స్మరణం

-ఆదూరి హైమావతి 

అప్పుడే పుట్టిన ఒక పురుగు  , కడుపు నిండా ఆహారం తిని కాస్తంత బలం చేకూరగానే బయటి ప్రపంచాన్ని చూడాలనే ఉత్సుకతతో  ఇంట్లోంచీ అమ్మకు చెప్పకుండానే  బయల్దేరింది .

ఒక కప్ప మహా  ఆకలితో ఉండి నీళ్ళలో ఏజీవీ కనిపించక ‘ఉభయచరం’ గనుక నేలమీదకి గెంతింది .  దూరంగా వేగంగా వెళుతున్న ఈ పురుగు కనిపించింది . దాని మనస్సు ఆనందంతో నిండి పోయింది.

“ఆహా! ఈపురుగును తిని నా ఆకలి చల్లార్చుకుంటాను , దేవుడు దయామయుడు నాకోసమే ఈపురుగును ఇక్కడికి పంపాడు” అని మురిసిపోతూ ముందుకు గెంత సాగింది .

అంతలో అక్కడి పుట్టలోంచీ ఒకపాము బయటి కొచ్చింది .

అదీ ఆకలికి అల్లాడి పోతూ ఎదురుగా గెంతు తున్న  కప్పను చూసి సంతోషంతో ” భగవంతుడు దయామయుడు, నాకోసం ఈకప్పను ఇక్కడికి పంపాడు, దీన్ని మింగి ఈపూటకు నా ఆకలి తీర్చుకుంటాను.” అని  భావించి, వేగంగా ముందుకు సాగింది.

పొదల్లోంచీ అప్పుడే నిద్రలేచి వచ్చిన ముంగిసా ఆకలితో ఉపాహారంకోసం వెతుక్కుంటూ ఎదురుగా వెళుతున్న పామును చూసి మహదానందంగా ” భగవంతుడెంత దయామయుడు! నాకోసం ఈ పామునిక్కడికి పంపాడు, దీనితో ఈవేళ నా ఆకలి తీరుతుంది ” అని మురుస్తూ ముందుకు సాగింది .

అడవిలో ఏ జంతువూ దొరకని ఒక పులి , అప్పుడే అక్కడికి ఘోరమైన అకలికి తాళలేక అక్కడ వెళుతున్న ముంగిసను చూసి,   ” ఆహా! భగవతుడెంత దయామయుడు! నాకోసం ఈముంగిస ను ఇక్కడికి పంపాడు . ఈపూటకు ఇదిచాలు  నాఆకలితీరను.” అని తలచి ఒక్క గెంతు గెంత బోయింది

దూరంగా గుట్టమీద అర్ధ రాత్రి నుంచీ వేట కోసం  కాపువేసున్న ఒక వేటగాడు ,” ఆహా! భగవంతుడెంత దయామయుడు , నిన్నటి నుండీ ఏవేటా దొరక్క పస్తులుంటున్న నా కుటుంబా నికి ఈపులిని చూపాడు, దీని చర్మ అమ్ముకుంటాను ,ఎంతో సొమ్ము వస్తుంది,. దీని మాంసా న్నిఇంటిల్లిపాదీ హాయిగా రెండురోజులు తినవచ్చు.” అనుకుంటూ , గెంతను సిధ్ధంగాఉన్న ఆ పులిపై తన పదునైన బాణం బాగా గురి పెట్టి ఆకర్ణాంతం లాగి వదిలాడు .

అది పులిని తాకేంతలో పెద్ద గాలి వీచి రివ్వున వస్తున్న బాణం గురి తప్పి పక్కనే ఉన్న మామిడి చెట్టుకు తగిలింది. రివ్వుమని వచ్చిన ఆశబ్దానికి పులి ఉలిక్కి పడి గాండ్రించి పక్కకు గెంతింది.

పులి అరుపుకు  ముందున్న ముంగిస భయంతో అరుస్తూ పొద ల్లోకి దూకింది .

దాని అరుపుకు పాము భయంతో పక్కనే ఉన్న కలుగులోకి దూరింది .

పాము బుసకొడుతూ కలుగులోకివెళ్ళడం గమనించిన కప్ప ‘ ప్రాణం’ దక్కినందుకు సంతోషి స్తూ నీటి గుంటలో దూకింది .

వెనుక నుంచీ కప్ప భయంతోకూడిన ‘ బెక బెక ‘ శబ్దం విన్న, ఆ చిన్న పురుగు కూడా ప్రాణ భయంతో దూరంగా ఎగిరిపోయింది .

బాణం తగిలిన మామిడి చెట్టు కొమ్మ విరిగి పండ్లన్నీ నేల రాలగా, వేటగాడు ‘ దొరికిందేచాలని ‘ సంతోషించి ఆపండ్లన్నీ మూటకట్టుకుని వెళ్ళిపోయాడు.

నిజంగానే భగవంతుడు ఎంత దయామయుడో చూశారా బాలలూ !

కనీసం తన నామాన్ని పలక్కపోయినా తనను  స్మరించగానే అందరికీ ఆపదలూ  తప్పి ప్రాణాలు నిలిచాయి.

దయామయుడైన భగవంతుడు ‘ అక్రూరు’ డంతటి వాడినే  స్మరించి నందుకు కాచి’ మోక్ష ప్రాప్తి ‘ కలిగించాడుకదా!

ఎవరైనా ‘ భగవాన్ ‘ అని స్మరిస్తే చాలు కాపాడే వ్రత నియమం కలవాడు భగవంతుడు.

కనుక నిరంతరం ‘భగవంతుని  ‘ నామాన్ని స్మరించడం మరువకండి.

      *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.