తల్లివేరు

-డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం

పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి .
పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి  .
సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు .
సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే! 
 
కడుపులో లేనిది కావలించు కుంటే రాదని ,
నలుపు నలుపే గానీ తెలుపు కాదని ,
పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని ,
తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది. 
 
అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట .
నేనెవరినని మూలాల కోసం తనక లాట .
జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు ,
భామా కలాపాలు,బతుకమ్మ పాటలు  అస్థిత్వ ఆరాటాలు .
 
 రెండు పడవల రెండో తరానికి  ఆవకాయ అన్నప్రాసనం 
ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన 
మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు  
అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు. 

*****

Please follow and like us:

One thought on “తల్లివేరు (కవిత)”

  1. తల్లివేరు తపనను చాలా చక్కగా వ్రాశారమ్మా
    రెండు పడవల రెండవ తరానికి ఆవకాయ అన్నప్రాశన….😂 భలేగా ఉంది మీ కవిత శుభాభినందనలు 💐💐

Leave a Reply

Your email address will not be published.