

“ఏంటక్కా?”

“సి.ఏ గారంటే ఎవర్రా?”

“ఎర్రగా పొడుగ్గా బట్టతలాయన కార్తో వత్తాడు సూళ్ళే? ఆయనే సి.ఏ గారంటే. అదేటో ఆయనగారి పేరే తమాసాగా ఉంటాది నాకు”

“మరి సౌగంధి సినిమాల్లో వేషాలిస్తుందన్నావు కదరా”

“అవును, రెండు సినిమాల్లో సిన్నంగా సిన్నంగా ఇచ్చిందంట. కానీ ఆ లైట్లూ ఆ ఏడీ పడక ఎర్ర..గా కందపిలకలాగైపోయింది. అంతలోకీ మందారక్క కల్లోకి క్రిష్ణులవారొచ్చి నీ కూతురు నీతోనే ఉండాల అన్జెప్పేరంట, అంతే, ఇంక మందారక్క ఎనకాముందూ సూళ్ళే, సావుకారుగారి కారేసుకుని మెడ్రాసెళ్ళి కూతుర్ని తీసుకొచ్చేదాకా నిద్రపోయిందేంటీ” అన్నాడు. హఠాత్తుగా గొంతు తగ్గించి అటూ ఇటూ చూసి “అసలు విషయం, సి.ఏ బావగారు నిద్రోలేదు సౌగంధమ్మొచ్చీ దాకా, ఆవిడేషం కట్టిన సినిమా ఈయనగారు చూసేడంట. ఇంకంతే. కుదేలైపోయాడు మొగోడు” కిసుక్కున నవ్వాడు చెక్రం.

“మరి యాపారానికి మంచి ముహూర్తం అదీ చూడకుండా మొదలుపెట్టేసిందేంట్రా మీ సౌగంధి?” అంది రమణి చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ.

“అయన్నీ మెడ్రాసులోనే అయిపోయినైలేక్కా, అయినా నీతో కబుర్లాడతా కూసుంటే నాక్కుదర్దు లే” అని అదేపోకపోయాడు.

తడిసిన జుట్టు ఆరబెట్టుకుని, ఉన్నవాటిల్లో కాస్త మంచి చీర కట్టుకుని రమణి పక్కింటికెళ్ళేసరికి అక్కడ పూజ ముగియవచ్చింది. మెట్లెక్కి వరండాలోకెళ్ళి వెనక్కి తిరిగి గేటువరకూ చూపుసారించింది రమణి. రంగురంగుల క్రోటన్ మొక్కల మధ్య విరబూసిన ఎర్రగులాబీలు దృష్టి తిప్పుకోనివ్వటం లేదు. పొద్దున్నే తోటమాలి నీళ్ళతో తడిపినట్టున్నాడు, పూలరేకుల్లో చిక్కుకున్న నీటి చుక్కలు రంగు పూసుకున్న అమ్మాయి పెదవుల్లా మెరుస్తున్నాయి. అప్పుడే విచ్చుకుంటున్న పూలు పరువంతో మిసమిసలాడుతూంటే నిన్నటి పూలు సగం సగం రేకులు రాల్చేసి వెలవెలపోతున్నై. నిట్టూరుస్తూ లోపలికి నడిచింది రమణి. అడుగుపెడితే మాసిపోయేటట్టున్న పాలమీగడ రంగు నేలమీద నీలిరంగు క్రిష్ణపాదాలు అందంగా తీర్చిదిద్దేరు. ఆ పెద్ద హాల్లోకి అడుగుపెడుతూనే మరోలోకంలో కొచ్చినట్టైంది రమణికి. పైన వేళ్ళాడుతున్న షాండ్లియర్సూ, కిందపరిచిన కార్పెట్లూ చాలు ఆ ఇంటి సంపదని అంచనా కట్టడానికి, వాటి విలువెంతో రమణికి ఊహకందకపోయినా చాలా ఖరీదైనవై ఉంటాయని మాత్రం అనుకుంది.

సీతాకోకచిలకలు ముసిరిన పూలతోటలా ఉందా హాలు. తనో గొంగళీ పురుగులా ఉన్నాదేమో అనుకుంది రమణి. బెరుకు బెరుకుగా ముందు నడిచి కార్పెట్ అంచు మీద కూర్చుంది. పంతులుగారు హారతి వెలిగించేడప్పటికే.

“సౌగీ, రా తల్లీ, దేవుడికి హారతివ్వు” అంటోంది మందారం.

మెట్లు దిగివస్తున్న సౌగంధిని చూసి కన్నుచెదిరిపోయింది రమణికి. పాదాలు కందిపోతాయేమో అన్నంత సుకుమారంగా నడుస్తున్న సౌగంధిని అందరూ అలాగే చూస్తున్నారని గమనించడానికి ఆమెకెంతో సేపు పట్టలేదు.

”ఈ సౌగంధి రోజుకి కేజీ బాదంపప్పు వాడుతుందట తెల్సా. అరకేజీ పైపూతకి, అరకేజీ లోపలికి” అంటోంది సంపంగి పక్కనున్న మధురంతో.

“అయ్యబాబోయ్, రోజుకి మూడొందలు దానికే ఖర్చవుతాయీ” అని రాగం తీసింది మధురం.

“ఆ మూల టీవి పెట్టిన బల్ల ఎంత బావుందో చూడవే” అని మోచేత్తో పొడిచింది సంపంగి. “ఆ పూజామందిరం, సౌగంధి గదిలో ఉన్న ఓడంత నగిషీల మంచం ఇయ్యన్నీ ఒకడే తయారుచేసేడంట. ఇయ్యన్నీ సౌగంధి పుట్టినరోజుకి ఫారెస్టాఫీసరు బహుమతిగా పంపించేడంట.”

“మనకివ్వడేమే ఏనా.. కొడుకూనూ?” అంది మధురం.

“నీకూ నాకూ సౌగంధిలాంటి కూతుళ్ళుండొద్దూ !”

“ప్స్, చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత” అంది నిస్పృహగా మధురం. మాటలు చెవుల్లో దూరుతున్నా రమణి చూపులు మాత్రం సౌగంధిని అతుక్కుపోయాయి. తల్లి అంటూండే మాటలు తలపుకి వచ్చాయి రమణికి. “అందం మన కులానికొక వరం. మనం చేసే పూజలన్నీ అందమైన ఆడపిల్లలు కలగాలనే”

ఏమాటికామాటే చెప్పుకోవాలి మందార పిన్నికి మొదట్నుంచీ పూజలూ పునస్కారాలూ ఎక్కువే. ఇప్పుడీ క్రిష్ణపూజ ఎలా చేసిందో శ్రావణంలో లక్ష్మీపూజా అలాగే చేస్తుంది. అందుకే దేవుడు ఆవిడ మొరవిన్నాడు కాబోలు. ఏ పూజలూ చెయ్యని తన తల్లిని తిట్టుకోబోయి మానేసింది రమణి. ‘చచ్చి ఏలోకాన్నుందో పోనీలే’ అనుకుంది.

హారతివ్వడం పూర్తయింది. నిలువెత్తు క్రిష్ణ విగ్రహానికి అలంకరించిన కొత్తవడ్డాణం, వరస గొలుసులూ తీసి కూతురికి అలంకరించి మెటికలు విరుచుకుంది మందారం.

పెద్ద పెద్ద స్టీలు పళ్ళాల్లో రవికగుడ్డా, కొబ్బరికాయ, అరటిపళ్ళూ, స్వీట్లు పెట్టి ఘనంగా అందరికీ వాయనాలిచ్చాడు చక్రం. చేతులు జోడించి క్రిష్ణుడికి వయ్యారంగా నమస్కరించింది సౌగంధి. “మొక్కుకోమ్మా మొక్కుకో, సి.ఏ గారు తొరలోనే నీకు మారుతీకారు కొనిపెట్టాలని మొక్కుకో” అంటోంది మందారం.

“సౌ! తొందరగా పైకిరా”

అప్రయత్నంగా పైకి చూసింది రమణి. ఓపెన్ గా ఉన్న హాల్లోంచి పైకి మెట్లున్నాయి. పైన గదులన్నిటికీ సిల్కు పరదాలు వేళ్ళాడుతున్నాయి. మెట్లపైన రెయిలింగునానుకుని తెల్లని పోత విగ్రహంలాంటి మనిషొకడు వచ్చి నిల్చుని ఉన్నాడు, రబ్బరు బొమ్మకి గాలి నింపినట్టున్నాడు. వాడి పైపులోంచి పొగ ఫేక్టరీ గొట్టంలోంచి లాగ బైటికొస్తోంది. నగ్నంగా ఉన్న వాడి ఛాతీ మీద జెర్రిపోతులాంటి గొలుసొకటి మెరుస్తోంది. వాడు పైపు పట్టుకున్న తీరు అయిదువేళ్ళ ఉంగరాలూ కనిపించి తీరాలన్నట్టుంది. వాడు పిలుస్తున్నది సౌగంధినే అయినా వాడి కళ్ళుమాత్రం డేగకళ్ళలాగా ఆ హాల్లోని ఆడవాళ్ళని పరికిస్తున్నాయి.

‘పోర్టికోలో ఉన్న పడవలాంటి కారు వీడిదే కాబోలు’ అనుకుంది రమణి. ‘అంత పెద్ద కారున్నవాడికి బొమ్మకారులాంటి మారుతీకారొక లెక్కా!’ అనుకుంది. ‘త్వరలోనే ఈ రంగేళీ రాణీగారు మారుతీ ఎక్కి ఊరేగుతూ ఉంటుంది కాబోలు’ అనుకుంటే అప్రయత్నంగా దుఃఖం తన్నుకొచ్చింది రమణికి. వాయనం అందుకుని పరుగులాంటి నడకతో ఇంట్లో కొచ్చిపడింది. ‘పుట్టుకెలాంటిదైతేనేం పూజ మంచిది కావాలి గాని ‘ అని తరచుగా చక్రం అంటూండే సామెత గుర్తుకొచ్చింది. మనసులోనే కన్నీళ్ళు తుడుచుకుంది.

“ఛా, అట్టేపోయిన డబ్బుగానీ, దానికోసం ఆ సీమపందిగాణ్ణి భరించడం ఎంతకష్టం ‘ అనుకుంది. ‘నలుపైనా వెంకట్రావుకేం, రాజాబాబులా ఉంటాడు’ అని తనకి తనే చెప్పుకుంది. ఆ రాజాబాబు ఆ రోజు పోయిన పోక నెలరోజులైనా కంటబడలేదు. ఇంట్లో బియ్యం, పప్పులూ అన్నీ నిండుకున్నాయి. ఏమైపోయాడో అంతుపట్టలేదు.

శ్రావణంలో మొదలైన వానలు భాద్రపదం వచ్చినా తగ్గుముఖం పట్టలేదు. ఎండా వానా ఎకసక్కాలాడుకుంటున్న ఓ మధ్యాహ్నం వేళ చక్రం తీరిగ్గా కబుర్లాడటానికొచ్చాడు.

“మీ ఎంకట్రావింక నిన్నొదిలేసినట్టే అక్కోయ్” అన్నాడు వస్తూనే.

“నీకేం పొయ్యేకాలంరా చెక్రిగా” అంది రమణి మంచం మీద లేచికూచుని, విడిపోయిన జుట్టుని ముడిపెట్టుకుంటూ.

“నువ్వట్టా కోప్పడితే నేనేం చెప్పలేనుగానీ, ఈ చెక్రంగాడు ప్రేణం పోయినా అబద్దవాడ్డని నీకు తెల్దూ!” అన్నాడు.

“చెప్పేడవరాదూ?” అంది ఆవలిస్తూ రమణి.

“నేనూ అక్కడికే వస్తున్నా. ఎంకట్రావు మా సుగందమ్మకి కబురు చేసాడు మారుతీకారు కొనిస్తానని.”

గతుక్కుమనిపోయింది రమణి. మాటాపలుకూ లేకుండా నోరెళ్ళబెట్టుకుని చూస్తూండిపోయింది.

“మందారక్క ఊరుకోలేదులే, ‘మనిషి జన్మెత్తేక నీతీ జాతీ ఉండాల. రమణితో తెగతెంపులు చేసుకోకుండా కుక్కలాగా కక్కుర్తిపడతానంటే కుదర్దు. అయినా మా సి.ఏ బాబుగారూరుకోడూ ‘ అని తెగేసి సెప్పేసింది.”

రమణి ఊపిరి పీల్చుకుంది. “మిగిలున్న తోటా దొడ్డీ అమ్మేసి ఉంటాడు చచ్చినోడు” అనుకుంది.

“టెల్లీఫోనేయించుకున్నాక ఇంపోటెంటుగాళ్ళ బెడదెక్కువైపోయిందంట” అన్నాడు చక్రం హఠాత్తుగా సంభాషణని దారి మళ్ళిస్తూ.

“ఇంపోటెంటుగాళ్ళెవర్రా?”

“ఏవోనక్కా నాకు మాత్రమేం దెల్సూ? సుగందక్కనడిగితే ‘నీకులాంటి పోటుగాళ్ళే ‘ అంది. ఆ ఎదవలకి పనీపాటా ఏదీ ఉండదు. పోనుజేసి ‘రానా, రానా?’ అనగడం, అవతలెవరో ఇంటా ఉంటారుగదా, ఆళ్ళదగ్గిర ఈడో పురుషపుంగవుళ్లాగ యాక్షనన్నమాట. ఇదొక పెద్ద తల్నెప్పి అయిపోయిందనుకో” అన్నాడు అక్కడికా తల్నెప్పంతా తను అనుభవిస్తున్నట్టు.

”పోరా, సొల్లు కబుర్లూ నువ్వూను” అని నవ్వింది రమణి.

“అబద్ధవనుకుంటున్నావా నవ్వుతున్నావు. ఒట్టమ్మా నీమీదొట్టు” అన్నాడు చక్రం రమణి నెత్తిన చెయ్యి పెడుతూ “ఇంతకీ నే చెప్పొచ్చిందేంటంటే నువ్వుగానీ టెల్లీపోనేయించుకున్నావు గనక”

“ఆ, నా బతుక్కింక అదొక్కటే తక్కువైంది”

“నీకేం, నల్లరూపుని సక్కని సుక్కవి. అయినా నువ్వింకా ఎంకట్రావుని నమ్ముకుంటే లాభంలేదు”

రమణి ఒక నిర్ణయానికొచ్చినట్టు దీర్ఘంగా నిట్టూర్చింది. పైటని తీసి స్థితిమితంగా మళ్ళీ వేసుకుంటూ గోడవైపు తిరిగి వెనకున్న చెక్రంతో అంది. “చక్రం, రిక్షావోళ్ళతో చెప్పరా పేసింజర్లొస్తే తీసుకురమ్మని”

***

ఆగని కాలం బలపం కట్టుకునే ఉంది.

సౌగంధి శరీరం వేలూ లక్షలూ ఆర్జిస్తున్నవేళ – మాఘమాసంలో ‘మంచి’ రోజొచ్చింది. చెక్రం కొత్తబట్టలు కట్టుకుని ఆనందంగా చెప్పడానికొచ్చాడు. “మేవందరం మెడ్రాసెళ్ళిపోతన్నాం. సౌగందక్కని ఈరోయినుగా పెట్టి సి.ఏ బావగారు సినిమా తీస్తారంట, ఆయనే సొయంగా డైరెక్టరు”

“మరి లైట్లూ అవీ పడవనీ..”

“అదప్పటి మాట” అని కిసుక్కున నవ్వాడు చెక్రం.

రెండు నెల్ల తర్వాత సి.ఏగారూ, మందారం వచ్చి ఇల్లమ్మి డబ్బు పట్టుకెళ్ళారు. సౌగంధివీ, వాళ్ళమ్మవీ నగలన్నీ అమ్మేసేరని చెప్పుకున్నారు.

ఆర్నెల్ల తర్వాత అక్కడేమైందో ఏంటో రమణికైతే అంతుపట్టలేదుగానీ – కేవలం ఒక సూట్ కేసుతో రిక్షాలోంచి దిగిన మందారాన్నీ, సౌగంధినీ రమణి ఇంట్లో కూర్చో బెట్టి అద్దె ఇంటిని వెదకడంకోసం బయలుదేరాడు చెక్రం.

ఇప్పుడు సౌగంధి గిల్లితే పాలుకారే పసిడి బొమ్మలా లేదు. రక్తంలేక పాలిపోయి పిండిబొమ్మలా ఉంది.

******

(“కౌముది” సౌజన్యంతో-)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.