
‘ఎన్ని ఆమెలో నాలో’ – ఝాన్సీ కొప్పిశెట్టి కవిత్వ సమీక్ష
-డా.సిహెచ్.సుశీల
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం అని చెప్పుకునే ఈ రోజుల్లో కూడా మారని స్త్రీల స్థితి గతులను చూసి, ఆలోచించి, స్పందించి, ఆడవాళ్ళ జీవితం గురించి రాస్తున్నానని, అలంకారాలు అంత్యప్రాసలు, పదలయలు మొదలైన వాటికోసం వెదకకండి అంటూ ముందే చెప్పిి ఝాన్సీ కొప్పిశెట్టి – వివిధ దశల్లో, పరిస్థితుల్లో ఆడవాళ్ళ జీవితాలు, వారి సంఘర్షణలకు సంబంధించిన కవితలను… ఎలాంటి అలంకార ఆచ్చాదన లేని కవితలను మన ముందుంచారు…. ” పువ్వులా నవ్వుతూ పుట్టి పూహాసాల మధ్య పరిమళిస్తూ పెరిగి, పెనిమిటి పోయాడని అలిగి పూలతో వైరపడిన పూబాల ఆమె … పూజకర్హం కాని వితంతు పుష్పాలను ఆకర్షించి ఆఘ్రాణించే మృగనాసికల తుమ్మెద అతను…'”నాతి చరామి అని ఆనాడు తన చేయి పట్టుకున్న భర్త అర్ధాంతరంగా అనంత లోకాల కేగిపోతే దిక్కుతోచని స్థితిలో ఆమె. ఊహ తెలిసిన నాటి నుంచి అమ్మ బొట్టు, కాటుక, పూలతో అలంకరిస్తే మురిసిపోయిన తను ఇప్పుడు ఆ పూల పరిమళాలకి దూరం అయిపోయింది. వ్యక్తిగతంగా తనకు జరిగిన అన్యాయానికి లోలోన కుమిలి పోతుంటే, తోటి స్త్రీలే తనని దూరంగా, వేరుగా ఉంచుతుంటే మనసు ఒంటరిగా రోదిస్తోంది. మనసులోని మాటని చెప్పుకునేందుకు తోడు లేక, చిరుగాలికే అల్లాడిపోయే చిగురుటాకులా అల్లల్లాడిపోతోంది. ఒక ఓదార్పు కోసం శూన్యంలోకి చేయి చాేస్తోంది దీనంగా. అలాంటి ఒంటరి స్త్రీలే టార్గెట్ గా కాచుకున్న మృగం ఆ వంటరి మనసుకు తోడుగా ఉంటాను అంటుంది. ‘గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా, చేరదీసి నీరు పోసి చిగురింపజే’స్తానంటూ ‘సంఘసంస్కర్త’ అవతారమెత్తి, ఆపద్బాంధవుడిగా, స్త్రీ జనోద్ధారకుడిలా పలకరిస్తాడు. మృదువుగా మాటలు కలుపుతాడు. ఓదార్పునిస్తాడు. మనసులోని భావాల్ని పంచుకునే తోడు అవుతాడు. “తన పూతోటకు పురుగుపట్టిందన్న ఆ తుమ్మెద రోదన తోటలో పూలన్నీ వాడి వీడాయన్న వాడిిఆవేదన.. భ్రమరం కథనం నిజమేనని భ్రమసిందా పిచ్చి పువ్వు…”స్నేహం…. అభిమానం… ఆత్మీయత… తర్వాత మెల్లిగా ప్రేమలోకి దించుతాడు. సామాజికంగా దూరంగా ఉండిపోయిన ఆ పిచ్చి తల్లి ఒకానొక కలల ప్రపంచంలోకి అతనితో అడుగులు వేస్తుంది. అదే అతనికి కావల్సినది.”పూ ఆకర్షణ తుమ్మెదనైజమని పూతేనెపై అది వాడికున్న మోజని ఎరుగని ముగ్ధమనోహరమా ముద్దమందారం..” ఒంటరి జీవితంలో శూన్యమైన మనసుకి ఒక ఆలంబన దొరికిందని మురిసిపోయింది. ఇది స్త్రీ హృదయానికి అసహజమేమీ కాదు. తోడులేని ఒంటరి మహిళా మనసుని ఝాన్సీ కొప్పిశెట్టి చాలా సహజంగా ఆవిష్కరించారు. ” వాడు తన బోసి నుదుట సింధూరమద్దుతాడని తనకు తావయి ఊపిరి పోస్తాడని, తనకు కంచై ప్రాణం కాస్తాడని రేకులు విప్పార్చి సంభ్రమంగా సంగమించిందా అమాయక పువ్వు…”తన లక్ష్యం నెరవేరాక, పని పూర్తయ్యాక ఇక ఆమెతో అవసరంలేదు. ‘ సంఘసంస్కర్త’ అవతారం సమాప్తమైంది. అసలు రూపం వికృతంగా బయల్పడింది. మరో “పూజ కర్హం కాని వితంతు పుష్పం” కోసం వేటాడడానికి ఎగిరిపోయిందా తుమ్మెద. “ముల్లయి నిలువునా చీరి తనలోని మధువంతా గ్రోలి రేకులు విచ్ఛిన్నం చేసి ఎగిరిపోయిన తుమ్మెదను నిర్వీర్యంగా చూస్తుండి పోయిందా చిరిగిన పూవు..”ఎంత విషాదం! భర్తను కోల్పోయిన ఆ స్త్రీకి గతంలో ఒక్కటే బాధ. ఇప్పుడు… అమాయకంగా నమ్మి మోసపోయినందుకు అవమానంతో కూడిన ఓటమి. ఈపరిస్థితి ఇంకా భరించలేనిది. ‘అనాచ్ఛాదిత కథ’ నవలలో ఒక ఒంటరి స్త్రీ పిల్లల్ని పెంచడానికి ఎదుర్కొన్న అష్టకష్టాలని, జీవితపోరాటాన్ని …. ‘విరోధాభాస’ నవలలో ‘తన గుండెలోని నాలుగు అరలలో నలుగురిని ఒకేసారి ప్రేమించగలిగే’ ప్రీతం పాత్రను సృష్టించిన ఝాన్సీ కొప్పిశెట్టి, తన చుట్టూ ఉన్న స్త్రీలు ఎన్నెన్ని రకాలుగా మోసపోతున్నారో గమనించి అక్షరరూపంలో వెలువరించడం అభినందనీయం. సామాజిక స్పృహ గల ఒక కవయిత్రి బాధ్యత అదే కదా!
****

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)

యదార్ధ సంఘటనలను కళ్ళకు కట్టి నట్టు వ్రాసే ఝాన్సీ గారు, యదార్థతను కళ్ళ ముందుకు తెచ్చి నిలిపే సుశీలా మేడమ్ గారు ఎవరికి వారు ఇద్దరూ ఇద్దరే .హృదయాన్ని పిండేసే ఆర్ద్రత కలిగిన కవితలకు చక్కని చిక్కని అందమైన సమీక్షను అందించారు సుశీల మేడమ్ గారు ఇద్దరూ అభినందనీయులు.ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
ఝాన్సీగారి “ఎన్ని ఆమెలో నాలో”
కవితలను వాటిపై సుశీలమ్మగారి సమీక్షను చదివాను.
“గాలివీచి పూవుల తీగ నేల వాలిపోతే
చేరదీసి నీరుపోసి…”
అత్యద్భుతమైన పాటను పనిలోపనిగా
“పనిముట్టు”గా మార్చేసుకుని”సంఘసంస్కర్త” లోలోపలి ‘కాముకత్వం,కుటిలత్వం,
పలాయనం”తవ్వి తవ్వి ఎత్తి పోశారు.
అలాంటి “బుద్భుదప్రాయులను”గాలిలోకి ఊది
గేలిచేసి వదిలారు.సమీక్ష కాదది
మేడిపండు లాటి మగవారికి చురకత్తి
పోటు!
ఒంటరి నెలతకు
తుంటరి జీవి ఎదురై
మోహపు చూపును
మమతల మాటున దాచేస్తే
ఆశలకు ఆసరా అందినట్లై
ఆసరాకు అచ్చంగా అర్పణై
అనుభవం అనుభూతికి అందక
ఊహలు ఆహుతై పోయి
ఆసరా అదృశ్యమై పోతే
ఆర్తి తో ఆవేశంతో
ఆగ్రహమే లోలోపల అనలమై
సహించక దహిస్తే…దహించేస్తే
దండనలూ దూషణలూ
దగ్ధమైన దీనులకా..దురాత్ములకా?
*శ్రీముఖి*
వితంతు జీవనాన్ని గుండె ద్రవించేలా చేసే కవితలో ప్రతిబింబించిన మనస్సు కవయిత్రి,రచయిత్రి ఝాన్సీ మేడం గారికి,అధ్యయన శీలి,సూటిగా సునిశితంగా విమర్శ రాసే సుశీలమ్మ గారు ఈ కవితని అద్భుతంగా సమీక్ష చేశారు.వారి ఇరువురికీ శుభాభివాదాలు
డి.నాగజ్యోతిశేఖర్,
10-7-21
పూలకు దూరమైన స్త్రీ ని వితంతుపుష్పం గా అభివర్ణిస్తూ ఆర్ద్రంగా గుండె చెమ్మగిల్లేలా ఝాన్సీ రాసిన మంచి కవిత నటి అంతే ఆర్ద్రత తో విశ్లేషణ చేసారు సుశీల గారు.ఇద్దరికీ మనసారా అభినందనలు
ధన్యవాదాలు సుభద్ర గారు.
భర్త లేని వారికి సమాజంలో లో జరిగే ఇటువంటి మోసాలు అన్యాయం అందరూ ఎప్పుడూ చూస్తూ వుంటారు. కాని సమాజానికి జడిసి బయట పెట్టరు ఆ యువతులు. మానసికంగా కమిలి పోతారు. వారిని వాడుకొనే దుర్మార్గులు ఎప్పుడూ వుంటారు. వారితో జీవితం పెంచుకునే వారు కూడా కనిపించడం జరిగింది కానీ అది అరుదు. ఈ విషయాన్ని హై లైట్ చేసిన రచయిత్రి మరియు పరిచయం చేసిన వారికి నా అభినందనలు.
Thank you Shyam garu
వితంతువు ల పరిస్థితి హృద్యమంగా తమ కవితల్లో
చెప్పారు కవయిత్రి. సమీక్ష కూడా అద్భుతంగా వుంది. ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు.
శ్యామ్ కుమార్
నిజామాబాద్.
నా కవితను ఇంత సవివరంగా విశ్లేషించి సమీక్షించిన స్నేహమయి డా. సుశీల గారికి సమీక్షను ప్రచురించిన నెచ్చెలి సంపాదకులు ప్రియ నెచ్చెలి గీతా మాధవి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..
Thank you Jhansi garu
ఒక మంచి కవయిత్రి ని(రచయిత్రి) ఒక గొప్ప విమర్షకురాలు(సమీక్ష కురాలు) పరిచయం చేయడం,ఆమె రచనలను సమీక్షించడం బాగుంది.
ఇద్దరికీ అభినందనలు. నెచ్చెలి కి కృతజ్ఞతలు.
Thank you Doctor garu.