ఫెమినిజం

– ఝాన్సీ కొప్పిశెట్టి

          అది రోజూ బయిల్దేరే సమయమే… శాంతమ్మ టిఫిన్ బాక్సు సర్దుతోంది. వైదేహికేదో తప్పు చేస్తున్న భావన…బస్సు మిస్ అవుతావంటూ, ఆఫీసుకి లేటవుతావంటూ శాంతమ్మ తొందర చేస్తోంది. వైదేహిని తను చేయబోతున్న దొంగ పని కలవర పెడుతూ చకచకా తెమలనీయటం లేదు. అక్కడికి వెళ్ళాలన్న తపనే తప్ప ఆమెకు అందమైన చీర కట్టుకుని ప్రత్యేకంగా తయారవ్వాలన్న ధ్యాస కూడా లేదు.  

          ఓవర్ ప్రొటెక్టివ్ తల్లి వంక అక్కసుగా చూసింది. కరుణామయిగా పేరుగాంచిన తన తల్లికి ఎందుకంత కసి, కక్ష సాధింపు..? బిడ్డ మనసును అర్ధం చేసుకోలేక పోయాక బిడ్డ పైన ఎంత ప్రేమ వుండీ ఏమి లాభం…

          శాంతమ్మ గుమ్మం వరకూ వచ్చి చెయ్యి ఊపుతూ సాగనంపుతోంది..

          దడదడా మోగుతున్న తన గుండె చప్పుడు తల్లికి వినిపించటం లేదు కదా… ఏ మాత్రం పసిగట్టినా ప్రళయమే సృష్టిస్తుంది. సందు మలుపు తిరిగి తల్లికి కనుమరుగయ్యింది. కనుమరుగయితే అయ్యింది కాని ఆమె కళ్ళు కప్పగలదా.?

          అది రోజూ వెళ్ళే ఆఫీసు రూటే… రోజూ ఎక్కే నలభై నంబరే. అదే డ్రైవర్.. అదే కండక్టర్… అదే వైదేహి..  కాని ఆమెలో ఆమె లేదు. తల్లిని మోసం చేసి ఆఫీసు మాని, సరిగ్గా ఆఫీసు అయ్యే సమయానికి తిరిగి ఇంటికి రాగలదా తను… వచ్చాక ఆఫీసు నుండే తిరిగి వచ్చినట్టు తల్లిని నమ్మించ గలదా… దొరికిపోదు కదా..!

          రోజూ చూసే కండక్టర్ “బావున్నారా అమ్మా..” అంటూ పలకరింపుగా నవ్వాడు.

          ఎప్పుడూ అడగంది ఇవాళ ఎందుకు అడిగాడు..? తనలో ఏమయినా తేడా కనిపిస్తోందా…? 

          అన్యమనస్కంగా పోసిటివ్ గా తలాడించింది.

          సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది. ధైర్యం కూడదీసుకుని నెమ్మదిగా బస్సు దిగింది. ఇక్కడి నుండి రూటు మార్చాలి… రోజూ ఆఫీసుకి వెళ్ళే ఆల్వాల్ బస్సు కాకుండా కూకట్ పల్లి బస్సు ఎక్కాలి.

          భయంగా వుంది. 

          తను వెళ్ళగలదా అసలు. 

          మనసుండబట్టక మొదటిసారి ఇలా తెగించింది. ఖర్మ కాలి ఎవరి కళ్ళయినా పడితే తల్లి చేసే కట్టడి మామూలుగా వుండదు.

          కూకట్పల్లి బస్సు ఎక్కి ఓ మూలగా నక్కి కూర్చుoది. వెన్నులో నుండి సన్నగా వణుకు ప్రారంభమయ్యింది. 

          “టికెట్… టికెట్..” కండక్టర్ గట్టిగా అంటూ వైదేహి ముందుకి వచ్చాడు. రూటు పాస్ వున్న ఆమెకు మారిన రూటుకి టికెట్ తీసుకోవాలని కూడా తెలియదు.

          “HMT హౌసింగ్ బోర్డ్ కాలనీ, కూకట్పల్లి వెళ్ళాలి నేను… ఎక్కడ దిగాలి..?” భయo భయంగా అడిగింది.

          కండక్టర్ ఆమె వంక అనుమానంగా చూస్తూ “JNTU” అంటూ సర్రున టికెట్ చింపి ఇచ్చాడు.

          టికెట్ తీసుకుని సీటుకి తల ఆన్చి కళ్ళు మూసుకుంది. తన ఈ స్థితికి కారణమయిన పరిస్థితులు సినిమా రీళ్లలా ఆమె మూసిన కళ్ళ ముందు కదలాడాయి.

* * *

          వైదేహి ఉతకటానికి బట్టలు వేస్తూ భర్త ప్యాంటు జేబులు తడిమింది. చేతికి ఏదో చిన్న పల్చటి పుస్తకంలా తగిలింది. బయటకు తీసి చూసింది. ఏదో సెకండ్ క్లాసు స్కూల్ ఫీజు వివరాల కార్డులాంటి పుస్తకం. 

          స్టూడెంట్ పేరు నీహార. అది సెంట్ ఆన్స్ స్కూల్, సికింద్రాబాద్ ఫీ కార్డు. దాని పైన ఇంటి అడ్రసు మిస్. ప్రియంవద, పద్మారావు నగర్, సికింద్రాబాద్ అని రాసి వుంది. 

          ఎవరీ ప్రియంవద…? 

          ఈ నీహారకు తల్లా..? 

          వీళ్ళకు, తన భర్తకు సంబంధం ఏమిటి..?

          మనసంతా సునామీలా పోటెత్తింది.  రాత్రి బాగా తాగి వచ్చిన భర్త ఇంకా నిద్ర లేవ లేదు. వెంటనే పిల్లిలా బెడ్రూంలోకి వెళ్ళి అతని వాలెట్ తీసి చూసింది. నిన్నటి తారీఖులో స్కూల్ ఫీజు కట్టిన రశీదు. 

          గుండె మండి పోయింది. వాలెట్ లో కాగితాలన్నీ మొత్తం తనిఖీ చేసింది. అదే ప్రియంవద ఇంటి కరెంటు బిల్లు, దాని రశీదు కూడా వున్నాయి.

          ఏనాడూ తమ పిల్లల స్కూలు ఫీజు బాధ్యత, ఇంటి బాధ్యత తీసుకోని అతను ప్రియంవద ఇంటి బాధ్యత తీసుకోవటంలో అర్ధం ఏమిటి..? 

          వేడెక్కిన ఆలోచనల ఆవిరితో మనసంతా కుతకుతా ఉడికిపోయింది. వేడి అగ్గిలా రాజుకుని కళ్ళు నిప్పులు రాల్చాయి… వైదేహి రుద్రకాళి అవతారం దాల్చింది.

          అలికిడికి అతను లేచి వచ్చి ఆమె చేతిలో తన వాలెట్ చూసాడు. అతను మూడో నేత్రం తెరిచిన శివుడయ్యాడు.

          “ఎవరీ ప్రియంవద” అరిచి అడిగింది.

          “నా రంకు పెళ్ళామే… అయితే ఏo చేస్తావ్…” రౌద్రంగా అరిచాడు.

          “అసలు ఏనాడయినా ఈ సంసారపు బాధ్యత తీసుకున్నారా.. మీకు మరో పెళ్ళాం కావాల్సి వచ్చిందా… దాని అంతు తేలుస్తాను” కీచు గొంతుతో అరిచింది.

          “నాకు తెలియకుండా అసలు నా వాలెట్ ఎందుకు తీసావు. నా జేబులు ఎందుకు కెలుకుతున్నావు” రెచ్చిపోయాడు.

          “కెలకటమే కాదు…. చెత్తంతా చించేస్తా…” అంటూ స్కూల్ ఫీజు పుస్తకాన్ని నాలుగు ముక్కలుగా చించేసింది.

          అప్పుడే ప్యాంటు నుండి తీసి వైదేహి అక్కడే పెట్టిన బెల్టుని అతను గబుక్కున అందుకుని శివాలెత్తినట్టు గొడ్డును బాదినట్టు వైదేహిని కొట్టటం మొదలెట్టాడు. 

          ఊహించని ఆ సంఘటనకి ఆమె హడలెత్తి పోయింది. 

          సుకుమారంగా పాలు మీగడలతో పెరిగిన ఆమె లేత చర్మం కమిలిపోయింది. ఎక్కడ తగులుతున్నదీ తెలుసుకోకుండా అతను ఏకధాటిగా దాడి చేసే సరికి ఆమె వీపంతా మంట లేచి ఎర్రగా తట్టు తేలిపోయింది. ఆమె భరింపశక్యం గాని బాధతో విలవిల్లాడి పోతున్నా, చించేసిన నీహార స్కూల్ ఫీజు కార్డు అతనిలో రేపిన అసహనం శాంతించ లేదు. 

          సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా, ఆదివారం కావటంతో వైదేహి  తమ్ముడు రవి వచ్చాడు. రవి అక్కడి సినారియో చూసి అవాక్కయిపోయాడు. 

          రవిని చూసిన అతను బెల్టు కింద పారేసి విసురుగా బెడ్రూం లోకి వెళ్ళిపోయాడు. వైదేహి తమ్ముడి భుజం మీద వాలిపోయి వెక్కివెక్కి  ఏడ్చేసింది. రవి దవడ కండరాలు కోపంతో బిగుసుకున్నాయి. అదే బెల్టు తీసుకుని బావగారిని వాయించేయాలని వున్నా అతని సంస్కారం అడ్డొచ్చింది. 

          కోపాన్ని దిగమింగుకుని “అక్కా, పిల్లలతో స్కూటర్ మీద కూర్చోగలవా లేక ఆటో తీసుకు రానా…” అని అడిగాడు.

          రవి తీసుకు వచ్చిన ఆటోలో వైదేహి పిల్లలతో సహా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అదే క్షణంలో.

          అమ్మ, తమ్ముడు, మామయ్య కలిసి డొమెస్టిక్ వయోలెన్స్ కేసు పెడదామన్నారు. 

          తను రెచ్చగొట్టటం వలననే అతనలా రెచ్చిపోయాడని, ఇది వరకు ఎన్నడూ తన మీద చేయి చేసుకోలేదని, పోలీసు కేసు వద్దని వైదేహి వాళ్ళను బతిమాలుకుంది.

          ఆమెకు శరీరం పైన పడిన దెబ్బల నొప్పి కన్నా మనసును గాయ పరిచిన ప్రియంవదతో ప్రేమాయణం బాధాకరంగా వుంది. కాపురం పొడి పొడిలాడుతున్నా, అనుబంధంలో ఆర్ద్రత లేకపోయినా, అతను పిల్లల పట్ల ప్రేమ చూపకున్నా, అసలు ప్రేమను వ్యక్తం చేయటం తెలీని మనిషని సరిపెట్టుకుందే తప్ప ఆ ప్రేమను మరో చోట చూపిస్తున్నాడంటే తట్టుకోవటం కష్టంగా వుంది.

          ఆమె ప్రమేయం లేకుండా అమ్మ, తమ్ముడు, మామయ్య కలిసి సమావేశామయి కొద్ది కాలం భార్యాభర్తలిద్దరినీ వేరు వేరుగా ఉంచితే, ఆమె విలువ అతనికి తెలిసి వస్తుందని, అతనికి జ్ఞానోదయం కలుగుతుందని తీర్మానించుకున్నారు. 

          రవి కారు వేసుకుని అక్క ఇంటికి వెళ్ళి పిల్లల పుస్తకాలు, బట్టలు, అవసరమైన ఇతర సామగ్రి తీసుకు వచ్చాడు. 

          రవి రాగానే అతనెలా వున్నాడని అడిగిన అక్క వంక జాలిగా చూసాడు. 

          రవి అతను కులాసాగానే వున్నాడని చెప్పాడు. ప్రియంవదను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదని తలచిన శాంతమ్మ తన కూతురి పేరు మీద వున్న ఆ ఇంట్లోంచి అల్లుడిని తరిమేద్దామని నిర్ణయించుకుంది. 

          మనిషి రోడ్డున పడితే తప్ప బుద్ధి రాదని ఆమె ఉద్దేశ్యం. 

          అసలైతే అలాంటి మొగుడితో కాపురం చేయాల్సిన ఆగత్యం తన బిడ్డకి లేదని విడాకులు ఇచ్చేయమని గొడవ చేసింది. ఎంత సేపూ వాళ్ళ అభిప్రాయాలు, నిర్ణయాలే తప్ప ఎవరూ వైదేహి ఉద్దేశ్యం అడగలేదు. 

          విడాకుల గురించి కలలో కూడా ఆలోచించవద్దని వైదేహి వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చింది. 

          వాళ్ళు అతని చేత ఇల్లు ఖాళీ చేయించారు. వైదేహిని మధ్యలో కలగచేసుకోవద్దని వారించారు. అతను తన బట్టల సూట్ కేసుతో అతని స్వార్జితమైన ఇంటిలోకి కూకట్పల్లి మారిపోయాడు.

          వైదేహికి అతని మీద బెంగ ఎక్కువయి పోయింది. వంట తెలియని అమాయక పిచ్చి వెధవ ఎలా వున్నాడోనని ఆమె మనసు ఒకటే కొట్టుకునేది. 

          తిండి కుదరక అతని ఆరోగ్యం చెడితే ఆనక తనే కదా ఇబ్బంది పడేది… వీళ్ళకు ఎందుకు అర్ధం కాదు ఈ విషయం. అతను తనంతట తానుగా కాళ్ళ బేరానికి రావాలని శాంతమ్మ భీష్మించుకు కూర్చుంది. అతని మొండితనం వైదేహికి తెలుసు. అతను ఒంటరితనంలో మగ్గి శుష్కించి పోతాడేమో తప్ప వైదేహిని రమ్మని ప్రాధేయపడడు. 

          ఏమి తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో అన్న బెంగ వైదేహిని రాను రాను కుదురుంచలేదు. అతను ఒకసారి పిల్లల స్కూలుకి వెళ్ళి వాళ్ళను చూసి వెళ్ళాడట. అది విన్న వైదేహి ఇంక ఆగలేక పోయింది. ఇంట్లో చెబితే ససేమిరా అంగీకరించరు. అందుకే అమ్మను మోసం చేసి అలా బయిలుదేరింది.

* * *

          బస్సు కుదుపుతో ఆలోచనలు చెదిరి కళ్ళు తెరిచి చూసింది. ఇంతలో కండక్టర్ ‘JNTU’ అంటూ అరిచాడు.

          వెంటనే లేచి బస్సు దిగింది. ఇంటి నంబరు గుర్తు లేకపోయినా ఇల్లు గుర్తు పట్టగలదు. సొసైటీ ఆఫీసుకి బాగా దగ్గరలో వుంటుంది. అతను ఇంట్లో వుంటాడా.. ఇవాళ వీక్లీ ఆఫ్. వుండాలి. 

          అతనిని ఎలా ఫేస్ చేయాలి.. ఏం మాట్లాడాలి..? చెప్పలేని ఉద్వేగంలో వైదేహి అడుగులు తడబడుతున్నాయి. 

          నిజానికి అతను వైదేహిని క్షమించమని అడగాలి.. ఆమెను కలిసే ప్రయత్నం అతనే చేయాలి. 

          కాని అలా జరుగలేదు. వైదేహే అతని కోసం వెళుతోంది. 

          ఆమెను మోసగించి ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నా ఆమె అతనిని క్షమించి వెళుతోంది. ఆమెను పాశవికంగా కొట్టినా ఆమె అతనిని మన్నించి వెళుతోంది. అతనెన్ని తప్పిదాలు చేసినా ఆమె అతనిని ఎప్పటికీ ప్రేమిస్తూనే వుంటుంది. 

          నిజమైన ప్రేమ వున్న చోట తప్పులన్నీ మన్నింప బడతాయని, దారుణాలన్నీ కప్పడిపోతాయని నమ్మే సహధర్మచారిణి ఆమె. నరనరాన పితృస్వామ్య భావజాలం ప్రేరేపిస్తున్న పురుషాధిక్య దుశ్చేష్టలకు అలవాటుపడిన హైందవ స్త్రీ ఆమె.

          దూరంగా ఎక్కడో మీటింగ్ జరుగుతోంది. మైక్ లో ఎవరిదో ఆవేశపూరితమైన స్త్రీ గొంతు వినిపిస్తోంది.

          “భర్త అనే వాడికి భార్య పైన చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారు.. భార్యంటే మానాభిమానాలున్న మనిషే తప్ప బానిస కాదు. ఒక్క చంప దెబ్బకే విడాకులు తీసుకున్న “తప్పడ్” సినిమా కథానాయిక చేసిందే కరెక్ట్…”తప్పడ్” సినిమా స్వాభిమానంతో జీవించాలనుకునే నేటి యువతులకు ఒక పాఠం, పురుషాహంకారానికి ఒక గుణపాఠం…”

          తను స్వాభిమానంతో జీవించాలనుకోవటం లేదా…?

          తనను అతను కొట్టి తన గౌరవాభిమానాలను అవమానించిన రోజున తమ్ముడు ఎంత బాధపడ్డాడు. మంచి చెడుల మధ్య వ్యత్యాసం తెలిసిన విజ్ఞానవంతుడైన రవి అతనికి దూరంగా వుండమని సలహా ఇచ్చాడు. ఇప్పుడు తను ఇలా అతడి దగ్గరకు వెళ్ళటం తమ్ముడి పౌరుషాన్ని అపహాస్యం చేయటమే కదా…? వాడి పౌరుషం సరే చావు దెబ్బలు తిన్న తనకు రోషం లేదా..?

          వైదేహి అడుగుల్లో వేగం తగ్గి నిస్సత్తువ ఆవహించింది. పాదాలు భారంగా కదులుతున్నాయి.

          “స్త్రీలందరూ స్వాభిమానాన్ని కాపాడుకుంటూ ‘అమృత’ పాత్రలా ప్రవర్తిస్తే ఈ పురుషాధిక్య సమాజoలో మార్పు సాధ్యమౌతుంది. తల్లిదండ్రులు అపురూపంగా పెంచుకుని ఏనాడూ చేయి చేసుకోని ఆడపిల్ల పైన చెయ్యి చేసుకునే అధికారం భర్తకి ఏ వివాహ వ్యవస్థ ఇచ్చింది…?”

          శాడిస్ట్ అయిన భర్త పైన వెర్రి ప్రేమతో తల్లికి అల్లుడి పైన కసి, కక్ష అని అనుకుందే తప్ప, తల్లి ప్రేమను గ్రహించలేక పోయింది. తన కంట్లో నలుసు పడితే, తల్లి కళ్ళు కన్నీరు కార్చేవి. అలాంటి తల్లి తనను భర్త నుండి వేరు పెట్టి బాధ పెడుతోందంటే ఆమె ఎంత క్షోభపడి వుండాలి..?  

          ఇల్లు నాలుగు అడుగుల దూరంలోకి వచ్చేసింది. పాదాలు ముందుకు కదలనని భీష్మించుకుని మొరాయించాయి. ద్వైదీ భావనలో కొట్టుమిట్టాడుతున్న మైండ్ సంకేతాలు కాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. 

          “ప్రతీ స్త్రీ తన అస్తిత్వాన్ని సంరక్షించుకుంటేనే ఈ సమాజంలో మార్పును ఆశించగలం.. భర్త కొట్టినా, తిట్టినా పతియే ప్రత్యక్ష దైవమంటూ దేవులాడుతూ, తన ఉనికినే లెక్క చేయని వాడి కోసం బానిసలా బతకాల్సిన ఆగత్యం లేదని ఈ కాలం యువతి తెలుసుకోవాలి…” 

          తలుపు గడియ తట్టాల్సిన వైదేహి చేతులు, చీర చెంగుతో నుదుట పట్టిన చిరుచమటను తుడుచుకున్నాయి. 

          పితృస్వామ్య పరదాలు తొలిగిన మైండ్ నుండి ఇప్పుడు వైదేహికి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. 

          ఒక నిర్ణయానికి వచ్చిన వైదేహి తేలికైన హృదయoతో గిర్రున వెను తిరిగింది చైతన్యం దిశగా…!

*****

Please follow and like us:

One thought on “ఫెమినిజం”

Leave a Reply to డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ Cancel reply

Your email address will not be published.