జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2 

   -కల్లూరి భాస్కరం

          శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక కుటుంబం గురించి చెప్పేటప్పుడు మనం ‘వంశవృక్ష’మనే మాట వాడుతూ ఉంటాం. ఒకే మూలం నుంచి పుట్టిన కుటుంబమే అయినప్పటికీ తరాలు గడిచిన కొద్దీ ఆ కుటుంబ వారసుల మధ్య దూరం పెరిగి సంబంధాలు తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఒకరినొకరు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. ఎవరెవరనేది పోల్చుకుని ఉమ్మడి వంశవృక్షం తయారు చేయడం ఒక పెద్ద సవాలవుతుంది. ఒక్క కుటుంబం విషయంలోనే ఇలా ఉంటే, విశ్వమానవకుటుంబం తాలూకు వంశవృక్షం తయారు చేయడం ఎంత కష్టమో, ఆ ప్రయత్నం ఎంత తికమెక పెడుతుందో ఊహించుకోవచ్చు.

చెట్టు మోడల్ సరిపోక తడిక మోడల్

          ఆధునిక మానవుల మధ్య సంబంధాన్ని చెప్పుకునేటప్పుడు ఈ చెట్టు మోడల్ సరిపోదని తాజా జన్యువిప్లవ ఆవిష్కారాలు స్పష్టంచేశాయని డేవిడ్ రైక్ అంటాడు. ఎందుకంటే, ఒక చెట్టు నుంచి పుట్టిన శాఖలు ఉపశాఖలుగా విస్తరిస్తూ పోతాయి తప్ప ఒకదానితో ఒకటి కలవవు. ఈ నమూనాతో చూసినప్పుడు, ఒకసారి మూలం నుంచి వేరుపడిన జనం కూడా తిరిగి కలవ కూడదు. ఇందుకు భిన్నంగా, ఒక మూలం నుంచి విడిపోయిన మానవ జనాభా మధ్య కూడా మళ్ళీ మళ్ళీ కలయిక సంభవించిందనీ, కనుక తడిక అల్లిక(trellis)లాంటి ఇంకొక మోడల్ అవసరమైందనీ డేవిడ్ రైక్ అంటాడు.

ఒకే కుదురులో యూరప్, చైనా, భారత్

          ఈ విశ్వమానవ వంశ చిత్రం ఎంత సంకీర్ణంగా, ఎంత అనూహ్యంగా, ఎంత అద్భుతంగా ఉంటుందంటే; సుదూరగతానికి వెళ్లినకొద్దీ ఈ రోజున భౌగోళికంగానే కాక, అనేక విధాలుగా ఏమాత్రం పరస్పర సంబంధం కనిపించని యూరప్ దేశాల జనాలూ; చైనా, జపాన్ లాంటి తూర్పు ఆసియాదేశాల జనాలూ, భారత్, ఇరాన్ జనాలూ ఉమ్మడిగా, కొంత హెచ్చు తగ్గులుగా ఒకే జన్యు వారసత్వాన్ని, అంటే ఉమ్మడి పూర్వీకులను పంచు కున్న దశకు క్రమంగా చేరుకుంటాం. ఆ దశకు చెందిన ఒక శాఖే, ‘బాసాల్ యూరేసియన్ (Basal Eurasian)’.

ప్రయోగాల్లో బయటపడిన బాసాల్

          ‘బాసాల్’ అనే మాటకు ‘అట్టడుగు పొర’ అన్న నిఘంటు అర్థం తప్ప నాకు మరో అర్థం దొరకలేదు. ఇది పశ్చిమాసియా (యూరోపియన్లు తమవైపు నుంచి దీనిని సమీపప్రాచ్యం-Near East-అంటారు. మనం పశ్చిమాసియా అందాం)కు చెందిన ఘోస్ట్ జనాభా. ఈ జనాభాను ఎలా గుర్తించారో డేవిడ్ రైక్ చెప్పుకుంటూ వచ్చాడు. హార్వర్డ్ లోని ఆయన ప్రయోగశాలలో ఇయోసిఫ్ లజరడిస్ (Iosif Lazaridis) అనే సహశాస్త్రవేత్త 2013 అంతా తనకు ఎదురైన ఒక విలక్షణ ఫలితంతో కుస్తీపట్టాల్సి వచ్చిందట. చెట్టు మోడల్ ప్రకారం చూస్తే, ఎనిమిదివేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా ద్వారా యూరప్ లోకి వ్యవసాయం విస్తరించడానికి ముందు అక్కడున్న వేట-ఆహార సేకరణ జనా(hunter-gatherers)నికీ, ఇప్పుడు యూరప్ లో ఉన్న జనానికీ, తూర్పు ఆసియా( చైనా, హాంగ్ కాంగ్, జపాన్, మకావ్, మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్ లు భాగంగా ఉన్న ప్రాంతం)జనానికీ మధ్య సంబంధం లేదు. అయితే, ఇప్పటి తూర్పు ఆసియన్లకు ఇప్పటి యూరోపియన్ల పూర్వీకులతో కన్నా, వారికంటే చాలా ముందు కాలంలో యూరప్ లో ఉన్న వేట-ఆహార సేకరణ జనంతో జన్యుపరంగా ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నట్టు లజరడిస్ విశ్లేషణలో తేలింది. ఇప్పటి యూరోపియన్లు పశ్చిమాసియా నుంచి యూరప్ కు వలస వచ్చిన వ్యవసాయజనాల నుంచి కొంత జన్యువారసత్వాన్ని పొందినట్టు లజరడిస్ పరిశోధనకు కంటె ముందే ప్రాచీన DNA వెల్లడించింది. దీనిని బట్టి యూరప్ లోని వేట-ఆహారసేకరణ జనం ఎక్కడి నుంచి జన్యువారసత్వం పొందారో అక్కడి నుంచే పశ్చిమాసియా వ్యవసాయ జనాలు కూడా పొందినట్టు తను భావించానని డేవిడ్ రైక్ అంటాడు.

మాల్టాతో విడిన పీటముడి

          కానీ తొలి యూరప్ రైతుల జన్యువారసత్వం, యూరోపియన్ వేట-ఆహార సేకరణజనం తాలూకు జన్యువారసత్వానికి కొంత భిన్నంగా ఉన్నట్టు ఇప్పుడు లజరిడిస్ కు అర్థమైంది. దాంతో విషయం పీటముడి పడుతున్నట్టు అనిపించింది. అయితే, మాల్టా నుంచి(దీని వివరాలకు కిందటి పోస్ట్ చూడండి) లభించిన జన్యుసంపుటితో పీటముడి విడిపోయింది. తూర్పు ఆసియన్ల నుంచీ, సబ్ సహారన్ ఆఫ్రికన్ల నుంచీ విడిపోయిన తర్వాత ఏర్పడిన ఒక ఉమ్మడి జనాభా నుంచి మాల్టా మనిషీ, వ్యవసాయానికి ముందు నాటి యూరోపియన్ వేట-ఆహారసేకరణ జనమూ వచ్చినట్టు లజరిడీస్ పరీక్షలలో కనిపించింది. ఈ ఫలితం చెట్టు పోలికతో సరిపోతోంది.

          అయితే, లజరిడీస్ ఈ స్టాటిస్టిక్(statistic)లో ప్రాచీన యూరోపియన్ వేట-ఆహారసేకరణ జనం స్థానంలో నేటి యూరోపియన్లను కానీ, తొలినాటి యూరోపియన్ వ్యవసాయదారులను కానీ ఉంచినప్పుడు చెట్టు పోలిక కుదరలేదు. నేటి యూరోపియన్లకు, పశ్చిమాసియా జనాలకు మధ్య ఏర్పడిన సాంకర్యంలో వేరొక యూరేసియన్ జనాల తాలూకు జన్యువారసత్వం కనిపించింది. మాల్టారకం జనం, యూరోపియన్ వేట-ఆహారసేకరణ జనం, తూర్పు ఆసియా జనం ఒకరి నుంచి ఒకరు వేరుపడడానికి ముందు; అంటే ఒకటిగా ఉన్నప్పటి ఉమ్మడి పూర్వీకుల నుంచి అవతరించిన యూరేసియన్ శాఖ ఇది. లజరిడీస్ ఈ శాఖనే ‘బాసాల్ యూరేసియన్’ అన్నాడు.

          ఇది ఆఫ్రిక నేతరులకు చెందిన ఒక ప్రధాన శాఖగానూ, ఇంతకు ముందు చెప్పుకున్న ANEతో సమాన ప్రాముఖ్యం గల శాఖగానూ తేలింది. నేటి యూరోపియన్లు, పశ్చిమాసియా జనాలు మూడో వంతు జన్యువారసత్వాన్ని ఈ బాసాల్ యూరేసియన్ శాఖ నుంచే పొందారు. అంతేకాదు, ఇరానియన్లకు, భారతీయులకు కూడా తగు పాళ్లలో ఈ శాఖ జన్యువారసత్వాన్ని కూర్చింది. కాకపోతే, ఇంత వరకు ఈ శాఖకు చెందిన ప్రాచీన DNA ను ఎవరూ సేకరించలేదు. మాల్టా రూపంలో ANE ఉనికిని గుర్తించినట్టే, బాసాల్ యూరేసియన్ తాలూకు ప్రాచీన DNAను కూడా సంపాదించ గలిగితే అది ఈ రంగంలో మరో ‘హోలీ గ్రేల్’(Holy Grail: క్రైస్తవ సంప్రదాయంలో మహిమలున్నట్టుగా చెప్పుకునే ఒక కప్పు, గిన్నె లేదా రాయి) అవుతుందని డేవిడ్ రైక్ అంటాడు. బాసాల్ యూరేసియన్ జనం ఉండేవారని మాత్రం పరోక్ష ఆధారాల ద్వారా స్పష్టంగా రుజువైంది.

బాసాల్ ప్రాచీనతకు రుజువులు

నేడు ఆఫ్రికా బయట ఉన్న జనానికి దోహదం చేసిన ఇతర శాఖలలో కనిపించని ఒక అసాధారణ లక్షణం  బాసాల్ యూరేసియన్ శాఖలో కనిపిస్తుందని డేవిడ్ రైక్ అంటాడు. ఈ శాఖ జనంలో నియాండర్తల్ జన్యువారసత్వం దాదాపు కనిపించకపోవడమే ఆ విలక్షణత. 14వేలు-10వేలు సంవత్సరాల మధ్యకాలంలో పశ్చిమాసియాలో జీవించిన జనంలో ఇంచుమించు 50శాతం బాసాల్ యూరేసియన్ జన్యువారసత్వం ఉన్నట్టు ప్రాచీన DNA విశ్లేషణ వెల్లడించింది. ఈరోజున యూరప్ జనంలో కనిపించే బాసాల్ యూరేసియన్ జన్యువారసత్వానికి ఇది రెట్టింపు. ఆఫ్రికనేతర జనంలో బాసాల్ యూరేసియన్ జన్యువారసత్వం తగ్గినకొద్దీ నియాండర్తల్ జన్యువారసత్వం పెరుగుతూ వచ్చినట్టు తాము గమనించామని డేవిడ్ రైక్ అంటాడు. ఆఫ్రికనేతర వంశవృక్షానికి చెందిన ఇతర శాఖలు బాసాల్ యూరేసియన్ల నుంచి వేరుపడిన చోట్లలోనే చాలావరకు నియాండర్తల్ తో సాంకర్యం జరిగినట్టు కనిపిస్తుందని ఆయన అంటాడు.

          ఆఫ్రికనేతరుల చరిత్రలో ఎక్కువభాగాన్ని పంచుకున్న శాఖ బాసాల్ యూరేసియనే. యాభై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికనేతర శాఖలన్నింటికీ మూలమైన చిన్నపాటి జనాభాకు చెందిన జన్యువారసత్వం కూడా అందులో భాగం. 10వేల సంవత్సరాలను మించిన వెనకటి కాలంలో ఇప్పటి ఇరాన్, ఇజ్రాయిల్ లలో జీవించిన జనాల్లో దాదాపు 50 శాతం బాసాల్ యూరేసియన్ జన్యువారసత్వం ఉండేది. ఇది బాసాల్ యూరేసియన్ పురాతన అస్తిత్వానికి ధ్రువీకరణ. విశేషమేమిటంటే, ఈ రెండు ప్రాంతాలవారూ ఆ తర్వాత వేల సంవత్సరాలపాటు జన్యుపరంగా ఒకరికొకరు దూరంగా ఉండిపోయినట్టు ఆధారాలు లభించాయి. బాసాల్ యూరేసియన్ ప్రాచీనతకు ఇది కూడా ఒక సాక్ష్యం.

వైవిధ్యానికి చిరునామా

          ఇదంతా వ్యవసాయవిస్తరణకు, ఆ విస్తరణ కారణంగా మొదలైన వలసలకు ముందు పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితి. అప్పట్లో స్థిరంగా ఒకే చోట ఉండిపోయిన, ఎంతో వైవిధ్యం కలిగిన అనేక బాసాల్ యూరేసియన్ పరంపరలకు చెందిన జనం ఉండేవారనడానికి ఇది నిదర్శనమంటాడు డేవిడ్ రైక్. బాసాల్ యూరేసియన్లు మానవ జన్యువైవిధ్యానికి సంబంధించి ఒక ముఖ్యమైన, నిర్దిష్టమైన వనరనీ, ఈ శాఖకు చెందిన అనేక ఉపశాఖలు చిరకాలంపాటు కొనసాగాయనీ అంటాడు.

హ్రోజ్నీకి ధ్రువీకరణ

          హిట్టైట్ లిపిని ఛేదించిన ప్రముఖ పురాతత్వ, భాషావేత్త బెడ్రిక్ హ్రోజ్నీని, ఆయనను అనుసరించిన మన రాంభట్ల కృష్ణమూర్తిగారినే కాక నన్ను నేనే అభినందించుకోవలసిన కొన్ని ధ్రువీకరణలు, వ్యాఖ్యలు డేవిడ్ రైక్ పుస్తకంలో కనిపించాయి. ఇది నాలో మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతున్న అంశం. నా మహాభారత అధ్యయనంలో ఇవి ఒక ముఖ్యమైన పార్శ్వం కాబోతున్నాయి. బాసాల్ యూరేసియన్ల ముచ్చట వాటిలో ఒకటి. మంచు యుగం ముగిసి భూమి పొడిబారుతున్న దశలోనూ, తాము ఉన్నచోట ఏర్పడిన జనసమ్మర్దం కారణంగానూ- వాతావరణ పరంగా ఎక్కువ ఆనుకూల్యత ఉండి, తక్కువ జనసమ్మర్దం కలిగిన ప్రదేశాలను వెతుక్కుంటూ అలలు అలలుగా వివిధ మార్గాలలో జనం మధ్య ఆసియాకు చేరుకోవడంతో అది ఆ సమయంలో మానవాళికి ఆశ్రయంగా మారిందని 1915లోనే తను రాసిన Ancient History of Western Asia, India and Crete అనే పుస్తకంలో హ్రోజ్నీ అంటాడు. ఆయనే ఇంకొక చోట, “కాకసస్, కాస్పియన్ ప్రాంతాలను కేంద్రస్థానం చేసుకున్న, వివిధ మూలాలు కలిగిన, సాధారణంగా సంచారదశలో ఉన్నజనాలు అక్కడి నుంచి వేర్వేరు చోట్లకు వలస పోవడం ప్రారంభించా”రని అంటాడు. రాంభట్ల తన ‘జనకథ’ వంటి రచనల్లో ఈ నిర్ధారణలనే మన పౌరాణిక, పురాచారిత్రక ఆధారాలకు అన్వయిస్తూ విస్తరించి రాశారు.

          ఇప్పుడు డేవిడ్ రైక్ ఏమంటున్నాడో చూడండి! “హార్వర్డ్ లోని నా ప్రాచీన DNA లేబరేటరీ 2015 చివరికల్లా, ప్రపంచానికి చెందిన జన్యువారీ(genome-wide) మానవ ప్రాచీన DNAలో సగానికి పైగా వెలుగులోకి తెచ్చింది….పదివేల సంవత్సరాల క్రితం, అత్యంత వైవిధ్యం కలిగిన అనేక రకాల జనాల మధ్య, సమీపప్రాచ్యం(మనవైపు నుంచి చెబితే పశ్చిమాసియా)లో వ్యవసాయం అభివృద్ధి చెంది, అనేక వైపులకు విస్తరించింది. ఆ విస్తరణ క్రమంలో భిన్న భిన్న జనాల మధ్య కూడా సాంకర్యం జరుగుతూవచ్చింది” అని తన పుస్తకం ఇంట్రడక్షన్ లో ఆయన అంటాడు. ఈ మాటలు హ్రోజ్నీ మాటల్నే స్పష్టంగా ప్రతిధ్వనిస్తాయి. బాసాల్ యూరేసియన్ జనవైవిధ్యం గురించి, జన్యువైవిధ్యం గురించి ఆయన అన్న మాటల్ని ఇంతకుముందే ఉదహరించుకున్నాం. ఇలాంటి ప్రస్తావనలు ఆయన పుస్తకంలో ఇంకా చాలా చోట్ల వస్తాయి.

డేవిడ్ రైక్ మాటల్లో నా ప్రతిధ్వనులు

          ఇక నన్ను నేను అభినందించుకోవలసిన అంశానికి వస్తే, చరిత్ర పూర్వకాలంలోనూ, చరిత్ర కాలంలోనూ కూడా వ్యవసాయవిప్లవం నేటి పారిశ్రామిక విప్లవంతో పోల్చదగిన ఒక ప్రపంచ విప్లవమనీ; అది అనేక విషయాలో తన వెనకటి కాలానికి పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని సృష్టించిందనీ, ఇప్పటికీ ఆ వారసత్వం కొనసాగుతున్నదనీ; ఆర్థికంగా వ్యవసాయ విప్లవం, సామాజికంగా పురుషాధిపత్యం చెట్టపట్టాలు వేసుకుంటూ నడిచాయనీ- “మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే” అన్న నా పుస్తకంలో రాశాను. డేవిడ్ రైక్ విషయానికి వస్తే, “సాంకేతికత(ప్రస్తుత సందర్భంలో పశువులు, మొక్కల పెంపకం)సాంస్కృతికంగానే కాక, జన్యుపరంగా కూడా ఏకరూపతకు ఎలా దారితీయగలదో తెలుసుకోవడానికి ఇదొక అసాధారణ ఉదాహరణ. మన కాలంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం కానీ, సమాచార విప్లవం కానీ మానవాళి చరిత్రలో అపూర్వమైనవేమీ కావనడానికి ఇది నిదర్శన” మంటాడాయన.

పక్కా గృహాల్లో నివసించిన తొలి జనం

          ఇంతకీ బాసాల్ యూరేసియన్ల స్వస్థలం ఏదన్న ప్రశ్న ముందుకు తెచ్చిన డేవిడ్ రైక్, ఇందుకు సంబంధించి నతూఫియ(Nathufian)న్ల నుంచి ఒక సూచన లభిస్తోందని అంటాడు. నతూఫియన్లు పద్నాలుగు వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియాలోని నైరుతి ప్రాంతాలలో జీవించిన వేట-ఆహారసేకరణ జనం. పక్కా గృహాలలో జీవించినట్టు తెలుస్తున్న తొలిజనం వీరే. వేట-ఆహారసేకరణ జనమైనప్పటికీ వీరు వలసలు ఎరగరు. వీరి వారసులు ఆ తర్వాత పూర్తిస్థాయి వ్యవసాయదారులయ్యారు. వేట-ఆహారసేకరణ దశలో ఉన్నప్పుడే వీరు భారీ రాతినిర్మాణాలు చేశారు, అడవి మొక్కలను సాగుచేశారు. వీరి పుర్రెలు, రాతి పరికరాలు అదే కాలంలో ఉత్తర ఆఫ్రికాలో జీవించిన జనాల పుర్రెలను, రాతి సాధనాలను పోలి ఉన్నాయి కనుక నతూఫియన్లు ఉత్తర ఆఫ్రికా నుంచి పశ్చిమాసియాకు వలస వచ్చి ఉండచ్చని భావించారు. పశ్చిమాసియాలోని తొలి ఇరానియన్ వేట-ఆహారసేకరణ జనంతో వీరు అత్యధికమైన పాళ్లలో బాసాల్ యూరేసియన్ జన్యువారసత్వాన్ని పంచుకున్నట్టు- ఇజ్రాయిల్ కు చెందిన ఆరుగురు నతూఫియన్ల నుంచి తన లేబరేటరీ సేకరించిన ప్రాచీన DNA వెల్లడించిందని డేవిడ్ రైక్ అంటాడు.

(తొలి యూరప్ ఘోస్ట్ జనాభాలు, ఆధునిక యూరప్, భారతదేశాల జన్యుచరిత్రకు సంబంధించిన విశేషాలు తర్వాత)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.