
పెళ్ళయ్యాక ..!
– సిరికి స్వామినాయుడు
నీ కళ్ళు .. కలువ రేకులన్నప్పుడు అనుకోలేదుకలలు చిక్కేసి నన్నో కబోదిని జేస్తావనీ ..! నీ మోము .. పున్నమి చందమామన్నపుడు పసిగట్టలేదురోజుకో వెలుగురేకును కోల్పోయిన వెన్నెలపూవును జేస్తావనీ ..! ఆకాశంలో .. సగం నీవన్నపుడు అర్ధం జేసుకోలేదుమసిగుడ్డల్లాంటి ఆమాస పూటల్ని మొహాన కొడతావనీ ..! గుడిలో దేవత ఇల మీదికొచ్చిందన్నపుడైనా ఊహించలేదుఇంటికి నన్నో జీతం భత్యం లేని పని మనిషిని చేస్తావనీ ..! బతుకుబండికి మనిద్దరం రెండెద్దులమన్నప్పుడైనా బోధపడలేదునన్నో గానుగెద్దుని చేసి గంతలు కడతావనీ .. ! చిన్నీ బుజ్జీ .. యన్న ప్రేమ పిలుపుపెళ్లయ్యాక .. ఒసే గిసేంటూ బుసలెందుకు కొడుతోందీ ? ప్రకృతితో పోల్చీ పొగిడిన ప్రతిసారీ పొంగిపోతున్న వెర్రిమాలోకమనుకున్నావే గానీ ..మాట వెనుక మార్మికతను పసిగట్టి మంటై ముంచెత్తదనుకున్నావు గదూ ..! పెళ్లికి ముందున్న సమానత్వం పెళ్లయ్యాక .. బానిసత్వమవుతుందంటే ..ఖచ్ఛితంగా నేనా పెళ్లినే ధిక్కరిస్తాను !!
*****

సిరికి స్వామినాయుడుది గురజాడ పుట్టిన నేల వేగావతీ నదీ తీరాన కుసుమూరు గ్రామం. నివాసం పార్వతీపురం మన్యం జిల్లా. ముఖ్యంగా కళింగాంధ్ర నేల అస్థిత్వ నేపథ్యాన్ని తన కవితలలో చెబుతాడు. ఇప్పటికి ‘ మంటి దివ్వ ‘ మట్టిరంగు బొమ్మలు ‘ అనే రెండు కవితా సంకలనాలు వచ్చేయి . ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ , ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డ్ , రంగినేని ఎల్లమ్మ సాహితీ పురస్కారం , నూతలపాటి గంగాధరం సాహితీ అవార్డ్ , రంజనీ కుందుర్తి ప్రధాన అవార్డ్ మొ” పురస్కారాలు వచ్చేయి .
