తెలంగాణ కవయిత్రులు

-డా. కరిమిండ్ల లావణ్య

తెలంగాణలో మహిళలు రాసిన కవిత్వం 19వ శతాబ్దం పూర్వార్థం నుంచే కనబడుతున్నది. నిజాం పరిపాలన ప్రభావం మహిళల విద్యపై ఉన్నప్పటికీ చదువుకున్న మహిళలు వారి కవిత్వం ద్వారా మహిళలను చైతన్యపరచాలనే ప్రయత్నం ఆనాటి కవిత్వంలో కనిపిస్తున్నది.

19వ శతాబ్దానికి పూర్వం క్రీ॥శ॥ 1230-1300 ప్రాంతంలో నివసించిన కుప్పాంబిక రంగనాథరామాయణం రాసిన గోన బుద్ధారెడ్డి కూతురు. ఈమె రాసిన పద్యాన్ని అయ్యలరాజు సంకలనం చేసిన గ్రంథంలో ఉన్నదని తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబికఅనే వ్యాసంలో సంగిశెట్టి శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డాడు. 1847లో పరిగి తాలూకాలోని ఇప్పటూరులో జన్మించిన రూప్‌ఖాన్‌పేట రత్నమ్మ (పెనుగోళ్ళ రత్నమాంబ దేశాయి) ఆధునిక కవయిత్రులలో మొదటి వ్యక్తిగా చెప్పవచ్చును. ఈమె వెంకటరమణ శతకం, శ్రీనివాస శతకం, బాలబోధ, శివకొరువంజి, దశావతార వర్ణన తదితర రచనలు చేసింది. గోలకొండ కవుల సంచికలో సంసార తరణము పేరుతో మూడు కంద పద్యాలు రాసింది. పాటల విషయానికొస్తే, మొదటగా మఠం మహంతమ్మ (హనుమంతమ్మ) మఠం మడివ్యాళయ్య (1833) మాదిరిగానే, ఆయన బాటలోనే అనేక పాటలు రాసింది. ఈమె నిజామాబాదు జిల్లాలోని బోర్లెం (బోర్గెం) గ్రామంలోని బసవేశ్వరునిపై పాటలు రాసింది.

శ్రీ సదాశివచిత్త సరసిజవాస గురు నందీశ్వరా

వాసవాంచి గీరీశ సన్నుత దాసపాలక శ్రీకరా

వ్యాస భుజయుగ వార్ధి కుంభజ యేశ భువనాధీశ్వరా

భాసుర ప్రద బొరళా చల మందిరా బసవేశ్వరా

దయసేయు పుత్రసంతానం

(సేకరణ : ముంగిలి)

1850 తర్వాత బిజినేపల్లి చెన్న కృష్ణమ్మ వనపర్తి సంస్థానప్రాంతంలో ప్రసిద్ధుడైన చంద్రమౌళీశ్వరస్వామి శిష్యురాలు. కపిలదేవహూతి సంవాద యక్షగానం, సత్యనారాయణ కథాకల్పం, బువ్వ బంతి పెండ్లిపాటలు, గురుభజన తత్త్వాలు రాసిందని ముంగిలిలో డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి రాసారు. తిరుమల బుక్కపట్నం కృష్ణమ్మ ఆత్మకూరు సంస్థాన విద్వాంసురాలు. ఈమె బుచ్చి వెంకటాచార్యుల కూతురు. సంస్కృతాంద్రాల్లో జ్యోతిష్యంలో పండితురాలు.

హైదరాబాదులో అచలతత్త్వాన్ని ప్రచారం చేసిన జాలమాంబ అనేక కీర్తనలు రాసింది. సీస పద్యం ద్వారా తాను రాసిన కవిత్వంలోని తప్పులను చెప్పాలని అన్నది. 

సీ॥ గురుపుత్రులార మద్గురుమూర్తి స్తోత్రంబు

రచియింప బూను నావచనములను

వినలేడ్కగలిగిన వినరయ్య వినిపింతు

తప్పులుండిన వాటి దాచబోక

దిద్దవలసినది మీ దేశికేంద్రుని మీద మీకు

భక్త్యున్నట్టె నాకు గలదు

గాని మీవలె నేను కవిత జేయగజాల

చాలనంచని విడజాలతోచి

నట్లు జేయుదు మీ రందరభయమిడిన

ననుచు విజ్ఞాపనమొనర్చిన్‌

యాజ్ఞగొంటి భాగవత వంశ భవకృష్ణ యోగి

రాజ ధీ విశారద మాకదేశి కేంద్ర

(సేకరణ: ఇందుమతి కవిత్వం: సం॥ సంగిశెట్టి శ్రీనివాస్‌)

1913 ప్రాంతంలో కవిత్వం రాసిన యస్‌. సుందరీ బాయి, గిడుతూరి రామానుజమ్మను ప్రస్తావిస్తూ సంగిశెట్టి శ్రీనివాస్‌ ఇలా అన్నాడు. తెలంగాణ సోయితో జరిగిన పరిశోధనల్లో జాలమాంబ, సుందరీబాయిలు వెలుగులోకి వచ్చారు”. 1934లో వచ్చిన గోలకొండ కవుల సంచికలో బో.ఆండాలమ్మ, పొనుగోటి ఆనందమాంబ, ఇందుమతీబాయి, సోమరాజు జ్ఞానమాంబ, రూప్ఖానుపేట రత్నమ్మ, వి.లక్ష్మీదేవమ్మ, బి. లక్ష్మీనరసమ్మ, లక్ష్మీబాయి, రాణి సర్దేశాయి వేంకట లక్ష్మాయమ్మ, కె. సీతాపిరాట్టమ్మల కవిత్వం ఉంది.

వీరిలో లక్ష్మీనరసమ్మ హైద్రాబాదు వాస్తవ్యురాలు. స్త్రీల పాటలు, భక్తవత్సల శతకం రాసింది. పద్యరచనలు చేసిన వారు నేమాని భారతీ రత్నాకరాంబ. అలాగే 1935లో ఏసుక్రీస్తుపై గీతాల్ని కె. ప్లారెన్స్‌ రాసింది. ఆ గీతం ఈ విధంగా ఉంది.

గీ॥ మా కొరకు గాను నీపుత్రు మమతజేసి

పంపితివి, కాని యాయన, బాధలు వడె

దల్లి మరియమ్మ యెంతగా దల్లడిలెనొ

చిన్ని కొమరుడేసు క్రీస్తు సిలువమోయ

1933 నాటికే తెలంగాణ నుంచి సోమరాజు ఇందుమతీదేవి ప్రణయ కవిత్వం రాసింది. ఈ కావ్యం పేరు కావ్యావళి. దీన్ని ఖమ్మం జిల్లాకు చెందిన సోమరాజు ఇందుమతీదేవి రాసింది. వేణుగోపాల శతకం కూడ ఈమె రాసినదే. శకుంతల పరిణయం కావ్యం రాసింది. భర్తపై ఉన్న మమకారంతో, పతిభక్తితో, స్మరణతో ఇందుమతీదేవి ఇలా రాసింది. కాల్పనికోద్యమ ప్రభావం ఈమె కవిత్వంపై ఉంది. అందులో ఆత్మాశ్రయధోరణి కనిపిస్తుంది.

అరసి దేనిని గూర్చి మాటాడుచున్న

చూడ్ములన్విప్పి దృశ్యంబు జూచుచున్న

కడగి భోగ్యపదార్థముల్‌ గుడుచుచున్న

రుచ్యములుగావు మీదగు రూపుకన్న

పొనుగోటి ఆనందమాంబ గోలకొండ కవుల సంచికలో స్త్రీవిద్య ఆవశ్యకతను చెప్పింది. ఆ కవిత్వంలో మహిళలనుద్దేశించి ఆనందమాంబ ఆనాటి పరిస్థితులను తెలియజెప్పింది.

కాంతలు మాతృభాషపయి గౌరవముంచక నన్య భాష న

శ్ర్శాంతము నెరవేర్చినంతటను సారములేదిక గొప్పయైన శ్రీ

మంతముగల్గి యున్నదని మంగళ సూత్రముబారవైచి య

త్యంత సుభూషణంబులను దాల్చినరీతిని యెంచి చూడగన్‌

1919లో హన్మకొండలో పుట్టిన నందగిరి ఇందిరాదేవి ‘ప్రేమమయి’ అనే గేయం రాసింది. నవ్యకవితారీతులను అభిమానించిన కవయిత్రి ఈమె. కాల్పనికోద్యమ ప్రభావంతో కవిత్వం రాసినవారు పర్సా జానకీదేవి. ఈమె రసాంజలి, నిలింపశ్రీ, మధురశ్రీ, కవితా ఖండికలను రాసింది. ఇల్లిందుల సరస్వతీదేవి నీ బాంచన్‌ కాల్మొక్తా అని చెప్తూ ఆనాటి సామాజిక స్థితిగతులను వివరించింది.

1930లో మహబూబ్‌నగర్‌లో పుట్టిన పాకాల యశోదారెడ్డి భావికఉగాదికి ఉయ్యాల పేరుతో వచన కవిత్వం రాసింది. భావికలో రాసిన ‘స్త్రీ’ కవితలో యశోదారెడ్డి అభిప్రాయం ఇలా ఉంది.

ఆ సౌందర్యంలో

ఎంత ఆవేదన – ఎంత ప్రశాంతి

ఎంత విశ్వాసం – ఎన్ని ఘాతుకాలు

ఎంత బడబానలం – ఎన్నెన్ని? అగ్ని పర్వతాలు!

ఎంత అమృతం – ఎంతెంత మధురిమ

ఎంత దైన్యం – ఎంత ఆవేదన – ఎంత కన్నీరు!

కుములుతున్న ఆ నిప్పు

ఎప్పుడు రాజుకుంటుందో?

అభినవ మొల్లగా బిరుదు పొందిన చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ భద్రాచలం వాసి (1939). ఈమె రాసిన రామదాసు పద్య కావ్యానికి కరుణశ్రీ, ఉత్పల సత్యనారాయణాచార్య, మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి తదితరులు ముందుమాట రాశారు. ఆరు ప్రకరణలలో 250 పద్యాలతో ఉన్న కావ్యమిది. కవయిత్రి రామదాసు జీవితాన్ని ఈ కావ్యంలో ప్రతిఫలింప జేసింది. మాతృభూమి చారిత్రక చంపూకావ్యం, కావ్యగౌతమి, తులసీ దళాలు, భక్తి గీతావళి, దివ్య గీతాంజలి కావ్యాల్ని రాసింది. తెలుగు తల్లికి వెలుగు పారాణికవితలో కవులందరినీ ప్రస్తుతించింది.

ఆదికవీంద్రుని యక్షర రమ్యతా

నారికేళరుచులు నవరసాలు

నన్నెచోడుని తెలివెన్నెల పదముల

జాను తెనుగు నెఱజాణతనము

పండితారాధ్యుని వలపల గిలకల

ప్రాసతమాషాల రాసలీల

పాల్కుర్కి కవిదేవి పల్కు కుల్కుల వీర

శైవ వాఙ్మయపాత్ర శతక మధువు

గోనబుద్ధుని ద్విపదల తేనెవాక

సోమనార్యుని రచనల సోయగాలు

చెలువమంతయుగల బోసి చెదరిపోని

వెలుగు పారాణి దిద్దెద తెలుగు తల్లి

పాలమూరు జిల్లాకు చెందిన జొన్నవాడ రాఘవమ్మ (1928) ఆకాశవాణిలో దాదాపు 600 పాటలు రాసి పాడింది. రాధికా గీతాలు, భావ తరంగాలు సంపుటాలు వెలువరించింది. ఈమె గేయాల్లో దేశభక్తితో పాటు తెలంగాణ ఉద్యమ కవిత్వం కూడ ఉంది. సినారె ఈమె గేయాలను ఉద్దేశించి ఇలా అన్నాడు. వేణు మాధవుని తలచుకొని, పులకించి, రవళించిన హృదయం జొన్నవాడ రాఘవమ్మది’’.

కరీంనగర్‌ జిల్లాలో బుట్టారెడ్డిగూడెంలో పుట్టి, నిజామాబాదులో నివసించిన త్రిభువనాదేవి ప్రకృతిపై, దేశభక్తిపై, ఆధ్యాత్మికపరమైన పాటలు ఆశువుగా పాడింది. ఈ కవయిత్రికి 8/12/60 నాడు నల్గొండలో జరిగిన సాహితీ సమావేశంలో స్వర్ణహస్తఘంటాకంకణం తొడిగి, ఉభయ భాషా ప్రవీణ బిరుదునిచ్చారు.

పోరాట పటిమను ప్రజల్లో నింపడానికి మల్లు స్వరాజ్యం పోరాట పాటలు రాసింది. వీరమట్టారెడ్డి ఉయ్యాలో / వీరమరణమును ఉయ్యాలో / నీవంటి వీరులు ఉయ్యాలో / మాకు వెల్గు జూప ఉయ్యాలో… అంటూ పోరాటంలో వీర యోధులను గురించిన చరిత్రను ప్రజలకు తెలియపరచింది. అలాగే తెన్నేటి సుధాదేవి ఉదయకాంత, అమ్మ కవితా సంపుటులను వెలువరించింది.

ఆదిలాబాదు నుండి 1978లో వెలువడిన శైవలిని కవిత్వ సంకలనంలో కుమారి పద్మజా సాయర్‌వార్‌ నిరీక్షణ కవిత రాసింది. ఆరేండ్ల పసిపిల్లవాడి కోసం నిరీక్షణ దీని సారాంశం. మత్తడి కవితా సంకలనంలో సుధ రాసిన ఎందుకు వ్రాస్తావు కవిత్వం”, సంధ్య ఛీ’’, కర్రి విజయకుమారి గవిని దాటిరా”, ఆఫ్రీన్‌ చమన్‌”, సబ్బని శారద గోస ఏం జెప్పుదు”, అనిశెట్టి రజిత అవ్వ ఆగమయ్యింది”, షాజహానా ఎత”, సూర్యాధనంజయ బంజారా బతుకు”, జాజుల గౌరి వేల వడగండ్ల వాన నా తెలంగాణ”, అనే కవితలు మహిళలు రాసినవి ఉన్నాయి. వీరంతా నేడు సీరియస్‌గా కవిత్వం రాస్తున్న తెలంగాణ మహిళలు.

కుళ్ళు వ్యవస్థకవిత ద్వారా సమాజంలోని భేదభావాలు పోవాలని కోరుకున్నది మోత్కుపల్లి దమయంతీదేవి. జ్యోతిర్మయి ఓ అమ్మ కథ చిత్రానికి చందమామ పాట రాసింది. కవయిత్రికి భావన, దీప్తి, దివ్వెలు, నవత కవితా సంపుటాలను ప్రచురించింది. రేపటి చైతన్యంకవితలో అడుగు ముందుకు వేసిన అక్రమాన్నీ / చిత్రంగా నుసిచేసే అగరువత్తిని నేను / విచిత్రంగా మసి చేసే వగరు చిగురును నేను / రేపటి చైతన్యం కోసం / తపిస్తున్న ఉన్నాదిని నేను / మానవతావాదిని నేను. జూపాక సుభద్ర కవిత్వంలో సమాజాన్ని శుద్ధి చేయాలనే తపనతో పాటు కొంత వ్యంగ్యం చోటు చేసుకుంటుంది. దళిత కవిత్వం రాస్తున్న నేటి మహిళా కవయిత్రుల్లో ముఖ్యమైనవారు. గద్ద సరోజనీదేవి, జాజుల గౌరి, కందాల లిల్లి, గోగు శ్యామల, మేరి మాదిగ, వి. నాగమణి, స్వాతి మార్గరేట్‌, మేరీ మార్గరేట్‌ నేడు దళిత కవిత్వం రాస్తున్న మహిళలు. చిత్తరువు దళిత కవితా సంకలనంలోనూ మహిళలు కవిత్వం రాసారు.

నేటి కవిత్వంలో పద్య కవిత్వం, అందులో ప్రధానంగా శతక పద్యాలు, వచన కవిత్వం దానిలో విభాగాలుగానున్న నానీలు, హైకూలు, రెక్కలు – లఘు కవిత్వంలో మహిళలు రాసిన కవితా సంపుటులు, కవితా సంకలనాలున్నాయి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా వెలువడిన మత్తడి, పొక్కిలి, ఊపిరి, మిర్గం, జిగర్‌, జిల్లాల వారీగా వచ్చిన సంకలనాల్లో మహిళల కవిత్వం సమప్రాధాన్యతను నోచుకున్నది. ఉద్యమ కవిత్వంలో గాయాలే గేయాలైఅమృతలత సంపాదకత్వంలో వెలువడింది. దీనిలో పూర్తిగా మహిళలే వారి వారి ఉద్యమ పోరును వినిపించారు.

నేడు కవిత్వాన్ని రాస్తున్న కవయిత్రుల్లో అనిశెట్టి రజిత ఒకరు. నిర్భయాకాశం కింద”, నేనొక నల్లమబ్బునవుతా, చెమట చెట్టు, ఉసురు, అనగనగా కాలం, దస్తఖత్‌, గోరంత దీపాలు, నహ్హే ఓ నహ్హే, దీర్ఘ కవితలు – ఓ లచ్చవ్వ, మార్కెట్‌ స్మార్ట్‌ శ్రీమతి వీరి కవితా సంపుటాలు. గులాబీలు జ్వలిస్తున్నాయికవితలో సహించుటయే తెలిసిన ఆ సొగసుందనాలు / నేడు దహించుకపోతూ / జ్వలిస్తున్నాయి జ్వలిస్తున్నాయి / గులాబీలు విప్లవిస్తున్నాయి. ఉత్సాహ జ్వాలలు ఈమె కవిత్వంలో ముమ్మరంగా కనిపిస్తాయి.

గరిశకుర్తి శ్యామల రాసిన కోవెల దీపాలు, చాడ లలితాదేవి భవానీ శతకం, అమ్మకు అక్షరార్చన, ఏ సిరాతో రాయాలి?, బండ సరోజన రాసిన సప్తస్వరాలు, ఒక పూవు పూసింది, ఎర్రమందారం, గద్ద సరోజనీదేవి దేశభక్తి గేయాలు, జ్వలిత రాసిన అగ్నిలిపి, వెంకన్న గారి జ్యోతి రాసిన నా పల్లెటూరు శతకం, నెల్లుట్ల రమాదేవి మనసు భాష, గడ్డం శ్యామల రాసిన వాసంత సమీరాలు, దాసోజు పద్మావతి రాసిన అక్షరార్చన, (గజల్‌ గీతాల సంపుటి) అమ్మకు ప్రేమతో, కె. జ్యోత్స్నప్రభ రాసిన కలల పరిమళం, ఎన్‌. అరుణ రాసిన పాట చెట్టు, పరవస్తు కమల రాసిన నా జన్మభూమి భారతి, పర్యాద సరళ రాసిన పాడుతా తీయగా (ఖండ కావ్యం), శ్రీలక్ష్మీనృసింహ శతకం, తదితర కవయిత్రులు వారి వారి కవిత్వాన్ని రాస్తూ భావి కవయిత్రులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పర్యాద సరళ పాడుతా తీయగాఖండ కావ్యంలో అంతా నాదమయంకవితలోని ప్రకృతి పరవశింపజేసింది.

సీ॥ ఆకాశవీధిలో ఆనందముగ సాగి

అందమ్ముగా హంసలాడినటుల

మేఘమాలికలపై మెరిసేటి కిరణాలు

మెరుపు తీగల ముగ్గు పరచి నటుల

జలతారు వలువల జలదాంగనలు గూడి

జలమాలికల దీర్చి సాగినటుల

మబ్బు తెరల మాటు మసలెడి జాబిల్లి

ఆనంద జలకమ్ము లాడినటుల

తే॥గీ అంతరసగంగ ప్రవహించి అవనియందు

వంపు సొంపులతో జాలు వారినటుల

మధుర సంగీత, సాహిత్య సుధలు జిలికి

పాడుతా తీయగా సాగె పరవశించి

ఎన్‌. అరుణ రాసిన పాటల చెట్టులో లో చూపుకవితలోని భావం నిజానికి / ఓ సూర్యోదయ ఏకాంత నిశ్శబ్దంలో / కళ్ళు మూసుకొని చూడు / తెరచి చూస్తే / నువ్వెంత మిగిలావో తెలుస్తుంది”.

బాల సరస్వతి, జలజ, శారదా హన్మాండ్లు, అడువాల సుజాత, త్రివేణి, యమ్‌. రత్నమాల, ఇస్రత్‌ సుల్తానా, కొండపల్లి నీహారిణి, సూర్యా ధనంజయ, షహనాజ్‌ ఫాతిమా, విజయలక్ష్మి, యం. అంజనాదేవి, మడుపు రత్నాదేవి, కొమర్రాజు రామలక్ష్మి, నాంపల్లి సుజాత, బండారు విజయ, తదితర కవయిత్రులు కవిత్వం రాస్తున్న నేటి సమాజ నిర్దేశకులు.

తెలంగాణ వచ్చిన తరువాత మట్టి ముద్ర, కొత్తసాలు వంటి కవితా సంకలనాలు వచ్చాయి. కొత్తసాలులో జూపాక సుభద్ర రాసిన నా జగాలు మారే వుగాదులెన్నడో… కవితలో సూర్య సెంద్రుల్ని, సుక్కల్ని దిక్కుల్ని / కలేసి తొక్కు నూరినా ఆకలారని శోకము నాది / అక్షరాలు దరిజేరని లోకము నాది / గీ పీడకు పాడెగట్టే పొద్దెప్పుడో / నా పుండు మానే పండుగేనాడో / నా జగాలు మారే వుగాదులెన్నడోఅంటూ ప్రపంచం మారే రోజు త్వరలోనే రావాలనే ఆశాభావం వ్యక్తం చేసింది కవయిత్రి. కలల కలకల కవితలో జ్వలిత అన్ని కుల వృత్తులను ప్రస్తావించినా చివరకు సర్వేజన సుఖినో భవంతు” – శుభం భూయాత్‌అనే ముగింపు పలుకుతుంది. మనకు ఇక్కడ అర్థమయ్యేది ఒక్కటే. జనం మారాలి. ఈ మార్పు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి.

ఒక్కొక్క దశకాన్ని చూసినపుడు కవిత్వ వస్తువులో మార్పులు సమాజానుగుణంగా మారినాయి. నేడు వచన కవిత్వానికి ప్రాధాన్యత పెరుగుతున్నా, శతకాలు రాసే మహిళలూ ఉన్నారు. వీరి కవిత్వంలో సమకాలీన ఉత్సాహ, ఉద్వేగాలే కవితా వస్తువుగా నిలుస్తున్నాయి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.