
అనుసృజన
మీనాకుమారి హిందీ కవిత-2
అనువాదం: ఆర్.శాంతసుందరి
అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. 2.
టుకడే టుకడే దిన్ బీతా ధజ్జీ ధజ్జీ రాత్ హుయీ
జిసకా జితనా ఆంచల్ థా ఉతనీ హీ సౌగాత్ మిలీ
పగలంతా అక్కడో ముక్క ఇక్కడో ముక్కా అన్నట్టు గడిచింది, చీలికలు వాలికలై రాత్రి వచ్చింది
ఎవరి చీరె చెరగు ఎంత ఉంటే వారికి కానుకలు కూడా అంతే దొరికాయి
రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్ బూందోం మే జహర్ భీ హై ఔర్ అమృత్ భీ
ఆంఖేం హస్ దీ దిల్ రోయా , యహ్ అచ్ఛీ బరసాత్ మిలీ
చిటపట చిటపట చినుకుల్లో విషమూ ఉంది, అమృతమూ ఉంది
కళ్ళు నవ్వేశాయి కానీ మనసు ఏడ్చింది ఇదేమి వర్షమో!
జబ్ చాహా దిల్ కో సమఝే హమ్సనే కీ ఆవాజ్ సునీ
జైసే కోయీ కహతా హో లే ఫిర్ తుఝకో మాత్ మిలీ
మనసుని అర్థం చేసుకోవాలనుకునేంత లో ఎవరో నవ్వటం వినిపించింది
మళ్ళీ ఓడిపోయావు చూసుకో, అని ఎవరో అంటున్నట్టు అనిపించింది
మాతే( కైసీ ఘాతే( క్యా చలతే రహనా ఆఠ్ పహర్
దిల్ సా సాథీ జబ్ పాయా బేచైనీ భీ సాథ్ మిలీ
ఓటములైనా , గాయాలైనా ఇరవై నాలుగు గంటలూ నడుస్తూ ఉండటమే
మనసుకు నచ్చిన సహచరుడు దొరికినా వ్యాకులత కూడా అతని వెన్నంటే వచ్చింది
హోంఠోం తక్ ఆతే ఆతే జానే కితనే రూప్ భరే
జలతీ బుఝతీ ఆంఖోం మే సాదా సీ జో బాత్ మిలీ
పెదవుల మీదికి వచ్చేంతలోనే ఎన్ని రూపాలు సంతరించుకుందో
వెలుగుతూ ,ఆరుతూ ఉన్న కళ్ళలో సరళంగా కనిపించిన ఆ మాట !
*****

ఆర్.శాంతసుందరి నాలుగు దశాబ్దాలకి పైగా అనువాద రంగంలో కృషి చేసారు. కథ,కవిత,నవల,నాటకం, వ్యాసాలు , ఆత్మకథలు , వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లోనూ అనువాదాలు చేసి 76 పుస్తకాలు ప్రచురించారు . ప్రఖ్యాత రచయిత ,కొడవటిగంటి కుటుంబరావు వీరి తండ్రి. ఆయన రాసిన నవల,’ చదువు’ని శాంతసుందరి హిందీలోకి అనువదించారు.కేంద్ర సాహిత్య అకాడెమీ దాన్ని ప్రచురించింది. వీరి భర్త గణేశ్వరరావు ప్రముఖ కథారచయిత. ఈమె చేసిన అనువాదాలలో, ‘మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు’, ‘ అసురుడు’ , డేల్ కార్నెగీ రాసిన రెండు పుస్తకాలూ , బేబీ హాల్దార్ జీవితచరిత్ర వంటివి ముఖ్యమైనవి. ఇవికాక ఎన్నో కవితా సంపుటాలనూ, సంకలనాలనీ, కథా సంకలనాలనీ హిందీ-తెలుగు భాషల్లో పరస్పరం అనువదించారు. ఈమెకి తమిళం కూడా బాగా వచ్చు. వైరముత్తు కవితలని తెలుగులోకి అనువదించి తెలుగు పత్రికల్లో ప్రచురించారు.సాహిత్య కుటుంబంలో జన్మించిన శాంతసుందరికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. అనేక దేశాలు పర్యటించారు. రెండు తెలుగు సినిమాల స్క్రిప్టుని హిందీలోకి అనువదించారు.
‘ప్రేమ్ చంద్ బాలసాహిత్యం -13 కథలు ‘ అనువాదానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ అనువాద పురస్కారం లభించింది. ‘ ఇంట్లో ప్రేమ్ చంద్ ‘ తెలుగు అనువాదానికి 2014 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. శాంతసుందరి నవంబరు 11, 2020 లో తమ 73వ యేట కన్నుమూసారు.
