ఎవరూ రాకపోయినా సరే

-లలితా వర్మ

ఉదయమే తియ్యని కబురు, స్నేహ కాల్ చేసి “ఈ రోజు ఇంటికొస్తున్నానమ్మా”  అని చెప్పినప్పటినుండీ
శాంతికి కాళ్ళూ చేతులూ ఆడటంలేదు. అయినా తడబడుతూనే కూతురుకిష్టమైనవన్నీ వండింది.
 
‘ఇల్లు నీట్ గా లేకపోతే నచ్చదు దానికి’ అనుకుంటూ తుడిచిందే తుడుస్తూ సర్దిందే సర్దుతూ తెగ ఆరాటపడిపోతుంది.  షో రాక్ తుడుస్తుంటే చరణ్, ఫోటో లోంచి మెచ్చుకోలుగా తనను చూస్తున్నట్లనిపించింది. ‘ఉంటే ఎంత గర్వించే వాడో!  తన కల నిజమైనందుకు ఎంత  సంతోషించేవాడో!’
అనుకుంటే కళ్లు చెమర్చాయి శాంతికి.
 
నా అన్నవాళ్లంతా దూరమయారని బాధపడినపుడల్లా 
“మహిళా ఆపనీ కే”
(పడతీ  నీవెవరు)
“ఆపనీ శాక్తి స్వరూపిణీ”
(నీవు శక్తి స్వరూపిణి) అనేవాడు.
“అక్ల చలో” అంటూ పాడి ధైర్యాన్ని నూరిపోసేవాడు.
తాను కదల్లేని స్థితిలో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.
కూతుర్ని మెడిసిన్ చదివించాలి అనేది ఆయన ప్రధాన లక్ష్యం.
చరణ్ జ్ఞాపకాలు శాంతిని ఇరవైయేడేళ్ల వెనక్కి తీసికెళ్లాయి
***
 
“ఆ …….ఆ……….ఆ……….”
 
మంద్రంగా, మధురాతిమధురంగా రాగాలాపన చేస్తున్న చరణ్ ని చూస్తూ మైమరచిపోయింది శాంతి.
అతణ్ణే చూస్తుండి పోయింది. అతడు పాడుతున్నాడు
 
“జొది తోరి డక్షుని క్యూ నా… షే…తోబి
అక్ల చలోరే!
అక్ల చలో అక్లచాలో అక్లచలో అక్ల చలోరే”
 
ఆ కంఠంలోని మాధుర్యం ఒక ఎత్తైతే, ఎంతటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొని ముందుకునడవాలనే ఆశావాదాన్ని పలికిస్తున్న ఆ భావయుక్త రాగాలాపన
అక్కడున్న అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.
 
ఆ చలిలో చీకటిని చీలుస్తూ,  పరిసరాల్ని అరుణరాగరంజితం చేస్తున్న క్యాంప్ ఫైర్ ఇస్తున్న వెచ్చదనపు అనుభూతిపొందుతూ, తనకిష్టమైన చరణ్ ని చూస్తూ బ్రతుకంతా అలా గడిపేయగలిగితే ఎంత బాగుంటుందో!   
అనుకుంటుంది శాంతి.
పాట ఎప్పుడు పూర్తయిందో తెలియదు కరతాళధ్వనుల సవ్వడితో ఈ లోకంలోకొచ్చింది శాంతి.
చప్పట్లు ఆపేసి, “ఇంత రొమాంటిక్ మూమెంట్ లో ఆ పాటేంటి మామా”?
కుతూహలంగా అడిగాడు రమణ.
“యా ఆపాటే నాకు ఇన్స్పిరేషన్ మామ”
 చెప్పాడు చరణ్. బరువెక్కిన వాతావరణాన్ని తేలికచేయాలనే ఉద్దేశ్యంతో  “మామా నీ టర్నే పాటందుకో” అన్నాడు కార్తీక్ రమణతో.
 
ఆటపాటలయాక ఎవరి టెంటుల్లో వారుదూరారు.
పూణే యూనివర్సిటీలో ఎమ్.బి.ఏ చదువుతున్న చరణ్,శాంతి మరో రెండు జంటలతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేయటానికి లోనావ్ లా టూర్ వెళ్ళారు.
 
చరణ్ బెంగాలీ అబ్బాయి, అనాథ. జాతి,మతం,కులం ఏమీ తెలియదు, ఒక క్రిస్టియన్ మిషనరీ పెంపకంలో క్రిస్టియన్ లా పెరిగాడు వారి సహాయంతోనే  చదువుకుంటున్నాడు.
 
చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న శాంతి చరణ్ కి దగ్గరయింది. జీవితాంతం కలిసి వుండాలని నిర్ణయించుకున్నారు.
 
ఆరోజు… ఆ రొమాంటిక్ వాతావరణం, చలి, ఒకరిపై ఒకరికిగల ప్రేమ, ఆటెంట్లో ఏకాంతం, యవ్వనం పెట్టే గిలిగింతలు అన్నీ ఒక్కటై వారిద్దరినీ ఒకటి చేశాయి.
ఫలితం మూడునెలలకు బయటపడటంతో రిజిష్టర్ మారేజీ చేసుకున్నారు.
 
విషయం తెలిసిన శాంతి తండ్రి, కులమేదో తెలియని ఒక అనాథని, కూతురు పెళ్ళిచేసుకోవటాన్ని జీర్ణించుకోలేక మనస్థాపంతో గుండె ఆగి ఈ లోకాన్ని విడిచివెళ్లాడు.
ఫలితంగా అన్నయ్య ఇంట్లో స్థానం కరువై, కట్టు బట్టలతో బయటి ప్రపంచంలో అడుగుపెట్టింది శాంతి, భర్త చరణ్ తో.
 
అప్పటికే చదువు పూర్తవడంతో ఉద్యోగ వేటలో పడ్డారు. మేధావులైన వారిద్దరికీ త్వరలోనే మంచి కంపెనీల్లో ఉద్యోగాలొచ్చాయి.
 
కొన్నాళ్లు ఉద్యోగాలు చేసి సొంతకంపెనీ పెట్టుకోవాలనే ఆలోచనలో వుండేవారు. 
దానికి కావలసిన పథకాలు వేసుకుంటూ, కంపెనీ లాభాల్లో కొంతవాటా అనాథశరణాలయాలకు విరాళాలుగా ఇవ్వాలని ఆలోచిస్తూ, భవిష్యత్తు గురించి కలలు కంటూ రోజులు హాయిగా గడిపేస్తున్నారు.
 
తన కన్నవారెవరోతెలియని అనాథ చరణ్ కి, తల్లిదండ్రులను పోగొట్టుకుని, తోబుట్టువుకి దూరమైన శాంతికి ఆత్మీయుల ఆదరణ కరువైందనే  బాధతప్ప మరే బాధా లేదు.
ఆ కాస్త లోటూ తీరుస్తూ పండంటి పాపాయి అడుగిడింది వారింట.
వారి ఆనందానికి అవధులే లేకుండాపోయాయి.
 
పాపకు స్నేహ అని పేరుపెట్టుకుని ముద్దుగా పెంచుకుంటున్నారు.
 
ఓరోజు అందమైన శాంతి  జీవితం అశాంతికి గురయింది.
శాంతిని శోకసముద్రంలో ముంచేసింది. బైక్ మీద వెళ్తున్న చరణ్ ప్రమాదానికి గురయ్యాడు. నడుము భాగం దెబ్బతిని మంచానికే పరిమితమయాడు.
ఆపరేషన్ చేసినా ప్రయోజనం లేదని తేల్చేశారు డాక్టర్లు.
ఉద్యోగం చేస్తూ రెండేళ్ల  స్నేహనీ, మంచాన పడివున్న చరణ్ నీ చూసుకోవటం శాంతికి అసిధారావ్రతమే అయింది.
కొన్నాళ్ళు ఉద్యోగానికి సెలవు పెట్టి పూర్తిగా చరణ్, పాపల సంరక్షణలోనే గడిపింది.
చరణ్ కి ఉద్యోగం పోయింది. అప్పటివరకూ కూడబెట్టిన డబ్బూ ఖర్చయిపోయింది.
 
తాను తప్పనిసరి ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి.
ఉదయమే చరణ్ కి కావలసినవన్నీ సమకూర్చి, పాపని సిద్ధం చేసి బండి మీద కూర్చోబెట్టుకుని క్రష్  లో దింపి తాను ఆఫీసుకు వెళ్లేది.
ఆఫీసులో వున్నా ధ్యాసంతా చరణ్ పైనా పాప పైనా.
పనిలో చిన్న చిన్న తప్పులు దొర్లేవి.
టీమ్ లీడ్ తో మెత్తని చివాట్లు రుచిచూసేది.
 
స్వతహాగా చాలా తెలివైన శాంతి పనిలో చూపించే శ్రద్ధ నైపుణ్యం చూసి మేనేజర్ ప్రశంసలతో ముంచెత్తేవాడు. అది కంటగింపైన టీమ్ లీడ్ కి శాంతి పైన కసితీర్చుకోవటానికి మంచి అవకాశం దొరికింది 
శాంతి కుటుంబ పరిస్థితులను తెలిసీ సాటి ఆడదానిగా ఇసుమంతైనా సానుభూతిచూపకపోగా, తప్పులు వెతికి  అందరిదృష్టిలోకి  తీసుకొచ్చి అభాసుపాలు చేయాలని ప్రయత్నించేది లీడ్.
ఈవిషయాలేవీ చరణ్ తో చెప్పేదికాదు శాంతి.
అసలే తనతో సపర్యలు చేయించుకుంటున్నందుకు క్షణక్షణం బాధపడే చరణ్ కి ఆఫీసువిషయాలు చెప్పి
మరింత బాధపెట్టడం ఇష్టంలేక పోయింది.
 
ఓ రోజు పాప  బాగా ఏడుస్తుందని క్రష్ నుండి ఫోన్.
శాంతికి తలమునకలయేపని. కంపెనీకి కోట్ల  లాభాలు తెచ్చిపెట్టే  ప్రాజెక్టు, క్షణం తీరిక లేకుండా పనిచేసినా,  పూర్తయేటప్పటికి రాత్రవుతుంది.
లీడ్,  చచ్చినా పర్మిషనివ్వదు.
హాస్పిటల్ కి తీసికెళ్లమని క్రష్ వారికి ఫోన్ చేసి, 
ఆఫీసు పని పూర్తిచేసుకుని పాప దగ్గరకెళ్లింది. 
మగతగా పడివున్న పాపని చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది శాంతికి.
“జలుబు,జ్వరంతో బాధపడుతూ ఏడుస్తూ వుంటే  మీకు కాల్ చేయాల్సివచ్చిందండీ. పీడియాట్రిషన్ వచ్చి చూశారు, సిరప్ వేశారు. ఏమీ తినలేదు పాలు కూడా తాగలేదండీ” 
క్రష్ నిర్వాహకురాలు చెప్తున్న విషయం వింటూ
బాధతో విలవిల లాడింది ఆ తల్లి మనసు.
బండి క్రష్ లోనే పెట్టేసి ఆటోలో ఇల్లు చేరింది శాంతి.
తన దగ్గరున్న తాళంచెవితో తలుపు తీసుకుని లోపలికెళ్లిన ఆమె అక్కడ కనబడిన దృశ్యం చూసి కంగారుపడిపోయింది.
“చరణ్! ఏమిటిదంతా ఏమైంది”? అంటూ అడిగింది ఆందోళనగా.
“సారీ శాంతీ చేయితగిలి వాటర్ జగ్  పడిపోయింది” అన్నాడు. అతడి గొంతులో న్యూనతా భావం.
 
మంచంప్రక్కనేవున్న టీపాయ్ పైన ఉదయం తను సర్దిపెట్టిన అన్నం కూరలన్నీ చెల్లాచెదురై, నీళ్లతో కలిసి అంతా కంగాళీగా తయారైంది.
 
పాపని బెడ్రూమ్ లో పడుకోబెట్టి, గబగబా ఆ ప్రదేశమంతా శుభ్రం చేసి, టీవీ ఆన్ చేసింది. (చరణ్ కి బోర్ కొట్టకుండా లివింగ్ రూం లోనే టీవీకి ఎదురుగా అతడికి మంచం ఏర్పాటుచేసింది. ఉదయం ఉపాహారం తినిపించి, మధ్యాహ్నానికి కావలసినవన్నీ టీపాయ్ మీద సర్ది వెళ్తుంది.)
 
లోపలికెళ్ళి ఉప్మా చేసి చరణ్ కి తినిపించి పాపని లేపి పాలు పట్టించింది.
తాను ఫ్రెషప్పయి ఉప్మా పళ్ళెంతో చరణ్ కి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్న శాంతి
చరణ్ కళ్లలో సన్నని నీటి తెర చూసి చలించి పోయి
“చరణ్” అంది లాలనగా 
 
” శాంతీ నావల్ల ఎన్ని కష్టాలు నీకు! ఎక్కడైనా అనాథాశ్రమంలో వదిలేయకూడదూ అదినాకలవాటేగా”  బాధగా అన్నాడు.
 
“ఛఛ అవేం మాటలు చరణ్! ఒకవేళ నాకే ఇలాంటి పరిస్థితి వస్తే నువు నన్ను అలాగే వదిలేస్తావా” అంది
చరణ్ చేయెత్తి ఆమె తలను ప్రేమగా నిమురుతూ “కలలో కూడా అలాంటి ఊహలు రానీకు  శాంతీ” అన్నాడు ఆర్ద్రమైన స్వరంతో.
 
తినటం పూర్తయ్యాక అతని గుండెలమీద తలవాల్చి ” పాపకు జ్వరం ముందు వేశాను తగ్గింది” అంది.
“హు అన్నీ నీవే చూసుకోవాల్సివస్తుంది” అంటూ ఆమె నుదుట ముద్దుపెట్టాడు.
ఆ ఒక్క స్పర్శతో ఉదయం నుండీ పడిన శారీరక మానసిక శ్రమంతా మర్చిపోయింది శాంతి. 
 
అడుగడుగునా చరణ్ ఇచ్చే మనోధైర్యం, చూపేప్రేఘ
శాంతిని నడిపించాయి.
కానీ……
అది ఎంతోకాలం దక్కలేదు తనకి.
చరణ్ వాడుతున్న మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంతో 
రకరకాల  కాంప్లికేషన్స్ తో చరణ్  ఈలోకం విడిచి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత మొదలయ్యాయి శాంతికి అసలైన కష్టాలు.
అడుగడుగునా చరణ్ పాట ‘అక్ల చలో’ ఆమెని నడిపించి తమ లక్ష్యాన్ని సాధించేలా చేసింది.
కూతురు డాక్టరయింది.
 
కాలింగ్ బెల్ మోగడంతో “స్నేహ వచ్చేసింది” అనుకుంటూ  గబగబా వెళ్లి తలుపు తీసిన శాంతికి సెక్యూరిటీ దర్శనమిచ్చాడు.
“మేడమ్ సెక్రెటరీ సాబ్ ఆప్ కో ఆనేకే లియే కహా” అన్నాడు.
“కహా పే”? అనుమానంగా అడిగింది
“గేట్ కే పాస్” అంటూ వెళ్లిపోయాడు.
‘స్నేహ రాలేదింకా సెక్రెటరీ నన్నెందుకు రమ్మన్నట్లు’
ఆలోచిస్తూ ఫ్లాటుకి తాళంవేసి బయలుదేరింది శాంతి.
అది గేటెడ్ కమ్యునిటీ తనుంటున్న బ్లాకు నుండి గేటు వరకూ వెళ్లడానికి రెండు నిమిషాలు పడుతుంది.
ఏ అవసరమైనా సెక్యూరిటీ వాళ్లు సహాయం చేస్తారు.
సెక్రెటరీ ఎప్పుడూ తనని రమ్మని పిలవలేదు.
నడుస్తూ స్నేహకి ఫోన్ చేసింది. స్నేహ ఫోనెత్తలేదు.
శాంతి మనసేదో కీడు శంకించింది.  
 
‘కోవిడ్ పేషెంట్ల సెక్షన్ లో ఐ.సి.యు లో పదిహేను రోజులుగా డ్యూటీలో వుండి ఈరోజు ఇంటికొస్తున్నానని చెప్పిన కూతురు ఫోనెందుకెత్తడం లేదు’ అనుకుంటూ గేటు దగ్గరకెళ్లింది.
 
అక్కడ ఆగివున్న కారు దాని చుట్టూ కమిటీ మెంబర్లు
అయోమయంగా చూస్తుంది శాంతి.
అంతలో కారు డోరు తీసుకుని స్నేహ దిగుతూ “అమ్మా రా అమ్మా” అంటూ పిలిచింది అందరూ పక్కకి తప్పుకున్నారు. స్నేహ కి, శాంతికి సెక్యూరిటీ వాడు చేతుల్లో శానిటైజర్  వేశాడు.
ఇద్దరూ లోపలికి నాలుగడుగులు వేశారో లేదో 
ఒక్కసారిగా చప్పట్లు మారుమోగాయి 
తలెత్తి చూసిన శాంతి అవాక్కయింది అపార్ట్మెంట్  వాసులు “వెల్కం స్నేహ,డాటర్ ఆఫ్ శాంతీ” అంటూ నినాదాలు చేస్తూ 
పై నుండి పూలవర్షం కురిపించారు.
శాంతికి చరణ్ గుర్తొచ్చాడు.
తనని లక్ష్య సాధనవైపు నడిపిన అతని పాట గుర్తొచ్చింది.
అక్ల చలో అక్ల చలో

******

Please follow and like us:

2 thoughts on “ఓ కథ విందాం! “ఎవరూ రాకపోయినా సరే””

Leave a Reply to డా||కె.గీత Cancel reply

Your email address will not be published.