
కలను ఏ కన్నీళ్లు ఆపలేవు
– శ్రీ సాహితి
నిద్రను హత్యచేసిన
ఆ కల పట్టపగలు
ఎన్నో రాత్రులను మోసుకుంటూ
ఏ రోజుకు చిక్కకుండా
ఏ గంటకు పట్టుపడక
నగ్నంగా తిరుగుతుంది.
ఎదురొచ్చిన ముఖంపై
చెంబుడు కబుర్లు చల్లి
చిందుల్ని ఏరుకుంటూ
పసి హృదయంలో
లోతుగా పాకిన ఇష్టం
పెద్దయ్యాక వటవృక్షమై
ఇప్పుడు
కలకు కళ్ళతో పనిలేక
కాలంతో ముడి వీడి
కోరికగా మారి మనసులో
మాటైయింది…చూపైయింది…
చప్పుడైంది….చిత్రమైంది.
ఇక కాలు ఆగేదాక
కళ్ళు ఆరేదాకా
ఏ కలను ఏ కన్నీళ్లు ఆపలేవు.
*****

మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా నాన్నగారు పరిచయం చేసిన మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నా జీవితంలో ఓ గొప్ప మలుపు. క్రమంగా వచన కవిత్వము పట్ల అభిమానము కలిగి, నాకు తోచిన భావాలను వచనంలో వ్రాయడం అలవాటుగా మారింది.
