వెనుతిరగని వెన్నెల(భాగం-25)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-25)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లయిన సంవత్సరం లోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది.

***

ఇలా గెడ్డం పెంచుకుని తిరుగుతూంటే ఏమనుకోవాలి?” అంది తన్మయి పక్కనే నడుస్తున్న కరుణతో చిన్నగా నవ్వుతూ.

 “మయీ!  మీతో ఎన్నో మాట్లాడాలి. ఎంతో చెప్పాలి. అసలు..అసలు ఎక్కడికి వెళ్లిపోయారు మీరు ఇన్నినాళ్లు?!” అన్నాడు ముక్కుపుటాలు ఎగరేస్తూ నిష్టూరంగా.

తన్మయికి చప్పున నోటి చివరి వరకూశేఖర్ ….” అని వచ్చింది కానీ తమాయించుకుంది. తన బతుకేవితో తనకే తెలీని పరిస్థితి. ఇంక అతనికి ఏవని చెప్తుంది?

మీరేం ఆలోచిస్తున్నారో తెలుసు నాకు. నేనెక్కడికెళ్తే ఇతనికేవిటనేగా. అసలే మా అమ్మకి ఒంట్లో బావుండడం లేదు.  అది చాలక సెలవుల్లో నా పార్ట్ టైం ఉద్యోగమూ ఊడింది. ఇక రిజల్టు సరేసరి నాలుగవ ర్యాంకు. అసలు నాలుగవ ర్యాంకు వచ్చినందుకు కాదు, నా బాధ. మొదటి మూడు ర్యాంకుల్లో వస్తేనే మెరిట్ స్కాలర్ షిప్పు వస్తుంది. ఆశ కూడా పోయింది. మీరు కూడా సెలవులకి వెళ్ళిపోయి ఎంతకీ తిరిగి రాలేదు. ఇక నేను ఇలా కాకుండా ఎలా ఉంటాను చెప్పండి?” అన్నాడు కరుణ కళ్లలో నీటి పొర మెదులుతూండగా.

అయ్యో! మీ మనసు నొప్పించాలని కాదు రుణా! నా సమస్యలు నాకు ఉన్నాయి. అని గేటు తీస్తూ, “రండి, కొంచెం టీ తాగి వెళ్దురుగాని.” అంది తన్మయి.

నిశ్శబ్దంగా అనుసరించాడు కరుణ ఓపిక లేనట్లు.

కాస్త ముఖం కడుక్కుంటారా?” అంది అతని వాడిపోయిన ముఖాన్ని చూస్తూ.

మొదటి సారి ఇంటి లోపలికి అడుగు పెట్టేడు కరుణ.

పుస్తకాల గూడులో అందంగా సర్ది ఉన్న పుస్తకాలదగ్గిర ఒక్క క్షణం ఆగిఅమృతం కురిసిన రాత్రిపుస్తకాన్ని చేతులోకి తీసుకుని, పేజీలు తిప్పకుండానే అంత నీరసంలోనూ ధారాళంగా

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ 
జాజిపువ్వుల అత్తరు దీపాలూ 
మంత్ర లోకపు మణి స్తంభాలూ 
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు

అగాధ బాధా పాథః పతంగాలూ 
ధర్మవీరుల కృత రక్తనాళాలూ 
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి 
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు 
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు

…..కలల పట్టుకుచ్చులూగుతున్న కిరీటం ధరించిన తిలక్ మీకూ ఇష్ఠమన్న మాటఅన్నాడు.

తన్మయి విస్మయంగా చూసింది అతని వైపు. “ఇతనికి రానిదేదయినా ఉందా!!”

పక్కనే ఉన్న మిగతా పుస్తకాల్ని చూస్తూ,  “మా కరుణశ్రీ గారేరీ?” అంటూ  ఆయన పద్యాలు రెండు గొంతెత్తి పాడుతూ ముఖం తుడుచుకుంటున్న అతన్ని ఆసక్తిగా చూస్తూ టీ పెట్టి తీసుకు వచ్చింది తన్మయి.

వరండాలో చాప మీద పరిచి ఉన్న క్లాసు పుస్తకాల పేజీలు తిప్పుతూమయీ! ఒక్కటడుగుతాను చెప్తారా?!” అన్నాడు

చదవాలని మీకు ఇంత పట్టుదల ఎందుకు? చంటి పిల్లాడితో ఇంత కష్టపడి……” అంటూన్న అతని మాటల్ని దాట వేస్తూ 

 “మీ అమ్మగారికి ఏమైంది? మీరిప్పుడు తిన్నగా ఇంటికే వెళ్తున్నారుగా, నేనూ వొస్తాను పదండి మీ అమ్మగారిని చూడడానికిఅంది లేస్తూ.

తాళం వేసి బయటకు వస్తుండగా ఇంటిగలాయన లోపలికి వస్తూ ,”శేఖర్ ని నాతో ఒకసారి మాట్లాడమని చెప్తారా?” అన్నాడు పక్కనే ఉన్న కరుణ వైపు పరీక్షగా చూస్తూ.

తన్మయి తల ఊపి, గేటు దాటి వస్తూనే భుజం చుట్టూ కొంగు కప్పుకుంది.

మా ఇల్లు మీలాంటి వారు చూడదగ్గ ఇంద్రభవనమేమీ కాదు.” అన్నాడు కరుణ సంశయిస్తూ.

మీ ఇంటిని కాదు, మీ అమ్మగారిని చూడడానికి వస్తున్నాను.” అంది వొత్తి పలుకుతూ.

ఇంటి నుంచి రెండు మూడు మలుపులు తిరిగి రోడ్డు  చివరి వరకూ నడిచి బస్టాండుకి చేరుకునే లోగా తమని దాటుకుంటూ వెళ్తున్న  స్కూటరు మీద శేఖర్ పిన్ని, బాబాయిల్ని గమనించింది తన్మయి.

తనని చూసి కూడా ఆవిడ ఎందుకు ఆగి పలకరించలేదో అర్థం కాలేదు తన్మయికి.  బహుశా: చూడలేదేమో, అని సర్ది పుచ్చుకుంది.

రెండు బస్సులు మారి దాదాపు గంటన్నర తర్వాత దిగి నడక మొదలు పెట్టేరు.

ఇంత దూరమా మీ ఇల్లు?!”  అంది ఆశ్చర్యంగా తన్మయి

అప్పుడే వచ్చేసేమనుకుంటున్నారా?” అన్నాడు ఎదురుగా కొండ వైపు నడుస్తూ.

పైకి వెడల్పు మెట్లు, అటు ఇటూ చిన్ని చిన్ని ఇళ్లు ఉన్న చిన్న కొండ అది. ఆయాసం వస్తున్నా ఆగకుండా ఎక్కసాగింది తన్మయి. కరుణ అలవాటుగా చకచకా మెట్లు  ఎక్కసాగేడు.

వెనకే ఒక మెట్టు కింద ఎక్కుతున్న తన్మయి వైపు చూస్తూమీ చీర కాళ్లలో పడ్తూంది జాగ్రత్తఅన్నాడు.

దాదాపు పై వరకూ ఎక్కేక, మెట్ల పక్కనే ఉన్న చిన్న రహదారి బాట పట్టేరు. కొండకి దాదాపు మరో పక్కకి ఉంది ఇల్లు. అది ఇల్లు కాదుచిన్న  గుడిసె

మాలాంటి పేదలకి గవర్నమెంటు ఇచ్చిన స్థలం ఇది.  మా అమ్మ, నేను ఇక్కడే మా తాతగారితో బాటూ ఉంటాం.”  అన్నాడు కరుణ పరిశీలనగా చూస్తున్న తన్మయితో.

చిన్న తడికె తలుపు, లోపలికి అడుగు పెట్టగానే ఒకే ఒక్క గది ఉన్న చుట్టు గుడిసె అది.  

ఇంత వరకూ తన జీవితంలో ఇంత పేదరికపు ఇంటిని  చూడలేదు తన్మయి. ఏవో రేకు పెట్టెలు, కాసిన్ని వంట సామగ్రి. చూరుకు వేళ్ళాడుతున్న పాత కిరసనాయిలు దీపం

తన్మయికి ఆశ్చర్యం వేసింది. ఇటువంటి ఇంట్లో నుంచి ఇంతటి పాండిత్యం ఉద్భవించిందా? కరుణ వైపు ప్రశంసా పూర్వకంగా చూసింది

ఒక వారగా నులక మంచంమీద పడుకుని ఉంది కరుణ తల్లి

తమని చూసి మెల్లగా లేవబోయింది, కరుణ చప్పున దగ్గరకు వెళ్లిపర్లేదు పడుకోమ్మా.. తన్మయిఅన్నాడు

సరైన పోషణ లేక బాగా చిక్కిపోయిన శరీరం, ఒక కాలు మాత్రం కదల్లేని స్థితిలో ఉంది. బాగా లావుగా వాచి, బోదకాలు అని స్పష్టంగా తెలుస్తూంది

నువ్వేనామ్మా తన్మయివి, మా వాడు అస్తమాటు చెప్తూ ఉంటాడుఅంది తన్మయిని పరీక్షగా చూస్తూ.

తన్మయి ఆవిడకు ఎదురుగా నేల మీద పరిచిన చింకి చాప మీద కింద కూచుంది.

నిలువుగా నామం పెట్టుకుని, మెడలో ఎప్పటివో రంగుపోయినట్లున్న కాషాయ పూసల మాలతో సన్యాసినిలా ఉంది ఆవిడ.

కరుణ వైపు చూస్తూ, “ఏం నాన్నా అన్నం తింటారా?” అంది హీనమైన స్వరంతో.

మేం పెట్టుకుంటాంలేఅన్నాడు.

పొద్దుట్నించీ ఏం తిన్నావో ఏమోఅంటూ

 “నిద్రలేచి, టీ తాగి వెళ్తాడమ్మా. రాత్రి పూట ఒక్కటే భోజనం. మా నాన్ననీ, నన్నూ కనిపెట్టుకుని చూస్తాడు, కానీ వాడి గురించి పట్టించుకోడుఅంది తన్మయితో ఆవిడ మరింత హీన స్వరంతో.

తాతయ్య ఏడి?” అన్నాడు.

ప్రసాదం కోసం కిందికి మార్కెట్టు లో గుడి వరకూ వెళ్లొస్తానని వెళ్లేడుఅని, “ఏవీ అనుకోకమ్మా, బాగా నీరసంగా ఉందిఅంది అటు తిరిగి పడుకుంటూ.

కాస్త ఏవైనా తింటారా?” అన్నాడు కరుణ. మొహమాటంగా తల అడ్డంగా ఊపింది తన్మయి.

చిన్న ఉండలాంటి అన్నం, కాసిన్ని పొట్లకాయ వేపుడు ముక్కలు, ఒక పచ్చి ఒడియం  తెచ్చుకుని కలుపుకుని తినసాగేడు కరుణ.

అతనేమైనా అనుకుంటాడని, ఒక ఒడియం అడిగి చేతులోకి తీసుకుంది. అతనింకా తింటూ ఉండగానే 
వెనక్కి వెళ్ళొస్తానుఅని తడిక తీసుకుని ఇంటి పెరట్లోకి వచ్చింది

వెళ్ళండి గానీ, మా అమ్మ మడి చీరకి తగలకండి, నన్ను కూడా ముట్టుకోనివ్వదుఅని నవ్వేడు కరుణ.

చిన్న దడి. దాని మీద ఆరవేసిన చిరుగుల చీర ముక్క. “ఇదేనా ఎవరూ ముట్టకూడని మడి చీర!” మనసులో అనిపించినా, వాళ్ళ నమ్మకాల మీద గౌరవంతో దూరంగా జరిగి దడికి మరోవైపు రెండడుగులు వేసింది. దడికి చుట్టుకుని దాదాపు ఎండిపోయిన స్థితిలో పొట్ల పాదు, పాదుకి వేళ్లాడుతూ చిన్న పిందెలు ఒకటో రెండో ఉన్నాయి పైన సన్నని గడ్డి కొండ. కొండకి అటు వైపు ఏవుందో తెలీదు. గట్టిగా వాన కురిస్తే కూడా ఉండడం కష్టమన్నట్లు ఉంది ఇల్లు.

తన్మయి లోపలికి వచ్చేసరికి కరుణ చేతులు కడుక్కునేందుకు పెరట్లోకి వెళ్లేడు.

వెనక్కి తిరిగే మరింత హీనమైన స్వరంతోఏవీ అనుకోకమ్మా, నాకు వొంట్లో బావుండదు. అడగడం మర్చిపోయేను, మీ ఇంటి పేరేంటి?” అంది. స్వరంలో తన పుట్టుపూర్వోత్తరాలు, తమ కులంతో సంబంధం తెలుసుకోవాలన్న ఆత్రం వినిపించింది తన్మయికి.

అయినా చెప్పిమేం మీ వాళ్లం కాదండిఅంది తన్మయి.

ఊరికే అడిగేనులే, మా వాడు చెప్పేడు. చంటి పిల్లాణ్ణి పెట్టుకుని కష్టపడి చదువుకుంటున్నావని.” అంది మాట మారుస్తూ.

అవునండి, బాబుతో కొంచెం కష్టమే అయినా, ఎమ్మే పీఎచ్ డీ చెయ్యాలన్నది నా ఆశయమండిఅంది దృఢంగా తన్మయి. బాబుని తల్చుకోగానే వెంటనే చూడాలని అనిపించి బెంగ మొదలయింది.

మంచిదమ్మా, చేత్తో మా వాడిని కూడా కాస్త కనిపెట్టు. రాత్రింబగళ్లు కష్టపడతాడు. కానీ ఏవిటో నా దురదృష్టం వాడిని కూడా పట్టుకుని పీడిస్తూందిఅంది మూలుగుతూ.

అప్పుడే లోపలికి వచ్చిన కరుణ, “మొదలుపెట్టేవా నీ బాధాయణం! కాస్సేపు నిద్రపోవచ్చు కదా.” అన్నాడు.

వెనక్కి తిరిగి వస్తూ బస్టాండు వరకూ వచ్చిన కరుణతో. “మనం ఎలాగైనా జే ఆర్ ఎఫ్ సాధించాలి కరుణా!” అంది పట్టుదలగా.

ఇంటికి తిరిగి వస్తున్నంత సేపు అంత కఠిన పేదరికపు పరిస్థితుల్లో  నిలదొక్కుకుని అతను చదువుని కొనసాగించడం తల్చుకుని తనూ ధైర్యం తెచ్చుకుంది.

కరుణ తల్లి అతని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది పాపం.

అయినా తల్లికి ఉండదు పిల్లలు వృద్ధిలోకి రావాలని

వస్తూనే వీధి చివర ఆగి ఇంటికి ఫోను చేసింది.

బాబు స్వరం వినేసరికి వెంటనే వెళ్లిపోవాలనిపించింది.

రెండ్రోజుల్లో రెండవ శనివారం, ఆదివారం వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం వెళ్లిపోతే మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి రావొచ్చు. అనుకుంది.

***

మర్నాడు కేంటీన్ బయట చెట్టు కింద కలిసేరందరూ.

తన్మయి గొంతు సవరించుకుని, రేపట్నించి జే ఆర్ ఎఫ్ కి ప్రిపరేషన్ మొదలుపెడదామనుకుంటున్నాను. మనందరికీ తెలిసిందే. అదెంత కష్టమో. కానీ అసాధ్యం కాదని నా ఉద్దేశ్యంఅంది.

రాజు వెంటనే అందుకుని నేనూ, అనంతా మీతో కలుస్తున్నాం. అన్నాడు.

దివాకర్ కరుణ వైపు చూస్తూ, “నేను పాపాత క్వశ్చన్ పే..పర్లు  మా నాన్న గారి సహాయంతో ..సంపాదించగలను.” అన్నాడు. ‘

కరుణ తనలో తాను అనుకుంటున్నట్టు మీ అందరికీ జే. ఆర్ ఎఫ్ ఒక లక్ష్యం మాత్రమే. నాకు  జీవన్మరణ సమస్య. చావో, రేవో తేల్చుకోవాల్సిందేఅన్నాడు ఆవేశంగా.

మరింకేం!”, అంటూ తెల్ల కాగితం తీసింది తన్మయి. ప్లాను అందులో గీస్తూ,  “మనకి ఫైనల్ పరీక్షల తర్వాత సరిగ్గా ఆరునెలల్లో జే ఆర్ ఎఫ్ ఉంటుంది. ముందుగా  అసలు పరీక్షలో విభాలున్నాయో పట్టిక తయారు చేద్దాం. తర్వాత ప్రతీ విభాగానికీ చదవాల్సిన పుస్తకాల, సేకరించాల్సిన వివరాల పట్టిక, అన్నీ పోగుచేసేక నోట్సు తయారు చేయడంఇవన్నీ చాలా పెద్ద పనులు కాబట్టి, విభాగాలుగా పంచుకుంటే త్వరగా చెయ్యగలుగుతాం.” అంది తన్మయి

కరుణ అడ్డు వస్తూ , “కానీ ఇక్కడొక విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. మనం అందరం అన్నీ చదవాల్సిందే. మనకు పరీక్ష లో బిట్టు పేపరుతో బాటూ వ్యాసరూప పరీక్ష కూడా ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. అందులో పట్టు సాధించాలంటే తప్పనిసరిగా సబ్జెక్టు మీద మంచి అవగాహన ఉండి తీరాలి. మీ అందరకూ సంస్కృతం, ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర, వ్యాకరణం నేను చెప్తాను.”  అన్నాడు కరుణ.

అనంత, రాజుమేం ఆధునిక సాహిత్యం, ఆప్షనల్ సబ్జెక్ట్   నోట్సులు తయారు చేస్తాంఅన్నారు.

ఇంగ్లీషు, లెక్కలు, భాషాశాస్త్రం నాకు వదిలెయ్యండి.” అని దివాకర్ వైపు చూసింది తన్మయి.

మీ..మీరందరిలా  నోట్సులు ..తయారు చెయ్యడం నా వల్ల కాదు, బైటి నించి పుస్తకాలు, మె..మెటీరియల్సూ సేకరణ మా..త్రమే న్నాపనిఅన్నాడు నవ్వుతూ దివాకర్.

అనుకున్న ప్రతీ పనికీ పక్కనే కాల నిర్ణయ పట్టికను, ఎవరు ఏం చేస్తారో పేర్లనూ రాసింది తన్మయి.

ఒక్కొక్కటిగా పైకి చదువుతూ……ప్రతి నెలా తయారు చేసిన నోట్సులు అందరి దగ్గిరా తలా ఒక కాపీ ఉండడానికి గాను జెరాక్సులు తీసుకుందాం. కుదరకపోతే నోట్సుల్ని ఎక్సేంజీ చేసుకుందాంఇందులో చివరి మూడు నెలలూ పునశ్చరణ కి కేటాయిద్దాం. చివరి నాలుగు  వారాల్లో పరీక్షకు ఎంత సమయంలో ప్రశ్న దగ్గిర ఆగాలో వ్రాత సాధన చేద్దాంఅంది ఉత్సాహంగా తన్మయి.

ప్రతీ పనీ సమయానికి పూర్తి చేస్తు న్నామో, లేదో  అన్న విషయం ప్రతీ వారం ఇక్కడ ఒక గంట కలుసుకుని చర్చిస్తే బావుంటుంది.” అన్నాడు కరుణ.

చెట్ల కొమ్మల చాటు నించి చుర్రున తగులుతున్న ఎండ వైపు చూస్తూఇక్కడా?” అన్నాడు దివాకర్.

ఇక్కడ కాకపోతే సముద్ర తీరానఅంది అనంత నవ్వుతూ.

 “మనకి చోటు అంత ముఖ్యం కాదు. కలవడం ముఖ్యంవీలైతే ప్రతీ రోజూ కలుద్దాం.” అన్నాడు సీరియస్ గా రాజు.

రోజూ ఒక చోట అనుకుందాం. క్లాసుల తర్వాత తిన్నగా అక్కడ కలుద్దాం. ఒకటి లైబ్రరీ, రెండు డిపార్టుమెంట్  బయటి బెంచీ, క్యాంటీను బయటి చెట్టు….అని అనంత లెక్కబెడ్తుండగా” “మా ఇంటి వరండా కూడా చేర్చుఅంది తన్మయి.

ఫర్వాలేదా?”అన్నట్లు చూస్తున్న అనంత వైపు అభయమిస్తున్నట్లు చూసింది తన్మయి.

అంతా లేచి హుషారుగా ముందుకు కదిలేరు.

నోట్సుల మీద పేర్ల పక్కనే “JRF” అని రాసుకోవాలి అంది తన్మయి నవ్వుతూ .

..ఎందుకు? అది కూడా పరీక్ష లో భాగమా ఏంటి?” అన్నాడు దివాకర్ అమాయకంగా.

అంతా గట్టిగా నవ్వేరు.

తన్మయి బస్సెక్కడానికి ఉద్యుక్తమవుతూండగా అనంత వెనకే వచ్చి, తనూ అదే బస్సెక్కింది.

ప్రశ్నార్థకంగా చూస్తున్న తన్మయి తోమీ ఇంటికి రెండు స్టాపుల అవతల రాజు చిన్న బాబాయి గారింట్లో పనుందిఅంది అనంత.

శేఖర్ లేడు, టీ తాగి వెళ్దువు రాఅంది తన్మయి.

ఇంటి ముంగిట్లో విరబూసిన సన్నజాజి పూల తీగె వైపు నడిచి, ఆత్రంగా మొగ్గల్ని కర్చీఫ్ లోకి కోస్తూ, “అబ్బ, ఇంటి చుట్టూ పూలమొక్కలుంటే అందమే వేరు కదూఅంది అనంత.

పూలంటే పిచ్చి అనంతకిచెట్లకి పూలు కనిపిస్తే చాలు, జడలో తురుముకునే వరకూ చేతులాగవు. రోజూ నందివర్థనమో, గన్నేరు పువ్వో.. ఏవి  కనబడ్డా తలలో తురుముకుని కనిపిస్తుంది.

మాల కట్టడానికి దారం తెచ్చి ఇచ్చి, టీ పట్టుకు వచ్చింది తన్మయి.

అనంత తటపటాయిస్తూ, “ఎప్పుడు వస్తాడు మీ ఆయనఅంది.

నెల్లూరు సంగతి విని ఎగిరి గంతేసింది.

మంచి వార్త చెప్పేవు తన్మయీ! మీ ఆయన ఇక్కడకు రాకపోతే, నాకు నీతో బాటూ ఇక్కడే ఉండిపోవాలని ఉంది. అసలు రోజూ మీ ఇంట్లోనే కలుద్దాం కాలేజీ అయిపోయేకఅంది అనంత.

నాకు అభ్యంతరం ఏవీ లేదుఅంది నవ్వుతూ తన్మయి.

ఇల్లు తాళం పెట్టి , “అలా బస్టాండు వరకూ వస్తా పద.” అంది తన్మయి.

పెళ్లి కాక ముందు బండి మీద హాయిగా తిరిగాను. ఇప్పుడు బస్సుల్లో తిరగాల్సి వస్తూ ఉంది”  అని నిట్టూర్చిపెళ్ళయ్యాక నాన్న గారి మీద ఆధారపడడం ఇష్టం లేదు తన్మయీ, అలాగని బండికి రోజూ ఆయిలు పోయించే స్థోమత లేదు, అందుకని బండిని చెల్లెలికి ఇచ్చేసేను. ఎమ్మే కాగానే మా ఇద్దర్లో ఎవరికైనా ఉద్యోగం తప్పనిసరి అవసరం. నెరవేరుతుందో లేదోఅంది బాధగా.

తప్పకుండా నెరవేరుతుంది అధైర్యపడకుఅంది తన్మయి అనంత చెయ్యి అందుకుంటూ.

నీ దగ్గిర నాకు నచ్చేదదే. నీకు ఎన్నో సమస్యలున్నా బెంబేలు పడకుండా నిలబడి, ఎదుటి వాళ్ళకి కూడా ధైర్యం చక్కగా చెప్పగలుగుతావు.” అంది అనంత.

అనంతని బస్సెక్కించి ఇంటికి వచ్చేసరికి ఇంటిగలాయన గుమ్మం దగ్గిరమీటర్ రీడింగ్అంటూ ఎదురయ్యేడు.

ఎప్పటిలానే వాకిట్లో నిల్చున్న తన్మయినినాతో వచ్చి కాస్త    బాటరీ లైటు చూపిస్తారా?” అన్నాడు.

కుర్చీ ఎక్కి అతను రీడింగు తీసుకుని దిగి వచ్చి, బాటరీ లైటు తిరిగి తీసుకుంటూ పనిగట్టుకుని చేతిని గట్టిగా నొక్కేడు.

పురుగు పాకినట్లయ్యి తన్మయి చప్పున దూరం జరిగిఛీఅంది

ఏంనీస్నేహితులసాటి రానా?” అన్నాడు వెకిలిగా స్నేహితులన్న పదాన్ని వొత్తి పలుకుతూ

ఒక్క ఉదుటున బయట వరండా లోకి  వచ్చిమర్యాదగా బయటికి నడవండి. లేకపోతే మీ ఆవిణ్ణి పిలుస్తాను.” అంది.

అతను అసలదేమీ తప్పుకానట్లు  మారు మాట్లాడకుండా నడుచుకుని వెళ్లిపోయేడు.

తన్మయికి ఒక్కసారిగా విపరీతమైన భయంతో కాళ్లలో  నుంచి ఒణుకు పట్టుకుంది చాలా సేపు

తలలో నుంచి ధారాపాతంగా చమట్లు కారసాగేయి

ఇంటిగలావిడ ఊరెళ్ళిందన్న సంగతి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆవిడ రాగానే వాళ్ళాయన నిర్వాకం చెప్పాలి.

శేఖర్ కి కూడా ఫోను చేసి అసలు తను ఇక్కడ ఉన్న విషయం మొదట చెప్పాలి. ఇక ఇంట్లో ఉండడం అసంభవం

కానీ శేఖర్ గురించి ఆలోచించేసరికి తలనొప్పి కూడా మొదలయింది. ఒకదానిమీదొకటిగా సమస్యలు వచ్చి పడ్తున్నాయి

మర్నాడు శుక్రవారం ఒక్క రాత్రి గడిస్తే రేపు సాయంత్రం ఊరు వెళ్లిపోవచ్చు

తిరిగి సోమవారం వచ్చేక అనంతని తనతో వచ్చి ఉండమని సాయం అడగాలి

కళ్ళు గట్టిగా మూసుకుని “అజ్ఞాత మిత్రమా!  రాత్రికి నన్ను రక్షించు.” అని పదే పదే తనలో తను అనుకోసాగింది

రాత్రి పడుకునే ముందు  తలుపు గడియకి అడ్డుగా అట్లకాడ పెట్టి, కుర్చీని తలుపుకి అడ్డంగా పెట్టింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.