
జ్ఞాపకాల ఊయలలో-10
-చాగంటి కృష్ణకుమారి
పఠాభి మాష్టారు గారు పాలికాపునిచ్చి నన్ను లచ్చమ్మపేటకి పంపారు కదా ! ఇంట్లోకి అడుగుపెట్టానో లేదో స్కూలు నుండి తిన్నగా ఇంటికి రాక పార్వతి ఇంటికెల్లావుట! మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ మొదలెట్టారు. అన్నదమ్ముల కుటుంబాలుంటున్న ఏక పెనక తాటాకు ఇళ్ల లో ఒక ఇల్లు మాది కదా. ఇంటికీ ఇంటికీ మధ్యనున్న పెరళ్లన్నీ కలిసే వుండేవి. మధ్యన గోడలు లేవు. మాఇంటినీ ప్రక్క ఇంటినీ విడదీసి చూపడానికి రెండు పెరళ్లమధ్యనా నీలి డిశంబరం పూల చెట్ల వరుస కొంత దాకా వుండేది.అంతే. పార్వతి ఇంటికి ఎందు కెళ్లావనీ ఏంచేసావనీ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతీదీ పూస గుచ్చినట్టు చెప్పడం అలవాటు. కథ చెప్పడం మొదలెట్టాను , కధలో భాగంగా నేనూ పార్వతీ చిట్టెమ్మ గారింటికెళ్లామని చెప్పాను. అంతే! ఇంకేముంది?
చిట్టెమ్మింటికెళ్ళావా?
దానింటికెందుకెళ్ళావ్?
చిట్టెమ్మ ఇంటికి కూడా వెళ్ళిందట!
దానింటికేల్లాల్సిన అవసర మేమొచ్చిందీ?
“పార్వతి తీసికేళితే వెళ్లాను.”
“పార్వతి ఎక్కడకు తీసికెళి తే అక్కడకు వెళిపోతావా?”
“అది నూతిలో దూకమంటుంది .దూకుతావుటే?”
అందారూ నేనేదో చాలా తప్పుపని చేసినట్టుగా గట్టిగా అరుస్తున్నారు .
“ఆవిడ చాలామంచిది. మాకు మరమరాలు పెట్టింది.” అన్నా.
“ మరమరాలు పెడితే మంచిదైపోతుందిటే !”
ఈ గద్దింపులతో నాకు ఏడుపొచ్చింది. ఆరోజులలో నానెత్తి మీద కుండ నిండా నీళ్ళతో వుండేది. ఈ గద్దింపులకి ఆనీళ్ళు కళ్లంపట బుగ్గల మీదుగా జారి పడుతున్నాయి. కుండ ఖాళీ ఆయేదేలేదు . శివుడి జటాజూటంనుండి ఒక పాయ గంగమ్మ నేరుగా నానెత్తి మీద కుండలోకి వచ్చి పడుతున్నాది.
ఏ ఘట్ట మైనా ఎంతసేపు నడుస్తుంది? చిన్న పిల్ల దానికేమిటి తెలుసు? ఆపిల్ల తీసికేళితే వె ళ్లింది , ఇంకదాన్నేమీ అనకండి అన్నారెవరో .
ఇంతకీ , “ మరమరాలు పెడితే మంచిదైపోతుందిటే?’ అంటె వారి ఉద్దేశ్యం ఆవిడ మంచిది కాదనేగా !
ఆవిడ ఎందుకు మంచిదికాదంటున్నారు? అప్పుడు నాకు ఏమాత్రం అర్ధంకాని విషయం . సందేహం అది.
అసలు ఆవిడ పేరు చిట్టెమ్మేనా? అలాగే గుర్తుంది. ఎందుకంటె “ చిట్టెమ్మఇంటికెల్లిందట ! చిట్టెమ్మఇంటికెల్లిందట! !అని ఆప్రక్క ఈ ప్రక్క వున్నవారు పలు మార్లు అనుకొంటున్న ట్టుగా గుర్తు.
పోనీ చిట్టెమ్మ కాకపోతే చిన్నమ్మ ! లేదా పెద్దమ్మ , ఎవరో? ఒక అమ్మ ! అమ్మల గన్న యమ్మ , ముగురమ్మల మూలపుటమ్మ! చాలాపెద్దమ్మ ! మాకు మరమరాలు పెట్టినమ్మ ! మాకు దయాంభురాశి గా కనిపించినమ్మ.
ఆవిడ మంచి చెడులు తెలుసుకోవాలంటే నావల్లయ్యే పనే!
ఆవిడ ఇంకా బతికుంటుందా? ఆతరంవారంతా చనిపోయేవుంటారుకదా! అయితే విజయనగరంలో మధురవాణి బతికేవుంది. ఆవిడకు చావులేదు. ఆవిడను అడిగి తెలుసుకోవాలి. కల్లే పల్లి విజయనగరానికి ఏమంత దూరంలోవున్నది కనక! మధురవాణే చరిత్రను అటు తిప్పి ,ఇటు తిప్పి , తిరగేసి బోర్లేసి, శోధించి , పరిశోధించి, నిగ్గు తేల్చిచెప్పగలదు.
*****

చాగంటి కృష్ణకుమారి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీలో పరిశొధన చేసి డాక్టరేట్ ను పొందారు. విజయనగరానికి చెందిన ఈమె ప్రముఖ రచయత చాగంటి సోమయాజులు గారి ( చాసో) కుమార్తె. 36 సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళాకళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలోనూ పనిచేసారు.1993లో ఆసోసియేట్ ప్రొఫసర్ గా పదోన్నతి పొందారు. తెలుగు అకాడమి లో డెప్యుటేషన్ పై రసాయన శాస్త్ర పుస్తక, పదకోశాల ప్రచురణవిభాగంలో పనిచేసారు. వీరు రాయల్ సొసైటి ఆఫ్ కె మిస్ట్రి (RSC)లండన్. సభ్యురాలు.
ఇండియన్ కెమికల్ సొసైటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిష్ట్రి, ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్,ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వారి కన్వె న్షన్ ల లోనూ వర్క్ షాపుల్లోనూ పత్రాలను సమర్పించి రెండుసార్లు సర్వోత్తమ పత్ర సమర్పణా అవార్డులను పొందారు.ఆకాశవాణి కేంద్రాలనుండి, ఇందిరాగాంధి సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి GYAN VANI కార్య క్రమాలలో వైజ్ఞానిక అంశాలపై సుమారు 80 ప్రసంగాలను ఇచ్చారు. RSC IDLS వారు, స్థానిక విద్యా సంస్థల వారు నిర్వహించిన సెమినార్లు, వర్క్ షాప్ లలో పాల్గొని సుమారు 50 జనరంజన వైజ్ఞానిక ఉపన్యాసాలను ఇచ్చారు.
ఈవిడ మంచి ఉపన్యాసకురాలు, పరిశోధకురాలు, అనువాదకురాలు. క్లిష్ట మైన వైజ్ఞానిక విషయాలను చక్కని తెలుగులో ఆసక్తి దాయకంగానూ, సుబోధకంగానూ, సరళంగానూ ఆద్యంతం ఆకట్టుకొనే శైలి లో చెప్పగల రచయిత్రి. ఎం.ఎస్ సి; పి.హెచ్.డి డిగ్రీలను ఆంద్రా యునివర్సిటి నుండి పొందారు. డిగ్రీ స్థాయిలో ప్రతిస్ఠాత్మక బార్క్ (BARC) స్కాలర్ షిప్, ఎం.ఎస్.సి.లో మెరిట్ స్కాలర్షిప్, పిహెచ్ డి ప్రోగ్రామ్లో యు.జి.సి.ఫెలోషిప్ ని పొందారు.
2000 లో లోహ జగత్తు. 2001 లో వైజ్ఞానిక జగత్తు. 2010 లో మేధో మహిళ , భూమ్యాకర్షణకి దూరంగా.. దూర దూరంగా… సుదూరంగా…. 2012 లో రసాయన జగత్తు. 2016 లో వైజ్ఞానిక రూపకాలు. 2017 లో జీవనయానంలో రసాయనాలు 2018 లో వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి ? 2019 లో కంటి వైద్యంలో ప్రాచీన భారత దేశ జ్ఞాన సంపద ( నిజానిజాలపై అమెరికా వైద్యనిపుణుల విశ్లేషణ) వంటి వైజ్ఞానిక శాస్త్ర గ్రంధాలను ప్రచురించారు. వీరు రచించిన పుస్తకాలను నేషనల్ బుక్ ట్ర ష్ట్ ,న్యూ ఢిల్లి; తెలంగాణ అకాడమి ఆఫ్ సై న్స స్ ,హైదరా బాద్; వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థలు ప్రచురించాయి.
ఈమె రాసిన భారతీయ సాహిత్య నిర్మాతలు:చాగంటి సోమయాజులు(చాసో)మోనో గ్రాఫ్ ని సాహిత్య అకాడమి 2014 ప్రచురించింది

కృష్ణకుమారి గారూ!మీ జ్ఞాపకాలు ఎంత బావున్నాయో. బాల్యం అంటేనే మధురమైనది కదా. మీ బాల్యపు ప్రత్యేకత ఏమిటంటే చాసో గారు కూడా ఉండడం. అభినందనలు.
మనం విజయనగరం లో నా చాసో పురస్కారసభలో కలవడమే. మిమ్మల్ని US లో కలిసినట్టు గీత చెప్పింది. మళ్ళీ కలుద్దామండి 👍