
చిత్రం-25
-గణేశ్వరరావు
స్మార్ట్ ఫోన్ ల ధర్మమా అని ఇప్పుడు ఐదేళ్ళ పిల్ల కూడా సెల్ఫీ లు తీసేస్తోంది. వీళ్ళ సంగతి అలా ఉంచితే, ఫోటోగ్రఫీ వృత్తి లో రాణించే వారిలో అసామాన్యులు అక్కడక్కడా కనిపిస్తున్నారు. అందమైన వాళ్ళు ఎంత మంది లేరు? అయితే వీరిలో మోడలింగ్ రంగంలో పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు? సూపర్ మోడల్స్ ని ఒక ప్రత్యేక కోణం నుంచి చూపించే వారే ఫోటోగ్రఫీ లో విజయం సాధిస్తారు. ఇప్పుడు నేను పోస్ట్ చేసిన ఫొటోనే తీసుకోండి. దీన్ని ఎలా రూపొందించారో చెప్పడం సులువా?ఈ ఫోటో ఇటలీ కి చెందిన అలేస్స్సియో అల్బి సృజనాత్మక శక్తికి నిదర్శనం.. మొదట్లో అతను ఫోటోగ్రాఫర్ అవుదామని అనుకోలేదు. మెడికల్ బయాలజీ చదివాడు. అయితే చిన్నతనం నుంచే బొమ్మలు గీయడం పట్ల మక్కువ ఉండేది. పెయింటింగ్స్ ని ఇష్టపడేవాడు. అది పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ వైపు అతన్ని తీసుకెళ్ళింది. ప్రతీ చిన్న అంశాన్ని అతను కెమెరా కన్నుతో పరిశీలించి దాన్ని బంధిస్తాడు. ఫాషన్ ఫొటోగ్రఫీలో అతని విజయానికి కారణం అతని సహనశక్తి, ప్రయోగీకరణం. మోడల్స్ ను అతను వెతుక్కోడు. వాళ్ళే అతని వెనక పడుతూ ఉంటారు. ప్రకటనా రంగంలో అల్బి తనకు తానే పోటీ. అతను రూపొందించిన లెక్క లేనన్ని ఫోటోలు యూరోపియన్ మాగజైన్స్ ముఖ చిత్రాలుగా దర్శనమిస్తూ ఉంటాయి. అందులో కొన్ని అద్భుతమైన కథలు కూడా చెబుతాయి. అల్బి ఇచ్చిన ఇంటర్వ్యూ లు చాలా చదివాను కాని, అతను తన ఫోటోలను తీసే ప్రక్రియ గురించి అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చిన దాఖలా లేదు. డిజిటల్ ఫోటోగ్రఫీ ప్లస్ ఫోటో షాప్ అని రెండు ముక్కలు చెబితే సరిపోదు కదా!
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
