
మెరుపులు- కొరతలు
డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”
– డా.కే.వి.రమణరావు
ప్రచురణ: ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (4 జూలై 2021)
ఇది అమెరికాలో ఉన్న ప్రవాసభారతీయులు నేపథ్యంగా రాసిన కథ. ప్రకృతి సంక్షోభం వచ్చినప్పుడు ఇళ్లను ఖాళీ చేయించే సమయంలో కలిగే ఆందోళనలమధ్య భార్యాభర్తలలో ఏర్పడుతున్న తాత్కాలిక అంతరాలు వెలికివచ్చే అంశంచుట్టూ అల్లిన కథ.
స్థూలంగా కథాంశం ఇది.
శశాంక్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగర బే ఏరియాలో పనిచేస్తున్న ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అతని భార్య (పేరు చెప్పలేదు. భర్త ఒకసారి ‘రాగా ‘ అని పిలుస్తాడు. అది పేరులో భాగమైవుండచ్చు) ఉత్తమపురుషలో చెప్పిన కథ ఇది.
శశాంక్, అతని భార్య బే ఏరియా శివార్లలో గడ్డికొండలనానుకొనివున్న ప్రదేశంలో యిల్లు కొనుక్కుంటారు. నగరానికి దూరమైనా పెద్ద ఇల్లు, ఇంటి వెనక విరగ్గాసిన నారింజ, నిమ్మ చెట్లతో విశాలమైన పెరడు, ఆవెనక ‘చేతికందేట్టుగావున్న’ గడ్డికొండ. ఇల్లు ‘రాగా’కి బాగా నచ్చి దాన్నింకా సౌకర్యంగా దిద్దుకుంటుంది.
అంతా బాగానేవుంది అనుకుంటూండగానే ప్రపంచగతిని మార్చేసిన కోవిడ్ ఆర్నెల్లుగా వాళ్ల జీవితాల్లోకూడా అనుకోని మార్పులు తెచ్చింది. శశాంక్ కి ఇంటినుంచే పని మొదలైనప్పుడు ఎంతో సంతోషించిన ‘రాగా’ అలాంటి మార్పులు వస్తాయని ఊహించలేదు. ఈ మార్పుల్లో మొదటిది శశాంక్ ఇంటిని, ఒంటిని పట్టించుకోకుండా ఎప్పుడూ తన ఆఫీసుగదికే పరిమితమైపోయి సన్యాసిలాగా ఐపోవడం. రెండవది ఆమెతో అదివరకట్లాగ సన్నిహితంగా ఉండకపోవడం (దీనికి అతను ఇంటికి పరిమితంకావడం తప్ప మరో ఇదమిద్దమైన కారణమేమీ కథలో కనపడదు). ఇవన్నీ రాగలో చిరాకును పెంచుతాయి. అవి తరచుగా ఇద్దరిమధ్యా చిన్న చిన్న ఘర్షణలకు దారితీస్తూంటాయి.
అసలే పరిస్థితి ఇలావుంటే ఇంతలో మరో విపత్తు వస్తుంది. కాలిఫోర్నియాలో ఎండాకాలంలో తరచూ అడవుల్లో వచ్చే మంటలు ఈసారి ఈ గడ్డికొండలకు కూడా వ్యాపిస్తాయి. ప్రభుత్వంవారు సమీపంలోవుండే ఇళ్లన్నిట్నీ ఖాళీ చేయిస్తూంటారు. వీళ్లుకూడా కేవలం గంటలో ఖాళీచెయ్యాలని సందేశం వస్తుంది (కథ ఇక్కడే ప్రారంభమౌతుంది).
గంటలో ఏవి సర్దుకోవాలో అర్థంకాక, అన్ని వస్తువులూ విలువైనవాటిలాగే కనపడి రాగ సతమతమౌతుంటే శశాంక్ ఆమె మనోభావాలు పట్టించుకోకుండా ఆలస్యమౌతూందంటూ ఆమెమీద చిరాకు పడతాడు. ఆమె ఎలాగో సర్దుకున్నాక ఇద్దరూ దగ్గర్లోని ఒక హోటల్లో మకాం పెడతారు. హోటలురూము ఖరీదెక్కువ కాబట్టి తాత్కాలికంగా తక్కువఖరీదు వసతిని వెతకమని ఆమె అడిగినా అతడు పట్టించుకోడు. వాళ్లమధ్య గొడవ మరింత పెరిగి క్లైమాక్స్ చేరుతుంది. చివరికి పైక్కనపడకపోయినా అతనుకూడా ఆమెమాట ప్రకారమే తాత్కాలిక వసతికోసమే వెతుకుతున్నట్టు ఆమెకు తెలియడంతో కథ సుఖాంతమౌతుంది.
పై కథాంశాన్ని చూస్తే ఇదివరకటి కథల్లో లాగ సంప్రదాయ పద్ధతిలో మొదలు, ముగింపు మధ్యలో కథావస్తువుకు సంబంధించిన సంఘటనల సమాహారంలాంటివేమీ కనపడవు. కథంతా ఒక మారిన నేపథ్యంలో భార్యాభర్తలమధ్య తలెత్తే మానసిక సంఘర్షణ కనిపిస్తుంది. అదికూడా భార్యవైపునుంచే చూపబడింది. కథ చివర అతనుకూడా కోవిడ్ వల్ల మారిన పరిస్తితుల్లో పైకి కనపడని సంఘర్షణ అనుభవించినట్టు మనకు తెలుస్తుంది.
దాదాపు కథంతా ఆమె (రాగా) మనోభావాలు మనతో పంచుకోవడం ఉంటుంది.
ఆమె రెండు సూట్కేసుల్లో సామాన్లు సర్దుకోవాల్సి వచ్చినప్పుడు ఏవి ఎంపిక చేసుకోవాలా అని సందిగ్ధంలో పడినప్పుడు కథ మొదలౌతుంది. అన్నీ ముఖ్యమైన వస్తువుల్లాగే కనపడతాయి. వాటికి సంబంధించిన ఙ్ఞాపకాలతో ఆలోచనలు నిండిపోతూంటాయి. తీసుకెళ్లే వస్తువుల ఎంపిక రెండు ఫోటోలతో మొదలుపెడుతుంది. అందులో ఒక ఫోటోలో పెళ్లైన కొత్తల్లో శశాంక్ కొంటెగా నవ్వుతూండడం ఉంటుంది. అదే ఈ కథలో మొదట్లో ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారని తెలియజేస్తుంది. అలావున్న దంపతులమధ్య ‘నిశ్శబ్దం అగాధంలా ప్రవేశించింది’. ‘ఆరునెలలుగా ఒకరికొకరు కొత్తమనుషు’లైపోయారు.
ఏవి సర్దుకోవాలన్న మీమాంసలో ఉండగానే ఇంటికి సంబంధించిన ఆమెకు అనేక పాత విషయాలు గుర్తొస్తూంతాయి. ఫర్నీచరు గురించిన అభిప్రాయబేధాలు, పెరట్లోని ఉయ్యాలతోవున్న అనుబంధం, తోటలో ఆమె మొక్కలకి గొప్పులు తవ్వడం, తియ్యని పళ్లని దొంగతనంగా తినడానికి వచ్చి పారిపోయే ఉడుతల్ని చూసి నవ్వుకోవడం, ఆ అనుభూతులన్నీ గుర్తుకొస్తుంటాయి.
ఆమెకు ఇల్లంటే వస్తువులు వాటితో ముడిపడివున్న ఙ్ఞాపకాలు. ఇప్పుడు ఇల్లే పోగొట్టుకోవాల్సి వస్తుందంటే? గంటలో ఇవాక్యుయేషన్ చేయాలని చెప్తే ‘అసలు ఏంవదిలెయ్యాలి? ఇంట్లో ప్రతి వస్తువూ ప్రీతిపాత్రమైందే’ అనుకుంటుంది.
కథంతా ఇలా సాగుతుంది. ఇద్దరి మధ్య ఒక సున్నితమైన అంశం గురించిన అనుభూతి ప్రధానంగా కథ నడుస్తుంది. కథ ఒక సెట్టింగ్ మధ్యలో మొదలై అక్కడక్కడా వర్ణన, సంభాషణలు, గత స్మృతులు, మనుషుల కదలికలు, వస్తువులు అన్నీక్లుప్తంగా కలసిపోయినట్టుగా వెనకా ముందులుగా నడిచి స్థలం మారినా అదే సెట్టింగులో ముగుస్తుంది. విషయవివరణను తగ్గించి ఒకటి రెండు వాక్యాలతో, లేదా ప్రతీకలతో నేపథ్యాన్ని చెప్పారు (విజయవారి పాత సినిమాల్లో చక్రపాణిగారి ఫార్ములాలాగ). అనుభూతి, అలోచనలు, ఒక మూడ్ ప్రధానంగా ఉంటాయి కాబట్టి మామూలు శిల్పంలో రాసిన కథలాగా కాకుండా రచయిత్రి తన భావాలను అస్పష్టంగా మనతో పంచుకున్నట్టుంటుంది. నిజజీవితంలోకూడా సున్నితమైన విషయాల గురించి సున్నితమైన మనుషుల మధ్య ప్రవర్తన సాధారణంగా అస్పష్టంగానే ఉంటుంది. పరిధి దాటి బంధాలమీద వాటి ప్రభావం పడకుండా చూసుకుంటారు. కానీ అలజడి కొనసాగుతూనే ఉంటుంది. వ్యక్తులు ముఖ్యంగా స్త్రీలు తమలోతాము ఏర్పరచుకునే సున్నితమైన ప్రపంచాలను గీతగారు కథలో అర్థవంతంగా చూపించారు.
ఇలాంటి భిన్నమైన కొంత అమూర్తమైన శిల్పంతో ఈమధ్య చాలామంది నవతరం రచయిత్రులు, రచయితలు రాస్తున్నారు. ఈ కథలు వ్యక్తి అంతరప్రపంచపు వాస్తవాలకు మరింత దగ్గరగా ఉంటాయని చెప్పవచ్చు. ఇది కథాశిల్పం సంతరించుకున్న నిజమైన మార్పా కాదా అన్నది కాలమే తేలుస్తుంది. ఇలాంటి కథలు రెండవసారి చదివినప్పుడే వాటిని అనుభూతించగలము. సెంటిమెంటుకథలు విరివిగా పండుతున్న ఈరోజుల్లో ఇలాంటి కథలు మెరుపుల్లా అప్పుడప్పుడూ కనిపిస్తాయి.
ఇలాంటి కథలు ఇదివరకు లేవని కాదు. కానీ తక్కువగా కనపడతాయి లేదా కథలో కొంతభాగమే ఇలా ఉంటుంది. ఇలాంటి కథలు రాయడం సులభంకాదు. చెదురుముదురుగా చెప్పే వాక్యాల్లో పాత్రల స్వగతాలు, చర్యలు మొదలైనవాటి ద్వారా సున్నితమైన ఆలోచనలను, అనుభూతులను పాఠకులకు సరిగ్గా అందేట్టుగా రాయడం కష్టమైన విషయం.
అందులోనూ రచయిత్రి ఒకదానికొకటి సంబంధం లేని రెండు సమస్యలను (ఇవాక్యుయేషన్, తాత్కాలిక మనస్పర్థలు కల్పించిన నిశ్శబ్దం) తీసుకున్నా కథనంతా అర్థవంతంగా నడిపించారు.
ఐతే అక్కడక్కడా కొన్నిచోట్ల ఇంకొంచెం వివరంగా ఉంటే బావుండేదనిపిస్తుంది. ఉదాహరణకు శశాంక్ వ్యక్తిత్వంగురించిన సూచనలేవీ లేవు, దంపతులిద్దరిమధ్యా తేడాలెలావచ్చాయన్నదీ చెప్పలేదు. కోవిడ్ కారణం సరిపోదు. కొసమెరుపనుకున్నా ముగింపు హఠాత్తుగా ఉందనిపిస్తుంది. ఒక్కోసారి పత్రికవారి సూచనమీదట పదాలతగ్గింపుకూడా ఇలాంటివాటికి కారణమౌతూంటుంది. లిండా అనే రాగా స్నేహితురాలు కార్చిచ్చుల నివారణకు ప్రిస్క్రైబ్డ్ ఫైర్ అన్న పరిష్కారం కొత్తగా కనుక్కున్నారని చెప్పడం (ఇది పాత ప్రక్రియే) ఇలాంటి చిన్నవి మినహాయిస్తే కథ బావుంది.
వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు, తమలోతాము ఏర్పరచుకునే ఇతరులతో ఘర్షణలేని సున్నితమైన ప్రపంచాన్ని, తనక్కావలసిన వాళ్లు దాన్ని అర్థంచేసుకోలేనప్పుడు అనుభవించే సంఘర్షణను రచయిత్రి సమర్థవంతంగా చూపించారు. ఈ కథను గీతగారు చక్కగా రాసి కథాప్రయోజనాన్ని చాలావరకు సాధించారు.
*****

డా.కే.వి.రమణరావు పుట్టింది, పెరిగింది ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో. చదివింది కడప, తిరుపతిలలో. వృక్షశాస్త్రంలో డాక్టరేట్. వివిధ ప్రభుత్వకళాశాలల్లో అధ్యాపకుడుగానూ, ప్రభుత్వ కళాశాల విద్యావిభాగంలో, రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయంలో అకడెమిక్ విభాగంలోనూ పనిచేసి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా 2017 లో ఉద్యోగ విరమణ. వీరి అర్ధాంగి శ్రీమతి సుభద్ర. ఆమెకూ సంగీత, సాహిత్యాల్లో ఆసక్తి, ప్రవేశం.
వివిధ మాస, వారపత్రికల్లో నలభై పైగా కథలు ప్రచురింపబడ్డాయి. కొన్ని బహుమతులు పొందాయి. సాహిత్యవిమర్శ, ఉన్నతవిద్యకు సంబంధించి కొన్ని వ్యాసాలు కూడా ప్రచురణపొందాయి. ‘విశాలాంధ్ర’ వారు 2013లో అప్పటివరకూ ప్రచురింపబడిన ఇరవై ఆరు కథలతో ‘పుట్టిల్లు – కె వి రమణరావు కథలు’ అనే పేరుతో కథాసంపుటం ప్రచురించారు. 2016లో ‘చాసో స్ఫూర్తి’ అవార్డు ప్రధానం చేయబడింది.
