
కాళరాత్రి
అనువాదం : వెనిగళ్ళ కోమల
అతన్ని అందరూ మోషే ది బీడిల్ అనే పిలిచేవారు. అతనికి ఎప్పటికీ ఇంటి పేరంటూ లేనట్లే. హసిడిక్ ప్రార్థనా మందిరంలో అన్ని పనులూ చక్క బెట్టేవాడు. ట్రాన్‌సిల్వేనియాలో చిన్నపట్నం సిఘెట్ ` అక్కడే నా బాల్యం గడిచింది. ఆ పట్నంలో అందరికీ అతను ఇష్టుడు. అతను చాలా పేదవాడు. మా ఊరివాళ్ళు పేదవాళ్ళను ఆదుకునేవారు. కాని వాళ్ళంటే యిష్టపడేవాళ్ళు కాదు. కానీ మోషే ది బీడిల్ సంగతి వేరు. అతను ఎవరి పనులకూ అడ్డువచ్చేవాడు కాదు. ఎవరికీ ఇబ్బంది కలిగించేవాడు కాదు. అందరి దృష్టి నుండి తప్పించుకొనటమే నేర్చుకుని గడిపాడు.
చూడటానికి సర్కస్ బఫూన్ మాదిరి ఉండేవాడు. అతను సిగ్గుపడటం అందరికీ నవ్వు తెప్పించేది. కాని నాకు మాత్రం అతని పెద్దకళ్ళు, ఏదో స్వప్న జగత్తులో ఉన్నట్లు వుండే అతని చూపు అంటే చాలా యిష్టం. తక్కువ మాట్లాడేవాడు. పాడుతూ ఉండేవాడు. అతని పాటలు ప్రార్థనలాగా అనిపించేవి. బహిష్కరణకు గురైన షేఖినా బాధలు అనిపించేవి నాకు అతన్ని వింటుంటే.
అతన్ని నేను 1941లో కలిశాను. నాకప్పుడు 13 ఏళ్ళు. అతన్ని నిశితంగా పరిశీలించేవాడిని. నేను పగలు టల్‌ముడ్ చదివేవాడిని. రాత్రిపూట సినెగాగ్ (మందిరం)కు వెళ్ళేవాడిని. మందిరాన్ని కూల్చటం గురించి ఏడ్చేవాడిని.
ఒకనాడు మా నాన్నను అడిగాను. నాకు కబాలా (దేవుడు సృష్టిమర్మం గురించి లోతుగా పరిశీలన) పఠించడం నేర్పడానికి ఒక మాష్టర్ని కుదర్చమని. ‘‘నీవు ఇంకా చిన్నవాడివి. మై మోని డేస్ ప్రకారం 30 ఏళ్ళు వచ్చేదాకా మార్మికవాదం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు. ప్రపంచంలో ఎన్నో బాధలున్నాయి. నీవు ముందు నీ చదువు కానివ్వు. అప్పటికి అన్ని తెలుసుకోగలుగుతావు’’ అన్నాడు నాన్న.
మా నాన్న చాలా సంస్కారం గలవాడు. సెంటిమెంట్స్ లేనివాడు. తన కుటుంబీకుల ముందు కూడా తన ఆలోచనలను తెలియజేసేవాడు కాదు. తనవారికంటే అన్యుల శ్రేయస్సు మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. సిఘెట్‌లో ఆయన సలహా సంప్రదింపులకు ఎక్కువ విలువ ఉండేది. మేము నలుగురం పిల్లలం ` హిల్డా, బయా, నేను మూడవ వాడిని, ఏకైక పుత్రుడిని ` జిపోరా ఆఖరిది.
అమ్మా నాన్నా ఒక షాపు నడిపేవారు. అక్కలిద్దరూ వారికి సాయపడేవారు. నేను చదువుకోవాలనే చెప్పేవారు.
సిఘెట్‌లో కబాలిస్టులు లేరు అని నాన్నెప్పుడు అంటూండే వాడు.
కబాలా చదవాలనే నా జిజ్ఞాసను తుడిచెయ్యాలనే ప్రయత్నించేవాడు. కాని అది సాధ్యం కాలేదు. నేను మోషే ది బీడిల్‌ను నా గురువుగా ఎన్నుకున్నాను.
ఒక సాయంసంధ్యవేళ నేను ప్రార్థిస్తుంటే అతను నన్ను గమనించాడు.
నన్ను ఎరిగినవాడులా దగ్గరకొచ్చి ‘‘ప్రార్థన చేస్తూ ఎందుకు ఏడుస్తున్నావు?’’ అని అడిగాడు.
నాకు తెలియదు అన్నాను. నన్ను నేను ఎప్పుడూ ఆ విషయంగా ప్రశ్నించుకోలేదు. నాలో నుండి దుఃఖం పొర్లు కొచ్చేది. ఏడ్చేవాడిని ` అంతే.
‘‘అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు?’’ అని అడిగాడు.
అది వింత ప్రశ్న ` నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అనేది. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఎందుకు నాకు శ్వాస ఆడుతున్నది?
అప్పటి నుండి రోజూ అతన్ని కలిసేవాడిని. ప్రతి ప్రశ్న శక్తివంతమయింది. కాని సమాధానం అంత బలంగా ఉండదంటూ చాలా లోతు విషయాలు చెప్పేవాడు.
ప్రశ్నించటం ద్వారానే మనిషి దేవునికి దగ్గరవుతాడు. కాని మనకు అది అర్థం అవదు. అవి మనలో నిక్షిప్తం అయి ఉంటాయి మనం చనిపోయే వరకూ. అసలైన సమాధానాలు నీలోనే ఉన్నాయని తెలుసుకుంటావు అని నాకు చెప్పేవాడు.
‘‘మోషే నీవు ప్రార్థన ఎందుకు చేస్తావు?’’ అని అడిగాను అతడిని.
‘‘నాలోని దేవుడిని ప్రార్థిస్తాను. ప్రశ్నించగల శక్తి నా కివ్వ’’మని అన్నాడు.
అలా రోజూ సాయంత్రం సినెగాగ్‌లో అందరూ వెళ్ళి పోయాక కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం.
సిఘెట్‌లో కబాలిస్టు విషయాలు గాని యూదుల మార్మికవాదం గురించి గాని నాకు తెలిపేవారు లేరని ఒకనాడు వాపోయాను. మార్మికత తెలుసుకోవాలంటే వేలకొలది మార్గాలున్నాయి. ఎవరి మార్గం వారికుంటుంది. తప్పు త్రోవన ప్రవేశించరాదన్నాడు.
అలా మోషే గంటల తరబడి కబాలాల గురించి మార్మికవాదం గురించి నాతో చెపుతూ ఉండేవాడు. అలా నా శిష్యరికం మొదలయింది. ఇద్దరం జోహార్ పేజీలు పదేపదే చదువుతుండేవాళ్ళం. అది కంఠస్తం పట్టటం కాదు. అందులోని దైవత్వం గురించి ఆకళింపు చేసుకునే ప్రయత్నమే అది.
మోషేయే నాకు దైవత్వం గురించి చెప్పగలడని, ఒకనాటికి ప్రశ్నలూ సమాధానాలు ఒకటవుతాయని నేను తెలుసుకోగలనని నమ్మకం కుదిరింది.
ఒకనాడు విదేశీ యూదులనందరినీ వెలివేశారు. మోషే వారిలో ఒకడు.
హంగరీ పోలీసులు వాళ్ళందరినీ పశువుల బండ్లలోకి కుక్కారు. వాళ్ళు నిశ్శబ్దంగా రోదించారు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్ మీద నిలబడి మేమూ ఏడ్చాము. నల్లటి పొగలు కక్కుతూ రైలుబండి వారితో వెళ్ళిపోయింది.
నా వెనకెవరో ఇంకేమి జరుగుతుందనుకుంటున్నావు. ఇది యుద్ధం అన్నారు. వెళ్ళగొట్టబడిన వారి గురించి అందరూ త్వరలోనే మరచిపోయారు. వాళ్ళు గెలీసియాలో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారంటూ పుకార్లు వినిపించాయి.
జీవితం గాడిన పడిరది. షాపుల వాళ్ళు తమ వ్యాపారం బాగా కొనసాగించారు. విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడు తున్నారు. పిల్లలు ఎప్పటి మాదిరిగానే రోడ్లమీద ఆడుకుంటున్నారు.
ఒకనాడు నేను సినెగాగ్ వెళుతుంటే మోషే ఒక బల్లమీద కూర్చుని కనిపించాడు.
బహిష్కరింపబడినవారితో బయలుదేరిన బండి ప్రయాణం సంగతులు చెప్పాడు.
బండి హరారే సరిహద్దు దాటి పోలెండ్‌లోకి ప్రవేశించగానే గెస్టాపో (జర్మనీ రహస్య పోలీసులు) అధీనంలోకి తీసుకున్నారు. బండి ఆపి యూదులందరినీ దిగమన్నారు. బయట ఉన్న ట్రక్కులలోకి ఎక్కమన్నారు. ట్రక్కులు ఒక అడవి వైపుకు చేరాక అందరినీ దిగమన్నారు. వారిని పెద్ద కుంటలు త్రవ్వమన్నారు. గస్టాపోలు ఒక్కొక్కరిని వరుస బెట్టి కాల్చి చంపారు. పసివాళ్ళను గాలిలోకి ఎగురవేసి కాల్చారు. ఇది జరిగింది కలామే దగ్గరలోని గెలీసియా అడవి దగ్గర. మోషేని కాళ్ళవైపు కాల్చగా పడిపోయాడు. చనిపోయాడని వదలి వెళ్ళారు.
రాత్రింబగళ్ళు నడుస్తూ జరిగిన సంఘటన గురించి యూదుల యిళ్ళకెళ్ళి చెప్పాడు. మాల్కా అనే అమ్మాయి మృత్యువుతో పోరాడటం గురించి, టోబీ అనే టెయిలర్ తన కొడుకుల కంటే ముందు తనని చంపమని వేడుకున్నాడు అని చెప్పాడు.
మోషేలో చాలా మార్పు వచ్చింది. పాడటం మానేశాడు. అతనిలోని సంతోషం యిగిరిపోయింది. దేవుని గురించి, కబాలా గురించి ప్రస్తావించటం లేదు. తాను చూసిన దాని గురించే మాట్లాడాడు. జనం అతన్ని నమ్మలేదు, వినటం కూడా మానేశారు. కొందరు జాలిపడటం కోసం కల్పించి చెపుతున్నాడన్నారు. మరి కొందరు అతనికి మతి భ్రమించిందన్నారు.
కానీ, మోషే ఏడుస్తూ బ్రతిమలాడాడు. ‘‘నేను చెప్పేది వినండి చాలు బాబు, మీ డబ్బు, దయా నాకు వద్దు. మీరు వింటే చాలు’’ అని సినెగాగ్‌లో ప్రార్థనల మధ్య గట్టిగా అరిచేవాడు. నేనూ నమ్మలేదు. అతను చెప్పేది వింటూ ఉండేవాడిని, జాలి పడ్డాను.
‘‘నేను పిచ్చివాడిననుకుంటున్నారు’’ అంటూ కన్నీరు కార్చేవాడు.
‘‘జనం నిన్ను నమ్మాలని ఎందుకనుకుంటున్నావు, నేనైతే వాళ్ళను లెక్కచేయను’’ అన్నాను.
కాసేపు కళ్ళు మూసుకుని ` ‘‘నీకర్థం కాదు. నేను దైవికంగా బయటపడ్డాను, తిరిగి వచ్చాను. నా చావు అనుభవం మీకందరికీ చెప్పి, మీ అందరికీ యింకా వ్యవధి ఉంది, సావధానులు కండి అని చెపుతున్నాను. నాకు బ్రతకాలనే ఆశ లేదు. నేను ఒంటరివాడను. మీ అందరికీ వార్నింగ్ యిద్దామని చెపుతున్నాను. కానీ ఎవరూ వినటం లేదు’’ అన్నాడు.
*****

వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.
