
వెనుకటి వెండితెర-3
పెళ్ళిచేసి చూడు (1952)
-ఇంద్రగంటి జానకీబాల
రకరకాల భావోద్వేగాలు, ఆదర్శాలు, కళారాధన, కాల్పనిక ఊహలూ గల మంచి మంచి దర్శకులు సినిమాపట్ల ఆకర్షితులై, తెలుగు సినిమాల్లోకి వచ్చారు. సినిమా తీయాలంటే ఆలోచనలు, అభిరుచీ వుంటే చాలదు. డబ్బు బాగా పెట్టుబడి పెట్టగల ధనవంతులు కూడా వుండాలి. సినిమా అనేది ఒక లాటరీలాంటిదే గ్యారంటీగా డబ్బు తిరిగి వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. సినిమా ప్రేక్షకుడికి నచ్చాలీ, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాహాల్లోకి రావాలి. అదీ ఒకేసారి వచ్చిన చాలదు. పదే పదే చూడాలనిపించే ఆకర్షణ అందులో వుండాలి.
బి.ఎన్. రెడ్డిగారు కళాత్మకమైన దృష్టిలో ఆలోచిస్తూ, లలిత సౌందర్యమైన ప్రేమకథల వైపు మొగ్గు చూపారనిపిస్తుంది. అలాగే కె.వి. రెడ్డిగారు నాటకీయత, చమత్కారం, ఉత్కంఠ కలిగించే కథావిధానం యిష్టపడే వారనిపిస్తుంది. ఇంక ఎల్.వి. ప్రసాద్ గారు సాంఘిక దురాచారాలవైపు, సమస్యలవైపు దృష్టి పెట్టి, ఆ చెప్పడం హాస్యరసభరితంగా వుండాలని ఆశించారనిపిస్తుంది. అయితే ఈ పై లక్షణాలన్నీ ఆనాటి అందరి దర్శకుల్లో ఎంతో కొంత, సమయాన్ని బట్టి వున్నాయని చెప్పుకోవాలి. అందుకే పి. పుల్లయ్య, సి. పుల్లయ్యగారు, వేదాంతం రాఘవయ్యగారు కూడా తమ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు.
విజయా సంస్థ ఏర్పడి రెండు సినిమాలు తీసి మేధావుల మన్ననలు పొందింది. అయితే షావుకారు సినిమాకు పేరు, మెప్పు బాగా వచ్చినా డబ్బులు రాలేదని చెప్పుకున్నారు. ఆ నష్టాల్ని పూడ్చుకుని, నిలబడటానికీ (1951) పాతాళ భైరవి తీసి, కనకవర్షం కళ్ళచూశారు. ఆ తర్వాత మూడో చిత్రంగా ప్రసాద్ గారికి పెళ్ళి చేసి చూడు అప్పగించారు. ప్రసాద్ గారి సమాజంలో వున్న దురాచారాలను ఎత్తిచూపి, ప్రక్షాళన చేయాలనే ధ్యాస ఎక్కువ. అందుకే ‘వరకట్నం’ మన సమాజంలో ఎలా పాతుకుపోయిందో చూపుతూ, ఒక ఆదర్శవంతమైన మెసేజ్ ఇవ్వాలని అనుకున్నారు. ఈ పెళ్ళి చేసి చూడు కథ చక్రపాణిగారిది. అంటే విజయాసంస్థ అధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి లలో ఒకరన్నమాట. సినిమా వెనుక స్ఫురించేది గంభీరమైన సమస్యే అయినా, సినిమా సాగడం హాస్యంగా, అందంగా సాగుతుంది.
ఇందులో హీరో నందమూరి తారక రామారావుగారే (N.T.R.) ఆయన విజయావారి హీరో – వారికి ఎప్పుడూ ఆయనే హీరో, కథానాయికలు మారుతూ వుంటారు. మరీ ప్రఖ్యాతి చెందిన హీరోయిన్ కాకుండా, సామాన్యమైన అమ్మాయిని తీసుకుని పెద్ద హిట్ చేయడం వారికి అలవాటు –
ఈ పెళ్ళిచేసి చూడులో హీరోయిన్. జి. వరలక్ష్మి, చక్కని రూపం, మంచినటనా, సంభాషణలు అందంగా చెప్పగల స్పష్టత, నేర్పుగల నటి జి. వరలక్ష్మి.
అప్పటికి కథ – తెరమీద కాస్త కొత్తగా వున్నా, మరీ ప్రేక్షకులు ఊహించలేని కథేమి కాదు. ఇందులో ఎన్.టి. రామారావు – జోగారావు – ఎస్.వి. రంగారావు – శివరామకృష్ణయ్య-సావిత్రి కనిపిస్తారు. ప్రధానంగా – సావిత్రి కొత్త కొత్తగా వస్తున్న రోజులు. ఇందులో చాలా చిన్న పాత్ర.
మొత్తం కట్నం డబ్బు, ఎదురుగా పెడితేగానీ పుస్తె కట్టెడు పెళ్ళి కొడుకు అంటాడు. పెళ్ళి కొడుకు తండ్రి. ఆ వేషం డా. శివరామకృష్ణ వేశారు. మన కథానాయకుడు (ఎన్.టి.ఆర్.) కాస్త ఆదర్శాలున్నవాడే కానీ తండ్రి మాట దాటలేని అయోమయంలో పడతాడు. తండ్రి తాళికట్టవద్దని అరుస్తూ వుంటాడు. కానీ అతను పస్తె మూడుముళ్ళు వేసి, ఏమీ ఎరగనట్టు చూస్తాడు. అతను అటూ యిటూ చూస్తూ సందిగ్ధంగా చూస్తున్నప్పుడు పెళ్ళికూతురు అతని పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తుంది. మొత్తానికి పెళ్ళిఅయినట్టూ, కానట్టూ అంతా లేచి వెళ్ళిపోతారు. కట్నం డబ్బు యిచ్చి చెల్లెల్ని అత్తారింటికి పంపాల్సిన బాధ్యత అన్న జోగారావు మీద పడుతుంది. హీరో తనతో భార్యని మద్రాసు రైల్లో తీసుకుపోతాడు బావమరిది (జోగారావు) సాయంతో.
అక్కడ్నించి కథ హాస్యంతో రసవత్తరంగా మంచి మంచి పాటలతో ముందుకు సాగుతుంది. ఈ సినిమాకి ఘంటసాల వారి సంగీతం మహా పెద్ద ఆభరణంగా అమరింది.
పెళ్ళి చేసుకుని, ఇల్లు చూసుకుని
చల్లగ కాలం గడపాలోయ్ – మీ
రెల్లరు హాయిగ వుండాలోయ్- అంటూ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి క:టం దేశమంతా మారుమోగిపోయింది- అదీగాక
ఏడుకొండలవాడా! వెంకటరమణా – అంటూ పి. లీల పాడిన పాట అందరి మనసుల్నీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతీ అమ్మాయీ ఆ పాట నేర్చుకుని పాడటం ఒక అలంకరణగా సాగింది. పైగా తిరుపతి వెంకటేశ్వరుని మీద చక్కని రచన, అందమైన బాణీ- చివర్లో తండ్రిని మోసగించటానికి, ఎన్.టి.ఆర్. పిచ్చివానిగా, అతనికి సపర్యలు చేసే నర్సుగా జి. వరలక్ష్మి, అల్లరి అల్లరిగా హాస్యంగా నవ్వులు పండించారు.
జి. వరలక్ష్మి కూడా బాగా పాడగల నటి. మొదట్లో పాటల్ని ఆమె చేత పాడించినప్పటికీ, ఇంకా మెరుగుగా వుండటానికి మళ్ళీ అన్ని పాటలు పి. లీల చేత పాడించారు.
ఈ సినిమా కథ చక్రపాణి గారు కూర్చగా, పాటలు పింగళి నాగేంద్రరావు గారు కూర్చారు. ఘంటసాల వెంకటేశ్వరరావు, సంగీతం బ్రహ్మయ్యా! ఓ బ్రహ్మయ్యా అనే పాట ఊటుకూరి సత్యనారాయణ వ్రాశారు. అమ్మా-నొప్పులే కూడా ఆయనే రాశారు.
ఈ పెళ్ళి చేసి చూడు సినిమా బాగా ఘన విజయం సాధించింది. విజయావారి విజయపతాకం ఎగురవేసింది.
*****

ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం “కొమ్మా కొమ్మా కోయిలమ్మా” వంటివెన్నో వెలువరించారు. జానకీబాల గారు డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ సూరి రామచంద్రశర్మ, శ్రీమతి లక్ష్మీనరసమాంబ. వీరు తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగంలో చేరారు. సాహితీ ప్రముఖులైన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి మూడో కుమారులు ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు వీరి భర్త. వీరి కుమారులు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, కుమార్తె శ్రీమతి ఇంద్రగంటి కిరణ్మయి ప్రముఖ సినీదర్శకులు. ఉద్యోగరీత్యా విజయవాడలో పాతికేళ్లపాటు నివసించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ప్రముఖ ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి. లలితగీతమాలిక , శివాక్షరమాల కేసెట్లు విడుదల చేశారు. ఈటీవీ-2లో “పాటలపాలవెల్లి” కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సినిమా పాటలపై పదలహరి సంగీతకార్యక్రమాన్ని రేడియోస్పందనలో నిర్వహించారు. సంగీత, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేసిన జానకీబాల గారిని పలు పురస్కారాలు వరించాయి. “కనిపించే గతం” నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం, జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథారచయిత్రిగా జ్యోత్స్నాపీఠం పురస్కారం మొ.వి
