
యుద్ధం ఒక అనేక విధ్వంస దృశ్యాలు
-గవిడి శ్రీనివాస్
యుద్ధం ఎపుడు విధ్వంసమే
విద్వేషాలే యుద్దానికి మూల ధాతువులు .
ఆధిపత్యం పోరు ప్రాణాల్ని
ఛిద్రం చేస్తుంది .
అండ చూసుకొని ఒక చిన్న దేశం
అంగ బలం చూసుకొని ఒక పెద్ద దేశం
యుద్దానికి తెరలేపాయి.
శూన్యాన్ని విధ్వంసం చేసి
ఆకాశాన్ని అల్లకల్లోలం చేసి
రక్తపు మడుగుల వాసన తో
యుద్ధం తడిసిపోతోంది.
నాటో వ్యూహాల మధ్య
దేశాల దేహాలు తగలబడిపోతున్నాయి.
ఇప్పుడు బతకడమంటే
మూడో ప్రపంచ యుద్ధమే .
దాహార్తులేవో
దేహాల్ని మింగుతున్నాయ్ .
యుద్ధాలెపుడు సామాన్యుని
గుండె మీద తాండవం చేస్తాయ్ .
ఇప్పుడు ఉక్రెయిన్ , రష్యాల మధ్య
యుద్ధం ఒక అనేకానేక
విధ్వంసక దృశ్యాల్ని లేపి
సాదృశ్య పరుస్తున్నాయి .
ప్రాణాలు మట్టిరేణువులతో
చివరాఖరి ఘోషను విన్నవిస్తున్నాయి .
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
