కథాకాహళి- 22

దళిత బాలికల వేదనాత్మక కథారూపం జాజుల గౌరి కథలు 

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

జాజుల గౌరి 1968 సికింద్రబాద్ లోని లోతుకుంటకు చెందిన జాజుల బావిలో జన్మించారు. ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. పట్టా పొందారు. తరువాత ఎమ్.సి.జె., చేసారు. న్యాయవాద పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొంది,  కొన్నిరోజులు న్యాయ వాదిగా ప్రాక్టీస్ కూడా చేసారు. రాజకీయరంగ ప్రవేశంచేసి,ఒక జాతీయ పార్టీలో మహిళా విభాగంలో కొనసాగుతున్నారు. 

మాదిగ దండోరా ఉద్యమంలో భాగస్వాములైన నాగప్పగారి సుందర్రాజు  ప్రేరణతో కథలు రాయడం ప్రారంభించారు. “మన్ను బువ్వ”, కథా సంపుటి ”ఒయినం” నవల రాశారు. దళిత కుటుంబాలలోని పేదరికం పిల్లల్ని ఎలా బాధిస్తుందో ప్రత్యక్ష అనుభవంతో జాజుల గౌరి “మన్నుబువ్వ”కథగా రాశారు. ఈకథ దళిత కుటుంబాల పిల్లలు అనుభవిస్తున్న అత్యంత దయనీయ స్థితిని వ్యక్తంచేస్తుంది. ఆటల్లో వండిన మట్టినే అన్నంగా లొట్టలేసుకుంటూ తిన్నట్లుగా నటించిన చిన్నారి అనుభవం, తన నిజజీవితంలో కూడా ఆకలి బాధ భరించలేక మన్నునే అన్నంగా భావిస్తూ  ఆకలి తీర్చుకుంటుంది.

 “మన్నుబువ్వ”కథలో ఇంట్లో తిండిఖర్చులు కూడా జరుగుబాటు లేని స్థితిలో భార్యభర్తల నడుమ గొడవలు జరుగుతూ వుంటాయి. భర్త తాగుడు కారణంగా పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నానన్నఆర్థిక, మానసిక వేదన పేద దళిత స్త్రీలది, ఈతల్లుల  ఆవేదన పురుషుడికి అర్ధం కాదు. 

ఈకథలో చిన్నపాప తన ఆటల్లో వండిన మన్నుబువ్వనే’ మెత్తని మన్నును అన్నంగా   తయారు చేసుకొని తిని నీళ్ళుతాగి పడుకుంటుంది. తల్లి ఎంతలేపినా లేవదు. ఈకథ చదువుతుంటే దక్షిణాఫ్రికాలోని ఓ మారుమూల కొండప్రాంతంలోని ప్రజలు ఆహార సంపాదనలేక జల్లించిన మెత్తని మన్నునే రొట్టెలుగా తయారుచేసుకొని తిన్న డాక్యుమెంటరీ చిత్రమే కళ్ళముందు కదలాడింది. 

పురుషుడి సంపాదనపై ఆధారపడ్డ కుటుంబంలోని స్త్రీలు, పిల్లల మానసిక స్థితిని ఈమె చిత్రించారు. పస్తులతో వున్న ఇంట్లోకి తాగి వచ్చిన భర్తను చూసి అతని భార్య లక్ష్మికి కడుపులో కాల్తుంది. తాగొద్దని ఆమె ఎంతగా చెప్తున్నా కూడా భర్త తాగడం మానలేదు. ఆమె అతని తప్పుని తెలియజేస్తున్నప్పుడు కూడా ఆమె భర్త  ఆధిపత్య వైఖరితో  దబాయిస్తాడే తప్ప, ఆమె బాధను అర్థంచేసుకోని వైనాన్ని అతని మాటల్లోనే ఇక్కడ గమనించొచ్చు.

 “ఎందే ఉకున్న కొద్ది ఎక్వ ఎక్వ మాట్లాడుతున్నావ్. నేనే మన్నా జేసుకుంట, నేను నా కష్టమంతా కర్చువెడ్తా తాగి తందనా లాడ్తా నా ఇష్టం, నీయమ్మ ఇంటికాడ్కెనించి దెచ్చినవా నాకు సెప్తవా? సెప్తవా? ” అని కొట్టడానికి సిద్ధపడతాడు. ఈమాటల్ని ఎందుకు కోట్ చేయాల్సి వచ్చిందంటే, “పితృస్వామిక ఆధిపత్యబావజాలం దళితస్త్రీలను అంతగా బాధించదు” అనే వాదనను కొంతమంది ఆక్టివిస్టులు నిర్ద్వందంగా ప్రకటిస్తుంటారు. కానీ స్త్రీవాదం అందించిన తాత్విక సైద్ధాంతిక పునాది దళిత స్త్రీవాద ధోరణిగా విస్తరించిన ఆవశ్యతా క్రమం గుర్తించడానికి ఈకథ చక్కని ఉదాహరణ కాగలదు. దళిత పురుషుని కులం అతనికి అహంకారాన్ని ఇవ్వలేదు. కానీ పురుషుడినన్న అహమే, అతనిలాంటి వారందరి మెదళ్ళలోకి మనువాద భావజాలం ఇంకిందనడానికి, అతని మాటల్లోని పురుషాహంకార భావజాలానికు న్న బలం ఏ సమాజం అందించిందో పాఠకులకు అర్థమవుతుంది.

పురుషుడు ఏం చేసినా స్త్రీ ఎదురు తిరగకూడదన్న ఆధిపత్య భావజాలం దళిత పురుషుల్లో ఏస్థాయిలో, స్థితిలో వుంటుందో ఈ కథలో చూడగలం. చేసిన కష్టం చేతికి అందకుండా పోతుందన్న బాధ కంటే, నా ఇష్టం నా సంపాదన మాట్లాడటానికి నువ్వు ఎవరు? అనటంలోని తీవ్రతను గౌరి చాలా స్పష్టంగా చిత్రించారు. దళితస్త్రీలు భర్తను ప్రశ్నించడానికి కూడా అర్హత లేనిదానిలా నిస్సహాయంగా మిగిలిపోవాల్సిన స్థితి ఒకవైపు, కన్నబిడ్డల ఆకలి కడుపుకు  తిండిపెట్టలేని అశక్తత మరోవైపు బాధించడం దళిత మహిళల ముందున్న  సవాళ్ళు.

దళిత కుటుంబాలలో వరకట్న సమస్య కూడా  వుందని ఈకథ నమోదు చేసింది. దళితస్త్రీలు కూడా వరకట్న సమస్యల్ని ఎదుర్కొంటూనే, ఆకలి చావులకూ, పురుషాధిపత్యానికి గురవు తున్నారు.

మార్పుకథలో తల్లిపై తండ్రి పెత్తనం చెలాయించడం హీనంగా చూడటం అవమానకరంగా మాట్లాడటం, పితృస్వామ్య భావజాల సమాజంలో సర్వసాధారణమైన విషయాలు. పితృస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీ, పురుషులు సమానమని అలాగే చూడమని, అవకాశాలు ఇవ్వమని ఉద్యమాలు చేసినప్పటికీ మార్పు చెందని జీవితాలు చాలానే వున్నాయి. మార్పుకు నోచుకున్న వాళ్ళు, అంతో ఇంతో చదువుకొని లోకం పోకడ తెలిసిన పురుషుల్లో కూడా చాదస్త భావాలు, పురుషపెత్తనాలను వదులుకోలేని మనువాద పురుషాధిపత్య సమాజంగానే మనం చెప్పుకోవాల్సి వుంటుంది.   

 మధ్య తరగతికి చెందిన ఇళ్ళలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే. అర్చన, ఇంటికి ఆలస్యంగా వస్తుంది.  తండ్రి, ఆమె వచ్చేసరొకే పిల్లల ముందు, తల్లిని ఎన్ని విధాలుగా దూషించి, అవమానించాలో అన్ని విధాలుగా చేస్తాడు. తిరిగి వంట చేయమని గద్దించి, పురమాయిస్తాడు. అయినా ఎదురు మాట్లాడకుండా తల్లి వంట చేయడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు అర్చన తల్లిదండ్రుల్ని పరిశీలించి తండ్రి లేటుగా వచ్చినప్పుడు అమ్మపడిన యాతన గుర్తుకొచ్చి రెండు సంఘటనల్ని బేరీజు వేస్తుంది. అమ్మలాగ నాన్నెందుకు ఆలోచించలేకపోతున్నాడు. అమ్మ ఎందుకి వన్నీభరించాలి అని తన తల్లికి అవగాహన కల్పించేలా మాట్లాడు తుంది. ప్రశ్నించమని ప్రోత్సహిస్తుంది కుతురు అర్చన. ఆమె మాటలువిన్న తండ్రి నివ్వెరపోతాడు. పురుషాధిపత్యాన్ని భరిస్తున్న తల్లిని, భరించాల్సిన పని లేదని, ఇన్నిసంవత్సరాలుగా సహించాల్సిన అవసరం లేదని కూతురు చెప్పడంతోపాటు తండ్రిగా అతని బాధ్యతలను తెలియజేస్తుంది. అర్చన తన మాటల్లో ”తల్లిదండ్రులు పిల్లలకి మార్గదర్శకత్వాన్ని ఇవ్వాలి కదమ్మా, మరి ఇదేమిటి” అని ప్రశ్నిస్తుంది. పిల్లల ముందు తండ్రుల ప్రవర్తనెలా వుండాలో కూడా తెలియలేనంత అనాగరికత పురుషులు వుండటానికి కారణం ఆధిపత్య భావజాలమేనని వాదిస్తుంది. 

“నేను మొగోడిని ఎక్కడైనా తిరుగుతాను. ఏమైనా చేస్తాను అడగటానికి నీకు హక్కు లేదు. పో….అని అనడంలో ఆధిపత్యధోరణి కనిపిస్తుంది. ఈ ఆధిపత్యాన్ని ఎందుకు సహించాలి. సహిస్తూ పోతున్నందువల్లే మరింత బాధని అనుభవించ వలసి వస్తుంది. ఇలా భరిస్తూన్నంతకాలం మార్పు రాదని తల్లికి చెప్తుతుంది అర్చన. తండ్రి చేసే తప్పులన్నీ భరిస్తూ పోతున్నంత కాలం మార్పురాదని, చేయని తప్పును భరించకూడదని అర్చన “నువ్వు చేయని తప్పును చేసినట్లుగా డాడీ అంటుంటే అన్నింటికీ తలొంచి చప్పుడు చేయకపోవడమే నీ తప్పమ్మా నువ్వు దిగులుపడ్తూ ఇలాగే కూర్చోని వుంటే అతనిలో మార్పెలా వస్తుంది” అని తల్లిని ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో జరిగే అనర్ధాన్ని కూడా ఆలోచించమని హెచ్చరిస్తుంది. మగవాళ్ళు ఆధిపత్య భావజాలంతో విర్రవీగుతుంటే ఆ అగడాలన్నీ స్త్రీలు భరిస్తూ పోవడంవల్లే ఆధిపత్య భావజాలం కూడా పెరిగిపోతూంది. దీన్ని ఖండించాలంటే స్త్రీలు ప్రశ్నించాలి! మాట్లాడకుండా, ఓర్పుతో.. ఎదురు చూసినంత కాలం ఇలాంటి భావజాలాన్నితల్లులు రేపటి తరానికి అందించడమే అవుతుందనే ధోరణిలో మాట్లాడుతుంది.   

“ఇదేమిటి డాడీ నువ్వు ఆడదానివి నేను మొగోడిని అంటూ నన్ను హేళన చేయటం చూస్తుంటే నాకెంత ఫీల్గా ఉందో తెల్సా రేపు తమ్ముడు కూడా ఇలాగే తయారవుతాడేమో. అంతెందుకు, నేను కూడా ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొవాలేమో” అంటూ తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవడంతోపాటూ సమస్యని పరిష్కరించడం మరో సమస్యకు కారణం కాకుండా వుండటం కోసం  చేయాల్సిన  స్త్రీలకర్తవ్యాన్ని కూడా ఈకధ తెలియజేస్తుంది. పురుషాధిపత్యాన్ని ధిక్కరించడం వల్లనే పురుషాధిపత్యాన్ని సహింపక, ఎదుర్కొని రేపటి తరాన్ని కాపాడాల్సిన బాధ్యతను ఈ కథ గుర్తు చేస్తుంది. 

ఆధిపత్యాన్ని ధిక్కరించిన మరో కథ నిట్టూర్పు‘. ఈకథలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఇంటిచాకిరి, పిల్లల పెంపకం స్త్రీపైనే పడుతుంది. వీటన్నింటినీ చక్కబెట్టడంతో పాటు.. కావాల్సిన అవసరాలన్నింటినీ ఆమె తీర్చాలి. ఏ పనిలో కూడా సహాయం చేయని భర్త కారణంగానే తన పై అధికారితో చివాట్లు తింటూనే వుంటుంది. చివరికి భర్తను సహాయం చేయమని అడుగుతుంది. ఇంటి పనులను ఇద్దరం కలిసి చేసుకుంటే తొందరగా ఎవరి పనులకు వాళ్ళు పోవచ్చని చెపుతుంది. కానీ భర్త రేపటి సంగతి కదా అని అనుకుంటాడు. కానీ తెల్లవారే లోపు కథ మామూలుగానే మారిపోతుంది. ఆమెజీవితంలో ఎటువంటి మార్పూ వుండదు. తరతరాలుగా స్త్రీలు, పురుషుల్ని కూర్చోబెట్టి సోమరుల్ని చేసి ఈ పనులన్నీ ఆడపనులని అడవాళ్ళే చేయడం ద్వారా ఈ ధోరణి కొనసాగుతోందనేది రచయిత్రి అభిప్రాయం.

అక్షరంకథలో ఒక దళితబాలిక చదువుకోసం చేసిన పోరాటం. మనుష్యుల మద్యలో పాదుకున్న అసమానతలను పెకలించాలంటే సరైన ఆయుధం చదువేనని తల్లీ కూతుళ్ళ మధ్య జరిగిన ఈ సంభాషణ ద్వారా తెలుస్తుంది.

 “ఆల్లు బాగా సద్వుకున్నోళ్ళు బిడ్డా. మంచి కొలువులున్నాయి. అందుకు అల్లు గొప్పగున్నరు. సద్వులేనందుకే మనం గొప్పవాళ్ళు కాదంటుంది., చదువున్న వాళ్ళు గొప్పోళ్ళు, చదువులేని వాళ్ళు గొప్పవాళ్ళు కాదని రెండు ముక్కల్లో తల్లి కూతురికి తేల్చి చెపుతుంది. తన కూతురిలో చదువుకొని గొప్పగా మారాలన్న ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని నింపుతుంది తల్లి. అక్షరాన్ని వెతుక్కుంటూ జీవితాన్ని మలుచుకోవాలని తల్లిదండ్రులతో మారం చేసి, మంకుపట్టుతో పోరాటం చేసి బడిలో చేరుతుంది. కూతురు చదువు లేనందువల్లే, వాళ్ళ తల్లిదండ్రులు బానిసలుగా బతుకుతున్నారని ఆ చదువేవుంటే వాళ్ళమ్మ కూడా ఉద్యోగం చేసి బతికేదని ఆమె కూతురిలో చదువు పట్ల ఆసక్తిబీజాలు నాటుతుంది. ఆమెలో ఆ బీజమే మెలకెత్తి అక్షరాలను వెతుక్కుంటూ చదువుకోసం ప్రయాణం చేస్తుంది.

ఈకథలోని బాలిక ఆలోచనా దృక్పథం చదువే అన్ని సమస్యలకు పరిష్కారం. అదే సమానత్వాన్ని తెచ్చి పెడుతుందని గట్టిగా నమ్మి చదువుకు ఉపక్రమిస్తుంది. చిన్నారి అక్షరం వైపు నడుస్తూండటంలో దళిత సమస్యల పరిష్కారానికి మార్గం చదువేనన్న డా. బాబూసాహెబ్ అంభేద్కర్ ఆలోచనావిధానానికి రూపకల్పనగా ఈకథ బహిర్గతమవు తుంది.

పగటిబెల్లుకథలో భార్యాభర్తలు ఇద్దరూ కూలిపని చేసే వాళ్ళు. వచ్చిన కూలి డబ్బులు తాగుడుకు సగం ఖర్చవ్వగా మిగిలింది ఇంటి ఖర్చులకు సరిపోకపోవడంతో అలుమగలు మాట్లాడుకుంటున్నప్పుడు గానీ, పోట్లాడు కుంటున్నప్పుడుగానీ అడ్డం వచ్చి విడిపించాలకుంటు న్నప్పుడుగానీ, వచ్చిన వాళ్ళపైకే ఇద్దరూ కలిసి గొడవకు పోయే వాళ్ళు. ఇద్దరి మధ్య జోక్యం చేసుకోవద్దని ఇద్దరూ కలిసి ఇతరుల్ని హెచ్చరించేవారు. ఈ కారణంగా వాళ్ళిద్దరి మధ్య మూడో వ్యక్తి చొరవ చేసుకొనే అవకాశం వుండేది కాదు. ఈ కారణంగా పిల్లలు పడే మానసిక సంఘర్షణ, ఆకలి, ఆవేదనల సమాహార రూపమే ఈ కథ.

ఈ కథలో భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకుంటున్నా కూడా ఒకరిపట్ల మరొకరికి వున్న గౌరవం గొప్పది. అందుకే మూడో వ్యక్తిని వాళ్ళ గొడవల మధ్యకి రానివ్వలేదు. అయితే వాళ్ళ గొడవల కారణంగా పిల్లల స్థితిని అర్ధం చేసుకొని ప్రవర్తించాల్సిన ఆవశ్యకతని మాత్రం మరిచిపోయారు. వాళ్ళకు పనిచేయగలిగే శక్తి ఉన్నప్పటికీ పని దొరకకపోవడం చేసిన పనికి తగ్గ ఫలితాలు దక్కకపోవడం వల్ల వాళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయని తత్ ఫలితంగానే పిల్లలు ఆకలి బాధకు గురౌతున్నారని చెప్పడం రచయిత్రి ఉద్దేశ్యం.

దళిత కుటుంబంలోని ఆడపిల్లలు పుట్టుకతోనే తల్లుల్లా పుడుతారు. వాళ్ళ తోబుట్టువుల భారమంతా మోస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులిద్దరూ పనులకు పోతారు. తమ తరువాత పిల్లల సంరక్షణా బాధ్యతంతా ముందు పుట్టిన వాళ్ళే చూడాల్సి వస్తుంది. 

తనతల్లీ, తమ్ముడు ఏమీ తినకుండా వున్నారని ఆలోచించి తనకు బడిలో పెట్టే ఉప్మానే వాళ్లిద్దరికి పెట్టాలనుకుంటుంది. ఆకలిని భరించలేక ఉప్మా అడిగినందుకు ఆ చిన్నారి చేతిపైన వంట మనిషి వాత పెడుతుంది. అన్ని బాధలు భరించి వాళ్ళ అమ్మ, తమ్ముళ్ళకు బడిలో పెట్టే ఉప్మాను తీసుకెళ్తుంది. బాల్యం కోల్పోతున్న పిల్లల్ని అధిక శ్రమదోపిడికి గురవుతున్న జంటని చూస్తాం. వీళ్ళలా తయారు కావడానికి కారణమైన వ్యవస్థను జాజులగౌరి ఈ కథలో సమస్యాత్మకం చేయగలిగింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.