
తానే
-డా. టి. హిమ బిందు
నిస్వార్ధపు లాలిత్యం కురిపించే తల్లీ తానే
దూరంగున్నా మమతలో హక్కు కోరే కూతురూ తానే
ప్రేమకు సర్వం ధారపోసే అపూర్వం తానే
చిలిపి అల్లర్లున్నా కలిమి లేమిలో తోడుగ నిలిచే చెల్లీ తానే
పోటీ కొచ్చినా కడుపులో పెట్టుకు చూసే అక్కా తానే
సోపతి అనుకునే పతికి సహధర్మచారిణీ తానే
అలుపెరగని పతికి ఆలంబన తానే
సకలం నీవే అనే పతికి పట్టపు రాణీ తానే
కాలం కలిసి రాక పోతే సేవకీ తానే
మనసెరగని పతికి విరిగిన తీగా తానే
అపనమ్మకపు భర్తకు పరాయీ తానే
అవమానించే భర్తకు ప్రత్యర్ధీ తానే
అన్న భార్య అయినా ఆపదలో అమ్మగా మారే వదినమ్మా తానే
మెత్తగాను, సుత్తి లాను మొత్తే అత్తా తానే
వాదనలో కత్తిలా సమాధానం చెప్పే చతురోక్తీ తానే
యుద్ధంలో తూటాలా సమాధానం చెప్పే తుపాకీ తానే
అద్రుష్టంలో దేవతా తానే
ఫ్రస్ట్రేషన్ లో దయ్యమూ తానే
శాంతంలో చల్లని మనసుతో నిండిన శీతల పవనమూ తానే
క్రోధంలో వేడి సెగలా బూడిద చేయగల బడబాగ్నీ తానే
సొంత వారిని శుద్ధి చేసే తన్నీరూ తానే
ఎదుటి వారి మనసు కరిగించే కన్నీరూ తానే
సెలయేరులో జలకాలాడించే పన్నీరూ తానే
ఆలోచనల్లో అనంతమంటి ఆకాశమూ తానే
ఓరిమిలో భూదేవీ తానే
స్థిరత్వంలో మహా వృక్షమూ తానే
అస్థిరత్వంలో గరిక పోసూ తానే
అమాయకత్వంలో బలిపశువూ తానే
గర్వం తానే
గౌరవం తానే
సర్వం తానే
అన్నీ తానే
తాను లేకుంటే అన్నీ సున్నే
అయినా…
ఇంటి పేరూ సొంత ఊరూ లేని
అనామికా తానే
అందుకే…
తానే ముందూ కాదూ
తానే వెనుకా కాదూ
అన్నింటా తానూ సమానమే
అనే సబలగా మారాలీ తరుణులంతాను!
*****

రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. డి. పూర్తయింది. పర్యావరణంపై పరిశోధన పత్రాలు, అనేక వ్యాసాలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. పండుగలు పర్యావరణంపై రాసిన పుస్తకము సుస్థిరోత్సవం. పర్యావరణ పరిరక్షణతో కూడిన అభివృద్దే మానవ మనుగడకు భరోసా అనే సత్యాన్ని అందరూ గ్రహించేట్టు చేయగలగాలని ఆకాంక్ష.
