బతుకు చిత్రం-27

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .

***

         ఇంతకు ముందయితే సరూపను సయిదులు కూడా ఆరాధనగా చూసేవాడు. దానికి కారణం తనకు ఎప్పుడు వచ్చిన ప్రత్యేకంగా వేడి వేడి గారెలు. మిర్చీలు వేసి అందరి కంటే అభిమానంగా చూసేది. ఒక దశలో ఆమె తనను ఇష్టపడుతున్నదని అనుకోని పెళ్ళి చేసుకుంటే బాగుండును అన్న పిచ్చి ఆలోచన కూడా చేశాడు.

         కానీ తల్లి, అదంతా తాను రోజూ రావాలనే స్వార్థపు ఆలోచనతో చేస్తున్నదనే మర్మాన్ని విప్పి చెప్పే వరకు ఆమెలోని వ్యాపార బుద్ది అర్థం కాలేదు. ఇక అప్పటి నుండి ఆమె ఏం చేసినా పట్టిచుకోవడం మానేశాడు. అసలు ఆమె కొట్టుకు వెళ్ళడమే తగ్గిం చేశాడు.

         ఇదంతా సైదులుకు ఆమె చూపును చూడగానే గుర్తుకు వచ్చి మౌనంగా కూర్చున్నాడు .

         మాట్లాడవా ? బావా ? అని భుజం పై చెయ్యి వేసింది.

         ఇంకా మితిమీరక ముందే అక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిదని లేవబోయాడు. ఆ పాటికే అందరూ తమ వైపు చూస్తుండడం గమనించక పోలేదు.

         ఆమె బలవంతం చేసి పక్కకు తీసుకు వెళ్ళింది.

         ఆగు బావా? నీతో మాట్లాడాలి. అని అటు ఇటు చూసి వీలయితే రేపు సాయంత్రం ఒక్కడివే ఇంటికి రా!

         రేపు మా ఆయన ఊర్లో ఉండడం లేదు. అందుకే దుకాణం ఉండదు. నీతో చాలా పనుంది, రానని మాత్రం అనకు. నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా తప్పక రా !అని వెళ్లిపోయింది.

         తాగుతున్నాడే కానీ, ఇదేమిటి ఈమె ఒంటరిగా ఇంటికి సాయంత్రం రమ్మంటా ఉంది. అయినా ఈమె ఎవరు నన్ను అజమాయిషీ చేసేది? అని అయిష్టంగానే తాగుతూ ఉండగా, ఆమె మళ్ళీ వచ్చి

         బావా! నేను ఒక ముఖ్యమైన సంగతి, అదీ మీ అవ్వకు సంబంధించినది మాట్లాడాలె. అందుకే తీరికగా రమ్మంటున్నాను. ఇది అందరి ముందట మాట్లాడేది కాదు. అందరికీ చెప్పాల్సింది కూడా కాదు. నువ్వు కూడా ఎవరితోనూ చెప్పకూడదు ……..

         ఎహే !ఆపు !అసలు ఏ ఇసయం ఇప్పుడే చెప్పు. ఎందుకు ఈ సోదంతా ? అసలే నా మనసు బాగోలేక ఈడి కత్తే , నువ్వు తగులుకున్నవ్ ?

         నీ మనసు బాగుపడే ఉపాయమే రేపు నేను చెప్పబోయేది. నువ్వు ఎంత చీకటి పడ్డాక వస్తే అంతా మంచిది. ఎవరూ చూడక ముందు వస్తే ఇద్దరికీ ఇంకా మంచిది .

         నీకు ఏమైనా ఎరికుక్క కర్సిందా? ఇయ్యాల బావా ..!బావా ..!అనుకుంటా నా ఎంట వడ్డవ్? అన్నను పిలువనా ? అన్నాడు.

         ష్ ….!గట్టిగా అరవకు. ఇది ఎవరూ వినకూడదనే ఇలా చెప్పాను. ఇంకా మాట్లాడకు. నువ్వు నీ ఓళ్ళబాగు కోరుకునేది అయితే రా ! అని ఈసారి కొంచెం కటువుగానే చెప్పి వెళ్లి పోయింది.

         సైదులుకు ఏమీ అర్థం కాలేదు. ఆమె చెప్పినంత మాత్రాన్నే తానూ వినాలా ?అయినా ఆమె ఎవరు ? ఆమె నా పై పెత్తనం చేయడం ఏమిటి ?

         ఛ …మనసు మంచిగా లేక ఇక్కడికి వస్తే ఇదేదో సాటుకు రమ్మని బలిమి చేత్తాంది అనుకుంటూ బయటపడి ఇల్లు చేరాడు.

***

         జాజులు ఇంకా నిద్ర పోలేదు. తన కోసమే కాబోలు ఎదురు చూస్తున్నది.

         తల్లి, తన పిల్లలని దగ్గర చేసుకొని ప్రశాంతంగా నిద్ర పోతున్నది. ఆమెను అలా చూడగానే సైదులుకు గుండె కలుక్కుమన్నది.

         జాజులు సైదులును గమనించి, ఇంత పొద్దుపోయే దాన్క ఏడికయ్యా ? పోతివి. అని దగ్గరగా వచ్చి అతను మళ్ళీ తాగాడని తెలుసుకొని ,

         బువ్వ తిందువుగానీ రాయ్య ? అన్నది .

         నువ్వు తిన్నావా ?

         నేనా ?నిన్ను చూసే తాల్లకే కడుపు నిండింది.

         అదేంది ? కొత్తగ తాగిన్నా ?

         కాకుంటే ?

         ఇంట్ల ఈ తేరుగా ఉండంగా నీకు అమ్మ మీద పట్టి లేకుండ ఎట్ల ముట్టబుద్ధైంది ?

         జాజీ !సంబురానికి తాగలేదే !యాది మరువ తాగిన .

         ఏంటిది ?అవ్వనా ?మరిసేది ?

         కాదె !అవ్వ బాధను. అవ్వకచ్చిన బీమారిని ,

         సరిపోయింది. దేనికయినా ఎట్లా బయట పడాల రా! దేవుడా అని ఎడువాలేగని గిదేంది? అన్నది. అన్నం పళ్ళెంలో పట్టుకు వచ్చి తినిపిస్తూనే.

         నేను ఏదో జన్మంల కొంచెం పున్నెం చేసినగా వచ్చే , దానికి మెచ్చి దేవుడు నాకు అవ్వను, నిన్ను ఇచ్చిండు, అట్నే కొంచెం పాపం కూడా చేసి ఉంటా అందుకే అమ్మకు బీమారిని పెట్టి తన కాడికి తీసుకపోవాలేనని అనుకుంటా ఉండు , అని చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్వసాగాడు.

         ఏందిది ? యాళ్ళ  గాని యాళ్ళ ఈ ఎడుపెంది ?

         ఏడుపు ముందట వడద్దనే పాకులాడవడితిమి. ఇగ సాలుగని తిని అని బలవంతంగా తినిపించింది.

         పడుకోమ్మని మంచంలో కూర్చోబెట్టి తాను కదులుతుండగా

         జాజీ ..జాజీ …!అని పిలిచాడు .

         ఏమిటన్నట్టుగా చూసింది .

         దగ్గరకు రమ్మని సైగ చేశాడు.

         వెళ్ళింది.

         నాకు నిద్ర రావడం లేదు. ఒక్క పాట పాడవే !అన్నాడు.

         ఎందయ్యో ! వింతగా ఉన్నదీ. నేనెప్పుడన్నా పాడిన్నా ? యాళ్ళ గాని యాళ్ళ గోపాలం పాడినట్టు ఇప్పుడు పాడమంటానవ్?

         అబ్బా !నీ దయ గని మన పిలగాండ్లకు అవ్వ పాడుతున్నట్టు పాడే అన్నడు ఆమెను కూచేబెట్టి ఒడిలో పడుకుంటూ .

         జాజులుకు ఆశ్చర్యం అనిపించింది .

         ఏమిటి ?ఈ మనిసి ?ఇయ్యాల ?అనుకోని ,

         రాములయ్యా ….రాములాయ్యా ….మదనాసుందరుడా …

         నీకు పొయ్యేటి తోవ్వల్ల దష్టి తగిలేనా ….మదనాసుందరుడా …

———————————————————————-

అని సైదులును అడుగాలనుకున్న వన్నీ పాటలాగా పాడింది.

         సైదులు నిద్రలోకి జారుకున్నాడు. అతనికి ఈ ప్రశ్నలు వినిపించాయో లేదో కూడా తెలియలేదు .

***

తెల్లవారింది.

         సైదులూ …!ఓరీ …!వారీ …!పనికి పొయ్యేది ఉన్నదా ?లేదా ?అని గట్టిగా పిలుస్తూ కొడుకును నిద్ర లేపింది. ఈర్లచ్చిమి.

         నిద్ర లేచిన సైదులు తల్లిని తనివి తీరా చూసుకొని మంచం దిగాడు.

         ఏమిరో !కొత్తగ జూస్తానవ్?ఇప్పుడే తప్పిపోతే దొరికినదానిలా ?అని నవ్వింది .

         సరే .!సంబురంగని, వాణ్ని లేపకుంటే ఏం బాయే. ఇంటినిండా ముగ్గురు ఆడోళ్ళు ఉన్నరు. పత్తులేరుడు, కలుపుదీసుడు ఇట్లా చాన్నే పనులు దోర్కవట్టే. మీరు బోతే గాదా?వాన్నే లేపాల్నా ?అన్నడు రాజీరు.

         మల్ల షురువు జేసినవా?ఆడోళ్ళని ,నువ్వు మారవు.

         ఎన్కటికి ఎవరో మహానుభావుడు జెప్పినట్టు

         ఎలుక తోలు దెచ్చి ఏడాది ఉతికినా

         నలుపు నలుపేగాని తెలుపుగాదు ……..

         అని నీకు ముగ్గురు మనుమరాండ్రు వచ్చి ముసలితనానికి వచ్చినంక సుత ఈ ఏరు వెట్టుడు మానవయితివి ,అన్నది కొంచెం కోపంగా.

         అదిగాదే !తలా ఒక పని జేసుకుంటే తప్పెమున్నదని దనిఅంటాన.

         మేము జేయ్యకుంటే నువ్వే మమ్ముల కూసోవెట్టి సాత్తానావు లె !నీ రెండో కోడలు కమల నిన్నటి నుండి సుస్తీగా ఉంటాంది. ఇగ జాజులమ్మ ఎప్పుడో పనికి పోయింది. పనులు దొరికినప్పుడే జేసుకుంటే ఇన్ని పైసలు కనవడుతయ్గదా !

         అవు ..అవు ..నాకిన్ని చాయ బొట్లు పొత్తే బజాట్లకు పోత .

         గదేగాదా !నీకున్న పెద్ద పని. పట్కత్తగని ,పొల్లగాండ్లు లేత్తరు జూడు.కోతులు గిన వత్తయ్ !

         ఈ ఆడి పోరగాల్ల మీద దీనికి ఎందుకో ఇంత పావురం ?అని గులుక్కుంటంటే ఈర్లచ్చిమి ,

         ఏంది ?ఏమో అంటానవ్?అన్నది.

         ఎమిలె …నేనేమంటి.అని తడబడ్డాడు.

         నాకు నీ సంగతంత ఎరికే ,అనుకుంట ,పొయ్యి కాడికి పోయి చాయ వేడి జేసుకొని వచ్చింది.

         తాక్కుంటూ ,అవునే ..!కమలకు ఏమైనట్టు అన్నాడు.

         ఏమో ..!జాజి వచ్చినంక దేవత దగ్గరకు ఇచ్చి పంపాలే. అని సైదులుకు సద్ది గట్టె పని ఉన్నదని లోపలకు నడిచింది.

         రాజయ్య ఏదో ఆలోచనలోనే తాగడం పూర్తి చేసి మనుమరాండ్ర వైపు చూడసాగాడు.

         ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి గానీ , నా ముగ్గురు మనుమరాండ్రంత ముద్దుగ ఈ వాడ కట్టుకు ఎవరున్నరు? ఆ మాటకు వత్తే తన సుట్టరికంల గూడ లేరు.అందుకు గర్వపడాలే గని, మొగోని లెక్క వంశం మోసేటోళ్ళు గాదన్నదే బాధ. వీల్లల్ల ఒక్కడు మగోడైనా బాగుంది పోవు, నేను కమలతోనో మల్ల లగ్గం ఎందుకు జేత్తు? కమల కన్న మగ పిలగాడు పుట్టాలె . లేకుంటే నేను ఇంకా నలుగురిట్ల నాదాను అయిత. అని మనసులో ఆలోచించుకోసాగాడు.

         పిల్లలు కదులుతుండగా ,తేరుకొని ఈర్లచ్చిమిని పిలిచి బయటికి వెళ్ళిపోయాడు.

         రచ్చబండ మీదకు పిచ్చాపాటి ముచ్చట్లకు వచ్చిన అందరిట్ల తనూ ఒకడయి పోయాడు.

         నీరటి గాబయ్య డప్పు చాటింపు మొదలు వేట్టుకుంట వచ్చిండు.

డడ్డంక …డడ్డంక ..డం

ఇన్నో లేవలో ……ఇననో ల్లెవలో

ఉన్నో ల్లెవలో ….లేనో లేవలో ..

ఆందరు ఓ తాప ఇటు ఇనుండ్రి ..

         ఓట్లయ్య కారటు లేనోళ్ళు ,ఇవారుదాంక పేరు ఎక్కిన్చుకోనోల్లు ,ఈ ఏడు పద్దెనిమిది ఈడు వద్దోల్లు, కారట్ల తప్పులు ఉన్నోళ్ళు గిట్ల అందరు గ్రామ పంచాయితికాడికి వచ్చి సరిజేయించుకోవలసిందిగా దండోరా ఎత్థానం ,అహో .!అని డప్పు వాయించుకుంటూ వెళ్ళిపోతుండగా ..

         అందరూ అతన్ని ఆపి, గిప్పుడు ఎందుకు ఈ చాటింపు.?ఓట్లు ఏం లెవ్వు గదా ?ఏమన్న పైసలు పంచుతారా ?అని ఆరా తియ్యసాగారు.        

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.