స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి


యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే కాలంలో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, పి. శ్రీదేవి లాంటి రచయిత్రుల స్వతంత్ర భావజాలం ఆతర్వాతి దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా నిలిపింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో లైంగికతను చర్చనీయాంశం చేసే క్రమంలో పి. శ్రీదేవి నిర్వహించిన పాత్ర గణనీయమైనది. నిర్దిష్టమైన వ్యక్తిత్వంతో తీర్చిదిద్దబడి, స్వతంత్రంగా ఆలోచించి, నిర్ణయం తీసుకోగల స్త్రీపాత్రల సృష్టితో పాఠకుల ఆలోచనలకు ఒక కొత్త ఉత్సాహాన్ని, స్పూర్తిని అందించగలిగాయి పి. శ్రీదేవి కథలు.


డాక్టర్ పెమ్మరాజు శ్రీదేవి 21సెప్టెంబర్, 1929 అనకాపల్లిలో జన్మించారు. ఈమె పేరు చెప్తే ఈతరం పాఠకులు తొందరగా పోల్చుకోలేక పోవచ్చు. ఈమె చాలా తక్కువ కథలు రాసినా ఎక్కువ మంది పాఠకుల అభిమానాన్ని పొందిన రచయిత్రి. అందరూ తన కథల్ని అభిమానిస్తున్నారు కదాని పుంఖాను పుంఖంగా కథారచన చేయలేదు. విశాఖపట్నంలో యం.బి.బి.యస్ చదివి, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతకాలం డాక్టరుగా పనిఛేశారు. తరువాత హైదరాబాద్ లో ప్రైవేటు ప్రాక్టీస్ చేశారు. తెలుగు స్వతంత్రలో అసిస్టెంటు ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసారు. 1957లో తెలుగు స్వతంత్రలో ధారావాహికంగా “కాలాతీత వ్యక్తులు” నవల రచించారు. . శ్రీదేవి దాదాపు15 కథలు రాశారు అందులో “రేవతీ స్వయం వరం”, “చక్రనేమి క్రమాన”, ”కళ్యాణ కింకిణి”, “వాళ్ళు పాడిన భూపాలం” ఈమెని ఉత్తమశ్రేణి కథా రచయిత్రిగా నిలబెట్టాయి. పి. శ్రీదేవి రాసిన ఒకే ఒక నవల “కాలాతీత వ్యక్తులు” తెలుగు సాహిత్యచరిత్రలో మైలురాయిగా నిలిచింది. బహుళ జనాదరణ పొందిన “కాలాతీత వ్యక్తులు” నవల తెలుగు సాహిత్యరంగంలోని ఐదు గొప్ప నవలల్లో ఒకటిగా ఈ నవలను సాహిత్య విమర్శకులు గుర్తించారు. 1958లో పుస్తకరూపంలో ప్రచురించారు. అంతే కాక, ఈనవలను నాటికగా 1960 ఆకాశవాణిలో ప్రసారం చేశారు. చదువుకున్న ఆమ్మా యిలు పేరుతో చలనచిత్రంగా రూపొందింది. డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా కూడా పెట్టారు. ఈనవల గురించి చెప్పడంలో నాఉద్దేశం ఇంత ప్రాధాన్య ప్రాచుర్యాలను పొందడానికి కారణం ఈ నవలలోని రాడికల్ భావాలే. ఈ భావాలతో పరిపక్వతను రాసిన పైన తెలిపిన కథలను గమనించినట్లయితే, ఒక క్రమంలో జరిగిన భావపరిణామాన్ని గుర్తించగలం. వైవాహిక వ్యవస్థ, దానికి ఆవల స్త్రీల లైంగిక, మానసిక సంఘర్షణలను కథలుగా మలిచారు. శ్రీదేవి కథనం అతి సులభంగా, అలవోకగా చక్కటి శైలిలో సాగిపోతుంది.

యాభై దశకంలోని స్త్రీల స్థితిగతుల్లో, ఆలోచనల్లోని లైంగిక సంఘర్షణలను ఈమె కథల్లో చర్చించేందుకు ప్రయత్నించారు. స్త్రీలుగా తమజీవితాన్ని నిర్ణయిస్తున్న బావజాలాన్ని అంగీకరించలేక, వ్యతిరేకించడానికి గల కారణాలను అన్వేషించారు. సంధర్భంలో తమని తాము శక్తివంతంచేసుకునే క్రమంలో తలఎత్తిన సంధిగ్ధాలను నివృత్తి చేసుకుని తమ జీవితాలను తీర్చదిద్దుకోవాలన్న తపన లోనుంచి “రేవతీ స్వయంవరం”కథలో ప్రేమ, పెళ్ళిని సమస్యాత్మకం చేశారు.

“రేవతీ స్వయంవరం” పూర్తిగా ప్రేమకథ. ప్రేమభావం జనించడం వలన కలిగిన అనుభూతులను సామాజికపరంగా ఆలోచించి వాటిని సమన్వయపరచుకొని అధిగమించిన సంస్కారం ఇందులో చక్కగా ద్యోతకమవుతుంది. రేవతి వ్యక్తిత్వంతో తన జీవితాన్ని సరైన పంథాలో నడిపించుకోగలిగింది. ప్రేమపట్ల అంతవరకూ గల భావాలస్థానే ఒక కొత్తరకమైన అవగాహన బయలుదేరి స్త్రీ పురుష సంబంధాలను ప్రభావితం చేసిన స్థితి పి.శ్రీదేవి రచనల్లో ప్రతిబింబించింది. “రేవతీ స్వయంవరం”లో కూడా అంతవరకూ సమాజంలో భావకవిత్వ ధోరణులలో సాగిన ప్రేమతత్వాన్ని వీడి వాస్తవిక ధోరణిలో ఆలోచించిన స్థితి కనబడుతుంది. అడవి బాపిరాజు లాంటివారి రచనల్లో వ్యక్తమైన ప్రేమభావనల కంటే భిన్నమైన భావనలు పి. శ్రీదేవి కథల్లో చూడగలం.


ఇంటర్మీడియేట్ చదివేటపుడు కలిగే ప్రేమ కేవలం ఆకర్షణ మాత్రమే. రేవతిలో తొలివలపు సీతారాంపట్ల కలుగుతుంది. కానీ సీతారాం వివాహితుడు కావడంతో, అతనిపట్ల అల్లుకున్న ఆశలన్నీ అడియాసలవుతాయి. అయినా ఆమె తట్టుకోగలుగుతుంది. గాయపడ్డ హృదయాన్ని స్నేహంగా మార్చుకొని, అతనితో స్నేహితురాలిగానే వ్యవహరించగలిగింది తప్ప హద్దుదాటి ప్రవర్తించలేదు. “నా తొలివలపు మొగ్గలోనే తుంచి మోడుగా జీవించలేను. రెండవ భార్యగానైనా నీకు సేవలు చేస్తూ దాసిగానైనా సరే పడి ఉంటాను. నన్ను నీ పాదాల చెంతనే బతకనీ’ లాంటి యాభై దశకంలోని స్త్రీల ఆలోచనా ధోరణిని చిత్రించలేదు. పోనీ తన వలపు భగ్నమైందని చెప్పి నిరాశతో కృంగిపోయి తన జీవితాన్ని అంతం చేసుకోదు. అవగాహనతో ఆ భావాన్ని అధిగమిస్తుంది. తర్వాత పరిచయమైన లెక్చరర్ వల్లగానీ, కృష్ణమూర్తి పట్లగానీ తనకు ఏర్పడిన భావాలను ఎలా అధిగమించగలిగిందో లెక్చరర్ – రేవతి కలిసినప్పుడు మాట్లాడిన సందర్భంలో తెలుస్తుంది.

సీతాపతి మీ అందరికంటే నాకు ముందు పరిచయమైనాడు. అతడు తనకు పెళ్ళయిపోయిందని నాతో చెప్పకుండా కొన్నాళ్ళు దాగుడుమూతలాడాడు. బుద్ధిపూర్వకంగా కాదనుకోండి. ఆ దినాల్లో అతడు నన్ను చాలా ఆకర్షించాడు. నేనతన్ని వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. కానీ అతడు వివాహితుడని తెలియగానే నా ఆశలు అడియాసలైనాయి. ఒకరకంగా నా మనసు దెబ్బతింది. తరువాత మిమ్మల్ని గాఢంగా గౌరవించాను, అభిమానించాను. ఒక్కొక్కప్పుడు నాకు తెలియకుండానే నాలో ఏవో కోరికలు కలుగుతున్నా వాటన్నిటినీ అణచివేసే గుణమెక్కటే నన్ను హెచ్చరించేది. ఇక కృష్ణమూర్తి విషయం అతడు వెన్నవంటివాడు. అతనితో జీవితం బాగానే గడుస్తుంది. కానీ అతని హృదయానికి గట్టితనం లేదు. అతడంటే నాకు పసిపిల్ల వానిపట్ల కలిగే వాత్సల్యం లాంటిదని అంటుంది. తనను ఇష్టపడిన వారిలో తనజీవిత భాగస్వామి కాదగిన వరున్ని ఎన్నుకునే క్రమంలో రేవతిలో కనిపించే స్పష్టత, హేతుబద్ధత, ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తిత్వం చదువుకున్న ఆమ్మాయిల పట్ల ఈకథ సదభిప్రాయాన్ని కలుగజేసింది. “రేవతిదేవి స్వయంవరం” రూపంలో చేసిన విశ్లేషణ వయక్తిక స్ధాయి నుంచి సామాజిక స్థాయిని సంతరించుకుంది.


ప్రేమ ఒక్కరితో ఆగిపోయేదికాదని,ప్రేమ ప్రవాహతత్వం కలదనీ ప్రేమకు ఒక తాత్విక కోణాన్ని పి.శ్రీదేవి అందించారు.ఇలాంటి తాత్వికతే కొ.కు. పి.శ్రీదేవి రచనల్లో ప్రేమ స్వరూపం లోని బహుళత్వాన్ని చూడగలం. పురుష రచయితలే
సంశయించే లైంగికత్వ భావనలను అందుకోవడం సాహసంగా పరిగణించేవారు. ఇక మహిళా రచయిత లెవరూ ఇలాంటి సాహసానికి పూనుకోలేదు.కానీ పి.శ్రీదేవి ఇలాంటి ప్రేమ ప్రతిపాదనలను కొత్తకోణంలో ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. శ్రీదేవి తరువాత స్త్రీవాదులే లైంగికత్వాన్ని, ప్రేమ తత్వాన్నీ చర్చనీయాంశం చేశారు.

యవ్వనోదయంలో అనేక ఆకర్షణలు. కోరికలు యువతీ, యువకుల మనసులను పూలపల్లకిగా చేసి ఊగిస్తాయి. నిద్రలేచింది మొదలు పడుకునే వరకూ అనేకమందితో పరిచయాలు ఏర్పడతాయి. ఈ సామాజిక వాతావరణంలో అమ్మాయిలు పంజరంలో చిలకల్లాగా బ్రతికే జీవితాలు కావు. ఆధునిక జీవనంలో సామాజిక సంబంధాలు ఉరుకులు పరుగులతో సాగిపోతుంటాయి. అలా ప్రవాహ వేగంగా వెళ్ళే కాలాన్ని సైతం స్థంభించేసే మనసును, మమతను చూరగల వ్యక్తులు తారసపడుతుంటారు. అట్లని అందరిపట్ల ఒకేరకమైన భావమే కలిగితే, వారందరినీ పెళ్ళాడే స్థితి కాదు కదా! మరి అలాంటప్పుడు యువతులు పెళ్ళి సమస్యను ఎలా పరిష్కరించాలి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మొదటితరంలో చదువుకున్న అమ్మాయిలు రేవతిలాగే మనసులోనే స్వయంవరాన్ని ప్రకటించుకోవాలి. ఆ స్వయంవరంలో జీవితాన్ని తనదైన బాణీలో ప్రభావితం చేసే వ్యక్తిని, గాఢమైన అనుభూతిని కలిగించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకోగలగాలి. మిగిలిన భావనలను సామాజిక దృష్టితో ఆలోచించి అధిగమించాలన్న ఆలోచనల్ని రచయిత్రి ఈ కథలో ఆవిష్కరించారు.

రేపతి ఆలోచనలూ, ఆచరణ ఆమె స్వీయ నిర్ణాయక శక్తికి నిదర్శనం. కానీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే క్రమంలో తనకేమాత్రం పరిచయం లేని వేణుగోపాలరావుతో పెళ్ళి నిశ్చయం చేసుకుంటుంది. అందుకే ఆమె లెక్చరర్ “ఏమీ పరిచయంలేని ఒక వ్యక్తితో జీవితం ప్రారంభించేకంటే అదివరకే అర్థం చేసుకున్న వ్యక్తితో జీవితం సుఖవంతంగా ఉండదంటావా? అని ప్రశ్నిస్తాడు.

తనను అభిమానించి తన మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తిని, బాగా పరిచయమున్న వ్యక్తిని భాగస్వామిగా నిర్ణయించుకోవడం మేలైనదనేది అతని అభిప్రాయం . కానీ రేవతి అలా కాకుండా ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని పెళ్ళాడి జీవితాంతం అతనితో గడపడానికి సిద్ధపడడమంటే జీవితాన్ని లాటరీ వేయటం కంటే భిన్నమైనది కాదు. అతని అలవాట్లు, వ్యక్తిత్వం సంస్కారం లాంటివేమీ జీవిత భాగస్వామికి తెలిసే అవకాశం ఉండదు. కనీసం పంచుకోడానికి కావలసిన సాధారణ అవగాహన లేకుండా కలసి జీవించడానికి నిర్ణయించుకోవడం అశాస్త్రీయమైనదనే లెక్చరర్ అభిప్రాయంలో రేవతి ఏకీభవించదు.

స్వాతంత్ర్యానంతరం క్రమంగా స్త్రీ విద్య అభివృద్ధి చెంది, సామాజికంగా ఒక ఆవరణ అంటూ స్త్రీకి ఏర్పడటం వలన, అంటే ఉద్యమం, ఉద్యోగం లాంటి అవకాశాలు కలిగిన తరువాత ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆర్థికంగా, రాజకీయంగా ఓ మేరకు పాల్గొనే స్థితికి స్త్రీలు ఎదిగిన తర్వాత స్త్రీల భావాలలో విప్లవాత్మక మార్పులు వచ్చినాయి. ప్రేమ విషయాలలో కూడా అలా వచ్చిన పరిణామాలలో భాగంగానే రేవతి పాత్ర చిత్రణ జరిగింది.


“ ప్రేమ నిలకడలేని నీటివంటిదనా నీ ఉద్దేశ్యం” అని అడిగితే, నిలకడలేని నీటివంటిదని చులకన చేయటం లేదు నేను. అనువైన ప్రతి హృదయంలొకి ప్రవహించగల శక్తివంతమైన, సజీవమైన ప్రవాహమంటాను. దానిని మనకు కావలసిన చోట ఆనకట్ట వేసి నిలుపుకోవటానికి ఎంతో నిగ్రహం కావాలి. అందుకు ప్రయాస పడవలసి ఉంటుంది. ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయేకంటే ఒడ్డున కూర్చొని ఆనందించడం తేలికైన పని.” అని అంటుంది రేవతి.
అనువైన ప్రతి హృదయంలోకి ప్రవహించల శక్తివంతమైన, సజీవమైన ప్రవాహంగా రేవతి ప్రేమను నిర్వచించటం ఉదాత్తంగా ఉంది. మరి ప్రేమపట్ల అంత గొప్ప భావనలు గల రేవతి ఎందుకు ప్రేమ వివాహం చేసుకోలేకపోయిందో గమనిస్తే, ఆమె చెప్పిన దానికంటే పెద్ద కారణమేమీ ఉండదనిపిస్తుంది. ప్రవాహంలాంటి ప్రేమను ఆనకట్ట వేసి నిలుపుకోవడానికి ఎంతో నిగ్రహం కావాల్సి ఉంటుందని మాట్లాడుతుంది. రేవతి ప్రేమను పొందే అర్హత గల పురుషులుగా ఆమెకు ప్రొపోజ్ చేసినవారికి లేరనేది ఆమె అభిప్రాయం. కళ్ళెంలేని గుర్రంలా, పల్లంలోకి ప్రవహించే నీటిలాంటి తన ప్రేమను, హృదయాన్ని ఓ చోట స్థిరంగా నిలపగలుగుతుంది. అందువలననే డా. వేణుగోపాలరావును పెళ్ళాడడానికి సిద్ధపడింది.

ప్రేమ ప్రవాహంలో కొట్టుకు పోయేకంటే ఒడ్డున కూర్చొని ఆనందించటం తేలికైన పని అని అనటంలో ప్రేమ పట్ల ఆమెకు గౌరవం లేక కాదు. రేవతి ప్రేమ గురించి అంత ఉదాత్తమైన అభిప్రాయాన్ని ప్రకటించి కూడా ఉదాసీనంగా ఒడ్డున కూర్చొని తిలకిస్తూ ఆనందపడతానని అనడానికి గల బలమైన కారణం ప్రేమ, పెళ్ళి పేరుతో స్త్రీల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్న పురుష స్వభావంపై నమ్మకం లేకనే. ప్రేమలో ఎలా దిగాలి? అని రేవతి వేసిన ప్రశ్నలోని అంతరార్థం.

ప్రేమ ప్రవాహంలో తడిసిన అనుభూతిని అనుభవించాలి. దాని లోతును గ్రహించగలగాలి. వాటి ద్వారా ఏర్పడిన పులకింతలను, పరవశాన్ని భద్రంగా పదిలపరచుకోవాలి. తనివితీర ఆ మధురానుభూతుల్ని నెమరేసుకుంటూ గడపాలి. శ్రీ శ్రీ. మాటల్లో చెప్పాలంటే, ‘అనుభవించి, పలవరించాలి. అంతేగానీ ఒడ్డున కూర్చొని చూడటం ద్వారా అనుభూతుల్ని పొందగలమా? చూసి ఆనందించడం విదోద ప్రాయమైన అనుభవం. రేవతి ప్రేమవిషయంలో ఎప్పుడూ ఎమోషనల్ అవదు. రేవతి ప్రేమపైన తనకుగల అభిప్రాయంతో ప్రేమలో పడకుండా జాగ్రత్త పడుతుంది. ప్రేమించడానికి అర్హత లేని వాళ్ళను వివాహమాడటం కంటే తాను వరించడానికి అర్హత కలిగినవాడు అపరిచితుడైనా అన్నివిధాలుగా తనకు తగిన వాడుగా డా. వేణుగోపాల్ నే అర్హుడిగా నిర్ణయించుకుంటుంది.


ఆమెలోని శాస్త్రీయ, హేతుబద్ధమైన భావజాలం, పురుషస్వామిక సామాజికతల ఫలితమే అవరిచితుణ్ణి పెళ్ళాడ్డం. జీవితాంతం కలసి బ్రతకాల్నిన వ్యక్తి అంతకుముందు ఏమాత్రం పరిచయం లేకపోయినా తాళి కట్టిన మరుక్షణం నుంచి నీవే నాసర్వస్వం అని భావించడం, సేవించడం, మొదటి రాత్రి పేరుతో ఎలాంటి మానసిక అనుబంధం ఏర్పడక ముందే జీవితాన్ని పంచుకోవటం స్త్రీల అస్వతంత్రకు నిదర్శనం . పెళ్ళి పేరుతో జరిగే శారీరక దురాక్రమణను ఎటువైపు నుంచి చూసినా ప్రోత్సహించదగింది కాదు. అందులోనూ రేవతిలాంటి ఆధునిక స్త్రీలు వాఛించే పెళ్ళి కాదు. అట్లని తమ భావాలకు భద్రతలేని సమాజంలో, అభద్రతలో బ్రతక
డానికి రేవతి లాంటి ఆధునిక స్త్రీలు సిద్ధంగా లేరన్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోదగింది. ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని గౌరవించి అర్థం చేసుకోవాల్సి వుంది. రేవతిలోని ఈ రకమైన ఆలోచనా ధోరణిని గమనించినట్లయితే, ప్రేమ విషయంలో ఆనాటి స్త్రీల స్థిరమైన అభిప్రాయాలలోని ప్రాక్టికాలిటీ, ధైర్యమే ఈనాటి స్త్రీవాద ఉద్యమం వరకు పర్యవసించిన మూలాలు ఒక క్రమంలో కనిపిస్తాయి.
అట్లని రేవతి మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలనేది కాదు. లెక్చరర్ కానీ, కృష్ణమూర్తిగానీ నచ్చలేదనుకుంటే, మరొకరెవరైనా సరే అతని పట్ల ప్రేమ కలిగినపుడే వివాహానికి సిద్ధపడవచ్చు. రేవతి లాంటి స్త్రీలు పరిస్థితుల్ని విశ్లేషించుకోగలిగిన పరిజ్ఞానం గలవాళ్ళు. అని పాఠకులు నమ్మినట్లయితే, ఎలాంటి సందేహాలకు అవకాశం ఉండదు. కానీ వేలసంవత్సరాలుగా అబలలుగా చూసిన సమాజానికి రేవతి లాంటి ఆధునిక స్త్రీల బలాన్నిఅపనమ్మకంగా చూసిన లెక్చరర్ లాంటి విద్యావంతులు విశ్వసించడానికి కూడా కొంత సమయం పడుతుంది. స్త్రీ ఆంతరంగిక జీవితాన్ని చిత్రించిన ఈకథ యాభైలలోని స్త్రీ పురుష సంబంధాలను వ్యక్తికరించిన మంచికధ ‘రేవతి స్వయంవరం”. స్త్రీగా తనకేం కావాలో తానే నిర్ణయించుకోగలిగిన స్త్రీగా రేవతి, అమృతవల్లి పాత్రచిత్రణ, “కాలాతీతవ్యక్తులు” నవలలోని ఇందిరలాగే కాలాతీతమైనవిగా తెలుగు సాహిత్యంలో ఆనాడు సంచలనం సృష్టించాయి.

“అర్థం కాని అనుభవం” అనే కథ ఇతివృత్తంలో, నిర్మాణంలోని బలహీనత, భావజాల అస్పష్టత ఆతరువాతి కథల్లో కనబడదు. “కళ్యాణ కింకిణి” కథలోని కళ్యాణి కౌమారదశలోనే గర్భం ధరిస్తుంది, దాన్ని దాచడానికి తల్లిదండ్రులిద్దరూ ప్రయత్నిస్తారు. ఆమెను సాటి సామాజికుల నుండి సంరక్షించే క్రమంలో ఆమె కుటుంబం సంక్షోభంలో పడుతుంది. కళ్యాణిని ఆమె తల్లిదండ్రులు దూషించి దూరం చేసుకోలేదు. తల్లి కూతుర్ని లోకనిందనుండి కాపాడి, ఆమె సంతానాన్ని తన సంతానంగా చూపుతుంది. తండ్రి ఉన్నపళంగా కూతురి వివాహం చేయాల్సి రావడంతో దొంగతనానికి పాల్పడటం, దాన్ని సవతి కొడుకు తన నెత్తిన వేసుకొని ఇంటి నుండి పరారవడం ఈ సంఘటనలన్నీ కథాప్రారంభం నుండి రచయిత్రి చిత్రించలేదు. ముగింపులో మాత్రమే పాఠకులకు తెలుస్తాయి. కుటుంబ భారాన్ని మోసే ఒక త్యాగమూర్తిగా భావిస్తారు. కాని తన తల్లి, తండ్రి, అన్న దూరం కావడానికి తానే కారణం అన్ననిజం కళ్యాణిని దహించివేస్తుంది. ఇద్దరు కలసి చేసిన దానికి తానే బాధ్యత వహించాలనుకుంటుంది. కనీసం అతని పేరు కూడా బయటపెట్టడానికి ఇష్టపడని స్థితి ఆమెది. ఒక పెళ్ళికాని తల్లి పడే సంఘర్షణ “కళ్యాణ కింకిణి” కథా ఇతివృత్తం. కళ్యాణి జీవితంలో జరిగిన సంఘటన తల్లిదండ్రులకు తప్ప మరెవరికీ తెలియక పోవడం, అన్నతో పంచుకోగానే హృదయ భారాన్నితగ్గించుకోవడంవలన పలికిన మువ్వల సందడిగా ఆమె హృదయ స్పందనలను ప్రతీకాత్మకంగా రచయిత్రి పోల్చడం జరిగింది.

ఫ్యూడల్ సామాజిక నియంత్రణలు స్త్రీలను అనుక్షణం న్యూనత పరుస్తుంటాయి. వాటిని అర్థం చేసుకొని అధిగమించడానికి కొంతకాల వ్యవధి అవసరమవుతుంది. ఈ సంధికాలంలో వాళ్ళు తమనితాము సన్నద్ధం చేసుకునే సమయంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనవ్వాల్సి వస్తుంది. వాటిని తట్టుకొని జీవిత సాఫల్యం చేసుకునేందుకు స్త్రీపురుషులమధ్య పెంపొందాల్సిన అవగాహనకు వారిమధ్యగల ప్రేమే ప్రధాన పాత్ర పోషిస్తుందని నిరూపించిన కథ “ఉరుములూ మెరుపులూ”. ఈకథలోని నాయకానాయికలు బావామరదళ్ళు, ప్రేమికులు, బార్యాభర్తలు కూడా కావటంతో గాలి వానగా మారాల్సిన వాళ్ళ కాపురం ఉరుములూ మెరుపులతోనే ( అలకలూ, కలయికలతోనే )సుఖాంత మవుతుంది.

ఆనందంగా సాగాల్సిన కాపురంలో ఒకరినొకరిని అర్థంచేసుకోకపోతే వచ్చే అనర్థాలకు జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుందనే హెచ్చరిక “చక్రనేమి క్రమాన” కథలో ఇమిడివుంది. బార్యాభర్తల అభిరుచులలోని వైవిధ్యాన్ని ఒకరుగా అర్థంచేసుకోవటం కంటే జీవితభాగస్వామికి కూడా అర్థం చేయించాల్సి వస్తుంది. అమృతవల్లి, వురఫ్ మిసెస్ పాణి, మిసెస్ రంగనాధం పశ్చాత్తాపంతో మృత్యు ఒడిలోకి ఒరిగిన ఒక స్త్రీ విషాధ కథగా ముగింపు ఇవ్వడంలో సమకాలీన సాధారణ (పురుష) దృష్టికోణాన్నే ఈకథ అందించింది.

సమాజంలో జరిగే వివాహంపై పి. శ్రీదేవికి చాలా అసంతృప్తి వుంది. ప్రేమ ఈ సమాజంలో లేదు. స్త్రీలకు ప్రేమించే స్వేచ్ఛలేదు. పెళ్ళాడిన తర్వాత ప్రేమించటమంటే, సమాజంలో స్త్రీ పురుషులకు సమానత్వం వుంటే ప్రేమలో ఈ తేడా రాదు …… స్త్రీ కూడా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఆర్ధికంగా స్వతంత్రురాలైనపుడు అతని వలనే ఆమెకు మరొక జీవితం వుంటుంది. వారిద్దరికీ వేరుగా వున్న జీవితాలను కూడా వారు సరిగా అర్ధం చేసుకోగలిగితే ప్రేమ నిలుస్తుందని పి.శ్రీదేవి అభిప్రాయం ప్రేమ తత్వంలో పి.శ్రీదేవి గుర్తించిన మరొక అంశం ప్రేమ శా శ్వతం కాదనే భావన. అలాగే ప్రేమకు, డబ్బుకు వున్న సంబంధాన్ని, స్త్రీపురుషులు ముఖ్యంగా భార్యాభర్తల సంబంధంలో డబ్బు నిర్వర్తించే పాత్రను గురించి పటుంబరావుకు స్పష్టమైన అవగాహన వుందనే విషయాన్ని పి. శ్రీదేవి సోదాహరణంగా ఋజువు చేశారు. అలాగే సమాజంలో అమలవుతున్న ద్వంద్వ నీతిని గురించి ప్రేమను సంఘనీతితో సమన్వయించటంలో వున్న కష్టాన్ని గురించి
పి.శ్రీదేవి చేసిన కాల్పనిక సాహిత్య చిత్రణను గుర్తించి విశ్లేషించటం ఈ వ్యాసంలో కనిపిస్తుంది.

రచయిత్రుల కాల్పనిక సాహిత్యంలో స్త్రీల లైంగికత గురించి నిర్దిష్ట, సామాజిక, శాస్త్ర నేపథ్యం నుంచి వచ్చిన కథలు తక్కువ. పి.శ్రీదేవి ఈ విషయంలో కొంత ముందున్నారనే విషయాన్ని ఈమె కథాసాహిత్యం ఋజువు చేస్తుంది. ముఖ్యంగా స్త్రీపురుషుల మధ్య భావసారూప్యత, భావఐక్యతలేని సంబంధంలో వుండే డొల్లతనాన్ని పి.శ్రీదేవి నమోదు చేశారు.
రచయిత తాను సృష్టించే రచనలో తన కళ్ళ ఎదుట కనబడే జీవితం, అట్లా వుండటానికి కారణమేమిటో చెప్పటానికి ప్రయత్నిస్తారు. ఈనాటి రచయితలు ఆపని చెయ్యాలంటే మార్నిజాన్ని ఆశ్రయించవలసిందే. శాస్త్రీయ దృక్పధాన్ని అవలంభించవలసిందే, మరోదారిలేదు’.

వర్తమాన సాహిత్య ప్రపంచంలో మార్క్సిజమే శాస్త్రీయ దృక్పథం అనే నిర్ధారణ ఎవ్వరూ చేయటం లేదు. బహుశా ఓల్గా కూడా అటువంటి ఆలోచనలో వుంటారని అనుకోలేం, ఆ విషయం అలా వుంచితే, ” చక్రనేమి క్రమాన” వర్తమాన సామాజిక నైతిక చట్రం మొత్తం స్త్రీలలోని ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి మానవలక్షణాలను చంపివేయటానికి ఉద్దేశించబడిందని, ఇకథలోని మూడు ప్రధాన పాత్రలు అమృత వల్లి, పాణి, రంగనాధం పాత్రలు మన సామాజిక స్వరూపాన్ని మూడు కోణాల నుండి బహిర్గతం చేస్తాయని పి. శ్రీదేవి ప్రకటించారు.

.
లైంగిక స్వేచ్ఛ కలిగి న అమృత వళ్ళిపాత్ర ఎంతో హైట్స్ లో నిలుస్తుఅందని ఆశించిన పాఠకులను ఒక్కసారిగా నీరసం ఆవహిస్తుంది. పురుషాధిక్య భావజాలానికి రచయిత తలోగ్గడం వల్ల రచయిత తన స్థాయిని తాను తగ్గించుకోవడం పాఠకులకు జీర్ణం కాదు.
రంగనాధం ఆసుపత్రిలో చేరినప్పుడు ఆమె ప్రవర్తించిన తీరు అమానవీయమైనది. మిసెస్ పాణిగా ఆమెకూడా లంగ్ కాన్సర్ తో అదే హాస్పెటల్ లో జాయిన్ అవడంసినిమాటిక్ గా వుంది.
లైంగిక స్వేచ్ఛ అనుభవించాలని కోరుకునే స్త్రీలు ఇలాశిక్షించబడతారన్న పితృస్వామిక దృక్పథంతో ముగింపు నివ్వడంలో ఎదగని కాలానికి ఉదాహరణ. ‘చెలియలి కట్ట’నవలలో విశ్వనాథ సత్యనారాయణ రత్నపాత్రకిచ్చి ఆ ముగింపు శ్రీదేవి ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది.

ఒకరకంగా “మనం ఇతరులకేమి చేస్తామో దాన్నే రెండింతలుగా అనుభవించాల్సి వస్తుంది, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అనే లోక సహజ వ్యాఖ్యానాలకు, మూఢనమ్మకాన్ని సమర్థిస్తుందా ఈకథ అన్న అనుమానం ఒక్క క్షణం కలుగుతుంది. కానీ స్త్రీల గమ్యం, గమనం పురుషుడే అయ్యేట్లు చేసిన స్థితి గురించి, పురుషుడి కలల ద్వారానే స్త్రీలు కలగనాల్సిన స్థితి గురించి, పురుషుడి ఆలోచనల అనుబంధంగానే చూడటాన్ని “రేవతీ స్వయంవరం”,”ఉరుములూ మెరుపులూ”, కళ్యాణ కింకిణి” కథల్లో గమనించగలం.
స్త్రీలను ఇంతకాలం పంజరంలో బంధించిన ఫ్యూడల్ కుటుంబ చట్రాలలో ఆధునిక భావాల వ్యాప్తితో మొదలైన ఒదులు కొంతమంది తమకు కావాల్సిన, అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా వినియోగించుకోవటం కూడా జరిగింది. సగం సగం అవగాహన, సగంసగం అభివృద్ధి స్త్రీల జీవితంలో పెను మార్పులకు దోహదం చేసింది. ఆ అభివృద్ధి ఫలాల ఫలితాల్ని అర్థంచేసుకోవటానికి, ఆచరించటానికి మధ్యగల కాల వ్యవధి చేసిన అసంబద్ధ పర్యవసానాల్ని పి. శ్రీదేవి తన కథలలో ప్రయోగాత్మకంగా చిత్రించారు. స్త్రీల లైంగిక సంబంధాలను వక్రీకరించే పితృస్వామిక భావజాల ప్రభావం నుండి బయటపడలేని స్థితి, లైంగిక స్వేచ్ఛ రాజకీయాంశంగా గుర్తించక పోవడం వల్లనే ముగింపు విషయంలో అసంతృప్తిని ఈమె కథల్లో చూడగలం. స్త్రీల రచనల విషయంలో స్త్రీలుగా తమవైన సంవేదనలకు ప్రతిస్పందిస్తూనే, పురుష ప్రతినిధులుగా పితృస్వామిక ప్రయోజనాలను కాపాడేందుకు తమకు తెలియకుండానే దోహదపడటం కూడా కాలిక స్పృహగా అంగీకరించాల్సిన కథాసంధర్భం.


“రేవతీ స్వయంవరం”లో స్త్రీపురుష సంబంధాలలోని ప్రేమ పెళ్ళిపట్లగల అనేక అంశాలను పి. శ్రీదేవి చర్చించారు. “కళ్యాణ కింకిణి” కథలో వైవాహిక సంబంధం లేకుండా స్త్రీ తల్లి కావడం, కుటుంబ సభ్యులందర్ని ఎలా సంక్షుభితం చేస్తుందో చర్చించారు. స్త్రీల అపరిపక్వ లైంగిక స్వేచ్చాజీవితంలోని ఒడిదుడుకులకు చిత్రిక పట్టారు. పి. శ్రీదేవి తన కథల్లో చేసినన్ని ప్రయోగాలు ఆమె సమకాలికులు చేయలేదు. ఒక సిద్ధాంతానికి పరిమితమవకపోవటం ఒకరకంగా పి.శ్రీదేవి కథాసాహిత్యాన్ని శక్తివంతం చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.