
ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-(చివరి భాగం)
-డా.సిహెచ్.సుశీల
స్త్రీకి విద్య కావాలి , స్వేచ్ఛ కావాలి , గౌరవం కావాలి , సమానత్వం కావాలి అంటే – ఎవరు ఇవ్వరు . ఒకరు ఇస్తే తీసుకునవి కావవి. అందుకే పదునైన సాహిత్యంతో కవితలు కథానికలు నవలలు సాధనంగా హృదయాల్లోకి చొచ్చుకొనిపోయి సంస్కరణను సమర్థవంతంగా నిర్వహిస్తామని స్త్రీలు భావించి ఆచరణలో పెట్టారు . స్త్రీ సముద్ధరణకైై స్త్రీలు పోరాడటం కేవలం ఆత్మ రక్షణకై పరిమితమవుతుంది కొన్నిసార్లు . కానీ స్త్రీల న్యాయబద్ధమైన కోర్కెలకు నడుము బిగించి స్త్రీ రచయిత్రులకు వెన్ను దన్నుగా రచయితల ప్రభంజనం ప్రారంభమవడం ముదావహం. సానుభూతి కాక , సహ అనుభూతితో పురుష రచయితల సాహితీ ప్రక్రియలు వెల్లువలుగా వెలువడ్డాయి. కథలు కథానికలు స్వరూప స్వభావాలలో చిన్నవే అయినా సంఘంలో పెద్ద మార్పు తెస్తున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి. పురుష రచయితలు కొందరు “”స్త్రీ వాదం”” అనే పేరు పెట్టకుండా , స్త్రీ వాదాన్ని బలంగా వినిపించినవారు ఉన్నారు. వారి కష్టసుఖాలు ఆచరణాత్మకంగా పాత్రల్లో నింపి దృశ్య కావ్యం అనుభూతిని కలిగించారు. ఒక్కో సాహిత్య ప్రక్రియలో, ఒక్కో సాహితీవేత్త తనదైన పంధాలో స్త్రీ ఔన్నత్యాన్ని ఒప్పుకుంటున్నారు. ఆమె ప్రగతికి, ప్రాబల్యానికి అడ్డుతగుల్తున్న సాంఘిక సాంస్కృతిక ఆర్థిక సమస్యలను ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చర్చించారు, పరిష్కరణ చూపిస్తున్నారు. ప్రాచీనులలో పరోక్షంగా ఆ ధోరణి ఉన్నా అది నివురుగప్పిన నిప్పులా ఉండేది. కానీ ఆధునికులలో చాలమంది స్త్రీలకు వకాల్తా పుచ్చుకొని అన్ని రంగాల్లో తమదైన శైలిలో ప్రబోధ చేశారు, వాదించారు, నినదించారు, నిరంతరంగా మానవతా గుండెల్లో నిద్ర పోయారు. స్త్రీజనోద్ధరణ ధ్యేయంగా కవితలు కథలు కథానికలు నవలలు తర్కసహంగా సాగాయి. కొడవటిగంటి కుటుంబరావు గారి కుటుంబ గాథల్లో రెండవ ప్రాధాన్యం ‘బాల్య వివాహాల’ తంతు మీద. ఈడు జోడు లేని పెండ్లిండ్ల బండారం, అందులోని ‘తూ..తూ’ మంత్రం ఛీి ఛీ అనిపించేలా వ్రాశారు. ‘కన్యాశుల్కం’ కథా వస్తువుగా గురజాడ అసమ వయస్కుల వివాహతంతు లోని స్వార్ధాన్ని ఎండగట్టారు.విద్య లేమి వల్ల జరిగే విపత్తు ని చెప్పారు. వేశ్య వృత్తిలోని ఉచ్ఛనీచాలను తక్కెడ వేశారు. కాళ్ళకూరి నారాయణరావు రాసిన సంస్కరణాభినివేశపు నాటకం ‘వరవిక్రయం’ సంఘంలో ప్రబలిన మరో దురాచారాన్ని సహేతుకంగా ఈసడించి, అందరూ అసహ్యించుకునేలా కనువిప్పు కలుగజేసింది. ఇక చలం స్త్రీ జనోద్ధరణకే కాక స్త్రీ స్వతంత్రానికి – అంటే అది వాక్ స్వాతంత్రం కావచ్చు , లైంగిక స్వేచ్ఛ కావచ్చు, విద్యార్జన హక్కు కావచ్చు , ఆర్థిక స్తోమత కు పునాది కావచ్చు . ఏదైనా ఉద్ధరణ అయినప్పుడు చలం ఆశయం నెరవేరినట్లే. ఆయన ప్రస్తావించింది “స్త్రీ ” సంపూర్ణ వికాసమే. పరిపూర్ణ స్వేచ్ఛ ప్రకాశమే. చలం కలం నుండి జీవం పోసుకున్న అతివల పాత్రల గమ్యం స్త్రీ పురుషుల సంబంధాల గురించి మొత్తం ఎడ్యుకేట్ చేయటం. గోపీచంద్ ‘అసమర్ధుని జీవిత యాత్ర’ అంతులేని కథలలో స్త్రీకి ఉన్న విలువ స్పష్టంగా చెప్పాడు . బమ్మిడి జగన్నాధరావు కథల్లో స్త్రీ ఆధిక్యత ఎలా రాజుకుంటుందో రేఖామాత్రంగా “రెక్కల గూడు’ లో మండించారు. కె శివారెడ్డి తరతమ భేదం లేకుండా స్త్రీకి దక్కవలసిన ఉచితమైన, ఉన్నతమైన స్థానాన్ని ఎటువంటి భేషజం లేకుండా చూపించాడు. ‘ఆమె ఎవరైతే మాత్రం’ వంటి కవితాసంపుటాల్లో స్త్రీని ఆరాధించాడు. స్త్రీల పట్ల ఉన్న వివక్షతను ప్రతిపక్షం చేశాడు. “రచ్చబండ” లో మద్దూరి నగేష్ బాబు , “దళిత వ్యాకరణం”లో తుల్లిమల్లి సుధాకర్ బాబు, “వర్తమానం”, “వర్గీకరణం” లలో ఎండ్లూరి సుధాకర్ ‘దళితవాదం’, స్త్రీవాద నినాదాన్ని వినిపించారు. “ఆవిష్కృతం”లో హరిహరనాథశర్మ , హిరణ్మయిలు స్త్రీశక్తిని అపరశక్తిగా తీర్చిదిద్దారు. కొలకలూరి ఇనాక్ గారి వైవిధ్యభరితమైన కవితల్లో కథల్లో కథానికల్లో వ్యాసాలు లో గుండెకు సూటిగా వాడివేడి వివాదాలతో నగరం మోగించారు. ఆయన రచనల్లో మానవతావాదం- దళితవాదం- స్త్రీవాదం ముప్పేటగా పురి వేసుకున్నాయి. స్త్రీ ఆభిజాత్యాన్ని, స్త్రీ ఆత్మగౌరవాన్ని , స్త్రీ ఆవశ్యకతను పదునైన సాహిత్యంతో అదునెరిగి ఆరాధ్య భావాన్ని చేరవేశారు. “బర్త్ సర్టిఫికెట్” కథలో పురుష ఆధిక్యతని స్త్రీ వైముఖ్యం చూపటం ఎవరికీ కష్టం కలగకుండా లాజికల్గా చిత్రించారు. “రమ నా కూతురు” లాంటి న్యాయపరమైన సంక్లిష్ట సమస్యలను కూడా అతి సున్నితంగా, అందంగా, ఆశావహంగా, వాదోపవాదాల మధ్య ఉత్కృష్టమైన అభినివేశంతో, ఆవేశంతో,ఆ వేగంతో, ఉద్వేగంతో ఉరకలెత్తించారు. “పిల్లనే కంటాను” వంటి కథల్లో స్త్రీ ఆవశ్యకతను, ఆమె పరమార్ధాన్ని, ఆమె ప్రయోజనాన్ని చిత్రించారు. గుక్క తిప్పుకోనివ్వకుండా సినిమాటిక్ గా రీల్స్ తిప్పారు. తన రచనలన్నిటిలో ఎక్కడో ఒక అక్కడ స్త్రీ పట్ల పూజ భావాన్ని వినిపించారు. “మా అమ్మే”లో అమ్మకి ఇచ్చిన మాతృస్థానం సజీవ జీవ ఛకఛకితం అయింది. ఆయన సున్నితమైన సహజమైన మాటలలో స్త్రీ వ్యక్తిత్వం ముత్యాల మూట అయింది. స్త్రీ సమారాధనకు పదిలమైన కోట అయింది. ఇంకా సాహిత్యాన్ని పంచుకుంటున్న యువ రచయితలకు ఆధునికత విసిరిన సవాళ్ళు సవాలక్ష ఉన్నా, అత్యంత ప్రాచీనమైనా – అత్యంత ప్రముఖమైన “స్త్రీవాదం” ఆకర్షిస్తూనే ఉంది. మత చాందసాన్ని మందలించే దమ్ము అందరికీ ఉండదు. కానీ నిజమైన “నిజానిక” ఉంటుంది. నిజాయితీ ఉన్న వాళ్లకు ఉంటుంది. ఆ శ్రేణిలోకి వచ్చే రచయిత సలీం. సలీం రాసిన “రూపాయి చెట్టు”, “చదరపు ఏనుగు”, “ఒంటరి శరీరం” మొదలైన కథల్లో మొహమాటం లేని నిష్కర్ష ఉంటుంద. ముస్లిం మతాన్ని, వారి సంఘాన్ని, వారి అభ్యున్నతిని కోరే దిశగా అడుగులు వేయడం, వేయించటం ఆయనకున్న నైతిక బాధ్యత. అందుకే ముస్లిం స్త్రీల కనబడని క్షోభను “వెండి మేఘం” అనే నవలలో తెరకెక్కించాడు. “ఖులా, మెహర్” వంటి కథలలో కట్నకానుకల వంటి ఆచారాన్ని అడ్డగించాడు. “బురఖా” లాంటి ఖాయిలా పడ్డ రుగ్మతల్ని చిరునవ్వుతో చిత్రంగా ‘కాదు పొ’మ్మన్నాడు. “ఫత్వాల” కొత్వాలుతనానికి “తలాక్” కథలో దాని ఔచిత్యానికి పరీక్ష పెట్టాడు . చిన్న చిన్న కథలతో, సున్నితమైన శైలితో , ఎదుటి వారికి కష్టం కలిగించని రీతిలో సాగే ఆయన సాహిత్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (కాలుతున్న పూలతోట ) దక్కడం నిజంగా తెలుగువారు గర్వించదగ్గ విషయం. “అందరి జన్మలకు అభివృద్ధికి కారణభూతమైన ఆమె ఆమె గాని మిగిలిపోతుంది” “అందరి అవసరాలు తీర్చుతూ ఎవరికీ చెందని ఆదిమ తల్లి”.. “యుగయుగాల పవిత్రదాసి..”అనే కె.శివారెడ్డి ఆవేదన జనసంద్రం ఘోషలో ఉవ్వెత్తున లేచే గొంతుక. స్త్రీ సముద్ధరణ మహాయజ్ఞం రావణకాష్టంలా ఎల్లప్పుడూ ఉంటుంది. సంస్కర్తలు దాని తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా ప్రభుత్వం, ఐరాస లు ఎంతో కొంత చొరవ చూపిస్తూ చట్టాలు చేస్తున్నా సమస్య కొలిక్కి వచ్చేట్లు లేదు. సంస్కర్తల పదునైన ఆయుధం సాహిత్యమే. మానవతలో చైతన్యం రానంత వరకు ఈ అసాధారణ ప్రయత్నం అంతం కాదు. ఆగదు. చిగురు పెడుతూనే ఉంటుంద. మొగ్గ తొడుగుతూనే ఉంటుంది. స్త్రీ వాదాన్ని స్త్రీలే గాక పురుషులు రచయితలు కూడా సహ అనుభూతితో స్పందించి, తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, కవిత్వం కథలు నవలలు వెలువరించారు. దానిని విశ్లేషించడమే నా ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. స్త్రీవాదాన్ని తర్కసహంగా, హేతుబద్ధంగా ప్రభుత్వం, స్థానిక సంస్థలు, మతపెద్దలు గుర్తించాలి. సంస్కరణల వెలిగించాలి. స్త్రీ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లాలి . ఇది అనంతమైన పోరాటం.స్త్రీ మనుగడకై స్వేచ్ఛ కై ఆరాటం.
*****
( ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం గురించి స్త్రీలు అనేక రచనలు చేశారు. కానీ స్త్రీవాదాన్ని సమర్థిస్తూ సహ అనుభూతితో రాసిన పురుషరచయితలు కూడా చాలామంది ఉన్నారు. వారి రచనలను విశ్లేషిస్తూ సాగిన ఈ వ్యాస పరంపరను ప్రోత్సహించి వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించిన డాక్టర్ కె. గీత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.)

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)
