
చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)
-డా. సి. భవానీదేవి
మార్పు అనివార్యమైనా…
ఇంత అసహజమైనదా ?
మనకు ఇష్టం లేకుండా
మనం ప్రేమించలేనిదా ?
అయితే
ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు
ఏ పాములూ.. పచ్చని చెట్లూ..
ఇక్కడ కనిపించవు
ఎటు చూసినా మనుషులే !
అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య
జరుగుతున్నది గ్రామాలక్లోనింగ్ !
ఒంటరి భూతం కోరలకి
పట్టణాలే కాదు పల్లెలూ బలి
ఇక్కడ తలుపుల్నీ
టీవీ యాంటీనాలు మూసేసాయి
మానవ సంబంధాలు మాయం చేసి
ఇంటి భాషను మింగేసిన పరాయిమాట
అమెరికా మట్టి కోసం ఆవురావురుమంటోంది పాడుబడ్డ ఇళ్ళు
కరెన్సీ నోట్లు పరుచుకున్న పొలాలు
పావురాళ్ళను తరిమికొట్టే పాలరాళ్ళు
ఇవ్వాళ నా పల్లె… ఓ పాడుబడ్డ గుడి
అయినా నా కాళ్లు అటే లాగుతున్నాయి శిధిలాలయంలోనైనా చిన్ని దీపాన్ని
పదిలంగా వెలిగించాలని
*****

డా||సి.భవానీదేవి నివాసం హైదరాబాదు. ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందారు. కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన అన్ని ప్రక్రియలలో రచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉప కార్యదర్శి. 12 కవితా సంపుటులు, వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించారు. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి.
