గొప్పదనం

-ఆదూరి హైమావతి 

అనగ అనగా రామాపురం అనేగ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు.అతడు తన పొలంలో వాదుకునే పరికరాలనంతా తన ఇంటిపక్కనే ఉండే రేకులషెడ్డులో ఉంచేవాడు.రామయ్యభార్య సూరమ్మకూడా తాను పెరట్లోనూ , ఇంట్ళోనూ వాడుకునే కొన్ని వస్తువులను అందుబాటూగా ఉంటాయని అక్కడేపెట్టేది.

ఒకరోజున ఆమె గబగబా రేకులషెడ్డులోకి వచ్చి అక్కడ క్యాలెండర్ కు గుచ్చి ఉంచిన సూదిని తీసుకెళ్ళి ముళ్ళు గుచ్చుకుని చిరిగిన రామయ్య పంచెను కుట్టి తెచ్చి మళ్ళీ అక్కడే ఉంచ్చి వెళ్ళింది.

ఆమె వెళ్లాక , అక్కడే ఒక మూల అలమారలో ఉన్న దబ్బనం కేసి చూసి సూది ఇలాంది.

“బధ్ధకపు దబ్బనమా!చూశావా నేను మన యజమానికి  ఎంత సేవచేసానో! ఆయన కట్టుకునే పంచె చిరిగితే నాసేవ వల్లే సరి చేసుకుని కట్టుకెళ్లాడు.యాడాదంతా అక్కడే తుప్పు పట్టేలా నీలుక్కుని కూర్చుని పంట పండి గోతాలకెత్తి కుట్టేప్పుడు మాత్రమే పనిచేస్తావు. వ్యర్ధురాలివి”అని హేళన చేసింది.

దబ్బనానికిరోషం పొంగుకొచ్చింది.”ఏమే చిన్న చీపురుపుల్లంత లావులేవు, ఎంత ధీమానే నీకు?అసలు నేను మన యజమానికి ఎంత ఉపయోగిస్తున్నానో నీకేం తెల్సు?పంటలు ,పండి కుప్పలు నూర్చగానే బస్తాలకెక్కించేప్పుడు నేనే కావాలి.బస్తాలకు ఎక్కించాక పాతరలో మాగి నాక మరపట్టించేప్పుడూ నేనే కావాలి.ఆధాన్యాన్ని తిరిగి సంచుల కకెక్కించి సంతకు చెర్చేప్పుడూనేనే కావాలి. సంచులు కుట్టను నన్నేగా తీసుకెళ్ళేది? నేనే లేకపోతే ఆధాన్యమంతా నేలపానే. మన యజమాని కి ధనం చేకూరను నేనేగా సహాయం చేసేది ?ఏమనుకుంటున్నావే నాగూర్చి?జాగ్రత్త.”అని మండి పడింది  సూదిమీద.

సూదీ దబ్బనం రెండూ నేలమీదకు దిగి ఎగురుతూ పోట్లాడుకుంటూ ఒక మూల మౌనంగా ఉన్న గునపం దగ్గర కెళ్లాయి.గునపం వాటింపోట్లాత విననట్లు మౌనంగా ఉంది.

ఆరెండూ గునపాన్ని ఇలా అడిగాయి.” గునపమన్నా  గునపమన్నా! నీచెప్పు. మన యజమానికి ఎవరు ఎక్కువ సేవ చేస్తున్నామో! ఏవరం బధ్ధకానికి పెద్ద చుట్టాలమో!చెప్పన్నా” అన్నాయి.

గునపం” నాకేం తెల్సు?మీగొప్పెంటో!మీరే ఒకరికొకరు చెప్పుకుని తేల్చుకోండి. కాస్తంత సేపు నన్ను విశ్రాంతిగా ఉండనీయండి.” అంది. అంతే సూదికీ దబ్బనానికీ మహాకోపం వచ్చింది.

“నిన్నడగడమే మాతప్పు.ఊరికే నల్ల సుద్దలా  మూల కూర్చునే నీవే మహా బధ్ధకపు దానివి. నిన్నడిగాం చూడూ అదే మా బుధ్ధి తక్కువతనం.ఐనా నీవేం సేవచేస్తున్నావో చెప్పు మనయజమానికి వింటాం” అన్నాయి ముక్త కంఠంతో.

గునపం గొంతు సవించుకుని “తమ్ముళ్ళూ నేను యజమానికి చేసేసేవ చాలా తక్కువే!మీ అంత ఎక్కువకాదు. మన యజమాని పొలందున్ని పదును చేసేప్పుడు,నాకు పసుపూ కుంకుమ పెట్టి తీసుకెళ్ళి పోలం త్రవ్వుతాడు.తన కూర మళ్లలో పాదులు చేయనూ, పొలంలో మొలిచిన పనికిరాని ముళ్ళచెట్లను నరికేయనూ, మొక్కలు నాటనూపాదులు త్రవ్వనూ , కాలువలు త్రవ్వనూ, కంచెవేయనూ,తన ఇంటికిగోడలు కట్టుకునేప్పుడూ,  బావిత్రవ్వనూ, నన్ను తీసు కెళతాడు. పొలంపనులు మొదలు పెట్టినప్పటి నుండీ, కాయకూరలూ విత్తులూ చేలల్లో నాటే రోజు నుంచీ నన్ను ఉపయోగిస్తాడు.ఇంచు మించుగా ఏడాది పొడుగునా నాకు పని ఉంటుంది.ఇదో ఈరోజే ఇలా కాస్తంత విశ్రాంతిగా  ఉన్నాను.” అంది.

సూదీ దబ్బనం ఒకదానికేసి ఒకటి చూసుకుని తమ పనికీ గునపం పనికీ ఉన్న వ్యత్యాసం తెల్సుకుని   సిగ్గుతో తలలు వంచుకున్నాయి.

నిండుకుండలా ఉన్న గునపానికి మనస్సులోనే నమస్కరించుకున్నాయి.

గొప్పవారెప్పుడూ తమ గొప్ప చెప్పుకోరు.వారి ప్రవవర్తనతోనే వారి గొప్పదనాన్ని  అంతా తెల్సుకుంటారు.

      *****

Please follow and like us:

2 thoughts on “అనగనగా- గొప్పదనం (బాలల కథ)”

  1. ఇలాంటి ఆలోచించ దగ్గ కధలే నమ్మా నేడు బాలలకు కావాల్సింది. ప్రతి చిన్నారి చేత మనం ఇలాంటి కధలు చదివింప చేయాలి. ఒకరిపై ఒకరు ద్వేషం లేకుండా…… ఎవరు ఎక్కువ ఎవరు తక్కువా…. కాదని… పిల్లల కు ఆసక్తి కలిగేలా రాసారు. చక్కని కధ. మా స్కూల్ పిల్లలుకు చెబుతాను

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published.