మంచి కుటుంబం

-అనసూయ కన్నెగంటి

అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న రైతు  ఉండేవాడు. అతనికి ఉన్న కొద్దిపొలంలోనే ఇంట్లో వాళ్లంతా కష్టపడి  పంటలను పండించే వారు. కానీ అది కుటుంబ అవసరాలకు ఏ మాత్రమూ సరిపోయేది కాదు.  ఆ విషయంలో భార్యకు ఎప్పుడూ బాధగా ఉండేది. 

    “ మరి కొంత పొలం ఎవరిదైనా తీసుకుని వ్యవసాయం చేద్దాము.లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం చేద్దాము. ఎన్నాళ్లని ఇలా చాలీ చాలని ఆదాయంతో కుటుంబం గడుపుకుందాం” అంటూ ఉండేది. రైతు పెద్దగా పట్టించుకునేవాడు  కాదు.  పైగా ఆ రైతుకు ఒక అలవాటు  ఉంది.   అదేమిటి అంటే తన పొలంలో  ఏమి  పండినా.. అందులో  ఎంతో కొంత  పేదలకు పంచేసేవాడు. అప్పుడుగాని మిగతా  పంటను  వాడే  వాడు కాదు.
    అతనికి ఉన్న ఈ అలవాటుని  భార్యా, పిల్లలు కూడా ఇష్టపడేవారు.
   అయితే  ఒకసారి  వర్షాలు  బాగా పడి చేతికి  అందిన పంట కాస్తా  నీటి  పాలైపోయింది. దాంతో  చాలా బాధ  పడ్డాడు.  తన కుటుంబం మాట ఎలా ఉన్నా తను పంచే పంట కోసం  ఎదురు చూసే పేదవాళ్ళ గురించి ఎక్కువ బాధ పడ్డాడు.
   ” అలా బాధపడకండి.  మనకి పండలేదు కాబట్టి పంచటం లేదు.  పండితే పంచేవాళ్ళమే  కదా. అలా అని వాళ్లకు చెబుదాము ” అంది  భార్య.
    ” అది నిజమే! కానీ వాళ్లకి ఎలా చెప్పాలా అని కాదు సమస్య.  మనం ఇచ్చే పంట కోసం ఎదురు చూస్తూ ఉంటారు.  పాపం ఆకలిగా ఉంటారు కదా. మనకు పంట బాగా పండినప్పుడు  .. మనకంటే వాళ్ళే ఎక్కువ సంతోషపడ్డారు. మీరు బాగుంటే మేము బాగుంటాము అన్నారు. అలాంటిది వాళ్లకి  వరదల వల్ల పంట నష్టపోయాము అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే అది మన చేతకాని తనము అవుతుంది. అదే ఆలోచిస్తున్నాను “ అన్నాడు రైతు.

    “ వరదలు వచ్చినట్టు వాళ్లకీ తెలుసు. మనం అబద్ధం చెబుతున్నామని అనుకోరు. “అంది రైతు భార్య.

   “ కానీ ఆకలికి వరద సంగతి తెలియదు. వరద వచ్చిందని మనం ఆకలి కడుపులతో ఉండటంలేదు కదా..? మరి వాళ్ళెందుకు  పస్తులుండాలి?” అన్నాడు రైతు.

   “ మీరన్నది నిజమే. మనం అయితే ఎలాగోలా బ్రతక వచ్చు. కానీ పేద వాళ్లకు మనం  పంచాలి అనుకుంటున్నాం. కాబట్టి  వాళ్ల కోసమైనా ఏదో ఒక పని చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు వరదలు వచ్చాయి. మరోసారి వర్షాలు లేక పంటలు పండక పోవచ్చు. లేదంటే చేతికందిన  పంట అగ్నికి ఆహుతి కావచ్చు. ఏది జరిగినా  మనం పంచాలనుకున్నవి పంచే తీరాలి కాబట్టి కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడితే సరిపోదు అనే విషయం ఇప్పటికైనా మీకు  అర్ధమైందా “ అంది భార్య. 

   రైతు సమాధానం చెప్పేలోపు..ఆ దార్లో  వెళుతున్న ఆసామి ఒకాయన వీళ్లను చూసి దగ్గరకంటా వచ్చి “ పనుంది చేస్తారా ?”అన్నాడు.

   ఏంపని?” అని అడిగారిద్దరూ..

   “జమిందారు గారి  కొట్తంలో ధాన్యం వరదలకు తడిచిపోయింది. వాటిని ఎండలో ఆరబెట్టాలి. అలా చేసినందుకుగాను..మీకు కూలి సొమ్ము కానీ దాని బదులు ధాన్యం కానీ తీసుకోవచ్చని చెప్పమన్నారు. మీకు ఇష్టమైతే వచ్చి పని చేయవచ్చు..” అన్నాడు.

   సంతోషంతో..అందుకు అంగీకరించి  ఆసామి వెంట వెళ్ళారు రైతు దంపతులు.

   “ చూశావా? మన ఆలోచనల్లో మంచితనం ఉంటే  అవకాశాలు ఎలా ఎదురు వస్తాయో..” అన్నాడు రైతు. 

     “ అవును. పని దొరికింది కాబట్టి  మన  నమ్మకం , మన మంచితనం  కాపాడబడింది. పని దొరక్కపోతే..?”  కాబట్టి  ఇకనైనా  వేరే పని కూడా చేస్తే మంచిది. మన శ్రమ వృధా కాకుండా ‘’అంది భార్య.

  “ ఇప్పుడు నీకు అర్ధమైందా? వస్తేనే ఇవ్వటం కాదు. ఇస్తేనే వస్తాయి అని” 

   “ నాకు అర్ధమైంది. అలాగే “ వస్తేనే ఇవ్వగలం అనేది మీకూ అర్ధమైందా?” 

    “ అర్ధమైంది లేవోయ్ ..! అన్నాడు రైతు జమిందారు ఇల్లు దగ్గర పడటంతో భుజం మీది తువ్వాలు తీసి నడుం చుట్టూ బిగిస్తూ.  

           *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.