
మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు)
-ఓల్గా
మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం
తళుకు బెళుకు వస్తువుల
భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల
గిలిగింతల పులకింతలతో
మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు
ఒక్కసారి అటు అడుగు వేశామా
మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది
కొను కొను ఇంకా కొను
ఇంకా ఇంకా ఇంకా కొను
సరుకులు బరువైన కొద్దీ
మనసు తేలికవుతుంది
ఇప్పుడు మనం మార్కెట్ లేకపోతే
మనుషులం కాదు
కొనుగోలు శక్తి ముందు
ఏ బలమైనా బలాదూరవుతుంది
****
ఇప్పుడు దేశమంతా మార్కెట్టే
మనుషుల జీవితాలు, ప్రాణాలు
రక్తమాంసాలు అమ్మకపు సరుకులు
అమ్మడం కొనడం
కొనడం అమ్మడం
లబ్ డబ్ లబ్ డబ్
లాభం నష్టం – నష్టం లాభం
ఉచ్చ్వాస నిశ్వాసాలై పోయాయి
మార్కెట్ నక్షత్రకాంతులకు
మూర్చలు పోవటమే
మనం జీవించి ఉన్నాము అనడానికి గుర్తు
ఇవాళ దేశం మార్కెట్టే కాదు
ఒక సరుకు కూడా !
*****
వందకోట్ల హృదయాల నెత్తుటి జలపాతంలా
విశ్వ విపణిలోకి దూకుతోంది దేశం
ఇది రెండు వందల కోట్ల చేతుల రోబోట్
మీరు ఏ పని చెప్పినా చచ్చినట్టు చేస్తుంది
రండి బాబులూ రండి, కొనండి
బజార్లలో దేశపు దళారుల స్వాగత గీతాలు పర్వతాలు నదులు ఎడారులు పచ్చటి పొలాలు ఇంత మంచి మాల్ మళ్లీ దొరకదు
మన్మోహనంగానే మొదలైంది బేరం
ఈ దేశపు రక్తపు రుచి ఆహా!
ఈ దేశపు బక్క ప్రాణుల
ఫ్యాట్ ఫ్రీ కొలస్ట్రాల్ ఫ్రీ మాంసం
మెత్తని కార్టిలేజ్ రుచి వింటూనే నోళ్లలో నీరూరు లొట్టలు వేస్తూ వచ్చే ప్రపంచ బేహారులు !
దారి వదలండి తలుపులు తెరవండి
ఈ ఎగుడుదిగుడు గుంతల రోడ్లు ఏమిటి
వారి సుతిమెత్తని శరీరాలు తట్టుకోలేవు
సునాయాస ప్రయాణానికి రహదారులు నిర్మించండి రాచ మర్యాదలు చేయండి
సరుకు నాణ్యత గురించి నమ్మబలకండి
ప్రపంచ మార్కెట్లో దేశం రేటు ఎంత
బుక్ వాల్యు బాబు బుక్ వ్యాల్యూ
ఒక్క పైసా ఎక్కువ అక్కర్లేదు
మీకు డబ్బెక్కువైతే
ఇదిగో మా జేబులు
ఎంత నింపినా చోటుండే కొత్తరకం అక్షయ పాత్రలు రంగురంగుల కలలు అమ్మే
జయ చంద్రులు దూసుకుపోతున్నారు
పురుషోత్తములు యుద్ధం మొదలవకముందే
నడిబజార్లోనో కీకారణ్యాల్లోనో
నరమేధాలవుతున్నారు
ఇవాళ ప్రతిఘటన ఒక సరుకే
హోల్ సేల్ గానో రిటైల్ గానో
తిరుగుబాటుని కొనడం అమ్మడం
మార్కెట్ మెల్లిగా నేర్చుకుంటోంది
మార్కెట్ ని జయించడం మాటలు కాదు
కానీ జయించక తప్పదు
మార్కెట్ మాయాజాలాన్ని ఛేదించే
సాహసుల కలయిక కోసం
వర్తమానం కళవళపడుతోంది
భవిష్యత్తు కలగంటోంది
*****

ఓల్గా గా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ, సాహిత్యరంగపు చర్చలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయితగా ఈమెను గుర్తిస్తారు స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, తనను తాను తెలుగులో గురజాడ అప్పారావు వ్రాసిన కన్యాశుల్కంతో ప్రారంభమైన అభ్యుదయ రచనా పరంపరలో భాగంగా కూడా భావించింది. నవంబర్ 27, 1950లో గుంటూరు జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు పోపూరి వెంకటసుబ్బారావు, వెంకటసుబ్బమ్మ. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యం ఎం.ఎ. చేసిన తర్వాత తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఓల్గా కథలు, నవలలు, పద్యాలు మహిళా సాహిత్యములో ఎన్నదగినవి. చలం, కొడవటిగంటి కుటుంబరావు రచనల వల్ల ప్రభావితమై స్త్రీ చైతన్యము అంశముగా రచనలు చేసి తనకై ఒక ప్రత్యేక స్థానము సంపాదించింది. పత్రికలలో, సాహిత్యములో, అనువాదములలో మహిళా హక్కులపై వివాదాస్పద చర్చలు గావించింది. చలన చిత్ర రంగములో ‘ఉషా కిరణ్’ సంస్థకు కథా రచయిత్రిగా పనిచేసి మూడు చిత్రాలు నిర్మించి పురస్కారాలు పొందింది. ఈమె రాసిన స్వేచ్ఛ నవలని వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసారు. 1991 నుండి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు. ఆమె ప్రస్తుతం అస్మితలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

క్రీడలు, కళలు, సినిమాలు,దైనందిన జీవితం అన్నింటా ఇదే వ్యాపారం.మన సంపాదనతో మన కంపెనీ మనల్నే ఉచితానుచితాలు లేకుండా వస్తువులను కొనేలా చేస్తున్న సమయం.పిల్లలు కొనుగోలు శక్తి పెంచుకోవాలని పరుగులు! అద్భుతంగా చెప్పారు.వోల్గా మేం.జయచంద్రుడు! రిఫరెన్స్ బాగుంది
మానవ జీవితాలను శాసిస్తున్న మార్కెట్ కుటిలత్వాన్ని కుల్లం కుల్లం చేసిన కవిత. మన్మోహనంగానే మొదలైంది బేరం… ఆర్థిక సంస్కరణలు ఆరంభాన్ని, తదనంతర పరిస్థితులను కళ్ళకు కట్టించారు ఓల్గా గారు