నా జ్ఞాపకాల్లో నాన్నగారు

(“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట)

-జఘనరాణి శర్మ

ప్రముఖ రచయిత, కవి, విమర్శకులు, సాహితీ ప్రియులు ఐన శ్రీ చిర్రావూరి సర్వేశ్వర శర్మగారి శతజయంతి ప్రారంభోత్సవ వేడుక ఈ నెల ఫిబ్రవరి 17 న అంతర్జాల వేదిక ద్వారా జరిగింది. ఆ సందర్భంగా వయోలిన్ విద్వాంసులు శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు గారు ఆవిష్కరించిన “నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” పుస్తకం లో ప్రచురితమైన వారి పెద్ద కుమార్తె వ్రాసిన “నా జ్ఞాపకాల్లో నాన్నగారు” అన్న ఈ మెమొయిర్ ఆమె తన తండ్రిగారితో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేర్చి కూర్చిన అక్షరమాల ..

****  

 నా చిన్ననాటి రోజులు చాలా అందమైన, అరుదైన ప్రశాంత సుదినాలు. తలంపుకి వచ్చినప్పుడల్లా అవన్నీ ఏ సుదూర తీరాలకు పారిపోయాయి ..ఏ దిగంతాల దిగువకు జారిపోయాయి అని దిగులుగా అనిపిస్తుంది. అలాంటి రోజులు మళ్ళీ ఇంకెప్పుడూ రావు కదా అని బాధ కలుగుతుంది. విజయనగరం లోని మా ఇల్లు ఒక పవిత్రమైన పర్ణశాల లాగఅందులో గడిచిన మా బాల్యము ఒక అందమైన కల లాగ, అమ్మ, నాన్నగారు మా కోసం దివి నుండి దిగి వచ్చిన దేవతామూర్తుల లాగ అనిపించి కళ్ళు చెమరుస్తాయి.

               నాన్నగారు ఢిల్లీ (మిలిటరీ) లో పనిచెయ్యడం, మా చదువుల కోసం అమ్మ విజయనగరం వచ్చేయడం లాంటివి నాకు అంతగా గుర్తు లేదు కానీ, అమ్మ మాకు నాన్నగారి కబుర్లు, మేం ఢిల్లీ లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కథల లాగ చెప్పడం, మమ్మల్ని నాన్నగారికి ఉత్తరాలు రాయమని ప్రోత్సహించడం లాంటివి బాగా గుర్తున్నాయి.  మేమంతా మాకు వచ్చిన , , , లు, ‘1 ,2 ,3 ,4’ లు, ‘ఎక్కాలుఅమ్మ రాసిన ఉత్తరం లోనే మాకు ఉంచిన స్థలం లో వ్రాసేవాళ్ళం. మమ్మల్ని మెచ్చుకుంటూ నాన్నగారి దగ్గర నుండి బదులు ఉత్తరాలు కవితా రూపం లో వచ్చేవి. నాన్నగారు మాకు పండగలకీ, పుట్టినరోజులకీ అందమైన బొమ్మల పుస్తకాలు (సౌండ్ చేసేవి), గ్రీటింగ్ కార్డ్స్ (మ్యూజికల్) పంపేవారు. మాకెంతో గొప్పగా, థ్రిల్లింగా ఉండేది. అలాంటివి ఇప్పుడు చాలా సర్వ సాధారణం కావచ్చు, కానీ ఆ రోజులలో మాత్రం చాలా చాలా అరుదు. నాకు 3 ఏళ్ళ  వయసు లో నాన్నగారు అమ్మని, పిల్లల్ని తీసుకొని ఆగ్రా లోని తాజ్ మహల్ చూడడానికి వెళ్లారట. తాజమహల్ లోపలకి వెళ్లే సమయానికి నేను లోపలకి రానని ఏడవడం మొదలు పెట్టాను ట.  అప్పుడు, నాన్నగారు నేను ముందు జన్మలో ముంతాజ్ అయి ఉంటానని, అందుకే లోపలికి రానంటున్నాననినన్ను ఎత్తుకొని బయటే ఉండిపోయారు. చిన్న పిల్ల మారాం లో కూడా భావుకత్వాన్ని, తాజమహల్ ప్రేమ తత్వాన్ని దర్శించగలిగిన ప్రేమికుడు నాన్నగారు.

          నాన్నగారు సర్వీస్ నుండి వచ్చేసిన తరువాత H.A.L., సునాబేడ లో హాస్టల్ వార్డెన్ గా పని చేసేవారు. నెలలో ఒకటి, రెండు సార్లు యింటికి వచ్చేవారు. నాన్నగారు వచ్చినపుడల్లా  మా యింట్లో పండగలా ఉండేది. ఉన్న నాలుగు రోజులు మమ్మల్ని సినిమాలకీ, షికార్లకీ తీసుకెళ్లేవారు. హోటల్ కి వెళ్ళినపుడు ఎవరికి ఏ రకం టిఫిన్స్ కావాలో పేరు పేరు వరుసనా అడిగి మరీ తెప్పించేవారు. పాల కోవా, నల్ల ద్రాక్షలు, అమృత కేళి అరటి పళ్ళు, Ovaltine/Bournvita, అమ్మ కోసం special గ నెస్కేఫ్ కాఫీ పొడి  లాంటివి కొనడం తప్పనిసరి.

తన కోసం తెచ్చుకొనేవి మాత్రం న్యూస్ పేపర్స్, వార పత్రికలూ, మాస పత్రికలూ etc., ., యివి కాకుండా అమ్మవారి గుడి దగ్గర ఉండే హిమాంశు బుక్ డిపో నుండి ఆంగ్ల సాహిత్యం, విశాలాంధ్ర (వైజాగ్) నుండి ఎమెస్కో వారి తెలుగు సాహిత్యం, వాటితో పాటు పుస్తకాల catalogs లాంటివి మా యింటికి రావడం పరిపాటి.  మా యింట్లో ‘center of attraction’ లా పుస్తకాలతో నిండిన ఒక అద్దాల బీరువా ఉండేది. నాన్నగారు అప్పుడప్పుడూ ఆ బీరువా లోని పుస్తకాలన్నీ వెలికి తీసి, dusting చేసి, వాటిని re-arrange చేసేవారు. అప్పుడు, మా పిల్లలం బయట వున్న పుస్తకాలను చేతికి ఏది దొరికితే దాన్ని అంది పుచ్చుకొని చదివేవాళ్ళం. అలాంటి పుస్తకాలలో, కొన్ని Mathematical puzzles, Famous people quotations, రకరకాల dictionaries, పాత magazines…కూనలమ్మ పదాలు, మరోప్రపంచం గీతాలు, నండూరి వారి ఎంకి కబుర్లూ..  అవన్నీ చాలా అందమైన జ్ఞాపకాలు..

           నాన్నగారిని  మా వీధిలో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు చాలా అభిమానించేవారు. చేతిలో పుస్తకం, హ్యాట్, బూట్లతో  నాన్నగారు హుందాగా వీధిలో నడుచుకుంటూ వెళ్లడం, ఫ్రెండ్స్ తో ఇంగ్లీష్ లో మాట్లాడడం లాంటివి అందరినీ ఆకర్షించేవి. లలిత మొగుడు బాగా చదువుకున్నవాడు, చాలా ఔన్నత్యం గల మనిషి అని అనుకుంటూ ఉండేవారు. స్వతహాగా మా నాన్నగారు చాలా మృదుస్వభావులు. ఎవరినీ విమర్శించడం కానీనొప్పించడం కానీ నేనెప్పుడూ చూడలేదు. పనిమనిషికి, రిక్షావాడికి కూడా మర్యాద యిచ్చి, సాటి వ్యక్తి లాగ చూడగలిగే సంస్కారం నాన్నగారిది. ఎవరైనా బిచ్చగాడు చేయిచాస్తే జేబులోంచి చేతికి ఎంత వస్తే అంతా యిచ్చేసేవారని అమ్మ నాన్నగారిని అప్పుడప్పుడూ కోప్పడుతూ ఉండేది, అందరినీ సోమరిపోతుల్ని చేసి కూర్చోబెడుతున్నారంటూ. నాన్నగారు ఎంతో ప్రసన్నంగా, ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు. నాన్నగారిని ఎప్పుడు తలచుకొన్నా, నాకు ఆ రూపమే కనిపిస్తూ ఉంటుంది.  

                                 అందరి నాన్నగార్లలా కాకుండా మా నాన్నగారు అమ్మని  మీరుఅని సంభోదించేవారు. అమ్మ ఆలోచనలను, నిర్ణయాలను గౌరవించేవారు. బహుశా ఈ విధంగా భార్య వ్యక్తిత్వానికి విలువనిచ్చి, గౌరవించే భర్త దొరకడం అమ్మ పూర్వజన్మ సుకృతమైతే, ‘కార్యేషుదాసీ, కరణేషు మంత్రి…లాంటి భార్య లభించడం నాన్నగారి పుణ్య ఫలం అనే చెప్పాలి. నాన్నగారు ఇంటికి వచ్చినపుడు అమ్మ మమ్మల్ని మా పుస్తకాలు చదివి నాన్నగారికి వినిపించమనేది. ఒకసారి నేను నా ఇంగ్లీష్ బుక్ లో Albert Schweitzer అనే noun ని ఆల్బర్ట్ స్క్విజ్జర్అని చదివాను. నాన్నగారు నన్ను ఆల్బర్ట్ స్క్వైజర్అని చదవాలని కరెక్ట్ చేసినట్లు గుర్తు. నాన్నగారు తెలుగులోనైనా, ఇంగ్లీష్ లోనైనా కానీ, స్పెల్లింగ్, ఉచ్ఛారణడిక్షన్ ఇలాంటి వాటికి చాలా ఇంపార్టెన్స్ యిచ్చేవారు.  మేము అల్లరి చేసినా, తప్పు చేసినా మందలించేవారు కానీ, మమ్మల్ని తిట్టడం కానీ, కొట్టడం కానీ ఏనాడూ చెయ్యలేదు. సహజంగా నాన్నగారి పట్ల వున్న భక్తి, గౌరవం వలన, నాన్నగారి మెప్పు పొందాలనే తపన మా అందరిలో బాగా ఉండేది. బహుశా, అందుకేనేమో, నాన్నగారు శాసించకుండానే, మేమంతా బుద్ధిగా ఉండేవాళ్లం. 

                                  అమ్మ వంటింట్లో పని చేసుకునే సమయంలో, నాన్నగారు ముందు గదిలో పడకకుర్చీలో కూర్చొని ఇంగ్లీష్ లేదా తెలుగు పుస్తకాలు పైకి చదువుకుంటూ ఉండేవారు. అవి వినడానికి చాలా బాగుండేవి.  కానీ, అలాంటి సమయాల్లో మాత్రం, ‘తన ఊహా ప్రపంచంలో విహరించే, మాకు తెలియని  మా నాన్నగారులా అనిపించేవారు. మా  యింట్లో రకరకాల ఇంగ్లీష్, తెలుగు బుక్స్ ఉండేవని నాకు చాలా గొప్పగా ఉండేది. నాన్నగారికి అన్నిరంగాలకు చెందిన పుస్తకాలూ ఇష్టమే.. లిటరేచర్, హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్స్, మ్యూజిక్, పెయింటింగ్స్, ఆటోబయోగ్రఫీస్ , ఫిలాసఫీ, సైకాలజీ..యిలా ఒకటేమిటి.. ఎన్నో, ఎన్నెన్నో. ఈ పుస్తకాలతో పాటు, ALL INDIA RADIO లో వచ్చే రకరకాల ప్రసంగాలు, నాటకాలు, ఇంటర్వ్యూలు, ‘రాగం, తానం, పల్లవిలాంటి సంగీత కార్యక్రమాలు, తెలుగు, ఇంగ్లీష్ న్యూస్ తప్పనిసరిగా వినడం, స్నేహితులతో సాహితీ సంభాషణ, చర్చలు, యింట్లో ఉదయం పూట సైగల్ పాటలు వినడం, సినిమాలు, రివ్యూలు మొదలయినవి నాన్నగారి లోని వైవిధ్యాన్ని చాటి చెప్తూ ఉండేవి.. 

       నాన్నగారు మా ప్రతి పుట్టినరోజుకి ఎవరి అభిరుచికి తగిన పుస్తకాన్ని వారికోసం ఎంచి, పేజీల మధ్యలో కొత్త రూపాయల నోట్లు పెట్టి మాకు కానుకగా ప్రెజెంట్ చేసేవారు. ఎంత అరుదైన, అపురూపమైన  బహుమానం..!  నా 16 వ పుట్టిన రోజుకి అనుకుంటా.. నాన్నగారు నాకు మాక్సిం గోర్కీ వ్రాసిన మదర్ బుక్ కి తెలుగు అనువాదం అమ్మ‘  యిచ్చారు. మొదటి పేజీ లో  అమ్మ ఎవరికైనా అమ్మే‘  అని వ్రాశారు. నాకు ఆ బుక్ లోని గొప్పతనం అప్పుడు అర్థం కాలేదు.. కాకుండా, చదవడానికి బోర్ అనిపించిప్రక్కన పడేసాను. తర్వాత, ఆ పుస్తకం గురించి పూర్తిగా మర్చిపోయాను. సరిగ్గా 40 ఏళ్ళ తర్వాత, ఓ రోజు పుస్తకాలు సర్దుతున్నప్పుడు అనుకోకుండా ఆ పుస్తకం కనిపించింది. ఆధునిక జీవితంలోని పరుగులతో సాహిత్యాన్ని ఆస్వాదించే శక్తిని కోల్పోయిన నేను, ముందు పేజీ లోని నాన్నగారి చేతి వ్రాత ని చూసి, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. పేజీలు తిరగేస్తున్నపుడు కనిపించిన అక్కడక్కడి వాక్యాలు నన్ను ఆ పుస్తకాన్ని మొదలంటా చదవడానికి ప్రేరేపించాయి. ఆ పుస్తకం చదవకుండా ఇన్నాళ్లు ఎంత మిస్ అయ్యాను…’ అని ఎన్నిసార్లు అనుకున్నానో. నాన్నగారు ఎంత గొప్ప పుస్తకం బహుకరించారు..! ఎక్కడో నన్ను గుర్తించారు.. ఇవాళ కాకపోయినా జీవితంలో ఏదో ఒక రోజు, నేను ఆ పుస్తకం చదువుతానని, ఆ రచన లోని లోతుకు, విలువలకి స్పందిస్తానని. నాన్నగారు మనుష్యుల తత్వాలని ఎంత చక్కగా చదవగలరు!  మమ్మల్ని ఎప్పుడూ పిల్లలలా కాకుండా, స్నేహితులలా చూసేవారు. మా  ఇష్టాయిష్టాలకు, అభిప్రాయాలకు అభ్యంతరం చెప్పేవారు కాదు. పిల్లలకు ఈ రకమైన ఫ్రీడమ్ మంచిదే అయినా, ఒక రకంగా చెడ్డది కూడా. కానీ మా అదృష్టం ఏమిటంటే అమ్మ ఎప్పుడూ మమ్మల్ని పరిధి దాటకుండా చూసుకొనేది. నాన్నగారికి ఒకరిని ఇంకొకరితో పోల్చడం నచ్చేది కాదు. ఎవరి ప్రత్యేకత వారిది అని గాఢంగా నమ్మేవారు. అమ్మ, నాన్నగారు మమ్మల్ని పెంచడం లో ఎంత సంయమనం చూపించారో తర్వాత తర్వాత మా  పిల్లలని పెంచుతున్నప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. 

                 నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేరిన కొత్తలో(1980), రోజూ ఆఫీస్ కి వెళ్ళడానికి, రావడానికీ బస్సులో దాదాపు ఒక గంట ప్రయాణం పట్టేది. ట్రావెల్ టైములో చదువుకోడానికి నాన్నగారు నాకు Sylvia  Plath’s ‘The Bell Jar’ పుస్తకం యిస్తూ, నీకు ఈ బుక్ నచ్చొచ్చు, ట్రై చెయ్యి అన్నారు. ఆ బుక్ నచ్చడమే కాదు, Sylvia  Plath రచనా విధానం, భావోద్వేగం నా ఆలోచనా సరళి మీద చాలా ప్రభావం చూపింది.  నాన్నగారు నాకు వేర్వేరు సందర్భాలలో వేర్వేరు పుస్తకాలు యివ్వడం జరిగింది. నా 10th క్లాస్ లో ఆచంట జానకి రామ్ గారి గీతాంజలి‘ (విశ్వకని రవీంద్రనాథ్ ఠాగూర్) తెలుగు అనువాదం నాకు పుట్టినరోజు కానుకగా యిచ్చారు. అందులో కొన్ని గీతాలు ఎంతగా నచ్చాయంటే, వాటిని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేవి.  

                      నాన్నగారు యిచ్చిన పుస్తకాల్లో మరి కొన్ని:

                      ప్రేమలేఖలు(చలం గారు)

                      సాగుతున్న యాత్ర(ఆచంట జానకి రామ్)

                      Woman of Rome (Alberto Moravia), 

                      Letters to Felice (Franz Kafka), 

                      The Autobiography of Bertrand Russell, 

                       Education and the Significance of Life (జిడ్డు కృష్ణమూర్తి)

            ఈ పుస్తకాలన్నింటిలో నూ ఒక commonality  కనిపిస్తూంటుంది నాకు.. ఎక్కడో తనని తాను తెలుసుకునే ప్రయత్నం, ఏదో ఒకటి సాధించాలనే తపన, సాధించి మాత్రం ఏం చెయ్యాలి అని నిసృహ, ఈ నిసృహ ని తప్పించుకోడానికి అన్నట్లుగా సృష్టి రహస్యాలను శోధించడంలో నిమగ్నమైన మేధావుల గుండె చప్పుళ్ళు. నిజానికి, ప్రతి మనిషి తన జీవిత కాలంలో ఇటువంటి సంఘటనలని ఎదుర్కొని, ఆత్మానుభవం పొంది, రూపాంతరం చెంది, ultimate గ గీతాంజలి లో విశ్వ కవి వర్ణించినట్లు, పరమాత్మతో భాషించగలుగుతాడేమో…ఇదేనేమో నాన్నగారి పరిపూర్ణత లోని అంతరార్థం.   నాన్నగారు నాకు యిచ్చిన ఆఖరి పుస్తకం – All the Marvelous Earth (జిడ్డు కృష్ణమూర్తి) ద్వారా, ఈ సందేశాన్నే తెలియజేశారనిపిస్తుంది. 

                 అమ్మ ఆ పరమాత్ముడిని తన పూజామందిరంలో కొలువుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే, నాన్నగారు సమస్త విశ్వాన్నీ, విజ్ఞానాన్ని తన పుస్తకాల గదిలో అలరించి ఆరాధించారు. వేర్వేరు మార్గాల్లోంచి ఒకే స్వరూపాన్ని దర్శించగలిగిన ధన్య జీవులు ఆ దంపతులు. నాన్నగారు తన కొటేషన్ బుక్ లో ఒక చోట రాసుకున్నారు..”ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోడం కాదు, యిద్దరూ కలిసి ఒకే వైపు చూడడం.. ” అని.  ఈ వాక్యం చాలు. అమ్మ, నాన్నగారు పరిపూర్ణమైన ప్రేమికులు అని చెప్పడానికి. నాన్నగారి బాధ్యతలు అమ్మ స్వీకరించింది. అమ్మ స్వతంత్ర భావాలకు నాన్నగారు విలువని, ప్రోత్సాహాన్ని యిచ్చారు. ప్రేమకి వేరే నిర్వచనం అవసరం లేదేమో..  అలాంటి అపూర్వ దంపతులకి పిల్లలమవడం ఏ నాటి మా నోము ఫలమో..!

*****

Please follow and like us:

2 thoughts on “నా జ్ఞాపకాల్లో నాన్నగారు (“నడిచిన పుస్తకం: సి.ఎస్.శర్మ” ముందుమాట)”

  1. మీరు వ్రాసిన మీ నాన్నగారి మీద వ్యాసం బాగుంది
    అయన వ్యక్తితం , ఆ దెశ కాల పరిస్థులలకు. అద్ధం పడుతోంది
    మీ వ్యాసములో, భావం, భావన , మీ నాన్నగారి. మీద ఉన్న అభిమనామ్ , అపాయయత , కనపడుతున్నాయి
    వ్యాసం బాగుంది

  2. మీ పత్రికలో ‘నా జ్ఞాపకాల్లో నాన్నగారు ‘ వ్యాసాన్ని ప్రచురించి ‘నడిచిన పుస్తకం: చిర్రావూరి సర్వేశ్వర శర్మ’ పుస్తకాన్ని మీ పాఠకులందరికి పరిచయం చేసినందుకు చాలా సంతోషం. సంపాదకులకు మా ధన్యవాదాలు!

Leave a Reply to Wizia Cancel reply

Your email address will not be published.