
నేతన్నలూ!
-దాసరాజు రామారావు
ఆంగ్లమూలం – సరోజినీ నాయుడు
తెల్లారగట్లనే నేత పనిలో పడ్డ నేతన్నలూ!
అర్ధనగ్న దుస్తుల నెందుకు నేస్తరు?…
పాలపిట్ట నీలపు రెక్క లాంటిది కాకుండా
మేం పురిటి బిడ్డకు రాజస మొలికే
నిలువు శేర్వాణీలను నేస్తం-
చీకట్లొస్తున్నా నేస్తూనే వున్న నేతన్నలూ!
మిరుమిట్లు గొలిపే వస్త్రాల నెందుకు నేస్తరు?…
నెమలి లాంటి ఉదా, ఆకుపచ్చల సహజాకర్షణ లేకుండా
మేం మహారాణికి పెళ్ళి కళ తొంగి చూచే మేలిముసుగులను నేస్తం-
కర్కశమైన శీతల శరత్తులో
ఇంకనూ పని నిష్టలో వున్న నేతన్నలూ!
ధవళ కాంతిలో మెరిసే ఈక లేదా మబ్బు లాంటివేవైనా…
మేం పాడెమీది శవానికి కప్పే శ్వేతవర్ణ వుడుపులను నేస్తం-
*****

1955 లో జననం,సిద్ధిపేట ప్రాంతం.టీచరుగా 2013 లో రిటైర్మెంట్. శ్రీశ్రీ మహాప్రస్థానం ,ఉన్నవ మాలపల్లి సాహిత్య అవసరం ,అక్షరం విలువ నేర్పినయి. 45 ఏళ్ల సాహిత్య ప్రయాణం లో గోరుకొయ్యలు,పట్టుకుచ్చుల పువ్వు ,విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు – ప్రోత్సాహకాలుగా ఉమ్మిడిశెట్టి ,సమైక్య సాహితి ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అవార్డులు. మంజీరా రచయితల సంఘం లో శాశ్వత సభ్యున్ని.
ప్రధానంగా సాహిత్య సృజన – జీవన గమన ప్రేరణాత్మక ఆచరణ గ ఉండాలని నమ్ముతాను.
