పల్లె ముఖచిత్రం

(ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

– రామా రత్నమాల

నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ

హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు

సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి

రంగవల్లులై విరిసిన ముంగిళ్ళు

పాలికాపు పొలికేకతో పొలాల వైపు పయనించే పద సవ్వడులు

రజని చెక్కిలిపై జాబిలి వెన్నెల సంతకమద్దే వేళ

కష్ట సుఖాల కలబోతలు

శ్రమ జీవన సౌందర్యాన్ని చాటే జానపద జావళీలు

మదిని దోచి అల్లుకునే ఆత్మీయతానురాగలతలు

కాల గమనంలో హిమంలా కరుగుతున్న పల్లె స్వప్నం

ప్రపంచీకరణ పంజాలో చిక్కిన పల్లె అస్తిత్వం

పట్టణ ఛాయలో మారిన పల్లె ముఖచిత్రం

ఎప్పటికీ ఆగని ఋతుగీతం

ఎన్నటికీ తీరని రైతు శోకం

పల్లెలు పూర్వ వైభవ కాంతితో వెలగాలి

హరిత హేమంతో హాలికుని దుఃఖం

దూదిపింజలా ఎగిరిపోవాలి!

****

Please follow and like us:

14 thoughts on “పల్లె ముఖచిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)”

  1. తొలకరి జల్లులకు నేలతల్లి పులకరించినట్లుగా
    మీ “పల్లె ముఖచిత్రం” చదువగానే నా మది పులకరించింది.
    నా మనసు లోతుల్లో నిగూఢంగా భద్రపరుచుకున్న నా పల్లె జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టి ఆనంద పరవశుడిని చేసాయి.
    పల్లె గొప్పతనాన్ని” అందమైన అక్షర శిల్పం” గా చెక్కిన కవితాత్మకమైన మీ రచనా ప్రతిభకు నా అభినందన వందనాలు.
    రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

    1. మీ కవితాత్మక స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు సర్.

  2. పల్లె అందాలు,ఆత్మీయతలు, జానపదాలు, రంగవల్లులు ఇంకా మరెన్నో కళ్ళకు కట్టినట్లుగా పల్లె ముఖ చిత్రంలో చూపించారు.ప్రపంచీకరణ, సుఖాలు, సంపాదన వైపు పరుగులు పెడుతూ మనం పోగొట్టుకున్నదేదో చాలా ఆవేదనతో తెలియచేసారు.మారిన పరిస్థితులు గురించి
    పునరాలించుకునేలా చేసింది పల్లె ముఖ చిత్రం.
    రత్నమాల గారు ఇలాంటి కవితలు ఇంకా రాయాలి అని కోరుకుంటున్నాము.

    1. మీ ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మీ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు సర్.

  3. పల్లెలు వర్ధిల్లు వేళ కోసం ప్రతి జీవి ఎదురు చూస్తోంది. మానవుడు పల్లెను ఆరాధన చేస్తాడు కాని పట్నం తో సహవాసం చేస్తాడు. ప్రణయ సుందరి మీద కూడా ఇంతటి అందమైన ఉపమాన ఉపమేయాలతో రాయలేమో అన్నట్టు రాశారు. చక్కని భావుకత మరియు స్పష్టత ఉన్న కవిత. అభినందనలు మేడమ్.

    1. మీ ఆత్మీయ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్.

  4. స్వేద బిందువులు చిందించు
    శ్రమ జీవుల ఆలయాలు పల్లెలు.
    పల్లెలు అంటే ఒక్క మనుష్యలకు మాత్రమే కాదు ప్రకృతికి కూడా పంచప్రాణాలు . అలాంటి పల్లె సోయగాలు వర్ణిస్తునే
    కవయిత్రి పల్లెలు పూర్వ వైభవం సాధించాలని ఆకాంక్షించారు. రత్నమాల గారు అక్షరమాల చక్కగా అల్లారు. అభినందనలు

    1. కవితాత్మకమైన మీ ఆత్మీయ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు సర్.

  5. చాలా బాగా వ్రాశారు మేడమ్

  6. పల్లె సొబగు అంతా మీ అక్షరాల్లో కనిపించింది.. ఒక పాటలాగా అద్భుతంగా వికసించింది.. చాలా బావుంది.. అలాగే పల్లె పడే కష్టాలను, పల్లె కష్టాలు తీరు తాయన్న ఆశావాదం చాలా బావుంది..కుడొస్

    1. మీ ఆత్మీయ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు సర్

  7. నమస్తే అండి పల్లెలో జీవనం గురించి చాలా చక్కగా రాసారు మీ కవితలో హేమంత అందాలు హరివిల్లుల సోయగాలు శ్రమైక జీవనం మదిని దోచే ఆత్మీయఅనురాగాలు నేడు కనుమరుగవుతున్న ఈ దృశ్యాలు. కదిలిపోతున్న కాలం కరిగిపోతున్న హిమంలామంచి పోలికతో పల్లె శోభను వివరించారు.

Leave a Reply

Your email address will not be published.