
అక్కమహాదేవి
-గిరి ప్రసాద్ చెలమల్లు
అక్కమ్మా!
ఎప్పుడో ఏనాడో
నీ నుండి
జాలువారిన వచనం
మా సమాజాన్ని
సూటిగా, నగ్నంగా
ప్రశ్నిస్తున్నట్లగుపిస్తుందమ్మా
నీ కాయం
నీ ఇష్టం
ఎవ్వరికి అర్పిస్తావో
ఎవ్వరి దురాక్రమణకి లొంగక
అణువణువూ
చెన్నకేశవ చెంత
దిగంబరమో
నీ మనోభీష్టమో
స్పర్శయో
సాన్నిహిత్యమో
తలంచినదే తడవుగా
ఎక్కుబెట్టిన విమర్శనావచనం
జీర్ణించుకోలేని ఆధిక్యత
నీ గుహ
ఎన్నో మనోనిగూఢాల వేదిక
నీ మేను
ప్రవచించిన కేశాల అల్లిక
నాడే ఎలుగెత్తిన నీవే
మా చలం కన్నా ఎంతో ఎత్తులో
*****

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేసాను. చదువు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని కవితలు వ్రాస్తున్నాను. ప్రేమ కవితల్లో కూడా ప్రవేశం. కవితలు వివిధ దిన వార మాస వెబ్ పత్రికల్లో ప్రచురితం.
