రాగో

– సాధన 

1

రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా తిరుగుతోంది. తోవ తప్పినోళ్ళు ఆగమాగమై అడవిలో తిరుగుతున్నట్లుంది రాగో జీవితం.

తారీఖులు, పంచాంగాలు లెక్కలు తెలియకపోయినా, ఊరోళ్ళందరూ ‘పడుచుపోరి’ అని వెక్కిరిచ్చినప్పుడల్లా తనకూ వయసొస్తుందని అర్థమయేది. ఊళ్లో చలికాలం రాత్రుళ్ళు డోళ్ళు, డప్పులతో నెగళ్ళ చుట్టూ వయసు వయసు పిల్లలందరు ఎగిరేపుడు వెకిలి పోరగాండ్లూ, వరుసైన వాళ్ళూ ఛాతి మీద చేతులేసి నవ్వేటపుడు ఈడు తెలిసి సిగ్గుతో మొగం ఎర్రబారేది.

ఊళ్ళో దుకాణం పెట్టి పూజారి, గైత (పటేల్)డు, సర్పంచుల ప్రాపంకం సంపాదించి వయసువాళ్ళతో వరుసలు కలుపుతూ, గోటుల్ ముందు ఎగరడానికి వచ్చే బెంగాలీవాడు అందమైన పడుచుల నడుముల చుట్టు చేయివేసి ఎగురుతూ, ఆ సందున భుజాలు తాకుతూ, పక్కల్లో చేతులు పోనిచ్చి కసిగా నొక్కడం గమనించినపుడల్లా రాగోకు అసహ్యంతో ఒళ్ళు మండిపోయేది.

దసరా పండుగనాడు పారిపోయి ఫోటో దిగుదాం రమ్మని ఆ బెంగాలీవాడు పిలిస్తే తను ఎంతగా కుమిలిపోయిందో…

పెద్దలు నవ్వుతూ ఊరుకోబట్టే కదా పడుచులకిన్ని బాధలు అనుకునేది రాగో. అలాగే మైని పెళ్ళిలో ఎగురుతుంటే సైను వచ్చి అంతమందిలో తన చీరూడిపోయేట్లు ఇగ్గితే, తను లంగా పై మిగిలిపోయినపుడు, అక్కడున్న వాళ్ళందరూ విరగబడి నవ్వితే ఒళ్ళు తెలియని కోపంలో తను వాడి పైకి కట్టె విసిరితే మాడియా రివాజు నెదిరించిన ఆడదని పెద్దోళ్ళు తనపైనే కన్నెర్ర చేశారు. అవన్నీ తలచుకుంటే రాగోలో ఒకేసారి అసహ్యం, కోపం ఉక్కిరిబిక్కిరవుతాయి.

రాగోకు తను ఒప్పుకున్న పెళ్ళి చేయాలని తండ్రి పట్టుదల. బంగారంలాంటి తమ్ముని కొడుకుండగా మరొకడి కెందుకివ్వాలంటుంది తల్లి. నా వాళ్ళను, నా రక్త సంబంధాన్ని దూరం చేసుకోనంటూ తల్లి కూడ తండ్రి మాటకే తాళం వేస్తుంది. రాగోను ఆ ఇంటికిస్తే దాని తల్లిని తెచ్చుకున్న నాటి జీవపారె (కన్యాశుల్కం) తీరుతుందనేది తన తండ్రి మతం.

అక్క మంచిది కనుక కొడుక్కి మరో పిల్లను వెతకాల్సిన బాధ తప్పిందనీ మేనమామ తృప్తిపడుతుంటాడు. సంఘో (మరదలు) రాగో తనకే దక్కుతుందని మేన సంఘి (బావ) ఉవ్విళ్ళూరుతున్నాడు.

పుటుకలే కదా, ఆ పెళ్ళి ఎలాగూ జరగాలి, జరుగుతుంది కూడ అంటుంది రివాజులను నమ్మిన సమాజం.

కానీ రాగో ఇష్టం ఏమిటో పట్టించుకున్న వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. ఆ వయసుకు తగ్గ ఆకారంతో అప్పుడే ఉదయాన చెట్టుపై నుండి రాలిన ఇప్పపూవులా, నిండుగా కంటికింపుగా కనపడుతుంది. అయినవాళ్ళకీ, పైవాళ్ళకీ కూడా రాగో అందమూ, చందమే కావాలి తప్ప రాగోకు కూడ ఓ మనసుందనే పట్టదు. ఆ మనసు తనకు నచ్చినోణ్ని కోరుతుంది.

తోటి వాళ్ళలో నాన్సు చాలా అందగాడు. అందుకు తగ్గట్టు వాడిలో అన్ని సుగుణాలున్నాయి. అందరి నోళ్ళల్లో మంచివాడనిపించుకున్నాడు. పైగా వరుసైన వాడూనూ, రాగో చిన్ననాటి నుండి చూస్తున్నదే. 

కాలం పరుగెడుతోంది. ఎండాకాలం వచ్చి పెళ్ళిళ్ళ జోరు పెరిగింది. డోళ్లు, డప్పులు ఎగురుళ్ళతో కల్లుతో పెళ్ళిళ్ళు ఖుషీగా సాగే కాలం అది. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు పెళ్ళి ఆర్భాటంగా చేస్తుంటారు. చుట్టూ పది ఊళ్ళ నుండి జనాన్ని పిలిచి అట్టహాసంగా మేకలు, కోళ్ళు, పంది, కల్లు, కండీల (క్వింటాలున్నర) కొద్దీ బియ్యం వండి రెండు, మూడు రాత్రుళ్ళు ఎగిరించి జరిపే పెళ్ళిళ్ళు పెద్దవాక పెళ్ళిళ్లు. మాడియ సాంప్రదాయం ప్రకారం ఆరు మేకలు, మేక తిననివారికి కోడి వండి పెట్టి బంధువుల్ని పేరంటానికి పిల్చుకొని ఉన్నదాంట్లోనే సరిపుచ్చుకునేవి మధ్య తరగతి పెళ్ళిళ్ళు. ఈ మధ్య ఖర్చు తగ్గించాలనీ, అప్పులపాలు కావద్దనీ చెబుతూ, ఉన్న దాంట్లోనే పది మందికి చేయి కడిగి పెళ్ళి అయిందని అనిపించడం కూడ పెరుగుతోంది. ఇవి సంఘం ప్రోత్సహించే పెళ్ళిళ్ళు.

రాగో పెళ్ళి ఆ ఎండకాలం జరిపించాలని నిశ్చయించుకొని ముహూర్తం పెట్టించి వియ్యంకులను కబురు పెట్టాడు తండ్రి. సన్నాహాలు చకచకా సాగిపోతున్నాయి. వడ్లు దంపడం, నెర్రెలు పాసిన గోడలు పూతలు పూయడం, ఇంటిముందు మండ (పందిరి) వేయడం, పనులన్నిట్లో ఊరి షేడో (పెళ్ళి అయిన స్త్రీ)లు, దాదలు సాయం చేస్తున్నారు. వాకిట్లో మర్మిముండ (పెళ్ళి గుంజ) పాతడం పూర్తయ్యేకనే ఈ పనులు మొదలయ్యాయి. రాగో మాత్రం ఏ పనీ ముట్టుకోవడం లేదు. రాగో వాలకం తల్లికి అనుమానంగానే ఉంది. ఇంట్లో ఉన్న ఇప్పపూలతో పెళ్ళికి సరిపడా కల్లుదించే పనిని తమ్మునికి అప్పగించాడు రాగో తండ్రి. ఇంట్లో ఉన్న మూడు మేకల దంటకు ఎట్లయినా మరో మూడు మేకలు తేవాలని పట్టుదలతో అందరిని ఆరాలు తీస్తూ అతడు రెండ్రోజులుగా ఆ పని మీద తిరుగుతున్నాడు. తెల్లరితే పెళ్ళి.

రాగో కనబడడం లేదు.

“రాగో హిల్లేకదా” (లేదు). మేలుకొని ఇంకా మంచంలోనే మెసలుతున్న భర్తతో అంది రాగో తల్లి, వాకబు చేయాలన్నట్టు.

“అబ్బెర హత్తచారి” (బయటకు పోయిండచ్చు) తండ్రి జవాబు.

“కాదు. చాలా సేపయ్యింది. దొడ్డికిపోతే ఇంత ఆలస్యమా? ఈడుమీదున్న పిల్ల తెల్లారితే పెళ్ళి” అంటున్న ఆ తల్లి మాటల్లో ఆందోళన స్పష్టంగా ఉంది.

“ఈడు మీదున్న ఆడదాన్ని కనిపెట్టుకుంటే ఎప్పుడు కొంపముంచేది తెలియదు” అంటూ రాగో తండ్రి దల్సు లేచి తన గోచి సవరించుకుంటూ నెత్తిమీద నల్లటోపి సదురుకొని ఇంటిముందుకొచ్చాడు.

ఈడొచ్చినాంక పెళ్ళి ఎట్లయినా జరిగేదే. అయితే ఆ పెళ్ళి మనసైన వాడితోనా, మరొకడితోనా అనేదే ఆడపిల్లల బెంగ. నచ్చని మగాడిని కట్టుకొని జీవితమంతా బాధలనుభవించే బదులు నచ్చినవాడితో లేచిపోవడం గొటోల్లలో (గోండులల్లో) ఆనవాయితీగా వస్తున్నదే. అడ్డుకోవాలనే పెద్ద మనుషుల కంట పడకుండా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతుంటాయి ఈ లేచిపోవడాలు.

రాగోకు మిగిలింది కూడ అదే దారి.

“రామ! రామ! ఏమ్ రా! కన్నల్ తప్పె” (కన్నని తండ్రి) అంటూ తమ్ముణ్ణి కేకేశాడు దల్సు.

“వాయినన్!” (వస్తున్నా) అన్న పిలుపుతో ఇంట్లో నుండి బయటికొచ్చాడు రామ.

“రాగో కనబడడం లేదట. ఖేతుల్ (పొలంలోని గుడిసె) దగ్గర చూసిరా. నేను ఊళ్ళో చూస్తాను” అంటూ తమ్ముడిని పురమాయించి “గోటుల్” వైపు దారి తీశాడు.

కాక రామకు రాగో మనసు తెలుసు. రామ అంటే రాగోకెంతో ప్రేమ. రాగో నాన్సుతో చనువుగా ఉంటుందని రామ ఎప్పటి నుండో గమనిస్తున్నాడు. అయితే అన్నతో చెప్పడానికి ఎందుకోగానీ మనసు ఇష్టపడలేదు. రాగో ఖేతుల్లో ఉండదనీ కూడ తెలుసు. అన్నతో చూసొస్తానన్నాడే గానీ రాగో నాన్సు ఇంట్లోనే ఉంటుందనేది తనకు తెలుసు. ఇద్దరు కలసి ఇప్పటికే ఊరి పొలిమేర దాటి ఉంటారనుకుంటూ లోలోన నవ్వుకున్నాడు.

తన పెళ్ళి కూడ ఇలానే జరిగిందని తానెట్లా మరిచిపోగలడు? ఆనాడు తను కూడా ఇలాగే ఇల్లు చొచ్చిన పెళ్ళాన్ని వెంటేసుకొని పరిస్థితి చల్లబడేవరకు అక్కడక్కడా రోజులు గడిపిన బాపతే కదా. తరతరాలుగా ఆడదానికి అలవాటైన పద్ధతే కదా అది.

గోటుల్ చేరుకున్న దల్సు ఒంటరిగానే అటిటు దిక్కులు చూస్తున్నాడు. అంత ఉదయాన్నే గోటుల్ వద్దకు ఎవరూ రారు. రాగో గురించి తను పడుతున్న ఆందోళనను పంచుకునేవారు ఎవరూ అక్కడ లేనందుకు దల్సు మరీ చికాకు పడిపోతున్నాడు. ఒక్క క్షణం ఆలోచించి గోటుల్లో వేళ్ళాడుతున్న డోలువద్దకు పోయి, ఆ డోలును కోపంగా బాదసాగాడు. ఆ డోలు చప్పుడు ఊరి పొలిమేరలను సులభంగా దాటుతుంది. ఆ ఊరివాళ్ళు ఎవరెక్కడున్నా సరే చప్పుడు విని రావడం ఆచారం.

“రాగో ఎవరింట్ల ఉందో చెప్పండి! ఎవడు దాసి పెట్టిండో చెప్పాలె. లేకుంటే మంచిగుండదు” ఉగ్రంగా దల్సు ప్రశ్నించాడు.

మౌనం ఆవరించింది. గోటుల్ ముందు సమావేశమైన ఇరవై మందిలో ఏ చలనమూ లేదు. నాన్సు తండ్రి కూడ అక్కడ చేరిన వాళ్ళల్లో ఉన్నాడు. అతడేమి గాభరా పడిపోవడం లేదు. ప్రస్తుతానికి ఎలా తమాయించడం అన్నదే అతని మౌనానికి అర్థం.

‘ఖేతుల్లో రాగో లేదు” అప్పుడే అక్కడికి చేరుకున్న రాగో కాక రామ జవాబు.

“ఎవరూ చెప్పకుంటే, మాట్లాడకుంటే ఇళ్ళన్నీ చూడాల్సి వస్తుంది” దల్సు గట్టిగా అన్నాడు.

ఊళ్ళో ఇళ్ళన్నీ ఇరవైకి మించి ఉండవు. అన్నీ గడ్డి గుడిసెలే. ఇంటింటికి వెదురు దడి ఉంది. అందరూ మాడియా గోండులే. వీరినే గొట్టోళ్లని కూడ అంటారు. ఊళ్ళో పిల్లలు, పెద్దలు ఎవరూ చదువుకోలేదు. ఊరికి ఉత్తరాన రెండు ఫర్లాంగుల దూరంలో ద్వార స్తంభాలుంటాయి. ఊరి నడుమ గోటుల్ ఉంది. ఊరికి కొద్ది దూరం నుండే పడమరన సెలయేరు పారుతుంది. ఆ ఏరు నీళ్ళే ఊరి వాళ్ళందరు తాగడం. ఇటీవల సర్కార్ బోరింగ్ కూడ వేసింది. అయితే చిలుం కంపు. ఆ నీళ్ళు తాగరు. కాకపోతే వాడకానికి తెచ్చుకుంటారు. నాన్సు ఇంటిముందే బోరింగ్ ఉంది. ప్రతి ఇంటి చూరుకి డోలు వేలాడుతుంది. అందులో కొన్ని కొట్టి కొట్టి పగిలిపోయాయి. తోళ్ళు చినిగి వేళ్ళాడుతున్నాయి. మరిన్ని బింకంగా మోగడానికి సిద్ధంగా ఉన్నట్లు కనపడుతున్నాయి.

మరో చివర వరుసగా ఇంటికో కొట్టం ఉన్నట్టు గొడ్ల కొట్టాలున్నాయి. అందరి పశువులు వర్షాకాలం అక్కడే మకాం. మేకలున్న వారి ఇండ్లల్లో మేకల కొట్టాలు, పందులున్న వారి దడుల పొంటి పందుల గూళ్ళున్నాయి. ఓ పెద్ద మొద్దుకు బోలు చేసి కోళ్ళు కమ్మేవారు కొందరైతే, మరికొందరి కోళ్ళు చెట్లమీదనే కునుకు తీస్తున్నాయి.

నాన్సు ఇంట్లో రాగో (రామచిలుక) ఉంది. బేల్ రేకులతో చేసిన పంజరంలో దాన్ని పెట్టారు. ఆ పంజరం నుండి బయటపడడం ఆ చిన్న పక్షి తరంగాదు. గొటచ్టి దాదలు రామచిలుకను ఇష్టంతో పెంచుకుంటారు. ఇంటిల్లిపాది దీన్ని ముద్దుగా ‘పట్టా’ అని పిలుస్తుంటారు. అందరు దానికి మాటలు నేర్పుతారు. వారి మాటలు వాళ్ళలాగే పలకడానికి అది రోజంతా తంటాలు పడుతూనే ఉంటుంది. అడవిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు మనుషుల మధ్య మెసలాలంటే వాటికి పెద్ద యాతనే. వాటి సహజ లక్షణాలను అవి క్రమంగా కోల్పోయి నెమ్మదిగా మనిషికి బానిసైపోతాయి. ఇది విట్టు పరిస్థితి.

రాగోను ఉంచిన గది చూరుకే విట్టు పంజరం కూడ వేళ్ళాడుతుంది. తొలి కోడి కూస్తుండగా ఇల్లు చొచ్చిన రాగో ఆ గదిలో ఒంటరిగా ఆలోచనలతో సతమతమవుతుంది.

నాన్సు కోసం తాను అన్నింటికీ తెగించింది. తనకోసం ఏమైనా చేసే తండ్రి మాటను కూడ కాదని ఇల్లు చొచ్చింది. అయితే తాను కోరుకున్నట్లు వెంటనే ఊరు విడిచి తనతో ఎక్కడికో పారిపోవడం గాకుండా నాలుగు రోజులాగి నిదానంగా చూద్దామంటాడు నాన్సు. కానీ తండ్రి కంటపడితే తనని మిగలనిస్తాడా? ఇల్లు చొచ్చిన వారు పడే తన్నులూ, గుద్దులన్నీ తను పడగలదా? రామ కాక (బాబాయి) తనకు అండగా నిలుస్తాడా? తాను కోరుకున్న పిల్లను తెచ్చుకోవడానికి అన్న అండ పొందగలిగిన రామ కాక కీనాడు తన బాధ నిజంగా పడుతుందా? వలచి చేరదీసిన వాడు నాన్సే ఊరు వదిలి రావడానికి సిద్ధం కాకపోతే తక్కిన వాళ్ళు తనను ఆదుకుంటారా? అసలింతకు సుశీలాబాయి నాన్సును తనతో ఉండనిస్తుందా? నాన్సును తనకు దక్కనిస్తుందా? ఇలా రకరకాల ఆలోచనలతో తల పోటెత్తి పోతున్న రాగోకు గది బయట పంజరంలో ఉన్న విట్టు చిలక పలుకులు వెక్కిరిస్తున్నట్టు, దెప్పి పొడుస్తున్నట్లు మరింత చిరాకు కలిగిస్తున్నాయి.

ఏ మగాడు ఇలాంటి పరిస్థితిలో ఏ స్త్రీని ఆదుకున్నాడు కనుక? తాను ప్రేమించబట్టి కూచి (పిన్ని)ని కాపాడుకోవడానికి ఆనాడు కాక అన్ని అవస్థలు పడ్డాడు! కాకకు కాస్తా తెలివితేటలుండి ధైర్యం చేసినందున కూచిని కాపాడుకోగలిగాడు. వారిద్దరూ అనుకొన్న మరుక్షణమే ఊళ్ళోనుండి ఉడాయించి బ్రతికిపోయారు. తన కాక కాపురం నిలబడటానికి తన తండ్రి ఆనాడు ఎంత తెగించే ధైర్యం చేశాడో! ఉన్నదాంట్లోనే తమ్ముణ్ణి ఆదుకోవడానికి తండ్రి ఆనాడు వెనుకాడలేదు. వారిరువురి ఉనికి తన ఇంటివారికి కూడ తెలియకుండా రహస్యంగా ఆ జంటను కాపాడాడు. ఊళ్లో సద్దుమణిగాక తమ్ముడిని, తమ్ముడి భార్యని ఊళ్ళోకి తెచ్చి పిల్ల తల్లిదండ్రులు 3000 రూపాయలు జీవపారె అడిగితే పెద్ద మనుషులను కట్టుకొని ఐదు వందలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇంత చేసిన తండ్రి ఈనాడు తన దగ్గరికి వచ్చేసరికి అల్లరి చేయడం రాగోకు వింతగానే ఉన్నది. తెల్లారకముందే ఊరి పొలిమేరలు దాటుదాం అంటూ ఎంత ప్రాధేయపడినా ససేమిరా కదలని నాన్సు పై కోపంతో రాగో రకరకాలుగా ఆలోచిస్తుంది. క్షణం క్షణం నిరీక్షణతో బాధపడుతుంది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.